Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యక్రమం – నివేదిక

తేది 26-07-2026 న ఉదయం 10.00 గంటలకు నాగ్‍పూర్, మహారాష్ట్ర లోని శ్రీ మారండేయ  సభాగృహంలో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా. సుమిత కొండబత్తున్వార్ తుమ్మే గారి ఏకపాత్రాభినయ జానపద గాథ “బిలోరీ మాలన్” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గడ్చిరోలి ప్రాంతంలోని ఆదివాసీ మహిళ “బిలోరీ మాలన్” జీవిత చరిత్రను డా. సుమిత గారు, సాంప్రదాయబద్ధమైన ఆహార్యంతో, తనదైన శైలిలో పాటలు పాడుతూ మధ్య మధ్యలో పిట్ట కథలు చెబుతూ హృదయాన్ని హత్తుకునే విధంగా ఆ జానపద గాథను ప్రదర్శించారు. నాగ్‌పూర్‍లో స్థిరపడ్డ తెలుగు మూలాలకు చెందిన డా. సుమిత గారు, ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సాంఘిక కార్యకర్త.

అది గత తొమ్మిది నెలల్లో, మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా జరిగిన పదిహేనవ సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమం. శ్రీ ఆశోక్ కంటే గారు ఆ కార్యక్రమం సూత్ర సంచాలనం చేయగా శ్రీ హరీశ్ ఇర్నాక్, శ్రీ కృష్ణ కనోజియా మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా, కార్యక్రమ సమన్వయకులుగా డా. అంబల్ల జనార్దన్ నాగపూర్ కార్యక్రమ స్థానిక సమన్వయకులుగా శ్రీ నీలేశ్ గాజింవార్ పాల్గొన్నారు. మొదట అతిథులందరు దీప ప్రకాశనంలో పాల్గొన్న తర్వాత, వందే మాతరం, మహారాష్ట్ర గీతం ఆలాపించ బడింది. ఆ తర్వాత వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటె గారు, ఆహూతులకు స్వాగతం పలికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ హరీశ్ ఇర్నాక్ గారిని స్వాగత ప్రసంగం చేయవలసిందిగా ఆహ్వానించారు.

శ్రీ హరీశ్ ఇర్నాక్ గారు మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పబడిన నేపథ్యం వివరించారు. అప్పటి సాంస్కృతిక విభాగం మంత్రి శ్రీ సుధీర్ మునగంటి వార్ చొరవతో  మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ కాకుండా మరో నాలుగు భాషల సాహిత్య అకాడెమీలు ఏర్పడ్డ వైనం తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పది భాషల సాహిత్య అకాడెమీలు ఉన్నాయని తెలిపారు. అన్ని భాషల అకాడమీలు దేశంలోని మరే రాష్ట్రాల్లో లేవని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. అంతే కాదు, తెలుగు సాహిత్య అకాడెమీ, మరే తెలుగేతర రాష్ట్రాల్లో లేదని కూడా చెప్పారు. మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలో తెలుగు ప్రజలున్న వివిధ ప్రాంతాల్లో సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆ కార్యక్రమాల ద్వారా మరాఠీ తెలుగు ప్రజల సాహిత్య,  సాంస్కృతిక బంధం మరింత బలపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇరు భాషల సాహిత్యం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. వచ్చే ఆగస్ట్ నెలలో ముంబయిలో జరుగబోయే అనువాద కార్యశాలలో మరాఠీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి మరాఠీ లోకి అనువాదం చేయగలిగే వారందరిని పాల్గొనమని ఆహ్వానం పలికారు.

ప్రముఖ అతిథి, విదర్భ పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ సంజయ్ బోజేవార్ గారు మాట్లాడుతూ, మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విదర్భలో కొన్ని లక్షల తెలుగు మూలాలున్నవారున్నారు, కానీ తనలాగే వారికి తమ మాతృభాష మాట్లాడడం కూడా రాదనీ, చాలా మందికి తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి ఉందన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ చొరవ తీసుకొని తెలుగు నేర్పించే క్లాసులు నిర్వహించాలని కోరారు.

ముఖ్య అతిథులు డా. సుమిత కొండబత్తున్వార్ తుమ్మే, డా. అంబల్ల జనార్దన్, శ్రీ నీలేశ్ గాజింవార్, శ్రీ సంజయ్ బోజేవార్, శ్రీ సంకు సుధాకర్, శ్రీ రాజ్ కుమార్ నాగుల్వార్ గార్లను మహారాష్ట్ర ప్రభుత్వం పక్షాన శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఆ తర్వాత గురు అంతర పెదిల్వార్ రేకి పర్యవేక్షణలో అంతర నృత్య క్రియేషన్ ఇంస్టిట్యూట్ బృంద నృత్య ప్రదర్శనలు చేశారు. వారు ప్రదర్శించిన శివ శివ శంకరం, గరుడ గమనం, భైరవి శతకం, నరసింహ కౌటువం, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆ పిల్లల భంగిమలు, కళ్లతో పలికించిన హావభావాలు, వారి మధ్య సమన్వయం, చూడ ముచ్చటగా ఉండి జనాలను ఆకట్టుకున్నాయి.

అటు పిమ్మట ఇంతకు ముందు చెప్పినట్టుగా, డా. సుమిత కొండబత్తున్వార్ తుమ్మే గారి ఏకపాత్రాభినయ జానపద గాథ “బిలోరీ మాలన్” ప్రదర్శన జరిగింది. దాదాపు నలభై నిమిషాలు జరిగిన ఆ జానపద గాథ, తిలకించి హాజరైన ప్రజలు ఆగకుండా మ్రోగిన చప్పట్లతో తమ స్పందన తెలియజేశారు.

ఆ తర్వాత వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటె గారు, డా. అంబల్ల జనార్దన్ గారిని “మాతృభాష తెలుగు ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత” అనే అంశంపై తమ ప్రసంగం చేయవలసిందిగా కోరారు.

ప్రేక్షకుల్లో చాలా మందికి తెలుగు అస్సలు రాదని తెలిసి డా. అంబల్ల జనార్దన్ గారు మొదట, రెండు నిమిశాలు మరాఠీలో మాట్లాడి ఆ తర్వాత తెలుగులో కొనసాగించారు. “’జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అన్న శ్రీ రాముని ఉక్తిని అనుసరించి, కన్న తల్లి. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది. అలాగే మతృభాష కూడా అంతే గొప్పది. మీలో చాలా మంది మహారాష్ట్రలోనే పుట్టి పెరిగినా, మీ పూర్వీకుల మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకని మీరు మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయవద్దు. మాట్లాడమే కాదు, చదవడం, రాయడం కూడా నేర్చుకోవాలి. మన తెలుగు వారు ఏ రాష్ట్రానికి పోతే అక్కడి వారిలో నీళ్లలా కలిసిపోతారు. అలా కాకుండా మనం, నూనె దేనిలో కలిపినా ఎలా ఐతే  తన అస్తిత్వాన్ని కోల్పోదో, అలాగే మనం కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ స్థానికులతో కలిసిమెలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాలు మన దేవకి మాత ఐతే, మహారాష్ట్ర మన యశోదామాయి, అందుకని ఇద్దరు తల్లులను మనం గౌరవించాలి. మన మూలాలు కాపాడుకోవాలంటే, మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఏ జాతికైనా దాని మాతృభాష వల్లనే గుర్తింపు లభిస్తుంది. మన మనుగడకు మన భాష నేర్చుకోవడం చాలా అవసరం. కన్నడ రాజు శ్రీకృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనీ ఇటాలియన్ దేశస్థుడు నికోలా డీ కొంటె తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అనీ ఒక తమిళ కవి ‘సుందర తెలుంగు’ అని అభివర్ణించిన మన మాతృభాషను మనం తప్పకుండా నేర్చుకోవాలి”  అని దాదాపు పదిహేను నిమిషాలు ప్రసంగించారు డా. అంబల్ల జనార్దన్ గారు.

మళ్లీ అంతర నృత్య క్రియేషన్ ఇంస్టిట్యూట్ బృంద నృత్య కళ్కారులు సాంస్కృతిక కార్యక్రమం కొనసాగించారు. అందులో “రామ కల్యాణం”, “నాగస్తుతి,” “మరాఠీ గోందళ్” “విఠ్ఠల్ విఠ్ఠల్ మావులీ” అంశాలు కనుల పండువగా ప్రదర్శించారు.

నృత్య కళాకారులందరికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రసంసా పత్రాలు అందించారు.

వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటే గారు వందన సమర్పణ చేసిన తర్వాత జన గణ మన ఆలాపనతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.

ఆహూతులందరికి మహారాష్ట్ర ప్రభుత్వం, ఉదయం అల్పాహారం, టీ, పగలు భోజనాలు ఏర్పాటు చేసింది.

Exit mobile version