Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానవ సంవేదనల దర్పణం ‘నక్షత్రాల పందిరి’

[దర్భముళ్ళ చంద్రశేఖర్ గారి ‘నక్షత్రాల పందిరి’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

తెలుగు సాహితీ జగత్తులో ఒక నూతన ఉత్తేజాన్ని, వైవిధ్యాన్ని నింపుతూ వెలువడిన సరికొత్త సృజన ‘నక్షత్రాల పందిరి’. వృత్తిరీత్యా భారత నౌకాదళంలో సీనియర్ అధికారిగా ఉంటూ, దేశ రక్షణ బాధ్యతల్లో అత్యంత బిజీగా గడుపుతున్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా తెలుగు సాహిత్యంపై అపారమైన అనురాగాన్ని పెంచుకున్న విశిష్ట వ్యక్తి శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు. ఇప్పటికే తొమ్మిది వైవిధ్యభరితమైన పుస్తకాలను ప్రచురించి సాహితీలోకంలో తనదైన ముద్ర వేసుకున్న చంద్రశేఖర్ గారి పదో సృజనాత్మక మైలురాయి ఈ గ్రంథం. ప్రముఖ అంతర్జాల వేదిక ‘సిరికోన’ వారి జింకా చెన్నరాయ కిషోర్ స్మారక 2024 పురస్కారాన్ని పొందిన ఈ సంపుటిలో 44 గల్పికలు/కథానికలు ఉన్నాయి.

గల్పికా? కథాకథనమా?

తెలుగు సాహిత్యంలో కథ, కథానిక, గల్పిక వంటి ప్రక్రియల లక్ష్యాలు, వాటి సరిహద్దు రేఖలపై సాహితీవేత్తల మధ్య ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి, సుదీర్ఘమైన చర్చలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. గతంలో 2022లో ‘సంచిక’ పత్రికలో విహారి గారు సైతం దీనిపై ఒక చక్కని వ్యాసాన్ని రాశారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు కూడా గల్పికా లక్షణాలపై ఎన్నో స్పష్టమైన వివరణలు ఇచ్చారు. “ఒక అనుభూతిని లేదా కాన్సెప్ట్‌ను పాత్రల ద్వారా నిర్ద్వంద్వంగా చెప్పించి, పాఠకుడు ‘అబ్బా ఎంత బాగా చెప్పాడు’ అనుకుంటే చాలు” అనేది రచయిత చంద్రశేఖర్ గారి ఉద్దేశం.

అయితే, సుప్రసిద్ధ రచయిత, విమర్శకులు విహారి గారు వీటన్నింటినీ కేవలం గల్పికలుగా మాత్రమే కాకుండా, వాటిలోని వస్తు విస్తృతి, భావ సాంద్రత ఆధారంగా ‘కథా కథనాలు’గా స్వీకరించాలని నిర్ణయించడం విశేషం.

పేరు ఏదైనప్పటికీ, ఈ రచనలలో విస్తృత సామాజిక జీవన చిత్రణ దాగి ఉన్నదనేది వాస్తవం.

ఈ పుస్తకంలోని ప్రతి గల్పికని/కథని ప్రస్తావించకుండా, ఆయా కథల విశేషతలు/ప్రత్యేకతల వారీగా సమీక్షించే ప్రయత్నం చేస్తాను. ఇతివృత్తాల వైవిధ్యాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తాను.

1. దాంపత్య బంధాల నిగూఢ అంతరంగం:

భార్యాభర్తల మధ్య వ్యక్తమయ్యే సున్నితమైన భావోద్వేగాలను, అక్షర రూపంలోకి తేవడం అత్యంత కష్టసాధ్యమైన పని. రచయిత చంద్రశేఖర్ గారు ఈ క్లిష్టమైన సవాలును ఎంతో చాకచక్యంగా అధిగమించారు. మొదటి కథనం ‘పాలపిట్ట రంగు’ లో ఒక విలక్షణమైన విషాదమోహన భావనను పండించగా, ‘గెలుపు-ఓటమి’, ‘మల్లెపూలు’ వంటి గల్పికలలో నూతన వధూవరుల మధ్య సాగే సరస శృంగార హేలని, కుటుంబ పెద్దలతో వారి ముగ్ధమోహన బంధాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మలిచారు. ‘ఎమ్ బేకరీ’ లో భార్యాభర్తల బంధంలో ఒకరు మరణిస్తే మిగిలే ఒంటరితనాన్ని గుండెలకు హత్తుకునేలా చూపిస్తూనే, ఆ బంధానికి సాక్ష్యంగా నిలిచిన బిడ్డల కోసం జీవితాన్ని సార్థకంగా కొనసాగించాలనే పరమార్థాన్ని బోధించారు.

2. సామాజిక స్పృహ, బడుగు జీవుల ఆర్తనాదం:

చింతనాపరుడైన రచయిత సమాజాన్ని చదివిన కొద్దీ ఆ వేదనలను తన రచనలలో ప్రతిబింబిస్తాడు. ఉత్తర్‍ప్రదేశ్ లోని హాత్రాస్‍లో ఒక బాబా ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది అమాయకులు దుర్మరణం చెందిన ఘోర ఉదంతం ఆధారంగా రాసిన ‘దయామయుడు’ కథ పాఠకుల హృదయాలను కలచివేస్తుంది. “అన్నిటినీ దేవుడు ఒక్క అరగంట సమయంలో సంపూర్తిగా శమింప జేసేశాడు” అంటూ ముగించడంలో ఎంతో ఆర్ద్రత నిండి ఉంది. అలాగే కనీస అవసరాలైన తాగునీరు, నీడ, టాయిలెట్ సౌకర్యాలు కూడా లేకుండా ఉప్పుకయ్యలలో మహిళలను బానిసలుగా మార్చి హింసిస్తున్న యజమానుల దౌర్జన్యాన్ని ‘దాహం’ అనే గల్పికలో అత్యంత ప్రభావవంతంగా ఎండగట్టారు. “వర్ణాలు కోల్పోయి ఆమె దేహము, హృదయము భావరహితంగా తెల్లబోయి ఉన్నాయి” అనడం ఉప్పుకయ్యల తెల్లదనాన్ని ప్రస్తావిస్తూనే; తెల్లదనం వెనుక ఉన్న మరకలని ప్రదర్శిస్తుంది.

బెలూన్లు అమ్ముకుంటూ బతుకు బండిని లాగే నిరుపేద జీవితాన్ని ‘స్టేచర్’ లోనూ, ‘దావత్’, ‘అలగాజనం’, ‘జెండా బాబాయ్’, ‘అమ్మోరి జాతర’ వంటి గల్పికల ద్వారా సమాజంలో అణగారిన వర్గాల ఆర్తనాదాలకు అక్షర రూపం ఇచ్చారు.

3. సమకాలీన వ్యవస్థలపై వ్యంగ్యాస్త్రాలు:

నేటి ఆధునిక సమాజంలో మనుషుల చిత్తవృత్తులలో వస్తున్న మార్పులను, వ్యవస్థలలో పెచ్చురిల్లుతున్న అవినీతిని రచయిత తన వ్యంగ్య బాణాలతో చీల్చిచెండారు. చురుక్కుమనే వెటకారం, అధిక్షేపం చంద్రశేఖర్ గారి గల్పికలలో కనిపిస్తాయి. ‘సిరితా వచ్చిన వచ్చును’లో కార్పొరేట్ కంపెనీలలో సామాజిక బాధ్యత పేరుతో జరిగే మోసాలను పారదర్శకంగా చూపించారు. ‘పావలా కోడిపెట్ట’ గల్పికలో కేవలం పదిమంది కూడా లేని ఒక చిన్న కార్యాలయంలో స్వచ్ఛతా కార్యక్రమం పేరిట తిండి ఖర్చుల కోసమే లక్ష రూపాయల దొంగ బిల్లు సృష్టించి మేనేజరుకు గుండె ఆగినంత పని చేసిన తీరు అవినీతి వ్యవస్థపై పడిన బలమైన చరుపు. ‘ఇచ్చట అన్నీ అమ్మబడును’, ‘దుష్టబుద్ధి’ వంటి కథనాలు కూడా సమాజంలోని రాజకీయ, సాంఘిక కుళ్ళును నిర్భయంగా ఎత్తిచూపాయి.

4. ఆధునిక మహిళా చైతన్యం:

ఈ సంపుటిలో స్త్రీ అస్తిత్వానికి, మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు రచయిత. ‘అంతం-ఆరంభం’లో గృహహింసకు పాల్పడే అరాచకపు భర్తకు భార్యే స్వయంగా శిక్ష విధించి అంతమొందించే విప్లవాత్మక కోణాన్ని చూపారు. ‘మంచువిడిన పువ్వు’ లో సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నేటి కాలంలో ఉద్యోగ బాధ్యతలు, పని ఒత్తిడి భార్యాభర్తలిద్దరికీ సమానమేననే ఎరుకతో, అర్థం చేసుకునే మనసుతో భర్తే స్వయంగా భార్యకు కాఫీ తెచ్చి ఇచ్చే దృశ్యం హృదయాన్ని తాకుతుంది. ‘మధ్య (తరగతి) గది’ లో సైతం మహిళా చైతన్యాన్ని ఎంతో వాస్తవికంగా చిత్రించారు.

5. జీవిత తాత్త్వికత, మానవ గౌరవం:

చంద్రశేఖర్ గారి కథాకథనాలకు బలమైన పునాది వారి జీవిత తాత్త్వికతే. ‘జీవితం-ఒక పూలదారి’ గల్పిక నేటి యాంత్రిక పరుగుపందెం జీవితాన్ని విమర్శిస్తూ, బతుకును చక్కటి పూలదారిపై నెమ్మది నడకలా ఆస్వాదించాలని ప్రబోధిస్తుంది. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, బతుకు ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ‘ధన్వంతరి మెడికల్ షాప్’ హితవు పలుకుతుంది. ఈ పుస్తకానికే మకుటాయమానంగా నిలిచిన కథ ‘వృత్తిధర్మం’. ఈ కథలో మసాజ్ చేసే ఇరవై ఏళ్ల చిన్నారి ‘మైకో’ పాత్ర ద్వారా హ్యూమన్ డిగ్నిటీకి భంగం కలగకుండా బ్రతికే జీవిత సారాంశాన్ని అద్భుతంగా విశదీకరించారు. ఉత్తమ కథ పాఠకుడి గుండెల్లో అలజడి రేపాలి అనడానికి ఈ కథే నిదర్శనం. అలాగే ‘తేలికపడటం’, ‘ఆత్మసంతృప్తి’ వంటి కథలు మనిషికి అంతర్మథనాన్ని కలిగిస్తాయి. తాను కొద్ది రోజులలో చనిపోతానని తెలిసిన పార్వతీశం, తను సేకరించిన ఉత్తమ గ్రంథాలను, తాను స్వయంగా గీసిన అనేక చిత్రపటాలను అడిగిన వారికి ఇచ్చేస్తాడు. ఎందుకిలా చేస్తున్నారని భార్య అడిగితే, ఆయన చెప్పిన సమాధానం గొప్పది. ‘తేలికపడటం’ గల్పిక ‘డెత్ క్లీనింగ్’ భావనని వివరిస్తుంది.

200 సంవత్సరాల తర్వాత దైనందిన చర్యలన్నీ యాంత్రికమైపోయిన కాలంలో ‘మనసు అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది?’ అనే జటిలమైన ప్రశ్నను సంధిస్తుంది ‘మనసు’ అనే గల్పిక. రెండే పేజీలలో సైన్స్ ఫిక్షన్‌నీ, మానవ మనస్తత్వాలని అద్భుతంగా ఇమిడ్చారీ కథలో. ‘ఆత్మసంతృప్తి’ గల్పికలో వ్రాసిన “అంతకాలపు అబద్ధానికి అంత్యకాలం వచ్చి త్రుటిలో తన పట్టు వదిలింది” అన్న వాక్యాల ద్వారా ఒక వ్యక్తిలో కలిగిన మార్పుని వివరించడం బాగుంది.

‘నక్షత్రాల పందిరి’ కథలో ఎంతో హృద్యమైన, రొమాంటిక్ సన్నివేశం కనిపిస్తుంది. తమ దగ్గర పనిచేసే అమాయకపు కుర్రాడి వివాహానికి భర్త ఇచ్చే కానుక కంటే, ఒక గొప్ప బహుమతి ఇవ్వాలని భార్య అనుకుంటుంది. ఆ కుర్రాడు కాపలాగా ఉన్న ఇంటిని, ఆ ఇంటి తోటలోని సన్నజాజి పందిరితో సహా అతనికి రాసిచ్చేయమని భర్తకు సలహా ఇస్తుంది. ఆ రాత్రి, ఆ నూతన దంపతులు ఆ సన్నజాజి పందిరి నీడన నక్షత్రాల సాక్షిగా తమ వైవాహిక జీవితాన్ని ఎంతో అందంగా ప్రారంభిస్తారు.

6. శిల్ప నైపుణ్యం, భాషాభిమానం, కళా హృదయం:

పర్యావరణ పరిరక్షణ అనేది బాగా నలిగిన కథావస్తువునైనా, సరికొత్త శిల్పంతో ఆవిష్కరిస్తూ ‘ఎర్రమూత’ అనే ప్లాస్టిక్ సీసాల మూత ఆత్మకథగా రాసిన ప్రయోగం అత్యంత ప్రశంసనీయం. ఇది ప్లాస్టిక్ వల్ల ప్రకృతి పడుతున్న బాధల గాథలను కళ్ళకు కడుతుంది. రచయితకు తెలుగు భాషపై ఉన్న అపరిమితమైన ప్రేమ, దాని భవిష్యత్తుపై ఉన్న సంవేదనలు ‘మహాప్రస్థానం’, ‘కక్కడ కుక్క’, ‘అక్షరం’ వంటి కథనాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంతేకాక, చంద్రశేఖర్ గారిలోని చిత్రకళాభినివేశాన్ని, రసాత్మక భావనలను ‘నలుపు తెలుపు’, ‘అంతిమచిత్రం’ కథనాలు చక్కగా ఆవిష్కరించాయి.

ముగింపు:

సమగ్రంగా పరిశీలిస్తే, ‘నక్షత్రాల పందిరి’ గల్పికల సంపుటిలో కేవలం కాల్పనిక కథలు మాత్రమే లేవు; ఇందులో ఒక లోతైన చరిత్ర ఉంది, తెలుగు సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, లోకరీతితో పాటు అత్యుత్తమ లౌక్యం, లోకజ్ఞత ఉన్నాయి. సాధారణ పర్యాటక చూపులకు అందని ఆలోచనాత్మక దృశ్యాల చిత్రణ ఇందులో ఉంది. ముందుమాటలో విహారి గారు అన్నట్లు, పాఠకుడి మనసులో సద్విమర్శనాత్మక అలజడిని, సామాజిక ఆలోచనను ఇబ్బడిముబ్బడిగా కలిగించగల శక్తి ఈ పుస్తకానికి పుష్కలంగా ఉంది. ప్రతీ ఒక్కరు చదివి, దాచుకోవాల్సిన విశిష్ట సంపుతి ఈ ‘నక్షత్రాల పందిరి’.

***

నక్షత్రాల పందిరి (గల్పికలు)
రచన: దర్భముళ్ళ చంద్రశేఖర్,
ప్రచురణ: సమత పబ్లిషర్స్, విశాఖపట్టణం
పేజీలు: 158
వెల: ₹ 150/-
ప్రతులకు:
దర్భముళ్ళ చంద్రశేఖర్,
303,  ఆర్. ఆర్. టవర్స్,
రైతుబజార్ ఎదురుగా,
గోపాలపట్నం, విశాఖపట్టణం. 530027
ఫోన్: 9491850718
ఆన్‍లైన్‌లో:
https://logilitelugubooks.com/book/nakshatrala-pandiri-darbhamulla-chadrashekar

~
దర్భముళ్ళ చంద్రశేఖర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-darbhamulla-chandrasekhar/

Exit mobile version