Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాకేం కావాలి?

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘నాకేం కావాలి?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రశ్నలన్నీ చీకట్లయినాయి
బాధలకు జవాబు దొరకక
కళ్ళ ముందు నిశీధి యవనికలు జారాయి.
గుండు సూది మొన అంత
సాంత్వన దొరికినా చాలనిపిస్తూంది
అది కూడా దొరకకపోతే
చావాలనిపిస్తోంది.
అలసిపోయిన మనసు మీద
కష్టాల సమ్మెట పోటులు…
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది
అంధకారం అలముకున్న రాతిరి వేళ
ముందు దారి కనపడక
కళ్ళు ఉండీ కబోదిలా నేను.
అగమ్యగోచరం.. అంతా అంధకారం.
తీరని కోరికలు..
‘ఇంతై.. వటుడింతై’లాగా
అందకుండా వ్యోమవీధిలోకి ఎదిగిపోతుంటే
వ్యక్తీకరించలేని ఆలోచనలు
అసలు నాకేం కావాలో
ముందు తెలుసుకోమంటున్నాయి
అవును నాకేం కావాలి..
బాధలు, కష్టాలు అనంతంగా ఉన్నా..
కార్యం సాధ్య పడాలంటే ఓ ప్రయత్నం కావాలి.
ఆ ప్రయత్నమే కరదీపికలా
మార్గాన్ని సుగమం చేస్తుంది…
సమస్య అర్థం అవుతూ ఉన్నట్లుంది!!
నాకేం కావాలో తెలుస్తూ ఉన్నట్లుంది!!

Exit mobile version