నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం
రోజు – పది
గదిలో స్నానాదులు పూర్తి చేసి సూర్యోదయానికి నర్మదా దేవాలయం వెళ్ళాము. దేవాలయంలో ఉదయం హారతి జరుగుతోంది. నిలబడే ఓపిక లేకపోయినా జగదంబ నిలబెట్టింది. నక్షత్ర హారతి, ఏకహారతి, నాగహారతి ఇత్యాదివి హారతులు పాడుతు ఇచ్చారు. దాదాపు ముప్పై నిముషాల తరువాత హారతి ఆపి అందరికి ప్రసాదం ఇచ్చారు. మేము ఇచ్చిన కొబ్బరికాయ, తామర పూలు, కలకండ తీసుకున్నారు.
పూజారి నా ముందు వాళ్ళని తిడుతున్నాడు “కోరికలు కోరుతారు, కాని మాయికి ఒక చీర కూడా తేరు. ఒక్క పువ్వు కూడా పెట్టరు…” అంటూ. అది నన్నేనేమో అనిపించింది. నేను చీర లాంటివి తీసుకుపోలేదు. కేవలం పూలు కొబ్బరికాయ తీసుకువెళ్ళాను. నన్ను చూసి “ఎక్కడ్నుంచి?” అంటు పలకరించాడాయన.
“హైద్రాబాద్…”
“నాకు హైద్రాబాద్ తెలుసు…” అన్నాడు ప్రసాదం తీసుకొని అమ్మవారికి తాకించి ఇస్తూ.
“ఎందుకొచ్చారు?” అన్నాడు అతనే మళ్ళీ
“పరిక్రమ!” అని చెప్పాను పొడిగా.
శ్రీవారు అతనికి దండిగా దక్షిణ ఇచ్చారు. ఆయన సంతోషపడ్డారనిపించింది.
నేను బయటకు వచ్చేశా. కాని నాకో పాఠం… దేవుడి దగ్గర మన కోరికల చిట్టా సమర్పిస్తాము, మరి ఏం తీసుకుపోతున్నాం?
మన కొబ్బరికాయకు మనకు సమస్త భువనాలు ఇవ్వాలా?
నేను భౌతికమైన కోరికలు కోరటం లేదనుకో.
కాని పారమార్థికమైనవైవా… అమ్మకు ఏం సమర్పించాను?
నేను సమర్పించాలనుకున్నది అహం.
ఇది ఆ తల్లే తీసుకోవాలి కదా!!!…
ఇలా రకరకాలుగా విచారం సాగింది. రేవా కుండ్ వద్ద శివలింగానికి అభిషేకం చేశాను …
“నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహా దేవాయ
త్రయంబకాయ
త్రిపురాంతకాయ
త్రికాల కాలయ
కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ
మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః…” అంటూ.
తరువాత ఇద్దరం కలిసి నర్మదకు షోడశ ఉపచారాలు చేసి, నైవేద్యం పెట్టి కోతులు తిరుగుతుంటే కోతికి పెట్టేశాం. అక్కడే నర్మదాష్టకం చదువుకున్నాం.
“మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలమ్।
జగల్లయే మహాభయే మృకణ్డుసూనుహర్మ్యదే
త్వదీయపాదపఙ్కజం నమామి దేవి నర్మదే॥”
అక్కడ మేము పూజలో ఉంటే కొందరు భక్తులు వచ్చి అడిగారు “పరిక్రమనా?” .
“అవును” చెప్పాము.
“మీరు ఉత్తరంలో వచ్చారా లేక దక్షిణమా?”
“ఉత్తరం!”
“అయితే అటు వెళ్ళకండి…” అంటూ కుండం రెండో వైపు చూపటం.
ఇలా చాలా సార్లు చాలా మంది చెబుతూనే ఉన్నారు.
మా డ్రైవర్ కూడా చెప్పాడు. ఆ కుండానికి ఉత్తరం వైపు కూర్చొని పూజ చేసుకున్న నేను చిలిపిగా “అటు పరుగెత్తి ఇటు రానా?” అన్నా మావారితో.
“చాల్లే అల్లరి. ముందు వచ్చిన పని చూడు…” హెచ్చరికగా అన్నారు.
‘పెద్దవాళ్ళు మనలను కట్టడి చేస్తారు’ మనసులో గొణుకున్నా.
పరిక్రమలో నర్మద దాటకూడదు. అమర్‌కంటక్‌లో నర్మద ‘జిగ్జాగ్’గా ఉపరితలంలో భూమిలో పారుతూ ఉంటుంది. అక్కడికి వద్దు. ఇక్కడికి వద్దు అంటూ ఆంక్షలు తెగ ఉంటాయి. గైడ్ మాతో రోజంతా ఉండి మమ్మల్ని అన్ని తీర్థాలు, కుండాలు తిప్పాడు కాబట్టి మాకు సరిపోయింది. లేకపోతే చాలా గందరగోళంగా ఉండేదనిపించింది. చాలా సార్లు, గైడ్ సహాయం ఉంటే క్షేత్రదర్శనం సులభం కూడా.
మా పూజ తరువాత మేము బయటకొచ్చి మా వద్ద ఉన్న దుప్పట్లు పంచాము. పది రూపాయల నోట్లు పంచాము. నోటు బుక్స్, పెన్నులు, బిస్కెట్లు పంచేశాము.
నేను శ్రీవారితో చెప్పాను, గుడిలో పూజారి మాటలు చెప్పాను. చీరన్నా తేలేదన్న విషయం…
“మనం దుప్పట్లు పంచాము కదా. నర్మదామాయి ఇంకా సంతోషపడి ఉంటుందిలే…” ఊరడింపుగా అన్నాడాయన.
కాని నాకో పాఠంగా అనిపించింది. మా నర్మదా పరిక్రమ తరువాత నేను ఇండియాలో దర్శించిన అన్ని దేవాలయాలకు అమ్మవారికి, అయ్యవారికి బట్టలు, పసుపు, కుంకుమ లేకుండా దర్శించుకోలేదు.
విజయవాడ, జిల్లేళ్ళమూడి, భ్రమరాంబికా ఇలా వెళ్ళిన చోటుకు బట్టలు, పసుపు కుంకుమలతోనే వెళ్ళాను. అమర్‌కంటక్‌లో నేను నేర్చుకున్న పాఠం, అడగటం కన్నా ముందు ఇవ్వమని. (ఇది మనం ఎంతగా పాటించినా,ఇంకా మిగిలిపోతూ ఉంటాయి. అది వస్తువైనా, భావమైనా, అహమైనా…) ఇవ్వటం, పంచుకోవటం మాకు మొదటి నుంచి నేర్పినా, అది హృదయంలో నిండి ఉన్నా, పరిక్రమ తరువాత రెండోది వ్యర్థమన్న భావము బలపడింది.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
మేము ఉదయం నర్మద పూజానంతరం హోటల్‌కి తిరిగి వెళ్ళాము. కొద్దిగా ఉపాహారం తిని అమర్‌కంటక్‌లోని మిగిలిన దేవాలయాలను దర్శించటానికి బయలుదేరాము. మా గైడు వచ్చి కలిశాడు. ముందుగా కారులో కపిలధారకు వెళ్ళాము. కపిలధార ఒక జలపాతం. భూమిలో నుంచి ప్రవహించి నర్మద ఒకచోట ఉపరితలం పైకి వచ్చి, వెంటనే జలపాతంగా దుముకుతుంది. అక్కడ ఋషులు, మునులు వచ్చి నర్మదలో స్నానం చేసి వెళతారట. దానికి ఒక కిలోమీటరు నడక ఒక కిలోమీటరు ట్రెక్ చెయ్యాలి. కిల్లోమీటరు నడిచాక మనకు కనిపిస్తుంది. దాని వద్దకు వెళ్ళాలంటే కొండ దిగి, ఎక్కి వెళ్ళాలి. నేను కనపడే వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నా. శ్రీవారు దిగి వెళ్ళి నీళ్లలో ప్రోక్షణ చేసి వచ్చారు. తిరిగి మేము వెనకకు నడిచాము.
అక్కడ్నుంచి మరో రేవా కుండ్ వైపు వెళ్ళాము.
నర్మద భూమి లోపల ఉంది కాబట్టి రోడ్డు మీదుగా వెళ్ళొద్దు అన్నాడు గైడ్. మట్టి దారిలో, చిన్న కాలువ వెంట నడుస్తు పెద్ద చెట్టు వద్ద కొచ్చాము. ఆ చెట్టు క్రింద చాలా చిన్న కాలువ, మన ఇళ్ళలో నీళ్ళు వాడాక కాలువలు కడతారుగా పల్లెలో అలాంటి కాలువ ఉంది. గైడ్ ఆ కాలువే నర్మద అని అక్కడ దాటితే ఇక వెనకకు వెళ్ళేది లేదని చెప్పాడు. మేము ఆ కాలువలో నీరు ప్రోక్షణ చేసుకొని దానిని దాటాము.
ఆ విశాలమైన రావి చెట్టు క్రింద నర్మదామాయి విగ్రహం ఉంది.
ఏదో బస్సు వచ్చినట్లు ఉంది, జనాలు నర్మదామాయి పూజకు కూర్చుంటున్నారు.
వారో వంద మంది ఉన్నారు. అందరి దగ్గర తలో వంద కలెక్ట్ చేసి పూజకు సంకల్పం చెప్పిస్తున్నారు పూజారి. కుండ్‌లో నీరు మన క్యాన్ లలో వాళ్ళే మార్చి ఇచ్చారు, మనం తాకరాదట.
మొత్తానికి అక్కడ నీరు మార్చుకొని, పండా(పండితుని)కు దక్షిణ ఇచ్చి కొంచం దూరంగా కూర్చొని మా పూజ చేసుకొని హారతి ఇచ్చాము.
బయటకు వచ్చి కారు ఎక్కి మా హోటల్‌కు వచ్చి లంచ్ చేశాము. నర్మదాకుండ్‌కు దక్షిణం వైపునుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. దక్షిణం వైపున పంచమఠ దేవాలయ సముదాయం ఉంది. ఇక్కడ దేవాలయ సముదాయంలో చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి.
ఈ చిన్న దేవాలయాలన్ని చాలా మట్టుకు ‘నగర’ పద్ధతిలో నిర్మించబడ్డాయి.
అక్కడి దేవాలయాలలో ‘మత్యేంద్రనాథ్’ శివాలయం ఒకటి. అది పదకొండవ శతాబ్దంలో నిర్మితమైనది. గర్భగుడి, ముందర మండపంతో ఉంటుంది ఈ దేవాలయం.
వీటి శిఖరాలు ‘ఫస్నా’ పద్దతిలో నిర్మితమైనాయి (ఈ వివరాలు దేవాలయాల ముందర ఉన్న ఆర్కియాలజీ వారి బోర్డులలో ఉన్నాయి).
పంచమాత దేవాలయాలు. ఐదు ఒకే పీఠం మీద నిర్మించబడ్డాయి. ఐదు ఐదు రకాల పద్ధతులలో నిర్మించబడ్డాయి. వీటిని గోండు రాజులు 15వ శతాబ్దంలో నిర్మించారని అంటారు. వీటిలో శివుడు, విష్ణువు ప్రతిష్ఠించబడి ఉన్నారు.
వీటిని కాక ముందుకొస్తే మరో చిన్న దేవాలయం జుహిలా నదికి అంకితం చెయ్యబడింది. ఈ నదే ఇక్కడ పుట్టి ఇక్కడే మాయమవుతుంది.
పాతాళేశ్వర దేవాలయం ఇక్కడ ఉన్న దేవాలయాలలో ముఖ్యమైనది. ఇక్కడ శివుడిని ఎనిమిదవ శతాబ్దంలో శంకరభగవత్పాదుల వారు ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం గర్భగుడి ముందర పిరమిడ్ ఆకారపు మండపం ఉంది. గర్భగుడి మండపం కన్నా లోతుగా ఉన్నందున్న దీనికి పాతాళేశ్వరుడని పేరు. ఈ దేవాలయాలను ‘కాలచూరి వంశ రాజు కర్ణదేవుడు’ నిర్మించాడు. ఈ దేవాలయం పంచరథ శిఖరంతో, పిరమిడ్ ఆకారపు మండప శిఖరంతో ఉంది. శివుడు స్వయంభువు ఇక్కడ. శంకరులు ఆ లింగాన్ని ప్రక్కనే ఉన్న సూర్యకుండం నుంచి తీసి ప్రతిష్ఠించారట. ఆ సూర్యకుండమే నర్మద జన్మకుండమని శంకరులు చెప్పారని అక్కడ రాసి ఉంది.
ఈ దేవాలయ సముదాయం ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి సంరక్షణలో ఉంది. దానికి వెళ్ళటానికి ఉన్న రుసుమును ‘గూగుల్ పే’ ద్వారానే కట్టాలి. మాకు ‘గూగుల్ పే’ లేనందుకు మేము వాళ్ళని ఎంతో ప్రాధేయపడ్డాము. మీ గూగుల్ పే ద్వారా కట్టండి మేము డబ్బులు ఇస్తామని. కాని వారు అలా కుదరదని తిరస్కరించారు. చివరకు మా డ్రైవరుకు గూగుల్ పే ఉన్నందున అతను గూగుల్ పే చేసి మాకు టికెట్లు ఇచ్చాడు. మేము అప్పుడు లోపలికి వెళ్ళగలిగినాము.
అన్నీ ఆన్లైన్ లోనే అంటే బాగానే ఉంటుంది కాని, గూగుల్ పే, పేటియమ్ తప్ప కుదరదంటే ఎలా? కార్డుతోనో, లేదా బ్యాంక్ ద్వారా కట్టవచ్చనే వెసులుబాటు ఇవ్వాలి కదా.
మొత్తానికి మేం లోపలికి వెళ్ళి దేవాలయాలను దర్శించగలిగాం.
ఆ దేవాలయాలు బావున్నా, పూజాపునస్కారాలు ఉన్నట్లుగా తోచదు.
మరి అసలు నర్మద జన్మ కుండం అయిన సూర్యకుండం ఇక్కడ ఉంటే, ప్రక్కన ఉన్న ఆ కొత్త దేవాలయ సముదాయాలను ఎందుకు నిర్మించారో? ఎందుకు ఇక్కడ పూజాపునస్కారాలు లేవో తెలియలేదు. ‘ఆదిశంకరుల కన్నా జ్ఞానులమా మనం?’ అనుకున్నాము.
ఆ దేవాలయాల వద్ద కొంత సేపు మౌనంగా కూర్చొని పరమాత్మ మీద మనస్సు లగ్నం చేసాం.
కొంత సేపటికి ఇద్దరం లేచి బయటకు నడిచాం. ముందరే ప్రస్తుతం నర్మదా కుండం యొక్క దక్షిణద్వారం ఉంది.
మేము ‘ఉద్ధం నర్మదా కుండానికి’ దక్షిణద్వారం ద్వారా ప్రవేశించాం. ఆ కుండం ఇటు వైపు మరింత సుందరంగా ఉంది. అన్ని దేవాలయాలు ఒకదాని ప్రక్కన ఒకటిగా ప్రక్కప్రక్కనే ఉండి, అన్ని నర్మదా మండపంతో సహా, కుండంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
కొందరు పర్యాటకులు, మరికొందరు పరిక్రమవాసులు వచ్చారు. అందరం మళ్ళీ నర్మదా జలం మార్చుకున్నాము. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. యాత్రికులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకరి వివరాలు ఒకరు అడుగుతున్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగి, మేమిద్దరమే అంత కారులో తిరుగుతున్నామని కొంత ఆశ్చర్యం, కొంత జెలసి ప్రదర్శించారు. మావారు వారితో కబుర్లు చెప్పుకొని వివరాలు సేకరించుకున్నారు.
అక్కడ్నుంచి బయటకు వచ్చి అమర్‌కంటక్ లోని మరో ముఖ్యదేవాలయం ‘శ్రీయంత్ర’ మందిరానికి వెళ్ళాము. ఆ దేవాలయం మహామేరువు ఆకారంలో నిర్మించబడి ఉంది. ప్రతి మెట్టు మీద కొందరు దేవత విగ్రహాలు నిర్మించబడి ఉన్నాయి. ఆ దేవాలయం ఇంకా నిర్మాణంలో ఉంది. మూసి ఉన్న ఆ దేవాలయం ఇంకా తెరవలేదు. ఎప్పటికో తెరుస్తారని చెప్పారు అక్కడ.
అక్కడ్నుంచి వచ్చి అమర్‌కంటక్‌లో నర్మదామాయి ప్రసాదం కొంత కొనుక్కున్నాము. అక్కడ అన్నదానానికి కట్టారు శ్రీవారు. అమర్‌కంటక్ జైనులకు కూడా ముఖ్యమైన క్షేత్రం. జైనులు కూడా చాలా మంది దర్శిస్తారు. జైనదేవాలయం కూడా చాలా పెద్దది. మేము లోపలికి వెళ్ళలేదు.
అమర్‌కంటక్ చుట్టూ ఉన్న కొన్ని ముఖ్యమైన శివాలయాలను దర్శించాం. అమర్‌కంటక్‌లో కబీరుదాస్ తపస్సు చేసిన చోటు ఉంది. మేము దాని దర్శించలేదు. టైం లేక పైగా, నాకు వాంతులు వల్ల మేము తిరిగే స్థలాలు తగ్గించుకున్నాం.
మధ్యాహ్నం మూడింటికి మేము అమర్‌కంటక్ నుంచి బయలుదేరాం. కాని అమర్‌కంటక్‌లో మనం రెండు రోజులు ఉండాలి. పరిక్రమవాసులైనా సరే, లేదంటే హడావుడిగా అవుతుంది. నాకు మైగ్రైన్ పెరిగింది. మందు పనిచెయ్యటంలేదు. ధ్యానం కుదరటంలేదు. మధ్యాహ్నం భోజనం సహించలేదు. ఏమీ తినలేకపోయాను. తిన్నది తిన్నంటుగా బయటకెళ్ళిపోతోంది.
ఇలా నేను పడుతూ లేస్తూ ‘మండ్లా’ సమీపంలోని మహారాజపుర్ అన్న సబర్బ్‌లో మాకు కేటాయించిన హోటల్‌కు వెళ్ళాము. చేరే సరికే రాత్రి ఎనిమిది కావొచ్చింది.
ఆ హోటల్ బయట నుంచి చూడటానికి బావున్నా, మాకు కేటాయించిన గది పరమ చెత్త గది. ఆ గదికి కిటికీ లేదు. పైగా గదిలో పక్కలు ఎవరో పడుకొని వెళ్ళినవి. మేము వెళ్ళిన తరువాత వాళ్ళు అప్పుడు సర్దటం మొదలెట్టారు. అది అయ్యాక మేము మా సామాను సర్ది నర్మదామాయిని తీసి సర్దుకున్నా. కాని శ్రీవారు ఆ గదిలో ఉండలేకపోతున్నారు. ఆయన ఇనుపపెట్టెలో ఉన్నట్లుగా కష్టపడ్డారు.
ఇంతలో దబదబ మని పెద్ద చప్పుడు. అది ఎంతకూ ఆగలేదు. ఇంకా తట్టుకోలేక వెళ్ళి అడిగితే ఆ గది పైన ఫ్లోర్‌లో సినిమాహాల్ ఉంది. అక్కడ సినిమా ఆడుతోంది. థియేటర్ క్రింద గది ఉంటుందా ఎక్కడైనా? పైగా కిటికీలు లేని గది, మురికి గది…. ఆ విషయం టూర్ మేనేజరుకు చెబితే అతను పట్టించుకోలేదు. పైగా అదో గొప్ప హోటలని వాదించాడు. నాకు తలనొప్పి పెరిగి ఆ రాత్రి నిద్ర కూడా కరువు.
ఎన్ని అనుభవాల సమాహారం ఈ యాత్ర…
మనం హోటళ్లు ఎన్ని చేసుకోగలం?
సినిమా హాల్ క్రింద హోటల్ నిర్మిస్తారా ఎవరైనా?
అలాంటివి ఎలా అనుమతి ఇస్తారు?
వీటికన్నా ఈ చెట్టో, నదీతీరంలో నయం. తలమీద సుత్తితో కొట్టినట్లు దన్ దన్ చప్పుడు ఉండదు. అది తలనొప్పితో ఉన్నప్పుడు. నర్మదామాయి ఏమి నేర్పిస్తోందో?
ఓర్పా?
ప్రతికూల పరిస్థితులలో, మనసును మరో వైపు తిప్పటమా???
నెత్తినొప్పి శరీరానిదే, ఆత్మది కాదని చూడమనా?
తెలీదు.
కానీ నెత్తి మీద సుత్తిదెబ్బల మాదిరి శబ్దంతో క్షణం కూడా కంటి మీద కునుకు లేక ఆ రాత్రి మాత్రం కాళరాత్రి…
మొత్తానికి మర్నాడు ఉదయమే ఆ ప్రాకారం వదిలి వెళ్ళిపోదలుచుకున్నాము.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
రోజు – పదకొండు
“అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజన్తుతన్తుభుక్తిముక్తిదాయకమ్।
విరిఞ్చివిష్ణుశంకరస్వకీయధామవర్మదే
త్వదీయపాదపఙ్కజం నమామి దేవి నర్మదే॥”
బ్రహ్మ – విష్ణు – మహేశ్వరులను నీ తేజస్సుచే రక్షించు ఓ దేవీ! నర్మదాదేవీ! కనబడీ కనబడని అనేక పాపములను పోగొట్టు ఆయుధములు కలది, ప్రాణుల బంధములను తెంచి భుక్తిని, ముక్తిని ప్రసాదించునది అగు నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను.
మేము బయలుదేరి సంగమానికి వెళ్ళాము.
అక్కడ నర్మదలోకి ‘బంజరు నది’ అన్న ఉపనది కలుస్తుంది.
ఆ సంగమం పరమ పవిత్రమైనది. పర్వదినాలలో ఆ సంగమానికి భక్తులు పోట్టెత్తుతారు.
ఆ సంగమం వద్ద ప్రస్తుతానికి కొందరు భక్తులు మాత్రమే ఉన్నారు. వారిలో కొందరు భజన చేస్తున్నారు. కొందరు హారతి పాడుతున్నారు. మేము నర్మదనదిని సేవించి, మునకలేసి, వచ్చి మా నిత్య పూజ చెయ్యడానికి ఒడ్డున మెట్ల మధ్యలో ఉన్న గట్టు మీద కూర్చున్నాము.
ఆ గట్లు మెట్ల మధ్య నిర్మించారు. ఇద్దరం కూర్చుని పూజ చేస్తుంటే ఒక గోమాత వచ్చింది. ఆ ఆవు మెట్లు దిగి, తన ముఖం మా నర్మదామాయి జలం ఉన్న డబ్బాల ప్రక్కగా ఉండేలా పెట్టి నిలబడింది. మాకు మాట రాలేదు. ఆ ఆవు కళ్ళలో ఏవో భావాలు. ఆకలిగా ఉందేమో. ఆ క్షణంలో నా దగ్గర పళ్ళు కూడా లేవు. నేను బాదం పప్పులను నైవేద్యంగా పెడుతున్నాను మరి. ఆ క్షణన్నా ఏమి చెయ్యాలో తోచలేదు.
శ్రీవారు మాత్రం పూజ ఆపి, ఆ తీరమంతా గాలించి ఆవుకు ఆహారం తీసుకొచ్చారు. “ఒక ప్రాణి ఆహారం అడుగుతుంటే అది చూడక, పూజలేంటీ? ఇదే నర్మదామాయికి అసలైన పూజ…” అంటూ నాతో చెప్పారు.
ఆయన ఆహరం తెచ్చేవరకు ఆ ఆవు నన్ను వదిలి వెళ్ళలేదు. ఆయన తెచ్చిన పళ్ళు, మరమరాలను ఆ ఆవు, మరో దూడ వచ్చి తిన్నాయి. వాటికి ఆహారం ఇచ్చాకనే ఆయన మళ్ళీ వచ్చి నాతో పూజలో పాల్గొన్నారు.
ఆనాడు మా డ్రైవర్ చెప్పాడు మధ్యప్రదేశ్‌లో ఆవులతో చాలా సమస్యగా ఉందని, వాటికి ప్రభుత్వం వారు బీమా ఇస్తున్నారు, వాటి చెవులకు నంబరు కట్టి, పోషించకనే రైతులు వాటిని ఊరి మీదకు వదిలేస్తున్నారట. వారికి డబ్బు వస్తుంది, ఆవులు ఆకలితో తిరుగుతున్నాయి పాపం. వాటి దురవస్థకు హృదయం కరిగి నీరైయింది.
శ్రీవారు నాతో, “మనం గోసేవకు ఏదైనా చేద్దాం!” అన్నారు.
సరేనన్నాను.
“కానీ మనం డబ్బు దానం చెయ్యటం తప్ప ఏం చెయ్యగలం?” అడిగాను….
కాదుట.
“ఇక్కడికి వచ్చి మనం ఆవుల సంరక్షణ మొదలెట్టాలి ఏదో నాటికి” అన్నారాయన.
“సరే చూద్దాంలే. నేను నా పుస్తకాలను వెల కట్టి అమ్మను, కాని ఎవరైనా డబ్బులిస్తే అవి గోరక్షకు కట్టేస్తాను…” అని వారితో చెప్పాను.
మొత్తానికి మామూలుగా పళ్ళు కాకుండా కారు నిండా అరటి పళ్ళు వేసుకొని కనపడ్డ ఆవుకు పళ్ళు పెట్టడం మొదలెట్టారాయన ఆ రోజు నుంచి.
మా యాత్ర మొత్తం తరువాతి రోజులు అలాగే చేశారాయన. భారతదేశంలో మేమున్నన్ని రోజులూ, చేసిన యాత్రలలో గోవులకు పళ్ళు అందించటమే పనిగా పెట్టుకు చేశారాయన.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
రోజు – పన్నెండు
మా తరువాతి గమ్యస్థానం నరసింహపూర్. ముందురోజు అనుభవం దృష్ట్యా మా తరువాతి గమ్యస్థానానికి ముందుగానే మేము వస్తున్నామని, గది సిద్ధం చేసి ఉంచమని ఫోన్ చేసారు శ్రీవారు. మేము ఉన్న హోటల్ పేరు ‘హోటల్ అతిథి’.
ఊరంతా రోడ్లు వేస్తున్నరు, అన్ని చోట్ల గుంతలే. పడుతూ, లేస్తూ వెళ్ళాము ఆ హోటల్‌కి.
హోటల్ బావుంది పరిశుభ్రంగా. ఆ రోజు మాకు ధోబీ కూడా దొరికారు. మా బట్టలు శుభ్రం చేసి ఇచ్చారు. అదే మొదటిసారి, చివరిసారి మా ప్రయాణంలో ధోబీ సహాయం తీసుకోవటం.
నరసింహపూర్ నారసింహుడి క్షేత్రం, నర్మదా నదికి దక్షిణాన ఉంది. ఉత్తరాన బర్మన్ఘాట్ ఉంటుంది. ఈ ఊరిలో నరసింహుడి ఆలయం పురాతనమైనది. ఈ దేవాలయం లోని నరసింహుని, పూర్వపు రాజులు కొలిచారట. శాతవాహనులు, గోండులచే పూజించబడిన దేవుడాయన. గోండులే నేటికి అక్కడ పల్లెలలో నివసిస్తున్నారు. నరసింహపూర్ దగ్గర నర్మద తీరాన బ్రహ్మ యజ్ఞశాల, రాణి దుర్గావతి దేవాలయం ఉన్నాయి. సంక్రాంతికి, వసంత పంచమికి అక్కడ బ్రహ్మండమైన సంత జరుగుతుంది. దేవాలయంలో నరసింహుడు, ప్రక్కన అమ్మవారు ఉన్నారు. ఎర్రని వస్త్రాలు కట్టిన నరసింహుడు స్థిరంగా కూర్చున్నాడు. ముఖం మాత్రమే కనపడుతోంది. అదే దేవాలయంలో వెనక శివుడు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. మేము పూజారికి పూలు, పళ్ళు ఇచ్చి దేవుడిని చూసి జపం చేసుకున్నాము. ఆయన పూజ తరువాత మాకు ప్రసాదమిచ్చాడు.
“శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే।
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్॥”
అంటూ సాగే నరసింహ కరవాలంబ సోత్త్రం చదివాను.
కొంత సేపు జపం చేసుకున్నాము.
తరువాత బయటకొచ్చి నర్మదాఘాటుకు వెళ్ళాము.
ఘాటులో నది చాలా లోపలికి ఉంది. ఇసుక మేటలు కిలోమీటరు లోపలికి వెళ్ళాలి. చాలా దుకాణాలు, మురికితో, చెత్తతో నిండి ఉంది. నీళ్ళు చాలా పాచిగా ఉన్నాయి. కొంత లోపలికి వెళ్ళి, మునిగి వచ్చి, గట్టు మీద పూజకు ఉపక్రమించాము.
ఒక బ్రాహ్మణుడు పూజ చేయించాలా అని అడుగుతున్నాడు.
“సరే” అన్నాము.
మళ్ళీ అదే ఆలోచన, ఆ బ్రాహ్మణుని రూపంలోని నర్మదకు నమస్కరించుకోవచ్చని. ఒడ్డు మీద ఒక ఆవును కొడుతున్నారు జనాలు. వెళ్ళి వాళ్ళని ఆపి వాటికి పళ్ళు ఇచ్చి వచ్చారు శ్రీవారు.
మేము కారు ఎక్కి మా తరువాతి గమ్యం వైపు బయలుదేరాము.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
హౌసంగాబాదు
మా తరువాతి గమ్యస్థానం హౌసంగాబాదు.
హౌసంగాబాదుకు వెళ్ళటానికి 250 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ దూరం ఆ రహదారుల మీద కొంత కష్టమే. చేరే సరికే దాదాపు సాయంత్రం అయింది. ఆ ఊరి పేరు పూర్వం నర్మదాపురం. కాని మాళ్వా సుల్తాన్ దానికి హౌసంగాబాదు అని మార్చివేశాడు. దానిని క్రిందటి సంవత్సరం మళ్ళీ ‘నర్మదాపురం’ అని మార్చారట. బోర్డులలో ఎక్కడా మార్చలేదు. మాకైతే కనపపడలేదు.
మా బస నర్మద నది ఒడ్డున ఉన్న ‘నర్మదా వ్యూ’. మేము ఆ హోటల్ చూసి పూర్తిగా తృప్తి పడ్డాము. కారణం ఆ హోటల్ నర్మద ఘాట్‌లో ఉంది. మాకు ఇచ్చిన గది మాత్రం సిటీ వైపు కిటికీ ఉన్న గది ఇచ్చారు.
“అయ్యా! మాకు నర్మదామాయిని చూస్తూ ఉండే గది ఇవ్వండి” అని అడిగితే,
“మీ ప్యాకేజ్‌కు ఇచ్చే గది ఇదే” అన్నారు వారు.
శ్రీవారు మళ్ళీ కొంత డబ్బు కట్టి నర్మద నదిని చూస్తు ఉండే కిటికి ఉన్న గదిని తీసుకున్నారు.
మేము గదిలో సామాను పెట్టి వెంటనే ఘాట్ లోకి వెళ్ళాం.
నర్మదా నది ప్రవాహం ప్రశాంతంగా ఉంది. ఘాట్ చాలా శుభ్రంగా ఉంది. ‘సుందరమైన నది తీరమంటే ఇది కదా!’ అని అనిపించింది. ఘాట్‌లో శివాలయం, గణపతి మందిరం, హనుమంతుని దేవాలయం, చిత్రగుప్తునికి దేవాలయం ఉన్నాయి. పెద్ద మర్రి చెట్టు. ఆ సాయంత్రం హనుమంతుని గుడి వద్ద ఉన్న భజనల్లో చేరి భజన చేశాం. నర్మద తీరానికి వెళ్ళి గట్టు మీద కూర్చున్నాం.
కొందరు ఆడపిల్లలు కోకో ఆటగాళ్ళట, ఇంటర్ కాలేజీ పోటీలకని వచ్చారట. వారికి మొదటి బహుమతి వచ్చిందట. అందరూ వచ్చి, తలో దీపం కొనుక్కొని నర్మదకు నమస్కరించి, నదిలో వదులుతున్నారు.
వాళ్ళు వెళ్ళే వరకు వారిని, వారి హడావుడిని చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు వెళ్ళాక నేను నది దగ్గరకు వెళ్ళి, నదిలో నిలబడి జపం మొదలుపెట్టాను. ఎంత సేపు ఉన్నానో, మావారు రమ్మని పిలిస్తే కదిలి వెళ్ళాను తప్పక.
అసలు అక్కడ నదిని చూస్తే కలిగిన ప్రశాంతత అనన్యం. ఆ రాత్రి మళ్ళీ నదిని చూస్తూ కూర్చున్నాము. దీపాలు వెలిగాయి. నర్మదలో దీపాలు ప్రతిబింబిస్తున్నాయి.
దూరం నుంచి గట్టు మీదుగా భజనలు వినిపిస్తున్నాయి. ఆ వృద్ధసాధువు గొంతు మంద్రంగా నది మీద తేలుతూ అలలు అలలుగా వినవస్తోంది.
“ఘనశ్యామ సుందర
వంశీధర ప్రభు కృష్ణ కన్నయ్య
తుమ్ హీ మేరా మాబాపు భయ్యా…
ఘనశ్యామ సుందర”
ఆ భజనలో ఏదో మహత్మ్యం ఉంది. అలల మీద చల్ల గాలితో పాటు భజన మెల్లమెల్లగా తాకుతు మమ్ములను మరో లోకాలకు తీసుకుపోతోంది.
‘నిజం!! ఇంత కన్నా ఆనందం ఉందా?’
అట్లాంటాలో కాని, మరోచోట కాని లేని ఆనందం నర్మదా తీరాన ఆశ్రమాలలో ఉంది. నర్మద తీరంలో ఒక మహత్యం ఉంది. మనస్సు పరమాత్మ మీదకు అనుసంధానపరిచే మత్తు ఉంది. సాధకులకు దారి చూపే శక్తి ఏదో అదృశ్యంగా అక్కడ పనిచేస్తుంది. ఆ ఎనర్జీకి పేరులేదు. కాని మనం నర్మద తీరం తదనంతరం మరో నదిని దర్శించినా, చూసినా ఆ తేడా తెలుస్తుంది.
అక్కడి ఆ పరమాత్మ భజనలలో ఉంది. జగదంబ ధ్యానంలో ఉంది.
ప్రకృతికి దగ్గరగా, సామాన్యమైన జీవితంలో జీవిస్తూ, అంతర్ముఖులమై జీవించటంలో అసలు ఆనందముంది.
నిత్య జీవితంలో ఉరుకులు పరుగులు ఎంత అల్పమైన విషయాలు.
పోటీ ప్రపంచం, ఒకరితో ఒకరు పోటీ పడటం, రాట్ రేస్‌లో ఎగుడుదిగుడు, మానవుని ఎటు తీసుకో పోతున్నాయి?
ఒకరి మీద ఒకరికి స్నేహం, ప్రేమ బదులు వాటి వ్యతిరేక భావాలు, అభద్రతా ఇదంతా ఎంత మిథ్య.
నిజమైన సంతోషం సామాన్యమైన జీవితంలో ఉందని ఎలుగెత్తి చాటాలి.
అందరు సంతోషంగా ఉండాలంటే, కావాల్సింది లోలోపలికి చూడటం అని చెప్పాలి…
మౌనంలో ఉన్న సంతోషంగా ఆణువణువు హృదయాన్ని నింపుతోంది.
అది అత్యంత ఉన్నతమైన మత్తు. ఆ మత్తు మరోదానితో సాధ్యం కాదు. కేవలం ఆ తీరాన మాత్రమే లభిస్తుందేమో…
***
మేము ఆ రాత్రి వేళ ఆ ఘాటులో భజనలు వింటూ పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించాం. నర్మద సన్నిధిలో సర్వం సిద్ధిస్తుంది. ఇది పరమ సత్యం.
ఇద్దరం అలాగే కూర్చున్నాం. ఎంతకీ కదలాలని అనిపించలేదు. ఒక మౌనం హృదయమంతా నిండింది. చలనంలేని స్ధితిలో ఆలోచనలు ఆగిపోయి, చూపు నర్మద మీద నిలిపి, జపం కూడా చెయ్యకుండా అలా ఎంతో సేపు ఉండిపోయాం.
“పది దాటింది … వెళ్ళి ఏమన్నా తిందామా?” అన్నారు మావారు మౌనాన్ని ఛేదిస్తూ.
తప్పదన్నట్లుగా లేచి గదికి వెళ్ళాం. గదిలో నుంచి కూడా నర్మదామాయిని చూస్తూ కూర్చున్నాం.
గొప్ప ప్రశాంతత, దాదాపు పదిహేను రోజుల తరువాత, ఈ రోజు శరీరానికి ఎలాంటి నొప్పులు లేవు. శరీరం చేస్తున్న సాధన, మనస్సు చేస్తున్న జపం, నేటికి లోలోపలికి చొచ్చుకుపోయాయేమో మరి. ఆ భజనలకు, నది మీదుగా వచ్చే మెల్లని చల్లని గాలికి హృదయానికి పూర్తిగా శాంతినిచ్చింది. జీవితంలో ఇంతకు మించి మరో సంతోషం లేదని, ఈ స్థితి సదా ఉంటే చాలని అనిపించింది మా ఇద్దరికి.
నర్మదానదితో హృదయానికి ఎడతెగని సంబంధం ఏర్పడింది. అది పిల్లలకు తల్లి ఉన్న బంధమంత సహజంగా ఉంది. అది భగవంతునికి భక్తునికి ఉన్న బంధం. అది ఆత్మకు పరమాత్మకు ఉన్న అనుసంబంధం.
రేవాతీరే తపః కుర్వాత్ మరణం జాహ్నవీ తటే।
దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రితయం వరమ్॥
నర్మదను చూస్తే చాలు కదా మనకు సర్వపాపాలు తొలిగిపోతాయి. పురాకృత కర్మలు పటాపంచలవుతాయి. మరి ఇన్ని రోజులు ఆ తల్లిని సేవిస్తూ తిరుగుతుంటే ఆ మాత్రం బంధం పెనవెయ్యాదా ఏమిటి??
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
రోజు – పదమూడు
సబిన్దుసిన్ధుసుస్ఖలత్తరఙ్గభఙ్గరఞ్జితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతమ్।
కృతాన్తదూతకాలభూతభీతిహారివర్మదే
త్వదీయపాదపఙ్కజం నమామి దేవి నర్మదే॥
యముని వలన కలుగు మరణభయమును హరించు ఓ దేవీ! నర్మదాదేవీ! నీటిబిందువులు కల ప్రవాహమునందు లేచి పడుచున్న అలలతో శోభిల్లుచున్నది, నిన్ను ద్వేషించు పాపాత్ముల పుట్టుకనే నశింపచేయు జలము కలది అగు నీ పాదపద్మమును నమస్కరించుచున్నను.
మేము ఆ రాత్రి గడిపి ఉదయమే ఐదుగంటలకల్లా నర్మద ఘాటుకు వెళ్ళాము.
ఆ ఉదయం మొదటిసారి నర్మద జలం గోరువెచ్చగా తోచాయి. నడుము వరకు నదిలోకి వెళ్ళి, నర్మదామాయికి పసుపు కుంకుమలతో పూజ చేసుకున్నాము. మునిగి లేచిన తరువాత అక్కడే నిలబడి జపం మొదలెట్టాము.
కొంత జపం తరువాత హోటల్‌కు వెళ్ళి బట్టలు మార్చుకొని మళ్ళీ ఘాటుకు వచ్చాము. అక్కడ జలం మార్చుకొని గట్టున కూర్చుని పూజ చేసుకున్నాము. నర్మదకు హారతి ఇస్తుంటే దుఃఖం ఆగలేదు. ఆ రోజు దాదాపు మా చివరి రోజు మరి.
ఆ సాయంత్రానికి మేము ఓంకారేశ్వరం వెళ్ళిపోతాము.
యాత్ర మొదలైనప్పటి నుంచి రకరకాల ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి.
భారతదేశానికి మూడేళ్ళ తరువాత వచ్చినందుకు వాతావరణం, నీరు తేడా చేసి మాకు నానా అవస్థలయింది. రొంప, దగ్గు, వాంతులు, విరోచనాలు, జ్వరం, మైగ్రైన్, తిండి సరిపడక, శరీరం ఎలా ఉన్నా, ఉదయం నర్మదామాయిలో స్నానాల వలన తగ్గని అనారోగ్యంతో అసలు ఈ యాత్ర పూర్తవుతుందా? అన్న అనుమానం కలిగింది.
దానికి తోడు నిబంధనలు, అమర్‌కంటక్‌లో ఇటు వెళ్ళవద్దు, అటు తిరగవద్దు అని విసిగించారు.
ఒకే కోనేరు మధ్యలో ఆపి ఇబ్బంది పెట్టారు. నదిని దాటరాదనటం వలన, దగ్గర దారి వదిలి దూరభారాల వలన, రోడ్డు, రాళ్ళు రప్పల మీద ఎత్తి పడేసే కుదుపులకు నడుములు విరిగి, కాళ్ళూ పట్టేసి నానా అగచాట్లు పడ్డాము.
రోజూ పోహా, రెండు రొట్టెలు, ఆలుకూరతో, ఒంటి పూట ఆహరం, అన్నఆహార నియమాలు పాటించాము. శరీరం అలిసిపోవటం తప్ప మరొకటి లేదు. ప్రతి రోజు మైళ్ళు మైళ్ళు తిరిగి శరీరం అలిసేది. సాయంత్రానికి తోటకూర కాడలా వడలిపోయేవాళ్ళం.
కాని, భారతదేశ పల్లెలను మళ్ళీ చాలా కాలానికి దగ్గర్నుంచి చూశాం.
చిన్న పట్టణాలు, ప్రజలలో స్నేహం, వారికి నర్మదమాయి మీద ఉన్న భక్తి ప్రత్యక్షంగా చూశాం.
హైందవము, సనాతన ధర్మం వెల్లువిరిసిన పవిత్రభూమి మీద తిరిగాం. పూర్వ సాంప్రదాయాలను కాపాడుతున్న పల్లె ప్రజలు నా మనస్సులో ఎంతో ఉన్నతమైన చోట నిలిచారు. పల్లెలు భారతదేశానికి నేటికి పట్టు కొమ్మలే. ధర్మం వెల్లివిరియాలంటే పల్లెలు వెలగాలి. దేశ బీదరికం, కొన్ని చోట్ల నది మీద ప్రజల నిర్లక్ష్యం కూడా కనిపించి హృదయాన్ని కలిచివేసింది.
నదితీరాన్ని శుభ్రపరిచే భక్తులు దాదాపు అన్ని ఘాట్లలో కనిపించినా, అంతే లెక్కన నదీ ఘాట్లను చెత్త చేస్తున్న ప్రజలను చూశాము.
బిక్షగాళ్ళలో కూడా గ్రీడ్ చూసి ఆశ్చర్యమయింది.
అమర్‌కంటక్‌లో దాదాగిరి చేసిన బ్రాహ్మణులను చూశాము.
మేము మా ఐడెంటిని వదిలి కేవలం పరిక్రమవాసులలా తిరిగాము(అలాగే తిరగాలి కూడా కదా). చాలా మంది బట్టలకి, హోదాకి మాత్రమే ఇచ్చే గౌరవం మామూలు మనుష్యులకు ఇవ్వక, మమ్మల్ని పురుగుల్లా చూడటం కూడా రుచి చూశాం. వారి నిర్లక్ష్యం కూడా రుచి చూశాం.
‘అమెరికాలో ఉంటామంటే ఈ ప్రజలే ఎలా మారుతారో కదా’ అని అనుకోని బయట మాత్రమే చూసే వారి కుంచిత బుద్ధి చూసి జాలి పడ్డాము.
మహేశ్వరంలో మహమ్మదీయ డాక్టరు గారికి తప్ప ఎవ్వరికి మేము ఎక్కడ్నుంచి వచ్చామో చెప్పలేదు. అవసరం లేదు కూడా.
మేము కేవలం పరిక్రమవాసులం. అలాగే తిరిగాం. ప్రవర్తించాం.
మా అహాన్నీ అమ్మకు సమర్పించటమే పరిక్రమ ముఖ్య లక్ష్యంగా సాధన చేశాం.
మంచి హైవేల నుంచి పరమ భయంకరమైన రోడ్లు మీద ప్రయాణించాం. దారిలో రెస్ట్ రూములు దొరకని దారంట రోజంతా ప్రయాణించిన సమయాలు కూడా ఉన్నాయి. వేషభాషలు చూసి మనలను రకరకాలుగా ట్రీట్ చేసే ప్రజలను చూశాం. కాలి నడకన పరిక్రమ చేస్తున్న భక్తులను అనేకులను కలిశాం.
పరిక్రమవాసులు నడుస్తూ కనిపిస్తే ఎన్నో చోట్ల ఆగి వారికి పళ్ళు, బిస్కెట్లు పెట్టి “నర్మదే హరే!” అంటూ శరణుగోష చేశాము.
ఎన్నో అనుభవాలు… ఎన్నో జ్ఞాపకాలు. కాని వీటన్నింటికి మించిన జగదంబ కరుణ మాత్రం హృదయాన్ని తడుపుతూనే ఉంది. ఉంటుంది కూడా.
నర్మదమాయిని అనునిత్యం తలుస్తూ, కుటుంబాన్ని, మిత్రులను, సోషల్ మీడియాను దూరం పెట్టి, ఎవ్వరితో సంబంధం లేక, తరచి తరచి లోలోపలకు చూసుకునే యత్నం చేశాం. చేసే పని శ్రద్ధగా, బాధ్యతగా, మీదు మిక్కిలి భక్తిగా చేశాం. నర్మదా తల్లి తప్ప మరో ధ్యాస లేకుండా, సాధనలో ముందుకు నడవటానికి ప్రయత్నం చేశాం.
అణుక్షణం అమ్మ చేయి పట్టుకు నడిపించింది. ఆ తల్లి కరుణను ప్రతిరోజు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ఏదో రూపంలో. ఇప్పుడు ఇక యాత్ర ముగింపుకొస్తున్నదంటే దుఃఖం ఆగింది కాదు.
“అప్పుడే అయిపోయిందా? అనిపిస్తోంది!!” అన్నారు శ్రీవారు నన్ను చూసి.
నా హృదయంలో కూడా అదే ప్రశ్న ‘అప్పుడే అయిపోయిందా??’
ఆ ఉదయం ఆ సూర్యోదయవేళ నర్మద మమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించినట్లుగా తోచింది. నర్మద మాతో మాట్లాడింది. మమ్ములను దీవించింది. ఏ తల్లి కరుణ లేకపోతే కాలు కూడా కదలదో, ఏ తల్లి కృపతో ఈ మహోన్నతమైన యాత్ర సాగింది… ఆ తల్లి మమ్ములను ఆశీర్వదించింది ఆ షీతాని ఘాటులో.
మేము మమ్మల్ని నిలవరించుకొని కర్తవ్యం నిర్వహించటానికి లేచాము.
ఆ షీతాని ఘాట్‌ను వదలలేక వదలలేక వదిలి వచ్చాం.
హోటల్‌లో మా ఫలహారం తిని, ఓంకారేశ్వరం వైపుకు సాగాం.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
ఓంకారేశ్వరం మేము సాయంత్రానికి చేరాం.
మాకు దీక్ష ఇప్పించిన పురోహితులు గారు మమ్మల్ని నర్మదా తీరం తీసుకుపోయారు.
అక్కడ పూజ చేసి నర్మదకు హారతి ఇచ్చాం. మమ్మలేశ్వరంలో శివునికి మా వద్ద ఉన్న క్యాన్ నర్మదా జలంలో కొంత జలంతో అభిషేకం చేశాం. మా దీక్ష పాక్షికంగా ముగిసిందని చెప్పారాయన.
మరుసటి ఉదయం ఓంకారేశ్వరంలో అభిషేకం చేసిన తరువాత పూర్తి అవుతుందని చెప్పారు.
ఆ రాత్రి మళ్ళీ ‘టెంపుల్ వ్యూ’లో విశాంత్రి తీసుకున్నాం.
***
రోజు పద్నాలుగు
ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠన్తి తే నిరన్తరం న యన్తి దుర్గతిం కదా।
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరా న వై విలోకయన్తి రౌరవమ్॥
ఈ నర్మదాష్టకమును మూడు కాలములయందు ఎల్లప్పుడు పఠించువారు ఎన్నడు కష్టములను పొందరు. వారు మానవులకు దుర్లభమైన కైలాశనివాసమును పొందెదరు. వారికి పునర్జన్మ లేదు. నరకమును చూడరు.
ఆ రోజు ఉదయమే ఐదుగంటల కల్లా మేము తయారైనాము. ఆ రోజు నదీ స్నానం లేదు, కాబట్టి ఇక నది స్నానానికి కావలసిన సామానులు ఉన్న సంచి తీసుకోలేదు. దేవాలయానికి వెడుతున్నాం కాబట్టి మా నర్మదానది జలం ఉన్న క్యానులు, ఆసనం మాత్రమే తీసుకున్నాము. ఉదయం ఐదున్నర కల్లా మేము కోవెలకు వెళ్ళే దారిలో, ఇటు నుంచి ‘మాంధాత పర్వతం’ పైకి ఉన్న వంతెన దగ్గర నిలబడ్డాం. మా పురోహితులవారు వచ్చారు. ఆయనతో కలిసి ఈ రెండు వారాల తరువాత మొదటిసారిగా నర్మదను దాటి ‘మాంధాత పర్వతం’పై వెలిసిన జ్యోతిర్లింగ రూపుడైన ‘ఓంకారేశ్వరుని’ సన్నిధానానికి వెళ్ళాము. పూజారిగారు వస్తూ ఒక బిందెతో నీరు తెచ్చారు. మేము ఆయనతో ఎకాఎకిన గర్భగుడి దాకా వెళ్ళిపోయాం.
నలుగురు ఉన్నారక్కడ. ఇద్దరు అర్చకులు. ఇద్దరు గేట్ కీపర్లు. మేము వెళ్ళి స్వయంభువు లింగమైన మహాదేవునికి నర్మదానది జలంతో కొంత అభిషేకం చేశాము. అర్చకులు మమ్మల్ని ఆశీర్వదించారు.
అక్కడే మెట్ల మీద మమ్మల్ని కూర్చోబెట్టారు.
కొంతసేపటికి మా పురోహితుడు వచ్చి మమ్మల్ని రమ్మని బయటకు తీసుకుపోయాడు. మేము ఇక రుద్రాభిషేకం చెయ్యాలి. బయట హాల్లో ఒక ప్లేట్‌లో శివుడ్ని పెట్టి అభిషేకం చేయిస్తారు అక్కడి వారు. అది నాకు తెలిసి రివాజు.
కాని ఆ రోజు ఆ ప్రాతఃకాల శుభవేళ మేము ఓంకారేశ్వర ఛాయలింగంగా పేరు గాంచిన మరో లింగరూపుడైన మహాదేవుని ఎదుట కూర్చొని అభిషేకం చేశాం. మాకు ఆశ్చర్యంతో నోట మాటరాలేదు. మా ముందర నిలువెత్తు బాణలింగాన్ని చూసాక హృదయం ఆనందంతో నిండిపోయింది. మమ్మల్ని ముందుగా గురువును తలచుకుని నమస్కరించమని అన్నప్పుడు, పూర్ణంగా మా పూజ్యగురుదేవులు ఆ శివుడిలో దర్శనమిచ్చారు. శ్రీవారికి మహాదేవుని దర్శనం కలిగిందిట.
మహాదేవునికి పంచామృతాలతో అభిషేకం చేసి, మా వద్ద ఉన్న నర్మదా జలంలో సగం ఆ లింగానికి సమర్పించాం. తదనంతరం, దేవదేవునికి పూలు, పూలమాలలు, పళ్ళు సమర్పించాం. గులాలు చల్లాం.. మెరుపులద్దాం. అందంగా అలంకరించాక మహాదేవుడు మెరిసిపోతున్నాడు, మా హృదయాలలా. అర్చకులు మా చేతికున్న దీక్షాతోరం తీసేశారు. తరువాత మరో కొత్తది కట్టారు.
మా మీద ఆ స్వామి కరుణకై మేము వందనాలు సమర్పించాం, పూజారులకు దక్షిణలిచ్చాం.
మేము అభిషేకం చేస్తుంటే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి మమ్మల్ని చకచకా ఫోటోలు తియ్యటం మొదలుపెట్టాడు. పూజ అంతా అయ్యాక, ఫోటోలు చూపెట్టి కావాలంటే డబ్బు కట్టాలని చెప్పాడు.
నాకు ఇక్కడి వారి మార్కెటింగ్ గుర్తుకు వచ్చింది. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా, టూరిస్ట్ స్థలంలో ముందు ఫోటో తీసేస్తారు. ఆ ఫోటోలు కావాలంటే డబ్బులు ఇవ్వాలి. కాదని ఎవరు చెబుతారు? వారి ఫోటోలు చాలా బావుంటాయి కూడా మరి.
అలాగే ఇక్కడ కూడా వీళ్ళు డెవలప్ అయ్యారు అనుకున్నాము.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
ఆదిశంకరుల గుహ
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం!!
పూజారిగారు మమ్మల్ని ఆదిశంకరుల గుహకు తీసుకుపోయారు. అది నిజానికి గోవిందపాదుల వారి గుహ. శంకరులు తన గురువును నర్మదానది తీరంలో కలుస్తాడు.
శంకరులు గురువును వెతుకుతూ నర్మదా తీరానికి వస్తాడు.
గోవిందపాదులవారు “వచ్చినది ఎవరు?” అని అడుగుతారు.
అప్పుడు శంకరులు చెప్పినదే ‘నిర్వాణ షట్కం’.
నిర్వాణం అంటే మోక్షం..ముక్తి.
ఇది ఆరు శ్లోకాలలో చెప్పారు కాబట్టి షట్కం అన్నారు.
ఈ శ్లోకాలు పూర్ణ ఆత్మతత్త్వాన్ని చెబుతాయి.
ఇలాంటి శ్లోకాలు మనకు ఏ సాహిత్యంలో కనపడవు, వినపడవు.
ఇంత చిన్న శ్లోకాల రూపంలో పూర్తి ఆత్మను ఆవిష్కరించారు ఆదిశంకరులు. అందుకే ఆయన జగద్గురువులు.
ఆ నిర్వాణషట్కం…
“మనోబుధ్యహంకార చిత్తాని నాహం।
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే।
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః।
చిదానంద రూపః శివోహంశివోహం॥”
నేను పంచభూతాలు కాను, నేను ఇంద్రియాలు కాను. చిదానంద రూపము కల శివుడను! కేవలం శివుడ్ని…..
“నచప్రాణసంజ్నోనవైపంచవాయుః।
నవాసప్తధాతుర్నవాపంచకోశః।
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయుః।
చిదానంద రూప: శివోహం శివోహం॥”
పంచ ప్రాణాలు కాదు, సప్తధాతువులు కాదు. చిదానంద రూపము కల శివుడను!
“నమేద్వేషరాగౌనమేలోభమోహౌ।
మదోనైవమేనైవమాత్సర్యభావః।
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః।
చిదానంద రూప: శివోహం శివోహం॥”
రాగద్వేషాలు, మదమాత్సర్యాలు లేవు. చిదానంద రూపం కల శివుడను! కేవలం శివుడను…
“నపుణ్యంనపాపంనసౌఖ్యంన దుఃఖం।
నమంత్రోనతీర్థంనవేదానయజ్ఞాః।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా।
చిదానంద రూపః శివోహం శివోహం॥”
పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు లేని నేను భోజనం కాదు, భోక్త కాదు. చిదానంద రూపము కల శివుడను!కేవలం శివుడ్ని.
“నమృత్యుర్నశంకానమేజాతిభేదః।
పితోనైవమేనైవమాతానజన్మ।
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్యః।
చిదానంద రూపః శివోహం శివోహం॥”
నాకు మరణభయం లేదు. చిదానంద రూపముకల శివుడను!
“అహంనిర్వికల్పోనిరాకారరూపో।
విభుత్వాచ్ఛసర్వత్రసర్వేంద్రియాణాం।
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయః।
చిదానంద రూపః శివోహం శివోహం॥”
వికల్పాలు లేని నేను సర్వత్రా ఉన్నాను. కేవలం శివునిలా.
ఈ స్తోత్రం చదివి సరికే గోవిందపాదుల వారు ఆ చిన్న గుహ నుంచి బయటకు వచ్చి అనుగ్రహిస్తారు శంకరులను. ఈ సోత్రం సాధకులకు దిక్సూచి.
ఆ గుహ చిన్నదే. దానికి క్రింద ఒక సొరంగం, పైకి మరో సొరంగం ఉన్నాయి. ఆ సొరంగం క్రిందిది నర్మదానదికి, పైకి వెళ్ళేది ఓంకారేశ్వరుని సమక్షానికి. ఆదిశంకరులు ప్రతి రోజు ముందు నర్మదానది జలంతో గురువును పూజించి తరువాత ఓంకారేశ్వరుణ్ని సేవించేవారట. ఆదిశంకరులు నర్మదకు వరదలు వచ్చినప్పుడు తన కమండలంలోకి నీరును స్వీకరించింది కూడా ఇక్కడే. ఆయన గురువాజ్ఞపై ‘బ్రహ్మసూత్ర భాష్యం’ రాసింది కూడా ఇక్కడేనట.
అక్కడ పూర్వం ఉన్న మండపం లుప్తమవుతుంటే బాగుచేసిన ఛాయలు కనపడుతాయి. సొరంగం మాత్రం పూడుకుపోయింది. రాళ్ళతో కప్పబడిపోయింది. మేము దివ్యమైన ధ్యానం చేసుకోగలిగాం ఆ ప్రదేశంలో, తరువాత నెమ్మదిగా బయలుదేరి కొన్ని బాణలింగాలు తీసుకొని, పూజారి గారి ఆశీస్సులు తీసుకొని, మా గదికొచ్చాం.
నర్మదానదిలో మనసులో మరిమరి నమస్కారాలు చెప్పుకున్నాం.
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!
***
నర్మదా జలంతో ఉజ్జయినిలో కూడా అభిషేకం చేసుకోమని, ఇంటిలో అభిషేకం చేసుకోమని అది మరింత ఫలదాయకమని మాకు చెప్పారు అర్చకులు. అందుకని యాత్ర మరో రెండు రోజులకు సాగింది. మేము మా తరువాతి రోజు ఉజ్జయిని వెళ్ళాలని ముందుగానే అనుకున్నాం. కాబట్టి, ఆ రోజు ఓంకారేశ్వరంలో భోజనం చేసి ఉజ్జయిని బయలుదేరాం.
అక్కడికి ఉజ్జయిని 140 కిలో మీటర్లు.
ఉజ్జయినికి వచ్చే దారిలో మేము ఇండోరులో అతి పెద్ద శక్తివంతమైన గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నాం. ఇండోర్ నగరాన్ని మళ్ళీ దగ్గరి నుంచి చూసే అవకాశం కలిగింది. ఇండోర్ నగరం కేవలం పరిశుభ్రమైనదే కాదు, చాలా చక్కటి నగరం కూడా. గణపతి దేవాలయంలో కూడా చాలా పద్ధతిగా భక్తులు కదలటం, పువ్వులు, ప్రసాదాలు అమ్మే చోట కూడా ఎలాంటి చెత్త పడకుండా శుభ్రపరుస్తూ ఉండటం చాలా బాగా నచ్చింది. ఆ గణపతి దేవుడు ఎంతో మహిమాన్వితుడని, అక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పారు. ప్రక్కనే నర్మద దేవాలయం ఉంది.
గణపతికి మొక్కి, మేము నర్మదను దర్శనం చేసుకున్నాం. గుడిలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. అక్కడినుంచి మేము ఇండోరులోని ప్రఖ్యాతమైన ‘స్ట్రీట్ పుడ్’ ఉన్న వీధికి వెళ్ళాము. అక్కడ ఒక వీధి వీధంతా ఆహరం అమ్మే కొట్లు. చాలా వరకు శాకాహరం, చాట్ నుంచి విదేశీ రకాలు కూడ దొరుకుతాయి. స్వీట్స్ అయితే చెప్పనక్కర్లేదు. ప్రపంచ ప్రఖ్యాత హల్దీరామ్ అక్కడినుంచే మొదలయింది. అలాంటి బ్రాండ్లు అక్కడ చాలనే ఉన్నాయి. తినకపోయినా కళ్ళతో చూసినా కడుపు నిండిపోతోంది. మేము ఒక చోట నచ్చిన చాట్ తీసుకొని తిన్నాము. కొన్ని స్వీట్స్ మూటగట్టుకున్నాము.
ఇండోర్ చూడటానికి కూడా చాలా బావుంది. మేము మా లంచ్ చేసి తిరిగి ఉజ్జయిని వైపు సాగాం. ఆ రోజు సాయంత్రానికి ఈ ఉజ్జయిని చేరుకున్నాం.
ఉజ్జయిని
“అయోధ్యా మధురా మాయా
కాశీ కాంచీ అవంతికా।
పురీ ద్వారవతీచైవ
సప్తైవ మోక్షదాయకాః॥” అని మనకు పెద్దలు చెబుతారు.
ఈ ఏడు నగరాలు మనకు మోక్షాన్ని ఇస్తాయి. ఇందులో అవంతికాపురీ అంటే ఉజ్జయిని నగరమే. ఉజ్జయినికి పూర్వ నామం అవంతిక. ఉజ్జయిని నగరం వారణాసి నగరమంత పురాతనమైనది. అవంతికా రాజ్యానికి రాజధానిగా ఉండేది ఉజ్జయిని నగరం. ఈ నగరం పురాణాలలో ప్రస్తావించబడింది. పౌరాణిక ప్రశస్తి, చారిత్రక విశిష్టత ఈ నగరానికి ఉన్న విశేషణం. ఈ నగరములో ఉన్న విశేషాలలో సాందీప మహర్షి ఆశ్రమం ముఖ్యమైనది. ఈ ముని ఆశ్రమంలో శ్రీ కృష్ణ, బలరాములు విద్యాభ్యాసం చేశారు. ఈ ఆశ్రమం తప్పక దర్శించవలసిన స్థలం.
ఉజ్జయినిలో జ్యోతిర్లింగాలలో ఒకటైన ‘మహాకాలేశ్వరుని దేవాలయం’ ఇక్కడే ఉంది. కాలాన్ని నడిపే మహాదేవుడు ఈ నగరంలో నివాసమున్నాడు. ఇది అమ్మవారి శక్తిపీఠం కూడా. అమ్మవారు మహాకాళి. క్షిప్రా నదీతీరంలో ఉన్న ఈ నగరం ప్రస్తుతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. ఇది ఓంకారేశ్వరునికి దగ్గర కాబట్టి మేము ఇక్కడ మహాదేవున్ని దర్శించుకుని వెళ్ళాలని ముందరే అనుకున్నాం.
ఉజ్జయిని మహానగరం చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న నగరం. చరిత్రలో చూస్తే మౌర్యులు, గుప్తులు ఈ నగరాన్ని తమ రాజధానిగా చేసుకుని దేశాన్ని పరిపాలించారు. చందమామ కథలలో ఉజ్జయిని అని చదివిన కథలెన్నో గుర్తుకు వస్తాయి మనం ఈ నగరం వెళితే. ముఖ్యంగా ఉజ్జయిని అంటే మనకు భట్టి విక్రమార్కుడు, గుర్తుకు వస్తారు. విక్రమార్కుడి కథలు అన్నింటికి భూమిక ఉజ్జయినినే. ఆయన ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉన్నది. కాళిదాసు అంటే మనకు ‘మేఘసందేశము’ మనసులో మెదులుతుంది.
మేఘసందేశంలో శాపవశాత్తు వింధ్య పర్వతాలపై ఉన్న యక్షుడు ఆషాడమాసాన తన విరహాన్ని ఒక మేఘంతో అలకాపురిలో ఉన్న తన ప్రియురాలికి చెప్పమని చెబుతాడు. అలా చెబుతూ, అలకాపురి చేరే దారిని వర్ణిస్తూ ఉజ్జయిని గురించి విశేషంగా చెబుతాడు.
“…మాస్మభూరుజ్జయిన్యాః
విద్యుద్దామస్ఫురితచితై ర్యత్ర పౌరాంగనానాం…”
“నీవు వెళ్ళే దారిలో నీవు తప్పక ఉజ్జయినిని దర్శించు…” అని చెబుతూ ఉజ్జయిని నగరం స్వర్గానికి సమానమైనదని పొగుడుతాడు. ఉజ్జయినిలో నదుల గురించి, భవనాల గురించి, వాటి మీద ఉన్న అందమైన స్త్రీల గురించి వర్ణిస్తాడు. వాసవదత్త గురించిన కథను చెబుతాడు కవి అయిన కాళిదాసు. ఇన్ని వర్ణనలు చేసిన ఆ నగరమే ఆ కవి నివాసం మరి.
వైద్యుడు ధన్వంతరి, సాహిత్యకారుడు అమరసింహుడు, న్యాయదర్శకుడు క్షిపణకు, వరహమిహిరుడు ఇత్యాది వారంతా విక్రమార్కుని ఆస్థానంలో ఉండేవారు ఉజ్జయినిలో నివసించేవారు.
ఈ ఉజ్జయిని క్షేత్రానికి మహాకాలుడు ఆదిదేవుడు. ఆయనకు ఉన్న దేవాలయం పురాతనమైనది. మూడు అంతస్తులుగా ఉన్న ఈ దేవాలయంలో దేవదేవుడు మహాకాలుడు పురాతనమైన ప్రసిద్ధిచెందిన లింగస్వరూపం.
“అవంతికాయాం విహితావతారం
ముక్తి ప్రదానాయ చ సజ్జనానామ్।
అకాల మృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాల మహాసురేశామ్॥”
అని ఆదిశంకరులు మహాకాలున్ని స్తుతించారు.
భూలోకంలో మహాకాల లింగంగా ప్రసిద్ధి చెందింది. పూర్వము మన వాళ్ళు కాలం లెక్కను ఈ మహాకాలేశ్వర లింగం నుంచి కొలిచేవారట.
ఈ మహాకాలుని గురించి కాళిదాసు తన మేఘసందేశంలో వివరిస్తాడు. అందున అక్కడ జరిగే హారతుల గురించి
“అప్యన్యస్మిం జలధర మహాకాల మాసాద్య కాలే
స్థాతవ్యం తే నయన విషయం యావదత్యేతి భానుః
కుర్వ న్సంధ్యాబలి పటహతాం శూలినః శ్లాఘనీయా
మామంద్రాణాం ఫలమవికలం లప్స్యసే గర్జితానామ్॥”
ఓ మేఘమా! నీవు ఆ మహాకాలుని మందిరం దగ్గర సూర్యాస్తమయం వరకు నిలిచి ఉండు. సాయంకాలం నీవు ఉరిమినట్లైతే నగరా ధ్వనుల వలె సహకరించగలం. నీకు పూజకు సహకరించినందుకు మంచి ఫలితం కలుగుతుంది. ఇలా ఎన్నో శ్లోకాలలో ఉజ్జయిని నగర సౌందర్యాన్ని వర్ణిస్తాడు కాళిదాసు.
కాలం అన్నింటికి ఆధారమైంది. అన్నింటిని తనలో లయం చేసుకుంటుంది. అటువంటి కాలమే మహాకాలుడిగా వెలిసింది. మంత్ర తంత్రాలకు నిలయం ఈ నగరం. మహాకాలుడి లాగానే మహాకాళికి కూడా నివాసం ఈ నగరం. ఈ క్షేత్రంలో మరణిస్తే వారికి ముక్తి లభ్యం అని మరుజన్మ ఉండదని అంటారు. అందుకే దీనిని మహా శ్మశానమని కూడా చెబుతారు. శ్మశానం నుంచి చితాభస్మం సేకరించి మహాకాలునికి ఉదయము చేసే భస్మహారతి నేటికి ప్రసిద్ధి చెందింది. ఈ భస్మహారతిలో స్త్రీలకు అనుమతి ఉండదు. ఇప్పుడు ఉన్నా కూడా అదో నామమాత్రం తంతులా సాగుతోంది అని చెప్పారు.
అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలుస్తారు. ఆమె శక్తి పీఠాలలో ఒకటి. అక్కడ శ్రీచక్రం మీద ప్రతిష్ఠించబడిందని పేరు. బడే గణపతి అన్న గణపతి దేవాలయం మరో ప్రసిద్ధ ఆలయం ఇక్కడ.
మేము వెళ్ళిన రోజు సాయంత్రానికి ఈ ఉజ్జయిని చేరుకున్నాం. అక్కడ మధ్యప్రదేశ్ టూరిజం వారి బస బావుంది. మాకు భస్మహారతి వీలు కాలేదు. కారణం కోవిడ్ మూలంగా అక్కడ నెలకొన్న కర్ఫ్యూ. దాంతో భక్తులకు అనుమతి లేక కేవలం అర్చకులు మాత్రమే సాగిస్తున్నారు ఆ హారతిని.
మమ్మల్ని ఉదయం ఏడుకల్లా దేవాలయం వద్దకు రమ్మనమని చెప్పారు అర్చకులు.
(సశేషం)