నల్లమల ప్రాంతానికి చెందిన కవి రాసమొళ్ళ చంద్రయ్య రచించిన ‘నల్లమల మొగ్గలు’, ‘రాసమొళ్ల రత్నావళి’ కవితాసంపుటాలను ప్రముఖ తెలంగాణ ఉద్యమకవి, నవలాకారుడు, ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్ ఆవిష్కరించారు. మే 31 న నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాసమొళ్ళ చంద్రయ్య నల్లమల అస్తిత్వాన్ని, సామాజిక అంశాలను అక్షరీకరించడం గొప్ప విషయమన్నారు. అప్పాయిపల్లి గ్రామంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన ధిక్కార స్వరంలో బాలుడుగా ఉన్న రాసమొళ్ల చంద్రయ్య పాల్గొన్నాడని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలకోసం సమాజ మార్పుకు మొగ్గలు, మణిపూసల కవిత్వం ద్వారా వెలుగెత్తి చాటుతున్నాడని ఆ అక్షరాలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయని చంద్రయ్యని కొనియాడారు.
ప్రశ్నించేతత్వం ఎల్లప్పుడూ సమాజంలో ఉంటుందని ఆ ప్రశ్ననే కవిత్వంలో కనపరుస్తూ చంద్రయ్య వినిపిస్తున్నాడని చెప్పారు. చంద్రయ్య తనకు ఈ కవిత్వం పుస్తకాలను అంకితం ఇవ్వడం గొప్పగా భావిస్తున్నానని రాబోయే కాలంలో మరిన్ని సమాజమార్పు కోసం తన కవిత్వంతో గళమెత్తాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన ‘నెలపొడుపు సాహిత్య వేదిక’ ప్రధాన కార్యదర్శి వహీద్ ఖాన్ మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో రచనలు చేసే కవుల కవిత్వం ఆధిపత్య ధోరణులను ప్రతిబింబిస్తాయన్నారు. కవిత్వం ఏ ప్రక్రియలో రాసిన అది సమాజాన్ని ప్రభావితం చేయాలన్నారు.
ప్రముఖ యువకవి బోల యాదయ్య ‘నల్లమల మొగ్గలు’ కవితాసంపుటిని సమీక్ష చేస్తూ అణగారిన వర్గాలకు అక్షరాన్నాందించిన సావిత్రీబాయి పూలే శ్రమ పోరాట తాత్వికతను, నల్లమల సౌందర్యాన్ని, దేశభక్తులు, రైతులు, చెట్లు, మహిళలు, పిల్లలు, చెరువులు, నదులు, సైనికులు, అమ్మానాయన, స్వామి వివేకానంద మొదలైన సామాజిక అంశాలపై కవిత్వం రాయడం అభినందనీయమని అన్నారు. రాసమొళ్ల చంద్రయ్య దివ్యాంగుడైనా శక్తినంత కూడదీస్కోని సమసమాజ మార్పుకై అక్షరాన్ని సృష్టించడం గొప్ప విషయమని అన్నారు. అప్పాయిపల్లి గ్రామం నుండి మొగ్గలు కవిత్వం రాస్తున్న చంద్రయ్య గతంలో నల్లమల ఆరాధ్య దైవం సళేశ్వరం లింగమయ్యపై అద్భుతమైన పాటలను, దివ్యాంగుల మణిపూసలను రచించాడన్నారు.
ప్రముఖ కవి టి.ఆశీర్వాదం ‘రాసమొళ్ళ రత్నావళి’ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ జీవితంలోని అనేక పార్శ్వాలను రాసమొళ్ల చంద్రయ్య అక్షరీకరించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకంలో వివిధ అంశాలపై రాసిన కవిత్వం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
అనంతరం మొగ్గలు సృష్టికర్త డా. భీంపల్లి శ్రీకాంత్, మణిపూసలు సృష్టికర్త వడిచర్ల సత్యం, ప్రముఖ కవులు వనపట్ల సుబ్బయ్య, గంటా మనోహర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మూడవత్ విజయ కృష్ణనాయక్ తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు ఎదిరెపల్లి కాశన్న, కల్వకోలు మద్దిలేటి, నల్లగొండ శ్రీనివాస్, కే.పి.లక్ష్మినరసింహ్మ, దేవరపాగ కృష్ణయ్య, కందికొండ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

