Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నక్షత్ర రాగం

[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘నక్షత్ర రాగం’ అనే కవితని అందిస్తున్నాము.]

గగన వీధుల్లో మిలమిల
మెరిసే తారకలు
నేడు
మన నేత్రాలకు కళా విహీనమై
గోచరిస్తున్న వెందుకో!
వెన్నెల రాత్రి ఇసుకతిన్నెపై
కూచుని చూస్తుంటే
నక్షత్రరాశులను
తనలో ఇముడ్చుకున్న
అనంతాకాశం
శోభాయమానంగా
చుక్కల.. రాకకు రాత్రి
స్వాగతం పలుకుతోంది
రేరాజు చుట్టూ రాణుల్లా
తళ తళలతో.. ఓ తారకలారా!
మీలో ఒకరువచ్చి
నా ముక్కు పై రాలరాదూ!

మీలా నా నాసిక మెరవగలదు!
బాల్యంలో నాకోరిక
చుక్కల మెరుపు తగ్గిన భావన!
కారణం ఏమిటో!
అంత ఆలోచనేల?
మన కాలుష్యాల విడుదల విడిది

నభోమార్గంలోనేగా!
కలుషిత వాయువులు తప్ప
కాంతులే ముంటాయి!
తళతళలు మిల మిలలు
ఏం కానవస్తాయి?
చక్కని చుక్కల్లారా!
మీరెంత మెరిసినా
చూసే తీరికేదీ?
పరుగుల ఉరకల
జీవనయానం!

నిశి.. రేపు.. మాపు లేదు
తిరిగి తిరిగి అలసి సొలసి
అరచేత వైకుంఠముండగా
ఆ వీక్షణలో లీనమై
దీనిలోనే మీ దర్శనం
ప్రత్యక్షం కాదు పరోక్షం!

మిమ్మల్ని మరచినా
మీ విధి నిర్వహణలో
మీ ఛమక్కులు మీవే!
నాకో కోరిక!
నీలాకాశపు చీరలో
మిమ్మల్ని అద్దుకోవాలనీ
అద్దుకుని ముద్దాడాలనీ!

మది పేటికలో దాచుకోవాలని

ఎందుకో ఆ కోరిక?

మహర్షులు.. ఋషులు.. మునులు,
మహాపతివ్రతలు,
వీరందరినీ సేవించుకోవాలనీ,
పగలు దర్శించాలని అత్యాశ!

మీ రాకకు ఎదురుచూపులు నావే!
ఎందుకంటే..
నా పేరు ‘నక్షత్ర’
మీరే నా మిత్రులు..

Exit mobile version