[బాలబాలికల కోసం ‘నల్ల మచ్చ ఆవు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
“అయ్యా నిన్నటినుండి నా ఆవు కనబడటం లేదు. మన గ్రామం లోని మూడో వీధిలో ఉన్న చలమయ్యే దొంగిలించి ఉండవచ్చునని నా అనుమానం. ఎందుకంటే అతడికి ఆవులు, ఎద్దులు దొంగలించే బుద్ధి ఉందని చెప్పుకుంటుంటారు” అని గ్రామ పెద్దతో చెప్పాడు నందయ్య.
“సరే నీకు న్యాయం జరిగేట్టు చూస్తాను” అని వివరాలు వ్రాసుకుని నందయ్యకు చెప్పి పంపించాడు గ్రామ పెద్ద ధర్మయ్య.
వెంటనే తన వద్ద పని చేసే ఉద్యోగిని చలమయ్య ఇంటికి పంపి ఆవులను పరిశీలించి రమ్మన్నాడు గ్రామ పెద్ద ధర్మయ్య.
ఆ ఉద్యోగి చలమయ్య ఇంటి వెనుక పెరడులో కట్టేసిన ఆవులను పరిశీలించి వచ్చి ధర్మయ్యకు వాటి వివరాలను వివరించాడు.
“నీవు చలమయ్య ఇంటికి వెళ్ళి తన వద్ద ఉన్న ఆవులను తీసుకు రమ్మనమని నా మాటగా చెప్పు” అన్నాడు ధర్మయ్య.
ఉద్యోగి వెళ్లి ధర్మయ్య చెప్పమన్నట్టే చెప్పాడు.
“నేనెందుకు రావాలి నా ఆవులతో?” అని ప్రశ్నించాడు చలమయ్య.
“ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీవు నీవు నీ ఆవులతో రావలసిందే” చెప్పాడు ఉద్యోగి.
“సరే వస్తున్నా” అని తన దగ్గరున్న మూడు ఆవులను తోలుకుని ధర్మయ్య వద్దకు వచ్చాడు చలమయ్య.
నందయ్యను కూడా పిలిపించాడు. ఆ మూడు ఆవులను నిశితంగా పరిశీలించి వాటిని తన ఇంటి వెనుక పెరడులో కట్టెయ్యమని చెప్పాడు తన ఉద్యోగితో.
నందయ్యను పక్కకు తీసుకువెళ్ళి “ఈ మూడు ఆవులలో నీ ఆవు ఏది దానికి ఏమైనా గుర్తులు ఉన్నాయా?” అడిగాడు ధర్మయ్య.
“అయ్యా నా ఆవు నల్లమచ్చలది. దాని మెడ దగ్గరి మచ్చ అచ్చం మన దేశ పటంలా ఉంటుంది. ఇంకా చిత్రమేమిటంటే మన దేశం కింద శ్రీలంక ఉన్నట్టు కూడా ఒక మచ్చ ఉంటుంది” అని వివరించాడు.
“సరే నీవు మాట్లాడకుండా అక్కడ కూర్చో” చెప్పి దూరంగా ఉన్న చలమయ్యను పిల్చి “నీ ఆవుల గుర్తులన్నీ నీకు తెలుసా?” అడిగాడు ధర్మయ్య.
“అయ్యా ఎర్ర ఆవుకి నుదిటి మీద తెల్ల మచ్చ ఉంటుంది, తెల్ల ఆవుకి కుడి కొమ్ము కొద్దిగా కొమ్ము విరిగి ఉంటుంది మరొకటి నల్లమచ్చల ఆవు” చెప్పాడు చలమయ్య.
“నల్లమచ్చల ఆవు సరే, దాని మెడకింద మచ్చ ఏ ఆకారంలో ఉంటుంది?” అని ధర్మయ్య అడిగాడు.
“ఆ మచ్చా?” అంటూ నీళ్ళు నమిలాడు చలమయ్య.
వెంటనే ధర్మయ్య నందయ్యను పిల్చి తన ఆవు గుర్తులు చెప్ప మన్నాడు. నందయ్య చక్కగా దాని మీద గుర్తులను మెడ దగ్గర మచ్చను గురించి వివరించాడు.
“నందయ్య తన ఆవుని దగ్గరనుండి పరిశీలించ కుండా చక్కగా వివరించాడు. అది నీ ఆవు కాదు కాబట్టి వివరించలేక పోయావు. నీవు నందయ్య ఆవుని దొంగలించావు. చేసిన తప్పు ఎప్పటికయినా బయట పడుతుంది, అతని నల్ల మచ్చల ఆవు అతనికే ఇచ్చేస్తున్నాను” అని ఆవులను తన పెరడు నుండి తెప్పించాడు.
ఆవు ఆప్యాయంగా నందయ్య వద్దకు వచ్చింది.
నందయ్య దానిని ప్రేమతో నిమిరాడు.
చేసిన తప్పుకి చలమయ్య తల వంచుకున్పాడు.
“నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష వేయాల్సిందే నీవు నందయ్య ఇంటికి వెళ్ళి ఆవులను కడగటం, కుడితి నీళ్ళు పెట్టడం వంటి పనులు పది రోజులు చెయ్యి ఇక మీదట నీవు ఇటువంటి పనులు చేస్తే నీకు కారాగార శిక్ష విధిస్తాను” అని ఖఠినంగా చెప్పాడు ధర్మయ్య.
“అయ్యా బుద్ధి గడ్డి తిని ఇటువంటి పనులు చేస్తున్నాను. ఇక మీదట ఇటువంటి పనులు చేయను. చేసిన తప్పుకి పదిరోజులు నందయ్య ఆవుకి సేవ చేస్తాను” చెప్పాడు చలమయ్య.
“నీవు నీ తప్పుని తెలుసుకున్నావు ఇక పశువులను దొంగిలించకు అది చాలు” అని తన మంచి బుద్ధిని చూపాడు నందయ్య.
