[‘నగ్మే, కిస్సేఁ, బాతేఁ, యాదే – ఆనంద్ బక్షి జీవితం, పాటలు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. అంబల్ల జనార్దన్.]
‘నగ్మే, కిస్సేఁ, బాతేఁ, యాదే – ఆనంద్ బక్షి జీవితం, పాటలు’ పుస్తకాన్ని స్వర్గీయ ఆనంద్ బక్షి గారి కుమారుడు శ్రీ రాకేశ్ ఆనంద్ బక్షి ఇంగ్లీషులో రాయగా, శ్రీ కొల్లూరి సోమశంకర్ గారు దాన్ని తెలుగులోకి అనువదించారు.
ఈ గ్రంథం స్వర్గీయ ఆనంద్ బక్షి గారి అబ్బాయి రాశాడు కాబట్టి, దీనికి ప్రామాణికత చేకూరింది. 1960 దశకం నుండి 2000 వరకు హిందీ పాటలు గమనిస్తే సింహ భాగం స్వర్గీయ ఆనంద్ బక్షి గారు రాసిన హిట్ పాటలే. దాదాపు 630 సినిమాలకు మూడు వేల మూడు వందకు పైగా పాటలు రాశారు వారు. కాని అంతకు ముందు వారు జీవితంలో పడ్డ ఇక్కట్లు చదివితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన డెబ్భై రెండేళ్ల జీవిత యానంలో బక్షి గారు ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయినా ధైర్యం కోల్పోక పడి లేచిన కెరటమయ్యారు.
అవిభక్త భారత్‌లో 21-07-1930న పుట్టిన ఆనంద్ బక్షి గారు మన దేశానికి కట్టుబట్టలతో వచ్చి, ఎన్నో ఇబ్బందులకు లోనైనా మొక్కవోని ధైర్యంతో విజయవంతమైన గీత రచయితగా, సంపన్నుడిగా తేది 30-03-2002 న శివైక్యం చెందారు.
తన పద్నాగేళ్లకే ఇప్పటి పాకిస్తాన్ లోని నావిక దళంలో చేరిన బక్షిగారు రెండేళ్ల లోపే తిరుగుబాటు దళంతో పాటు అక్కడి నుండి బర్తరఫ్ చేయబడ్డారు. అక్టోబర్ 1947లో భారత్ వచ్చిన వారు అదే సంవత్సరం నవంబర్‌లో తన పదిహేడవ ఏట భారత సైనిక దళంలో చేరారు. సినిమాల్లో పాటలు రాయాలనే పిచ్చితో 1950లో సైన్యం వదిలి బొంబాయి బాట పట్టారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా అవకాశాలు రాకపోవడంతో తిరిగి 1951 లో సైన్యంలో చేరారు. అక్కడ 1956 వరకు కొనసాగి తిరిగి బొంబాయికి తరలి వచ్చారు. మళ్ళీ జీవన పోరాటం మొదలయింది.
ఇద్దరు ‘భలా ఆద్మీ’లు బక్షి గారికి ఆసరాగా నిలిచారు. ఒకరు ‘అల్ బేలా’ ఫేం భగవాన్ దాదా ఐతే మరొకరు రైల్వే టికెట్ చెకర్ చితర్ మల్ స్వరూప్. 1956లో కాకతాళీయంగా భగవాన్ దాదా తన ‘భలా ఆద్మీ’ సినిమాకు నాలుగు పాటలు రాయించి నూటయాభై రూపాయలు ఇస్తే, రైల్వే టికెట్ చెకర్ శ్రీ చితర్ మల్ స్వరూప్ గారు బక్షి గారి పాటలకు ఫిదా అయి, ఒక్క రూపాయి తీసుకోకుండా నాలుగు సంవత్సరాలు తన ఇంటిలో ఆశ్రయం కల్పించారు. అంతే కాదు, రాకపోకలకు రోజూ డబ్బు కూడా సమకూర్చారు. 1958లో విడుదలైన ‘భలా ఆద్మీ’ అంతగా ఆడలేదు, పాటలు కూడా ప్రజాదరణ పొందలేదు, అందుకని బక్షి గారికి సినిమా అవకాశాలు రాలేదు.
1959 లో సిఐడి సినిమా లోని పాటలతో ఆనంద్ బక్షి గారి దశ తిరిగింది. ఆ తర్వాత వారు వెనక్కి తిరిగే అవసరం రాలేదు.
ఒక విజయవంతమైన గీత రచయితగా బక్షి గారు ఎందరో సంగీత దర్శకులతో, దర్శకులతో పని చేశారు. ఒక్క లక్ష్మికాంత్-ప్యారేలాల్ గార్లతోనే మూడు వందల మూడు సినిమాలకు పాటలు రాశారు. అలాగే రాహుల్ దేవ్ బర్మన్కి తొంబై తొమ్మిది, కళ్యాణ్ జీ – ఆనంద్ జీ కి ముప్పై నాలుగు, అను మాలిక్‌కు ఇరవై ఆరు, ఇలా ఎందరో సంగీత దర్శకుల సినిమాలకు మూడు వేల మూడు వందలకు పైగా పాటలు రాశారు బక్షి గారు.
1967 నుండి 2001 మధ్యలో పదకొండు సార్లు బినాకా/సిబాకా గీత్ మాలా లో బక్షి గారు రాసిన పాటలు ఆ యా సంవత్సరాల్లో పదకొండు సార్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే ఫిలింఫేర్ అవార్డ్‌కు నలభై రెండు సార్లు నామినేట్ అవగా నాలుగు సార్లు అవార్డ్ వచ్చింది. ఈ మొత్తం పాటల పట్టిక పుస్తకంలో ఉంది.
ఈ పుస్తకం చదువుతుంటే ఆనంద్ బక్షి గారి బయోపిక్ ఒక సీరియల్‌గా వస్తే అత్యంత ప్రజాదరణ పొందుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుంది. ముంబయికి వలస వచ్చిన వాళ్లలో ఎన్నో RAGS TO RICHES కథలున్నాయి. అందులో ఆనంద్ బక్షి గారి జీవితం అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీ కొల్లూరి సోమశంకర్ గారి అనువాదం సరళంగా తెలుగు మూలం అనుకునేలా ఉంది. ఈ సమీక్ష రాసే అవకాశం ఇచ్చిన ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
***
మూలం: రాకేశ్ బక్షి
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: xxvi+224
వెల: ₹ 200/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643
~
ఆన్లైన్లో:
https://www.sahithibooks.com/products/anand-bakshi-jeevitham-paatalu-rakesh-anand-bakshi
https://www.telugubooks.in/products/nagme-kisse-baatein-yaadein-anand-bakshi-jeevitam-paatalu
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

