[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘నలుపు తెలుపుల మధ్యన’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నలుపు తెలుపుల మధ్యనే
ఉంది మొత్తం జీవితం
తెల్లారితే తెలుపు రంగు
చల్లారితే నలుపు వైపు
పగలు అందాల పొంగు
రాత్రి కీచురాళ్ళూ క్రీనీడలు
పగలంతా పరుగుల పదనిసలు
రెక్కాడినా డొక్కాడని దైన్యాలు
అయినా బారెడంత పొద్దు పుచ్చాలి
అలవి కాని ఆశలకు పగ్గాలు వేయాలి
సరిచూసుకుంటూ స్వారీ చేయాలి
గురి తప్పకుండా ముందుకు సాగాలి
పగలు పెట్టే సెగలు పొగలు దగాలు
పగ బట్టి వెంట పడుతూంటాయి
ఉన్నవాడికి పగలు విలాసం
వెలుగు జిలుగుల స్వర్గం
పగలు నలుపు చేయాలన్న ఊహ
రోజంతా దొర్లించాలన్న ధ్యాస
నలుపు సొమ్ము తెలుపు చేసే ప్రణాళిక
లేని వాడికి పగలే బతుకు
రాత్రి ఒక చీకటి దుప్పటి
నలుపు తెలుపుల దోబూచాటలో
బక్కోడి బతుకు బంతాట
బలవంతుడికి జీవితమే సయ్యాట
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
