దృశ్యం-14
[డా. నసీర్ తిరిగి వచ్చి రాజ్ వద్ద కొచ్చి చెట్టు మొదలుమీద కూర్చుని, పక్కన పెట్టుకున్న తన టీ కప్పులో టీని ఒక్క పెద్ద గుక్కవేసి తాగుతారు]
రాజ్ : (గాభరాగా) బాబోయ్! మీరేం చెప్తున్నారు? మరి అపై గురువారం నాడు గుల్లా వస్తే ఎలా?
డా. నసీర్ : అదేంటలా మాట్లాడుతున్నావు రాజ్?… పై గురువారం వరకూ అక్కడెవరుంటారు?
రాజ్ : (అర్థం కానట్లు) అంటే?
డా. నసీర్ : అంటే రాజ్, ఆ రాత్రికి రాత్రే నఫీసా, షహానాలను తీసుకుని, కోడి కుయ్యటానికంటే చాలాముందు, బాగా తెల్లవారుఝామునే బైల్దేరి జమ్మూ వెళ్లిపోయాను… శాశ్వతంగా…
రాజ్ : డాక్టరుగారూ, మీరు కూడానా?
డా. నసీర్ : అవును రాజ్ (దుఃఖిస్తున్న గొంతుతో) నేను కూడా…! తోవంతా నీ ఆలోచనలే, మాటలే మనసులో మెదులుతూనే ఉన్నాయి. నువ్వు ఆనాడు చాలా సరిగ్గానే చెప్పావు, “ఇంకా AK 47 మీవైపుకు గురిపెట్టలేదు కదా! అని… నువ్వు చెప్పినది అక్షరాలా నిజం!… నావైపుకు గురి పెట్టే సరికి మాత్రం అక్కడ ఒక్క రాత్రయినా ఉండలేకపోయాను.
రాజ్ : చాలా బాధాకరమైన…
డా. నసీర్ : (గొంతుకలో బాధ, దుఃఖం లేవు) ఉహుఁ నా గురించి మాత్రమే బాధపడటం కాదు, మొత్తం కాశ్మీరు లోయలో నెలకొన్న పరిస్థితుల గురించి బాధపడాలి. మన లోయ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది…. ఈ AK 47 జాతి, మతాన్ని చూడరు. కేవలం భయంతో కూడిన రక్తం పులుముకుని నవ్వుతున్న మొహాల్ని మాత్రమే చూడాలన్న ఆనందం! కేవలం భయాందోళనలు కలిగించే మొహం! అంతే!
రాజ్ : అంటే ఇన్నేళ్లూ మీరు జమ్మూలోనే ఉన్నారా?
డా. నసీర్ : లేదు – లేదు! నేను దిల్లీ వచ్చేసేను… ఇప్పుడు జరిగిన కాల్పులు, చంపడాల్లో గుల్లా చచ్చిపోయాడన్న వార్త తెలిసింది… అందుకే మళ్లీ ఇంటికి తిరుగుప్రయాణం!
రాజ్ : (ఆనందంగా) నిజమా?… అయితే ఇది చాలా మంచి వార్తే!… (లేచి నిల్చుంటాడు) మీరు ఇంటికి తిరిగి వెళ్తున్నారన్న వార్తకన్న మంచి తీపి వార్త మరేం ఉంటుంది? డా. నసీర్ సాబ్… ముబారక్…
డా. నసీర్ : అవును రాజ్! ఆ ఇల్లు మళ్లీ రెండేళ్ల తరవాత నివాసంగా మారుతుంది… మనుష్యులతో!
రాజ్ : నిజమే ఆ యిల్లు నివాసంగా మారుతుంది… (దుఃఖంలో మునిగిపోతూ) దాని తోటే, పక్కనే ఉన్న నా యిల్లు? ఒకవేళ మొక్కలు ఎండిపోతూ ఉంటే కాసిని నీళ్లు ఎప్పుడయినా పోస్తూ ఉండండి…
డా. నసీర్ : (రాజ్ భుజం పైన చెయ్యివేసి) రాజ్! ఇక నువ్వు కూడా తిరిగొచ్చెయ్యి!
రాజ్ : ఎక్కడికి?
డా. నసీర్ : ఇంటికి, నీ ఇంటికి …
రాజ్ : (దుఃఖిస్తూ) ఇల్లు! హుఁ! యిల్లు అన్న భావమే ఏదో రోజు సమసిపోతుందేమో!… (హఠాత్తుగా తనను తాను సంబాళించుకుంటూ) మరోసారి మీకు అభినందనలు… (చేతులు కలిపి) వెళ్తా!… రూప ఎదురుచూస్తూ ఉంటుంది…
డా. నసీర్ : (కేక వేసి) రాజ్… ఓ… రాజ్… (అగి) ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను రాజ్ – (ఇద్దరూ ఆలింగనం చేసుకుంటారు.)
(సశేషం)