Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళాకారుడిగా దిగ్గజం.. వ్యక్తిగా మనలో ఒకడు

[‘నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం పాటలు’ పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ వ్రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]

వ్యక్తి మనకి ఎందుకు నచ్చుతాడు? అతను సాధించిన ఘనతల వల్లా? లేక విజయాలు సాధించే క్రమంలో, విజయాలు సాధించాకా కూడా వినమ్రంగా ఒదిగి ఉన్నందుకా? లేక మనలాంటి స్వభావమే ఆయనదని మనం భావించినందుకా? నిజానికి మనకన్నా ఎన్నో ఏళ్ళు ముందు పుట్టినవారు మనల్ని ప్రభావితం చేశారంటే, అర్థం, వారిది మన స్వభావం కాదు, మనదే వారి స్వభావం! మనం కూడా వారిలా జీవించడానికి ఇష్టపడేవాళ్ళమని అర్థం!

అలాంటి వారి జీవితకథలు చదివినప్పుడో, వారి గురించి ఇతరత్రా విన్నప్పుడో మనకెందుకో తృప్తిగా అనిపిస్తుంది. ‘ఫీల్ గుడ్’ భావన కలుగుతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రే ‘Nagme, Kisse, Baatein, Yaadein: The Life & Lyrics Of Anand Bakshi’ అనే పుస్తకం!

ఆనంద్ బక్షి సుప్రసిద్ధ హిందీ సినీ గీతరచయిత. 1960ల నుంచి 2000ల వరకూ దేశవ్యాప్తంగా హిందీ పాటల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన జీవితగాథని వాళ్ళ రెండో అబ్బాయి రాకేశ్ ఆనంద్ బక్షి గ్రంథస్థం చేసి పుస్తకరూపంలో వెలువరించారు.

ఓ పాఠకుడిగా ఈ పుస్తకం చదివాను, ఎంతో నచ్చింది. కొన్ని రోజుల తరువాత అనుకోకుండా, ఆ పుస్తకాన్ని అనువదించే అవకాశం కల్పించారు ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ. ‘సంచిక’ వారపత్రికలో 36 వారాల పాటు తెలుగు అనువాదం ధారావాహికగా ప్రచురితమైంది.

***

సినీగీత రచయితగా ఆనంద్ బక్షి:

ఆనంద్ బక్షి 500కి పైగా సినిమాలకు 3500 కి పైగా పాటలతో బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన గీత రచయిత. 1960ల నుండి 2001 వరకు ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను అందించారు. ఆయన గొప్పతనం సరళమైన, కవితాత్మకమైన, లోతైన భావాలతో నిండిన సాహిత్యాన్ని వ్రాయగల సామర్థ్యంలో ఉంది. కాలాతీత ఇతివృత్తాల ద్వారా ప్రజలతో బాగా కనెక్ట్ అయ్యారు, ‘ప్రజల కవి’గా తన హోదాను పదిలం చేసుకున్నారు.

1959లో తొలి సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆయన ప్రతిభ పూర్తిస్థాయిలో వెల్లడయింది, 1960వ దశకం మలి సగం నుంచే.

ఆయన అందించిన ఎన్నో గొప్ప పాటల నుండి నమూనా కోసం కొన్నింటిని పేర్కొంటాను. ‘మెహెందీ లగీ మేరే హాత్’ (1962), ‘యే సమా సమా హై ప్యార్ కా’ (జబ్ జబ్ ఫూల్ ఖిలే, 1965), ‘సావన్ కా మహీనా, పవన్ కరే షోర్’ (మిలన్, 1967), ‘మేరే సప్నోం కీ రాణీ కబ్ ఆయేగీ తు’ (ఆరాధనా, 1969), ‘బిందియా చమ్‌కేగీ చూఢీ ఖన్‌కేగీ’ (దో రాస్తే 1969), ‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో ఔర్ ఛాబీ ఖోజాయ్’ (బాబీ, 1970), ‘దమ్ మారో దమ్’ (హరే రామ హరే కృష్ణ, 1971), ‘చింగారీ కోయీ భఢ్‌కే’ (అమర్ ప్రేమ్, 1972), ‘కుఛ్ తో లోగ్ కహేంగే’ (అమర్ ప్రేమ్, 1972), ‘ఆద్మీ ముసాఫిర్ హై’ (అప్నాపన్, 1974), ‘గాడీ బులా రహీ హై’ (దోస్త్, 1974), ‘మెహబూబా మెహబూబా’ (షోలే, 1975), ‘పర్దా హై పర్దా’ (అమర్ అక్బర్ ఆంథోనీ, 1977), ‘డఫ్లీ వాలే డఫ్లీ బజా’ (సర్‍గమ్, 1978), ‘తేరే మేరే బీచ్ మే’ (ఏక్ దూజే కేలియే, 1981), ‘చిట్ఠీ ఆయీ హై’ (నామ్, 1986), ‘మై నేమ్ ఈజ్ లఖన్’ (రామ్ లఖన్, 1989), ‘జుమ్మా చుమ్మా దే దే’ (హమ్, 1991), ‘ఛోళీ కీ పీఛే క్యా హై’ (ఖల్‌నాయక్, 1993), ‘జాదూ తేరీ నజర్’ (డర్, 1993), ‘టిప్ టిప్ బర్సా పానీ’ (మోహ్రా, 1994), ‘తుజే దేఖా తో యే జానా సనమ్’ (దిల్‌వాలా దుల్హనియా లేజాయెంగే, 1995), ‘ఐ లవ్ మై ఇండియా’ (పర్‌దేశ్, 1997), ‘దిల్ తో పాగల్ హై’ (దిల్‌ తో పాగల్ హై, 1997), ‘తాల్ సే తాల్ మిలా’ (తాల్, 1999), ‘హమ్‌కో హమీసే చురా లో’ (మొహబ్బతేఁ, 2000), ‘మై నిక్లా గడ్డి లేకే’ (గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2001). దాదాపు 5 దశాబ్దాల పాటు మూడు తరాల శ్రోతలను ఆకట్టుకున్నారు.

ఆనంద్ బక్షి రాసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన పాటలు ఎక్కువగా జీవనయానం, ఆత్మవిశ్వాసం, పట్టుదలపై దృష్టి సారిస్తాయి. తాత్త్వికతని సరళమైన, మన జీవితంతో సంబంధం ఉన్న పాటలతో మిళితం చేయగల ఆయన సామర్థ్యం – ఎన్నో పాటలను ప్రేరణాత్మకంగా నిలిపింది.

జీవితం – పట్టుదల:

జిందగీ కే సఫర్ మే’ (ఆప్ కీ కసమ్): జీవితపు అస్థిరతనీ, మార్పు అనివార్యతనీ హృద్యంగా ప్రతిబింబిస్తుంది. జీవితంలోని విలువైన క్షణాలు, సంబంధాలు, వ్యక్తులు, ఒకసారి కోల్పోయిన తర్వాత తిరిగి రారని ఈ పాట నొక్కి వక్కాణిస్తుంది, వాటిని వెంటనే ఆదరించాలని కోరుతుంది.

గాడీ బులా రహీ హై’ (దోస్త్): అడ్డంకులు ఉన్నప్పటికీ నిరంతర పురోగతిని ప్రోత్సహించే ప్రయాణంగా జీవితాన్ని తాత్వికంగా చూడాలంటుంది.

‘చింగారీ కోయీ భఢ్‌కే’ (అమర్ ప్రేమ్): చీకటి నిండిన విపత్కర పరిస్థితులలోనూ తనలో తాను ఆశనీ, వెలుగుని కనుగొనడం గురించిన పాట.

ఆత్మగౌరవం – దృఢత్వం:

‘కుఛ్ తో లోగ్ కహేంగే’ (అమర్ ప్రేమ్): ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, మన జీవితాన్ని నిజాయితీగా గడపడం గురించిన కాలాతీత గీతం.

ఆప్ కీ నజరోం నే సమ్‌ఝా’ (అన్‍పఢ్): ఒకరి ప్రేమపూర్వక చూపుల ద్వారా రూఢిపరచటం, ఉద్దేశాన్ని కనుగొనే అందమైన వ్యక్తీకరణ.

మై షాయర్ బద్నామ్’ (నమక్ హరామ్): ప్రాపంచిక అవగాహన ఉన్నప్పటికీ, అపఖ్యాతి పాలైన ఓ కవి అంతర్గత ప్రపంచాన్ని, కవితా ప్రయాణాన్ని ప్రకటించే గీతం.

దేశభక్తి – ఆశ:

చిట్ఠీ ఆయీ హై’ (నామ్): మాతృభూమి పట్ల అపేక్ష, విదేశాలలోని కార్మికుల త్యాగాల గురించి శక్తివంతమైన పాట.

మేరా దేశ్ హై మహాన్’ (ఆఖ్రీ రాస్తా): దేశపు స్ఫూర్తిని, సామర్థ్యాన్ని సదా స్మరించుకునే దేశభక్తి గీతం.

ప్రేమ – అంతర్గత శక్తి:

తేరే మేరే బీచ్ మే కైసా హై యే బంధన్’ (ఏక్ దూజే కే లియే): విడదీయరాని, విధి నిర్ణయించిన బంధం జరుపుకున్న వేడుక ఈ గీతం.

యే సమా సమా హై ప్యార్ కా’ (జబ్ జబ్ ఫూల్ ఖిలే): ప్రేమని, ప్రకృతి సౌందర్యాన్ని మేళవించిన చక్కని పాట.

నశ్వరత – కాలం ఒడిదుడుకులు:

‘జగత్ ముసాఫిర్‌ఖానా, లగా హై ఆనా జానా’ (బాలికా బధు),

‘జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హైం జో ముకాం’ (ఆప్ కీ కసమ్),

‘యే జీవన్ హై’ (పియా కా ఘర్),

‘ఏక్ రితు ఆయే ఏక్ రితు జాయే’ (గౌతమ్ గోవింద)

నశ్వరతనీ, కాలం చలనశీలతని గొప్పగా చాటుతాయి ఈ పాటలు.

జీవితంలో ఎదురైన విభిన్న అనుభవాలు, కాలమే మనుషులకు ఏకైక యజమాని అని, అందరూ దాని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆనంద్ బక్షికి నేర్పించాయి. ఆనంద్ బక్షి ఎంతో వినమ్రంగా తాను కాలానికి శిష్యుడనని (వక్త్ కా మురీద్) చెప్పుకున్నారు.

ఆనంద్ బక్షి పాటలు ఎందుకు అంతలా విజయవంతమయ్యాయని విశ్లేషించుకుంటే, అందుకు కారణం – అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో రాయడమని గ్రహిస్తాం. కానీ ఆయన ఎంతో వినమ్రతతో తాను ఎక్కువగా చదువుకోనందువల్ల తన హిందీ పదజాలం పరిమితమనీ, అందువల్ల సాధారణ భాషలోనే పాటలు రాశాననీ అంటారు. అయితే ఈ విధానాన్ని, ఆయన ఎంతో గౌరవించే ఇతర గీత రచయితలు – దీనానాథ్ మాధోక్, సాహిర్ లుధియాన్వి, శైలేంద్ర కూడా ఆమోదించి ఆ సరళతను కొనసాగించమని సలహా ఇచ్చారు.

ఆనంద్ బక్షి సాహిత్యం లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిందనడానికి ఒక ఉదాహరణ ఉంది. జీవితం పట్ల విసిగి వేసారిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టలపై పడుకోగా, దగ్గరలోని ఓ రేడియో నుంచి దోస్త్ అనే సినిమాలోని ‘గాడీ బులా రహీ హై’ పాట వినబడిందట. ఆ పాట విన్న అతను ప్రేరణ పొంది, ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడట. ఇంతకంటే సార్థకత ఏముంటుంది ఏ రచయితకైనా?

***

వ్యక్తిగా ఆనంద్ బక్షి:

ఓ వ్యక్తిని ఎందుకిష్టపడతాం అని ప్రశ్నించుకుంటే, వారిలో మనకి నచ్చే గుణాలేవో ఉంటాయన్న సమాధానం దొరుకుతుంది.

ఆనంద్ బక్షి గారిలో నాకేం ఏం నచ్చుతాయ్?

నిరాడంబరత, క్రమశిక్షణ, తన బలహీనతలు తెలిసి ఉండడం, బలహీనతలనే బలంగా మార్చుకోడం, సద్విమర్శలను స్వీకరించి పొరపాట్లు దిద్దుకోడం, ఎదుటివారికి గౌరవమివ్వడం.. వంటి లక్షణాలు ఆయన పట్ల అమితమైన గౌరవాన్ని కల్పించాయి.

ఆయన పట్టుదలని తెలిపే ఓ సంఘటనని గుర్తుచేసుకోవాలి. తొలి రోజుల్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు – ప్రసిద్ధ సంగీత దర్శకుడు రోషన్ గారు ఓ రోజు కలమన్నారు. కానీ ముందురోజు రాత్రి నుంచి బొంబాయిలో బీభత్సమైన వాన. నగరమంతా నీట మునిగింది. లోకల్ ట్రెయిన్స్, బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వర్షాన్ని, హోరుగాలిని లెక్కచేయక, తాను రాసిన కవితల పుస్తకాన్ని, గొడుగుని తీసుకుని బోరివలిలోని తన తాత్కాలిక నివాసం నుండి శాంటాక్రజ్‌లోని రోషన్ గారింటికి సుమారు 19 కిలోమీటర్లు నడిచివెళ్ళారు. అంతటి ప్రతికూల పరిస్థితులలో ఆ రోజు రాకపోతే ఏం అని రోషన్ మందలించినప్పటికీ, తర్వాత సినిమా ‘సిఐడి గర్ల్’ (1959)లో బక్షికి అవకాశమిచ్చారు. తర్వాత క్రమక్రమంగా ఆయన ప్రస్థానం పుంజుకుంది.

పాట రాయడానికి ‘మూడ్’ కావాలి, హోటల్ గది కావాలి, వేరే దేశంలో రిసార్ట్ కావాలి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. తనకి పారితోషికం ఇస్తున్న నిర్మాత కష్టం తెలుసాయనకి. అందుకే పాటలని తన ఇంట్లో పడకగదిలో మంచం మీద కూర్చుని రాసేవారు. సకాలంలో అందించేవారు. ఏనాడు ఆయన వల్ల పాట రికార్డింగ్ ఆలస్యమవటం అనేది జరగలేదు. దీన్ని బట్టి అయన వ్యక్తిత్వం అర్థమవుతుంది.

***

కళాకారుడిగా ఆయన ఓ దిగ్గజమైనప్పటికీ, వ్యక్తిగా సామాన్యుడు.. మనలో ఒకడు. అందుకనే ఆయనంటే అభిమానం, గౌరవం కలుగుతాయి.

ఆనంద్ బక్షి గారి జీవిత చరిత్ర ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు’ పేరిట ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది!

నాకు ఈ అవకాశమిచ్చిన కస్తూరి మురళీకృష్ణ గారికి, అనువాదానికి అనుమతించిన రాకేశ్ ఆనంద్ బక్షి గారికి అనేక కృతజ్ఞతలు!!

మీ అభిమాన గీత రచయిత జీవితాన్నీ, ఆయన పాటల నేపథ్యాన్ని, ఆయన విజయాలని, ఆయన సంశయాలనీ, సంకోచాలనీ.. అన్నింటిని తెలుసుకోండి!!

లోపలి పేజీలలోకి స్వాగతం! హ్యాపీ రీడింగ్!!

***

నగ్మే కిస్సే వాదేఁ బాతేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు
మూలం: రాకేశ్ బక్షి
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: xxvi+224
వెల: ₹ 200/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు,
#33-22-2,
చంద్రం బిల్డింగ్స్,
సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట,
విజయవాడ – 520 004.
ఫోన్: 0866-2436643

~
ఆన్‌లైన్‌లో:
https://www.sahithibooks.com/products/anand-bakshi-jeevitham-paatalu-rakesh-anand-bakshi

Exit mobile version