[మేరీ సురేష్ అయ్యర్, డా. బొమ్మరాజు సారంగపాణి గార్లు సంయుక్తంగా రచించిన ‘నమ్మకం’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 1వ భాగం.]
అధ్యాయం 1
గతాన్నితనలో దాచుకునే నది
ఆ రోజు నేను కాశీ హరిశ్చంద్ర ఘాట్ పై అడుగుపెట్టే సరికి, ఇంకా సూర్యోదయం కాలేదు. కానీ కాశీ నగరం అప్పటికే మేల్కొని ఉంది. రణగొణధ్వనులతో కాకుండా, ఏదో మృదువైన అనుభూతితో మేల్కొంది. గతాన్ని వినే వారికి మెల్లగా పురాతన రహస్యాలు చెబుతున్నట్లుగా నది సవ్వడులు చేస్తూ ప్రవహిస్తూ ఉంది. ఘాట్ కు చెందిన రాతి మెట్లు నా కాళ్ళకి చల్లగా తగిలాయి. మెట్ల సందుల్లో ఎవరో వెలిగించిన అగరువత్తుల నుండి సన్నని పొగ వెలువడుతున్నది. నది తీరానికి కొంచెం దూరంలో, గంటలు నెమ్మదిగా మ్రోగుతున్నాయి. ఈ శబ్దాలన్నీ కూడా ఒకే లయలో కాకుండా, ఒకదానికొకటి ప్రతిస్పందిస్తున్నట్లు, ఉదయించబోయే సూర్యుడికి ఒక్కో స్వరంతో స్వాగతం పలుకుతున్నట్లుగా మ్రోగాయి.
నేను ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. కనీసం వస్తానని కూడా ఊహించలేదు.
ఇలాంటి హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి నాకు చిన్నప్పటినుండీ భయాన్ని నూరిపోశారు. చర్చి ప్రసంగాలలో కాశీ అనే పదాన్ని వినగూడని పదంగా చెప్పేవారు. ఆ పదాన్ని బిగ్గరగా ఉచ్చరించడానికి బదులు గుసగుసలాడేవారు. ఈ కాశీ నగరాన్ని విగ్రహాలతో, అబద్ధపు దేవుళ్లతో, మోసంతో నిండిన ఒక చీకటి నగరంగా పదేపదే వర్ణించేవారు. ఈ నగరంలోని ప్రతి అంశాన్నివిమర్శించే పాస్టర్ల బోధనలు వింటూ నేను పెరిగాను. ఇక్కడ చేయబడుతున్న పూజలు, వివిధ కర్మలు, తంతులను నిర్వహించే వారి బారి నుండీ కొందరు రక్షింపబడ్డారని చెబుతూ, వారి కథలను చిలువలు పలువలుగా చేసి చెప్పేవారు. ఎంతో పవిత్రంగా అనాదిగా ప్రవహిస్తున్న గంగానదిని భక్తితో కాక, తృణభావంతో చూడటం కూడా నాకు నా సండే స్కూలే నేర్పింది.
కానీ ఎందుకో ఇప్పుడు, నాచేతుల్లో ఉన్న అమ్మమ్మ అస్థికల బరువుకన్నా నా మనసే ఎక్కువ భారంగా ఉంది. ఈ నది ఒడ్డున నిలబడిన నా మనసు పరిపరివిధమైన ఆలోచనలతో నిండి స్తబ్దుగా ఉంది. గంగ జీవమున్న దానిలాగా, జ్ఞాపకాల భారంతో విస్తరించి ఉన్నట్లుగా నాకు కనిపిస్తున్నది. అక్కడ కట్టెల పొగ వాసనలు ఉన్నాయి. భక్తులు రాగి పాత్రల్లో పూజా సామాగ్రిని పెట్టుకొని నిశ్శబ్దంగా నన్ను దాటి, మెల్లగా అడుగులు వేసుకుంటూ దైవదర్శనం కోసం వెళుతున్నారు. వారి మనసులన్నీ బహుశా విశ్వనాథుడిపైనే ఉన్నట్లుగా ఉన్నాయి, అందుకే ఎవరూ నా వైపు చూడటం లేదు. ఎవరూ తొందరపడటంలేదు. వారిని గమనిస్తున్న నాకు, ఇక్కడ దుఃఖం, కృతజ్ఞత పక్కపక్కనే ఉన్నాయన్న క్రమంగా అర్థమవడం మొదలయింది.
నేను చిన్నప్పటినుండీ క్రైస్తవంలో పెరగడం వలన నాకు హిందువుల ఆచారాలు తెలియవు, మంత్రాలు అసలే రావు. అప్పటికి సమయం కాకపోవడం వలన ఏం చేయాలో చెప్పేందుకు ఏ పూజారీ ఆ చుట్టుపక్కల లేడు. నాతో పాటు వచ్చిన రాజేష్ పెద్దనాన్న మెల్లిగా కొన్ని విషయాలు వివరించడానికి ప్రయత్నించారు. అస్థికలు గంగలో కలిపేటప్పుడు ఏం చేయాలో చెప్పారు. నేను నిమజ్జన ప్రక్రియను శాస్త్ర ప్రకారం, నిజాయితీగా పూర్తి చేయటానికి వచ్చాను. పెద్దనాన్న సూచనల ప్రకారం గంగకు మోకరిల్లాను, అస్థికల కలశం నా చేతుల్లోనే ఉంది. నేను ఊపిరిబిగ పట్టి, మెల్లగా మూత తీశాను. లోపలి బూడిద చాలా తేలికగా ఉందనిపించింది. అందులో నా కళ్ళముందే బూడిదలా మారిన ఒక సంపూర్ణమైన అమ్మమ్మ జీవితం అస్థికలు, బూడిద రూపంలో ఉంది.
వణుకుతున్న చేతులతో, నేను కలశాన్ని గంగలోకి వంచి, ఆ జీవనదిలో ఆమె అస్థికలను కలిసిపోయేలా చేశాను. ఆ అస్థికలు నీటిని తాకగానే ఉపరితలం మెల్లగా కదిలింది – ఒక క్షణికమైన మెరుపులా కనిపించి, ఆపై ఆ నీటిలో కలిసిపోయింది. ఉరుములు లేవు, మెరుపులు లేవు. రాబోయేది ఏమిటో తెలిసినట్లుగా నది హుందాగా అస్థికలను తనలో కలుపుకున్నది.
నా చిన్నప్పటి నుండీ ఉన్న ఒక బంధం ఇక్కడితే తెగిపోయింది. అమ్మమ్మకు ముక్తి లభించింది.
అక్కడే నాలో జరుగుతున్న ఒక సంఘర్షణకు కూడా సమాధానం లభించింది. అమ్మమ్మను గౌరవించాలా లేక బైబిల్ వాక్యాలకు విధేయత చూపాలా అనే రెంటి మధ్య దేనినో ఒక దానినే ఎంచుకోవాలనే ఆలోచననుండి విముక్తి లభించింది.
నిజం చెప్పాలంటే, నేను ఇకపై దేన్ని నమ్ముతున్నానో నాకే తెలియదు. నేను చిన్నప్పటి నుండి నమ్ముతూ వచ్చిన ప్రతిదీ అబద్ధంలా కనిపిస్తున్నది.
ఎందుకో నా ఆలోచన క్రైస్తవం మీదకు మరలింది. క్రైస్తవం దైవ గ్రంథాల ముసుగు కప్పుకున్న ఒక క్రూరమైన, కుతంత్రపు మోసమని ఇప్పుడు అనిపిస్తున్నది. బైబిల్ భాష నన్ను మోసం చేసింది. అమ్మమ్మను గౌరవించకుండా చేసి, ఆమె పాటించిన విలువలను అర్థం చేసుకోలేనంత దుస్థితికి నన్ను నెట్టివేసింది. మతబోధకుల వాక్యాలు నాకు నావారికి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించాయి.
నాకు మా అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా మధ్య ఇప్పుడు పెరిగిన బాధాకరమైన, బహుశా శాశ్వతమైన దూరం గురించి ఆలోచిస్తే బాధకల్గుతున్నది. అర్థం లేని మూర్ఖపు క్రైస్తవ సిద్ధాంతాల కోసం, తన తల్లి చెప్పింది వినడానికి నిరాకరించడం; తన కన్నతల్లి చివరి కోరికను కూడా అంగీకరించలేని ఒకానొక దైవ సిద్ధాంతానికి ఆమె అతుక్కుపోయిన విధానం జ్ఞప్తికి వచ్చి మనసు భారమైంది. ఒక్కటి మాత్రం నిజం క్రైస్తవం మా జీవితాలను, మామధ్య గల సంబంధాలను గాఢంగా ప్రభావితం చేసింది.
ఈ కష్టనష్టాలు, ఈ పరిణామాలు, ఈ ఒంటరితనం జీవితం ఎటుపోతోందో తెలియని స్థితి. తర్వాత ఏమి జరుగుతుందో కూడా ఊహించలేని స్థితి నాది.
మా అమ్మ మత నమ్మకాల వలన మా మధ్య నెలకొన్న అపోహలు తొలగిపోతాయా? లేక ఏదీ సరిదిద్దబడకపోవచ్చేమో!
దుఃఖం లాగానే విశ్వాసం కూడా మనతో పాటు ఉంటుంది కాబోలు.
ఇప్పటికి ఇంతేనేమో..
గత కొద్ది రోజుల సంఘటనలను తరచి చూస్తే, అమ్మమ్మ మరణం తరువాత దుఃఖం అకస్మాతుగా కాక, అనుభవాల తరంగాల రూపంలో వచ్చింది. అభిప్రాయ భేదాలు, నిశ్శబ్దంగా జరిగిన నమ్మకద్రోహాలు, ముఖాల నుండి ముసుగులు తొలగిపోవడం అలల మీద అలలు వచ్చినట్లుగా వచ్చి నన్ను దుఃఖంలో ముంచివేశాయి.
ఇప్పుడు అమ్మమ్మ లేదు. ఆమె మరణం నాకు ఒక పెద్ద లోటు. ఆమె మరణం తరువాత నెలకొన్న పరిస్థితులు నేను బలంగా నమ్మిన ప్రతిదాన్ని -కుటుంబం, విశ్వాసం, జ్ఞాపకాలను ప్రశ్నార్థక౦లో పడవేశాయి.
అధ్యాయం 2
మరణంతో మొదలైన అమ్మమ్మ కథ
అన్ని రోజుల్లాగా కాకుండా ఆ రోజు మాత్రం ఒక ఫోన్ కాల్‌తో మొదలైంది. తెల్లవారుజామున, ప్రతి శబ్దమూ చాలా స్పష్టంగా వినిపించే వేళ నా ఫోన్ మోగింది. కానీ ఆ కాల్ ఎవరినుంచో నాకు ముందే తెలియడం వలన నేను స్క్రీన్ చూడాల్సిన అవసరం కూడా రాలేదు.
నేను ఫోన్ ఎత్తి, మాట్లాడలేక తడబడ్డాను. అవతలి వైపునుండి నా పలకరింపు కోసం ఎదురు చూడకుండా; “అమ్మమ్మ ఈ ఉదయం కన్నుమూసింది” అంటూ ఎటువంటి భావోద్వేగం లేకుండా రెండు ముక్కల్లో విషయాన్ని క్లుప్తంగా చెప్పింది.
అంతే, ఎటువంటి వివరణ లేదు. స్పందించే లోపే ఫోన్ కట్ అయింది!
నేను అలా స్తబ్దుగా కూర్చుండిపోయాను, ఫోన్ ఇంకా చెవి దగ్గరే ఉంది. ఏం చేయాలో తెలియనట్టుగా గుండె కొట్టుకుంటోంది.
ఇది జరుగుతుందని మా అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి, ఊపిరి తీసుకోవడానికి పోరాడుతూంది. చివరికి ఈ వార్తతో ఆమె పోరాటం అంతమైందని తెలిసింది. ఈ ఘట్టాన్ని ఎదుర్కోడానికి నన్ను నేను సిద్ధం చేసుకోడానికి ముందే సిద్ధంచేసుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం, నేను చేసిన ప్రయత్నం విఫలమై, నేను ఊహించిన దానికంటే ఎక్కువగా విషాదం నన్ను కుదిపేసింది – నా హృదయంలో అతికించే వీలు లేకుండా ఏదో పగిలిపోయినట్టు అనిపించింది.
నేను నా హౌస్ సర్జన్సీ ముగించే ప్రక్రియలో ఉన్నాను. దానికోసం సుదీర్ఘ కాలం పనిచేయాలి, అందులో విరామం లేని డ్యూటీలు, ఉన్న ఆసుపత్రితో బాటుగా, నగరానికి అవతలి వైపు ఉన్న మరో ఆసుపత్రిలో ఉన్న రోగుల బాధ్యత కూడా నాపై ఉంచారు. దాంతో నేను మునుపటిలా అమ్మమ్మ పక్కనే ఉండాలని ఎంతో అనిపించినా కూడా ఉండలేకపోయాను. చివరి క్షణాల్లో తన పక్కన లేనందుకు అమ్మమ్మ నన్ను అర్థం చేసుకుంటుందని నాకు నేను సరిజెప్పుకున్నాను. కానీ, లోలోపల మాత్రం, మునుపటిలా అన్నీ పక్కన పెట్టి ఆమె పక్కనే ఉండలేకపోయినందుకు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను.
చివరిసారిగా ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చూసాను. అప్పుడే ఏదో జరగబోతోందని అనిపించింది. ఏదో అనుమానం, ఒకరకమైన దిగులు మొదలైంది. ఆ తరువాత అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించింది, ఆమె శ్వాస మారి, కళ్ళు నిస్తేజమయ్యాయి. ఆమెకు ఆక్సిజన్ పెట్టారు, ఆమె శరీరం నేను ఎన్నడూ చూడనంత బలహీనమయింది. అమ్మమ్మ ఏడాదిగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతూనే ఉంది, కానీ ఈసారి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. ఈసారి ఆమె శరీరం పోరాడటం ఆపేసినట్టు అనిపించింది.
రెండు రోజుల ముందు నేను రాజేష్ పెద్దనాన్నకు ఫోన్ చేశాను. ఆయన అమ్మమ్మ మేనల్లుడు మాత్రమే కాదు, అమ్మమ్మకు చాలా ఆప్తుడు కూడా. ఆవిడ తన రహస్యాలన్నీ పంచుకునే వ్యక్తి. ఆమె నిస్సందేహంగా నమ్మే ఏకైక వ్యక్తి రాజేష్. తన తండ్రి – అంటే అమ్మమ్మ అన్నయ్య – అమ్మమ్మను జాగ్రత్తగా చూసుకోమని ప్రమాణం చేయించుకున్నప్పటి నుండి, రాజేష్ పెద్దనాన్న ఆ మాట ఒక మంచి కొడుకులా నిలబెట్టుకున్నాడు.
నేను ఏం జరుగుతుందో చెప్పగానే ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. ఆయన, ఆయన భార్య శారద పెద్దమ్మ అన్నీ పనులు పక్కన పెట్టి గుంటూరు నుండి నేరుగా హైదరాబాద్ వచ్చేశారు. వారు వచ్చిన మరుసటి రోజునే అమ్మమ్మ వెళ్ళి పోయింది.
ఆఖరి రోజుల్లో కూడా, అమ్మమ్మ మరణం గురించిన భయం లేకుండా ప్రశాంతంగా, జరగబోయేది అంతా తనకు తెలిసినట్లుగా సంయమనంతో ఉంది. ఆమె చివరిసారిగా ఆసుపత్రిలో చేరడానికి కొన్ని రోజుల ముందు కూడా సమయం వచ్చినప్పుడు తన శరీరాన్ని గుంటూరు తీసుకువెళ్లాలని నాకు గుర్తు చేసింది. రాజేష్ పెద్దనాన్న అంతా చూసుకుంటాడని చెప్పింది. తన జీవితాంతం హిందూ ప్రకారం జీవించిన ఆమె, తన అంత్యక్రియలు కూడా హిందూ పద్దతిలో జరగాలని కోరుకుంది.
క్రైస్తవంపై తీవ్రమైన విశ్వాసం కలిగిన రూత్ – అంటే మా అమ్మ – తన చివరి కోరిక నెరవేర్చుతుందని అమ్మమ్మ ఆశించలేదు.
అమ్మమ్మకు తన కూతురి గురించి బాగా తెలుసు. హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయనే కారణంతో మా అమ్మ తన సొంత తండ్రి, తాతల అంత్యక్రియలకు హాజరు కాలేదు. తన విషయంలో తన కూతురు అంతకంటే భిన్నంగా చేస్తుందని ఆవిడ ఆశించలేదు. అందుకే సమయం వచ్చినప్పుడు తన అంత్యక్రియలు చేయడానికి తన శరీరాన్ని రాజేష్ పెద్దనాన్నకు అప్పగించాలని అమ్మమ్మ కోరింది.
రాజేష్ పెద్దనాన్న తన మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే వచ్చాడు. ఆమె జీవితంలోని ప్రతి దశలో – అమ్మమ్మ అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా – ఆమెకు కావలసినవి అందేలా చూశాడు. బాధ్యత కంటే అమ్మమ్మ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం తోనే ఆయన అన్నీ పనులు చేసాడు. ఇప్పుడు ఆమె చివరి కోరికను నెరవేర్చడానికి ఆయన హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నాడు.
అమ్మమ్మ చివరి కోరికను నెరవేర్చడానికి ఆమె దేహాన్ని పెద్దనాన్నకు అప్పగిస్తే సరిపోతుందని నేను అనుకున్నాను. కానీ సాదాసీదా పని కూడా అంత కష్టమైన పని అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే కరుడుగట్టిన క్రైస్తవురాలైన నా తల్లిని సాధనంగా వాడుకొని చర్చి నేను ఎన్నడూ ఊహించని కుట్రను పన్నింది. అమ్మమ్మ అంత్యక్రియలు హిందూ పద్ధతిలో జరుగకుండా అడ్డంపడ్డది. ఇది నేను ఎంత మాత్రమూ ఎదురుచూడని ఘట్టం. ఎందుకో నేను నమ్మిన వారే నా వెన్నులో కత్తిని దింపినట్లు అనిపించింది.
***
నేను ఆసుపత్రికి చేరుకునే సరికి అక్కడి వాతావరణం తేడాగా అనిపించింది. అక్కడ దుఃఖంతో బాటుగా ఒక రకమైన ఆందోళనతో నిండిన వాతావరణం కనిపించింది. కారిడార్లలో ఒక రకమైన ఉద్రిక్తత కనిపిస్తోంది. ఆ గోడలు కూడా ఏదో జరగబోతోందని సూచిస్తూ ఉన్నాయి. జనం నిశ్శబ్దంగా తిరుగుతున్నారు, కానీ అది సంతాపం కాదు – మరేదో. బిగబట్టిన పెదవులు, జాగ్రత్త పడుతున్న చూపులతో అక్కడ వున్న వాళ్ళు నాకు తెలియనిదేదో వారికి తెలిసినట్టు చూస్తున్నారు .
నేను లాబీలోని గుంపు దగ్గరకు వెళ్లేలోపే రాజేష్ పెద్దనాన్న నన్ను చూశారు. ఆయన ముఖం పాలిపోయి ఉంది, కళ్ళలో దుఃఖం ఉంది. ఆ ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత పోయి ఆందోళన కనిపిస్తోంది. బహుశా మోసపోయామన్న భావన వలన ఆ భావాలు ఆయనలో ప్రతిఫలిస్తూ ఉండవచ్చు.
నన్ను చూసిన ఆయన ఆగకుండా, అందరినీ తోసుకుంటూ నేరుగా నా దగ్గరకు వచ్చారు. నేను మాట్లాడేలోపే నా చేయి పట్టుకుని ఎవరికీ వినిపించని చోటికి తీసుకువెళ్లారు.
వణుకుతున్న స్వరంతో “శ్యామూ! మీ అమ్మ – అప్పుడే అన్నీ ఏర్పాటు చేసేసింది. క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక్కడ వున్న వాళ్ళ వాలకం చూస్తుంటే వీళ్ల ప్రయత్నాలను ఆపటం అంత సులువు కాదనిపిస్తోంది. దీన్ని ఇప్పుడు నువ్వు మాత్రమే ఆపగలవు.”
నేను మాట్లాడేలోపే రాజేష్ పెద్దనాన్న మళ్లీ మాట్లాడడం మొదలుపెట్టాడు. “అమ్మమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడే యేసును అంగీకరించిందని మీ అమ్మ చెప్తుతున్నది. పాస్టర్, ఆయన భార్య కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. వారు క్రమం తప్పకుండా ఆమె కోసం వెళ్ళేవారమని, స్వస్థత ప్రార్ధన చేసేవారమని చెబుతున్నారు. యేసును అంగీకరించటం ఆమెకు, దేవుడికి మధ్య జరిగిన విషయమని చెబుతున్నారు.”
అధ్యాయం 3:
నా ఊహకే అందని దృశ్యం!
“అవన్నీ నాకు తెలిసినవే – ఆ పాస్టర్ల మాటలు, వారి స్వరం, అందులోని ఆధిపత్యం. కానీ ఆమె విషయంలో కూడా పాస్టర్లదే పై చేయి అవుతుందని నేను ఊహించలేదు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.”
నా గొంతు ఎండిపోయింది. “కానీ.. అమ్మమ్మ మతం మారలేదు కదా?” మాటలు కూడదీసుకుంటూ అన్నాను. “వారు అలా ఎలా చేయగలరు?”
నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మతం మార్చుకుందా? ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడా? అదీ ఆమె సరిగ్గా మాట్లాడలేక, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనా?
నేను పెదనాన్న చూపులను అనుసరిస్తూ లాబీలోకి చూశాను. అక్కడ ఉన్న చర్చి మనుషులు కనబడ్డారు. నా బాల్యం నుండి, నా కుటుంబ జీవితంలోని ప్రతి మూలనా నిశ్శబ్దంగా పాతుకుపోయిన పరిచయమైన ముఖాలే అవి. వారు అతిథులు ఎంత మాత్రమూ కాదు – మతం అనే తాళం చెవులతో మా కుటుంబంలోకి చొరబడిన ఆక్రమణదారులు. పుట్టినరోజులు, అనారోగ్యాలు, గొడవలు, రాజీలు – ఇలా మా కుటుంబానికి చెందిన ప్రతి విషయంలోనూ వారు చొరబడ్డారు. నా తల్లి చెవుల్లో సలహాలను కుమ్మరిస్తూ మా వ్యక్తిగత విషయాలను ఆధ్యాత్మిక చర్చలుగా మార్చేశారు. అడగకపోయినా మాకు ఏది ‘మంచిదో’ కూడా వారే నిర్ణయించేవారు. వారి ఉనికి బలవంతంగా అలవాటు చేయబడినది మాత్రమే కాదు – అనేక సార్లు ఊపిరాడకుండా చేసింది. అది మద్దతు ఇచ్చే వ్యవస్థ ముసుగులో, “సహవాసం”, “మార్గదర్శకత్వం” అనే పదాల చాటున సాగుతున్న నిశ్శబ్ద ఆక్రమణ.
ఇప్పుడు కూడా వారు ఇక్కడే ఉండి, నా తల్లిని చుట్టుముట్టి, ఆమెతో గుసగుసలాడుతూ, తరువాత ఏం జరగాలో అప్పటికే నిర్ణయించేసిన వారిలా ఆత్మవిశ్వాసంతో కదులుతున్నారు. మా అమ్మ రూత్ వారి మధ్యలో నిలబడి ఉంది – తన తల్లిని కోల్పోయిన బాధ ఆమెలో ఎక్కడా కనిపించడం లేదు. తరువాత జరగవలసిన కార్యక్రమం గురించి వారితో మాట్లాడుతున్నది.
అమ్మ నా వైపు కన్నెత్తి చూడలేదు.
అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. చర్చి మనుషులు సంతాపం తెలపడానికి ఇక్కడ లేరు.
ఆమెను సొంతం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు.
కేవలం అమ్మమ్మ శరీరాన్ని మాత్రమే కాదు, ఆమె కథను కూడా.
వారు నాగమ్మను, అదే మా అమ్మమ్మను – వారి మతపరమైన స్క్రిప్టులోకి మార్చేస్తున్నారు. ఆమె జీవితాన్ని వారి రక్షణ (Salvation) సూత్రాలకు అనుగుణంగా తిరగరాస్తున్నారు.
వారు ప్లాన్ చేస్తోంది అంత్యక్రియలు కాదు.
వారి వేగం, వారి తీరు ఎంతో అలవాటైనదిగా ఉంది – ఆఖరికి మా దుఃఖాన్ని కూడా వారి సేవలో ఒక భాగంగా మార్చేసినట్లు ఉంది.
నా తల తిరిగిపోతోంది..
ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు.
ఇది ఒక ఉల్లంఘన.
వారు ఆమె చరిత్రను, ఇష్టాయిష్టాలను, విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని తిరగరాస్తున్నారు.
ఇది కేవలం ఆమె అంత్యక్రియలను నిర్వహించడం మాత్రమే కాదు!
ఆమె వారసత్వాన్ని పునర్నిర్వచించడం. ఇదే డెజా వూ (Déjà vu) .
క్రైస్తవానికి చెందిన ఈ కథను ఎన్నోసార్లు నేను విన్నాను?
అదే మరో మరణశయ్య అద్భుతం.
సరిగ్గా చివరి నిమిషంలో రక్షించబడిన మరో “ఆత్మ”.
అదే అలవాటు చేయబడిన కథ:
ఒక చనిపోతున్న వ్యక్తి, పీడకలలతో తల్లడిల్లిపోవడం – నల్లని బట్టలు వేసుకున్న రెండు చీకటి శక్తులు వారిని నరకానికి లాగుతున్నట్లు, భయంకరమైన మాటలు వినబడుతున్నట్లుగా చూపే వర్ణనలు.
ఆ తర్వాత: తెల్లటి దుస్తుల్లో యేసు, ప్రకాశిస్తున్న దేవదూతలు, చాచిన చేతుల దర్శనం.
ఆ వ్యక్తి భయంతో నిద్రలేవడం.
వెంటనే చర్చి వ్యక్తుల ప్రవేశం.
వారు వస్తారు-ప్రార్థన చేస్తారు – మార్గాన్ని నిర్దేశిస్తారు
బలహీనమైన చెవుల్లో క్రైస్తవ వాక్యాలను గొణుగుతారు.
చనిపోతున్న వ్యక్తి తన పాపాలను ఒప్పుకుంటాడు. యేసును అంగీకరిస్తాడు.
అంతే వెంటనే పీడకలలు మాయమవుతాయి.
హఠాత్తుగా వెలుగు కనిపిస్తుంది.
కొద్ది రోజుల తర్వాత, ఆ వ్యక్తి ప్రశాంతంగా మరణిస్తాడు. – అంతటితో ఆ కథ ముగుస్తుంది.
ఆ కథను విన్న చర్చి సభ్యులందరూ ఆనందిస్తారు.
ఇలా మరో విజయం ద్వారా మరో రక్షించబడిన ఆత్మ చరిత్ర కథలాగా అందరికీ చెప్పబడుతుంది.
మరో ఆదివారం మరో సాక్ష్యం.
ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతోంది. కానీ ఈసారి ఇది చర్చిలో ఎవరో చెప్పిన కథ కాదు.
ఈసారి, ఇది అమ్మమ్మ, నా అమ్మమ్మ కథ.
వారు ఆమె పేరును కూడా ఆ “రక్షించబడిన వారి” జాబితాలో చేర్చేశారు.
యేసు మహిమకు మరో సాక్ష్యం రెడీ చేయబడుతున్నది.
మా అమ్మమ్మ విషయంలో ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు
ఆచారాలు, కన్నీళ్లు, తను ఎప్పుడూ నమ్మిన విధంగా మట్టిలో కలిసిపోయే గౌరవం – కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో ఇవేమీ లేవు. నా తల్లి దహన సంస్కారాలకు రాదని నాకు తెలుసు. అది కొత్త విషయం కాదు.
ఆమె నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందని కూడా అనుకొన్నాను – కేకలు, గొడవలు, సెంటిమెంట్, బ్లాక్‌మెయిలింగ్ వంటివన్నీ ఊహించాను.
వాటన్నింటికీ నేను సిద్ధంగా ఉన్నాననే అనుకున్నాను.
కానీ, మా అమ్మ ఏ మాత్రం సిగ్గుపడకుండా, సంకోచం లేకుండా – తన జీవితమంతా హిందూ ధర్మ విశ్వాసాలతో బ్రతికిన స్వంత తల్లి, చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా “మారుమనస్సు” పొంది, Born Again Christian గా మారినట్లుగా ప్రకటిస్తుందని నేను ఊహించలేదు.
దాంతో మాటలుడిగిన నేను అక్కడ నిశ్చేతనంగా నిలబడ్డాను. నా వెనుక వినిపిస్తున్న గుసగుసలు – ప్రార్థనలు, నడక శబ్దాలు, అక్కడక్కడ వినిపించే వెక్కిళ్లు – ఇవన్నీ నాకు క్రమంగా వినిపించడం మానేసాయి. ఏదీ నిజం అనిపించడం లేదు. ఆ ఆసుపత్రి, ఆ జనం, అమ్మమ్మ లేదన్న నిజం.. అంతా అబద్దంలాగా అనిపితున్నది.
నా మనసులో కేవలం “మతం మారింది” అనే మాట మాత్రమే ఒక వెటకారంలా గింగురుమంటోంది.
నేను అమ్మమ్మ విషయంలో విఫలమయ్యానా?
ఆ ప్రశ్న నా గుండెల్లో లోతుగా గుచ్చుకుంది!
నాకు అన్నీ తెలుసనే అనుకున్నాను. నేను జాగ్రత్తగా ఉన్నానని కూడా అనుకున్నాను. అందుకే రాజేష్ పెద్దనాన్నకు ఫోన్ చేసి, ఆయన వచ్చేలా చూశాను. నేను చేయగలిగింది చేశానని నాకు నేను చెప్పుకున్నాను.
నా మనసులో మోసపోయానన్న దుఃఖం మొదలైంది – ఆ దుఃఖం, కోపంగా మారసాగింది – అది వచ్చి వెళ్ళే కోపం కాదు, లోతుగా పాతుకుపోయి వెళ్ళనంటున్న కోపం.
అక్కడి క్రైస్తవులందరూ కేవలం అమ్మమ్మ కోరికలను విస్మరించలేదు.
వారు ఆమెను, ఆమె లక్ష్యాలను సైతం హైజాక్ చేశారు.
ఇప్పుడు ఆమె చివరిక్షణంలో మతం మారినట్లుగా అది ఒక అద్భుతంలా చిత్రిస్తున్నారు!
ఇది ఇక కేవలం ఆమె అంత్యక్రియలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు.
ఆమె జ్ఞాపకం – ఆమె గౌరవం – ఆమె విశ్వాసాలను కాపాడాలంటే నేను ఏదోఒకటి చేయలి,
అవును నేనే ఏదో ఒకటి చేయాలి! వాళ్ళను ఆపే శక్తి ఇంకెవరికీ లేదన్న విషయం కూడా నాకు అర్థమైంది.
నేను తిరిగి ఆసుపత్రి లాబీలోకి నడిచాను, రాజేష్ పెద్దనాన్న నన్ను అనుసరించాడు. కాలం గడిచేకొద్దీ మరింతమంది చర్చి సభ్యులు అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు.
“దేవుడు రూత్ ప్రార్థనలను ఆలకించాడు. మన దేవుడు ప్రార్థనలను మన్నించే దేవుడు సిస్టర్” అని ఒకరు ఉత్సాహంగా అనడం విన్నాను.
“అవును సిస్టర్ రూత్ కన్నీళ్లు వృథా పోలేదు,” అని మరొకరు సమాధానమిచ్చారు.
వారందరూ ఇప్పుడు నా తల్లి చుట్టూ గుమిగూడారు. అందరూ ఏడుస్తున్నారు – లేదా అలా నటిస్తున్నారు. మధ్యమధ్యలో హల్లెలూయలు చెప్పుకుంటున్నారు.
“ఏడవకు రూత్ సిస్టర్. దేవుడు నిన్ను వదలిపెట్టలేదు. నీ తల్లి ఆత్మ రక్షించబడింది!”
అమ్మ ఏడుస్తూ “దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు,” అంది. “ప్రతిరోజూ నేను ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువుకు మొర పెట్టాను. ఒకానొక దశలో ఆశను కోల్పోయాను, కానీ ఆయన నమ్మదగినవాడని నిరూపించాడు.”
ఇవన్నీ విన్న నేను ఇప్పుడు, మా అమ్మ వైపుకే చూడలేకపోయాను.
ఎందుకో నాకు అమ్మమ్మ గుర్తొచ్చింది, చిన్నప్పుడు నేను ఏడుస్తుంటే, ఆమె తన చీర కొంగుతో నా కన్నీళ్లు తుడిచి, నన్ను కౌగిలించుకుని, “పర్వాలేదు కన్నా, అమ్మమ్మ ఉందిగా,” అని నాకు ధైర్యం చెప్పిన తీరు, ఆ ఓదార్పు నాకు నాకు గుర్తొచ్చింది. కానీ ఆమెతో బాటుగా ఈ కుటుంబంలో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆత్మీయత కూడా వెళ్ళిపోయింది.
రాజేష్ పెద్దనాన్న నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నేను విన్న ఆ సువార్తీకుల గుసగుసలన్నీ ఆయన కూడా విన్నాడు.
ఆయన తన భార్య వైపు వంగి, “మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే, మనల్ని కూడా ఆ ‘అద్భుతంగా రక్షించబడిన వారి’ జాబితాలో చేర్చేలా ఉన్నారు,” అని గొణిగాడు. ఆమె చిన్నగా నవ్వింది.
కానీ ఇది జోక్ కాదు, కానీ వారు అంతకన్నా ఏమి చేయగలరు?
ఈ వ్యక్తులు రాజేష్‌ను నాగమ్మను నరకానికి తీసుకుని వెళ్లడానికి వచ్చిన దూతలాగా చిత్రీకరిస్తున్నారు. ఇక రూత్ – దారి తప్పి తిరిగొచ్చిన కుమార్తె – కానీ ఇప్పుడు ఆమెను తన తల్లి ఆత్మను కాపాడిన పుణ్యాత్మురాలుగా చిత్రీకరిస్తున్నారు.
నాకు అమ్మమ్మ గురించి బాగా తెలుసు. ఆమెకు ఎదురైన సమస్యల గురించి, ఆ సమస్యలను అమ్మమ్మ అధిగమించిన తీరు గురించి అనేకసార్లు ఆవిడ నాకు చెప్పింది. ఆమె మోసిన భారం గురించి నాకు తెలుసు. ఆమె అడిగిన ప్రశ్నల గురించి నాకు తెలుసు. ఆమె తిరస్కరించిన జీవితం గురించి కూడా నాకు తెలుసు
తన జీవిత చరమ కాలంలో ఆమె అనేక ప్రశ్నలు – ఇతరులు అడగటానికి సాహసించని ప్రశ్నలను లేవనెత్తి వాటికి సమాధానాలను అన్వేషించింది.
తన విశ్వాసాలకు, పద్ధతులకు అనుగుణంగానే బతికింది. తనకు నచ్చిన ఆచారాలను పాటించింది. క్రైస్తవ పద్ధతిలో తనను ఖననం చేయమని సూచనా ప్రాయంగా కూడా ఆమె ఎప్పుడూ ఎవరితోనూ అనలేదు. చివరి క్షణంలో అని ఉంటుందని అనుకోవటానికి ఆస్కారమే లేదు .
అమ్మమ్మ మా తాతయ్యను, ఆయన తండ్రిని అంటే ఆమె మామగారిని హిందూ పద్ధతిలోనే సాగనంపింది. వారందరికీ ఆమే దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించింది.
ఆమె మూలాలు గురించి ఆమెకు ఎంతో స్పష్టత ఉంది. ఇతరుల నమ్మకాలలో ఒదిగి ఉండటం ఆమెకు ఏ కోశానా సమ్మతం కాదు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, తన కన్న కూతురు తనకు వ్యతిరేకంగా మారినా, తన జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు పెద్దలు చూపిన మార్గంలోనే నడిచింది. ఆ ప్రక్రియలో ఎంతో కోల్పోయినప్పటికీ తన మార్గాన్ని, తరతరాల నుండి తన కుటుంబం నమ్ముకున్న దైవాన్ని ఆమె వదలలేదు.
ఒకవేళ అమ్మమ్మ నిజంగానే భయంతో చివరి క్షణంలో లొంగిపోయి ఉంటే, అప్పుడు ఆమె క్రైస్తవంతో తన జీవితాంతమూ చేసిన పోరాటాలకు అర్థం ఏమిటి?? అమ్మమ్మ అన్వేషణ, ప్రశ్నలు, ఆమె దుఃఖం, ఆమె బలం – క్రైస్తవానికి లొంగిపోవడమే ఈ సంఘర్షణకు ఫలితమా?
చివరిక్షణంలో అమ్మమ్మ యేసుని అంగీకరించిందని డేవిడ్ అంకుల్, ఆయన భార్య చెప్తున్నారు.
ఇప్పుడు ఆమె కూతురు సైతం ఆమెను క్రైస్తవ పద్ధతిలో సాగనంపాలనుకుంటున్నది.
అమ్మమ్మను, ఆమె వ్యక్తిత్వాన్ని, అంతకు ముందు వరకూ హిందూపద్దతిలో తన అంతిమసంస్కారాలు జరగాలని మాతో తీసుకున్న మాటలన్నింటినీ ఆసుపత్రి గదిలో చెప్పిన ఒక చిన్న మాటతో తుడిచేస్తారా?
అమ్మమ్మ తన చిన్ననాటి నుండీ ఆచరించిన హిందూ విశ్వాసాలను, నమ్మకాలను ఒక హాస్పటల్ కర్టెను వెనుక అపస్మారక స్థితిలో, చివరి క్షణాల్లో క్రైస్తవానికి మారిందనే మాటతో వమ్ము చేస్తారా?
ఇది అసత్యం చెప్పడమా లేక అమ్మమ్మ విశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని హననం చేయడమా? సాంప్రదాయం, విశ్వాసం అనేది జీవనశైలి కాక, ఆ వ్యక్తి ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా తగిలించే బ్యాడ్జి వంటిదా?
మరణమంటే అమ్మమ్మకు భయం లేదు. కానీ తనను, తన జీవితాన్ని మార్చేస్తారేమోనని భయపడేది, ఆందోళన చెందేది. రాజేష్ పెదనాన్నకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే అమ్మమ్మకు మద్దతుగా నిలబడ్డాడు. అణచివేతకు గురైన వర్గానికి చెందిన వారి అస్తిత్వాన్ని తుడిచిపెట్టడం సులువైన ఈ ప్రపంచంలో, తన వారసత్వానికి కట్టుబడి ఉండటం ఒక తిరుగుబాటులాంటిదని ఆయన గ్రహించాడు. గర్వించదగ్గ సంప్రదాయాలను తప్పుడు కథనాలు ఎలా అపహాస్యం చేస్తాయో, చర్చిలు రక్షణ పేరుతో మతమార్పిడిని ఒక విజయంగా ఎలా వాడుకుంటాయో ఆయన గమనించాడు.
ఈ అబద్ధం, ఈ మతమార్పిడి కథ ఆయన్ని తీవ్రంగా కలచివేస్తున్నదని ఆయన ముఖకవళికలే చెబుతున్నాయి. అమ్మమ్మ మరణం తర్వాత ఒక కట్టుకథ అల్లబడుతోంది. దానిని ఖండించగలిగే ఏకైక స్వరం అమ్మమ్మది మాత్రమే, అందుకే ఆ స్వరం మూగబోయే వరకు వారు వేచి చూశారు.
అదే వారి వ్యూహం.
ఆ గొంతు ఆగిపోయే వరకు ఆగి.. ఆపై ఆమె నిజాన్ని మార్చేయడం. చరిత్రను తమకు అనుకూలంగా తిరగరాయడం వారికి కొత్తేమీ కాదు!
వారి అబద్ధం కేవలం మతమార్పిడి గురించి మాత్రమే కాదు. అది చేస్తున్న ఆక్రమణ గురించి కూడా. ఆమె ఎన్నడూ విశ్వసించని క్రైస్తవ ఆచారాల ప్రకారం ఆమెను పాతిపెట్టడం అంటే – ఆమె దగ్గర మిగిలి ఉన్న ఏకైక సంపదను, ఆమె జీవితసత్యాన్ని- lived reality ను – ఆమె నుండి లాగేసుకోవడమే.
చర్చి సభ్యులు ఆమె దేహం చుట్టూ నిలబడి ప్రార్థనలు చేయడం చూస్తున్నాను. వారి కళ్లు ఆనందంతో మూసుకుపోయి ఉన్నాయి. నా కళ్లు మాత్రం దిగ్భ్రాంతితో తెరుచుకుని ఉన్నాయి.
ఇప్పుడు వారు అమ్మమ్మ ఉనికినే తుడిచి వేస్తున్నారు. ఏ కథలో భాగం కావాలని అమ్మమ్మ ఎన్నడూ కోరుకోలేదో, బలవంతంగా అదే కథలోకి మారుస్తున్నారు. మరణానంతరం అమ్మమ్మను క్రైస్తవురాలుగా చేస్తున్నారు. చనిపోయిన తర్వాత బాప్టిజం ఇస్తున్నారు.
నేను అమ్మమ్మ అస్తిత్వాన్ని తుడిచిపెడుతున్నందుకు కుమిలిపోతున్నాను. అదే నన్ను అన్నింటికన్నా ఎక్కువగా బాధించసాగింది.
ఒకవేళ నేను ఈ క్రైస్తవ తతంగానికి అంగీకరిస్తే – ఈ అరువు తెచ్చుకున్న ప్రార్థనలు, కృత్రిమ సంతాపం మధ్య ఆమెను పూడ్చిపెట్టనిస్తే – నేను కూడా ఆ తప్పులో భాగస్వామినవుతాను. అమ్మమ్మ అస్తిత్వాన్ని దొంగలించడంలో నేను సాయపడిన వాడిని అవుతాను!
(ఇంకా ఉంది)
