Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నమ్మకం-2

[మేరీ సురేష్ అయ్యర్, డా. బొమ్మరాజు సారంగపాణి గార్లు సంయుక్తంగా రచించిన ‘నమ్మకం’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]

అధ్యాయం 4

విశ్వాసులతో ముఖాముఖి

“మమ్మీ,” నా స్వరం నాకే కఠినంగా అనిపించింది. “మనం మాట్లాడుకోవాలి”

అమ్మ కొంచెం మెత్తబడినట్లుగా కనిపించింది. కానీ ఆ అమ్మ కళ్లలో ఒక రకమైన పట్టుదల ఉంది.

“అమ్మమ్మ సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేకపోయింది, అలాంటిది మతం మారేంత పెద్ద నిర్ణయం తీసుకునేంత శక్తి ఆమెకు ఉందని నువ్వు అనుకుంటున్నావా?”

నా స్వరంలోని ఆ కాఠిన్యం అమ్మకు కొత్త అయినా, అంతా తెలుసన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వి మాట్లాడడం మొదలు పెట్టింది “అమ్మమ్మ ఇన్నేళ్లు తన హృదయాన్ని ఎంత కఠినం చేసుకుందో నీకు తెలుసు – ఎంత మొండిగా ఉండేదో! తనను దహనం చేయాలని, ఆ అన్య ఆచారాలన్నింటినీ పాటించాలని ఎంతగా పట్టుబట్టేదో. కానీ ఏమైందో ఏమో, ఆసుపత్రిలో ఉన్నప్పుడు హఠాత్తుగా డేవిడ్ అంకుల్‌ను, గ్లోరీ ఆంటీని పిలవమని అడిగింది. నువ్వు నమ్మగలవా? ఆమె స్వయంగా వారిని కోరుకుంది. వారు వచ్చారు శామీ!. ఆమెతో గంటల తరబడి గడిపారు. మూడు రోజుల పాటు ఆమె కోసం ప్రార్థించారు, మన సహోదర సహోదరీలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అమ్మమ్మను దేవుడి రక్షణలోకి నడిపించారు.”

నేను ఏదో చెప్పబోయాను, కానీ ఆమె నన్ను అడ్డుకుని ముందుకు సాగింది.

“ఇది నమ్మడం కష్టమని నాకు తెలుసు. నాకు కూడా కష్టంగానే ఉంది. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో పనిచేస్తాడు. ఆయన అమ్మమ్మ ఆత్మను రక్షించడమే కాకుండా, మనల్ని కూడా రక్షించాడు – ఆ అన్య ఆచారాల్లో పాలుపంచుకునే ఉచ్చులో పడకుండా.”

అమ్మ కాసేపు ఆగింది, తర్వాత చెప్పబోయేది అన్నింటినీ వివరిస్తుందన్నట్టుగా చూసింది.

“నీకు అర్థం కావడం లేదా? మనం గనుక ఆమె శరీరాన్ని రాజేష్ పెద్దనాన్నకు అప్పగించి ఉంటే దేవుని నామానికి ఎంత అవమానం వచ్చేదో ఆలోచించు. ఆయన ఏం చేసేవాడో నీకు తెలుసు – ఆ చీకటి ఆచారాలు, ఆ విగ్రహారాధన. దీని గురించి ప్రజలు ఏమనుకుంటారో ఊహించుకో శామీ. ఇన్నేళ్లు మనతో ఉన్నా, ఆమెను వదిలేశామని, పరాయిదానిలా చనిపోనిచ్చామని, అవిశ్వాసుల చేత పాతిపెట్టించామని అనుకునేవారు. కానీ దేవుడు అలా జరగనివ్వలేదు. ఆయన మనల్ని కాపాడాడు. ఆయన మన సాక్ష్యాన్ని కాపాడాడు. అన్యుల ముందు మనం అవమానపడకుండా చూసుకున్నాడు.”

నాకు ఊపిరి ఆగిపోయినట్టయ్యింది.

“మమ్మీ, ఆపు,” నా గొంతు నేను అనుకున్నదానికంటే గట్టిగా వచ్చింది. “ఇక ఆపు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా?”

అమ్మ నివ్వెరపోయింది.

నేను కోపంగా కొనసాగించాను. “ఇదంతా గత మూడు రోజుల్లో జరిగిందని నువ్వు చెప్తున్నావా? అమ్మమ్మ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు? సహాయం లేకుండా ఊపిరి కూడా తీసుకోలేనప్పుడు? ఆమె మీ పాస్టర్‌ను పిలిపించి, తన పాపాలను ఒప్పుకుని, రక్షణ పొందిందని నన్ను నమ్మమంటావా?”

“నేను అబద్ధం చెబుతున్నానని అంటున్నావా, శామీ? నువ్వు డేవిడ్ అంకుల్‌తో, గ్లోరీ ఆంటీతో మాట్లాడు. వారు నీకు అంతా చెబుతారు. ఇందులో ఎటువంటి గందరగోళం లేదు.”

ఆమె తన పర్సులో నుండి ఫోన్ తీసి వేగంగా డయల్ చేసింది.

“డేవిడ్ అంకుల్? అవును, మీరు, గ్లోరీ ఆంటీ ఒక్క నిమిషం కిందకు రాగలరా? శామీ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు.”

నేను అక్కడే నిశ్చలంగా నిలబడ్డాను, నా శరీరంలో రక్తం ఉడుకుతున్నట్టు అనిపించింది. ఆ సన్నివేశం, ఆ వేగం, ఆ నిశ్చయత – నీతిమంతులమనే ముసుగులో ఉన్న ఆ గర్వం నాకు అసహ్యం కలిగించింది.

డేవిడ్, అతని భార్య ప్రత్యక్షమయ్యారు, వారి ముఖాల్లో గంభీరత, మాటల్లో సిద్ధం చేసుకున్న సమాధానాలు ఉన్నాయి.

వారు ఏదో ఒక ఆధ్యాత్మిక న్యాయస్థానం నుండి బయటకు వచ్చినట్టుగా నా ముందు నిలబడ్డారు. నవ్వలేదు, తల ఊపలేదు. సత్యాన్ని చూడ నిరాకరించే వ్యక్తులపై చూపే ఒక రకమైన జాలి నిండిన చూపుతో వారు నన్ను చూశారు.

గ్లోరీ ఆంటీ వెంటనే మాట అందుకుంది. “మీ అమ్మమ్మ మమ్మల్ని పిలిచింది శామీ. ప్రార్థన చేయమని అడిగింది. నిత్యజీవం గురించి ప్రశ్నలు వేసింది. ఆమె చాలా స్పష్టంగానే మాతో మాట్లాడింది.”

నేను గట్టిగా దవడలు బిగించి వారిని చూశాను.

“ఆమె కనీసం ఊపిరి తీసుకునే స్థితిలో కూడా లేదు. ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉంది, మాటిమాటికి స్పృహ కోల్పోతున్నది. మతాలు గురించి ఆలోచించే స్థితిలో ఆమె లేదు.” అని అన్నాను.

గ్లోరీ ఆంటీ మృదువుగా, విచారంగా నవ్వుతూ – “శరీరం బలహీనంగా ఉన్నప్పుడు కూడా, ఆత్మ చలిస్తుంది. దేవుడు నిశ్శబ్దంలో మాట్లాడుతాడు. ఆమె ఏడ్చింది శామీ. తనకు వెలుగు కనిపించిందని చెప్పింది. కన్నీళ్లతో తన పాపాలను ఒప్పుకుంది. నేను ఆమె చేయి పట్టుకుని ప్రార్థన చేశాను. ఆమె ఆత్మలోకి శాంతి ప్రవేశించడం నేను గమనించాను.” అంది.

ఇది చాలా అలవాటైన కథలా ఉంది వినడానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంది.

నా జీవితమంతా ఇలాంటి సాక్ష్యాలనే వింటూ వచ్చాను. పేరు మారినా, ఆసుపత్రి మారినా – స్క్రిప్ట్ మాత్రం అదే.

“అమ్మమ్మ నా దగ్గర దీని గురించి ఎప్పుడూ చెప్పలేదు,” నేను బదులిచ్చాను.

“చనిపోవడానికి రెండు రోజుల ముందు నేను అమ్మమ్మతో మాట్లాడాను. యేసు గురించి కానీ, రక్షణ గురించి కానీ ఏమీ అనలేదు. అమ్మమ్మ చెప్పిందల్లా ఎప్పటిలాగే తన శరీరాన్ని రాజేష్ పెద్దనాన్నకు అప్పగించి దహనం చేయించమనే.”

నేను దేవుని లోతైన విషయాలను అర్థం చేసుకోలేని చిన్న పిల్లవాడినన్నట్టుగా డేవిడ్ అంకుల్ నన్ను చూశారు.

“శామీ,” ఆయన స్వరం మృదువుగా ఉంది, “కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలను చివరి క్షణం వరకు దాచి ఉంచుతాడు. మరణం ముంచుకొచ్చినప్పుడే హృదయం తెరుచుకుంటుంది – అప్పుడే నిత్యత్వం అనేది నిజమవుతుంది. దేవుడు చివరి గడియలో, మన అవగాహనకు అందని రీతిలో పనిచేస్తాడు. బైబిల్‌లో మత్తయి 19:26లో చెప్పినట్లుగా, ‘మనుష్యులకు ఇది అసాధ్యము గాని దేవునికి సమస్తమును సాధ్యమే.’”

నేను మా అమ్మ వైపు తిరిగాను. ఆమె వారి పక్కన నిలబడి ఉంది, ఆమె కళ్లలో ఒక నిరీక్షణ – నేను ఇప్పుడే కుప్ప కూలిపోయి, ఏడ్చి, చివరకు లొంగిపోతానని ఆమె ఎదురుచూస్తున్నట్టుగా ఉంది.

కానీ నేను అలా చేయలేదు.

“చివరిసారి ఆసుపత్రికి వెళ్లేముందు అమ్మమ్మ నాకు ఏం చెప్పిందో తెలుసా?” నేను అన్నాను. “మీరు ఆమె చివరి కోరికను గౌరవిస్తారని అమ్మమ్మ అనుకోలేదు. మీరు దీన్ని మీ విశ్వాసానికి సంబంధించిన విషయంగా మారుస్తారని అమ్మమ్మకు తెలుసు. కానీ – కనీసం రాజేష్‌ పెద్దనాన్ననైనా దహన సంస్కారాలు చేయనిస్తారని ఆశపడింది.”

అమ్మ ముఖంలో ఒక క్షణం అపరాధ భావం, ఆ వెంటనే తనను తాను సమర్థించుకునే భావం కనిపించాయి.

“అమ్మమ్మ తప్పుదారి పట్టించబడింది శామీ,” ఆమె మెల్లగా అంది. “అమ్మమ్మకు సత్యం తెలియదు. కానీ దేవుడు తన కరుణతో, చనిపోకముందే దాన్ని అమ్మమ్మకు వెల్లడిoచాడు.”

“లేదు మమ్మీ,” నా గొంతు నాకే తెలియకుండా పెరిగింది. “అమ్మమ్మకు తెలియనిది – ఊహించలేనిది ఒకటి ఉంది. అది – చనిపోయాక కూడా, మీరు అమ్మమ్మ కథను మీ సాక్ష్యం కోసం మార్చేస్తారని. మీ సాక్ష్యం కోసం అమ్మమ్మ చివరి గౌరవాన్ని కూడా మీరు లాగేసుకుంటారని ఆమెకు తెలియదు.”

రూత్ నివ్వెరపోయింది, ఆమె ముఖం గాయపడినట్లుగా ఉంది. “నువ్వు అవిశ్వాసిలా మాట్లాడుతున్నావు.”

ఇది కేవలం అమ్మమ్మ గురించి మాత్రమే కాదు. ఇది సత్యం గురించి. ఎవరో రాసిన రక్షణ కథలో పాత్రగా కాకుండా ఒక వ్యక్తి ఎలా బతికాడో అలాగే గుర్తుంచుకునే హక్కు లేకుండా చేయటం గురించి మాటిమాటికి అల్లబడుతున్న కథ.

నేను మళ్ళీ డేవిడ్ అంకుల్, గ్లోరీ ఆంటీ వైపు తిరిగాను.

“మీ సమయానికి.. కృతజ్ఞతలు,” అన్నాను. “కానీ మేము ఏర్పాట్లు చేసుకోవాలి.”

గ్లోరీ ఆంటీ ముందుకు వచ్చి, నా చేతిపై మెల్లగా చేయి వేసింది. ఆ స్పర్శతో నేను మారు మనసు పొందాలని ఆమె ఉద్దేశ్యం అనుకొంటాను. నేను రెండుఅడుగులు వెనక్కు వేశాను

“దేవుడు నీ హృదయాన్ని మెత్తబరచనివ్వు శామీ,” ఆమె అంది.

“నేను బాగానే ఉన్నాను. నాకే సమస్య లేదు,” నేను బదులిచ్చాను.

వారు అయిష్టంగానే వెళ్ళిపోయారు. నేను అడిగిన ప్రశ్నలు వారిని కొంచెం కలవరపెట్టాయి. మతప్రచారకులను ప్రశ్నిస్తే తట్టుకోలేరు!

మా అమ్మ కుర్చీలో కూర్చుంది, ఆమె కళ్లు నిశ్చలంగా ఉన్నాయి, మాట్లాడకుండా పెదవులు బిగబట్టి కూర్చుంది. కానీ ఆ చూపు నాకు తెలుసు. ఆమె ఇంకా వదల్లేదు.

అధ్యాయం 5

నిశ్శబ్ద వ్యూహం

అప్పుడే రాజేష్ పెద్దనాన్న గంభీరంగా కనబడుతూ ఏదో చెప్పాలనుకొంటున్నట్లుగా పక్కకు రమ్మని సైగ చేశారు.

రాజేష్ ఈ పోరాటాన్ని ఈ పాదరి వర్గం ఏర్పాటు చేసిన పద్ధతుల్లో చేయదలచుకోలేదు. ఆయన వారికంటే తెలివైనవాడు. – ఆయన ముఖం ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా ఉండి, చూపు కూడా మారింది! దుఃఖం నుండి వ్యూహానికి మారిన చూపు అది. ఇక్కడ మాకు సంఖ్యాబలం లేదు. మమ్మల్ని బలపర్చేవాళ్ళు ఒక్కరూ లేరు. అందుకే ఒక ఉపాయం ఆలోచించినట్లున్నాడు .

“శ్యామూ,” ఆయన ప్రశాంతంగా అన్నారు, “మీ అమ్మమ్మ మతం మార్పు గురించి జరుగుతున్న ఈ వాదనలు – అది నిజంగా జరిగిందా లేదా అన్నది – ప్రస్తుతం అనవసరం. వీళ్ళతో వాదించి ఉపయోగం లేదు.”

ఆయన తన స్వరాన్ని తగ్గించారు. “ముందు మనం పార్థివ దేహాన్ని గుంటూరుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడదాం. అక్కడికి వెళ్ళాక ఆచారాల గురించి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి, వారు చెప్పినట్టుగానే నటిద్దాం.. బయటపడ వద్దు. అక్కడ మనకు సాయపడే వాళ్ళు ఉన్నారు..”

శామీ తల ఊపాడు, కానీ ఆ నిశ్శబ్దం కేవలం అంగీకారం మాత్రమే కాదు. నిశ్శబ్దంగా ఉండటం ద్రోహంలా అనిపిస్తోంది; గట్టిగా ఎదిరించటం బలహీనతలా అనిపిస్తోంది. అతను తన జేబుల్లో పిడికిలి బిగించాడు, గోళ్లు అరచేతుల్లోకి దిగిపోతున్నాయి. ఇది లొంగిపోవడం కాదు – కేవలం వేచి చూడటం అని తనను తాను సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ, ఆ నిరీక్షణ అతనికి చురుకులా తగిలింది.

అయితే ఆశ్చర్యకరంగా శామీ త్వరగానే శాంతించాడు – మరీ అంత త్వరగా శాంతించడం అనుమానాస్పదంగా ఉన్నా, నిజానికి అతను ఉపశమనం పొందాడు. రాజేష్ పెద్దనాన్న ఏదో ఒకటి చేస్తారనే నమ్మకం అతనిలో కలిగింది, దానివల్ల ఆ బరువును తానొక్కడే మోయాల్సిన అవసరం లేదని అర్థమైంది. “సరే, అలాగే చేద్దాం,” అని తల ఊపాడు.

వారిద్దరూ తిరిగి ఆసుపత్రిలోకి నడిచారు. తమ చుట్టూ ఉన్న ఉద్రిక్తతను గమనించనట్టుగా ముఖానికి ఒక నిర్లిప్తమైన ముసుగు వేసుకున్నారు. కానీ రూత్ దాన్ని గమనించింది. శామీ అంతకుముందు చూపించిన కోపం కంటే, ఈ అకస్మాత్తుగా వచ్చిన మార్పు ఆమెను మరింత కలవరపెట్టింది. అంత్యక్రియల ఏర్పాట్ల జాబితాను పట్టుకుని, కొడుకు దగ్గరకు వెళ్లాలా వద్దా అని తటపటాయించింది.

రాజేష్ గది మూలన నిలబడ్డాడు. రిసెప్షన్ డెస్క్ దగ్గర కొందరు చర్చి సభ్యులు గుమిగూడి మెల్లగా, ఆందోళనగా మాట్లాడుకుంటున్నారు. ఆయనకు ప్రతి మాట వినబడలేదు కానీ, వినిపించిన ముక్కలు చాలా విషయాలు చెబుతున్నాయి.

“-ఇప్పటికే బాప్టిస్ట్ గ్రౌండ్ చూశాం..”

“పాస్టర్ లెటర్ కావాలంటున్నారు..”

“ఆమె ఏ రిజిస్టర్డ్ సంఘంలోనూ సభ్యురాలు కాదని చెప్పారు..”

ఆయన వారి వైపు తిరగలేదు. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా వింటున్నారు. ఒక స్పష్టత రావడం మొదలైంది.

రూత్ ఏ చర్చిలోనూ సభ్యురాలు కాదు, ఏదేని ఒక చర్చిలో సభ్యత్వం ఉంటేనే, ఆ చర్చికి సంబంధించిన సమాధి స్థలంలో చోటు దొరుకుతుంది.

అది రాజేష్ కు చాలా విచిత్రంగా అనిపించింది. రూత్ తన జీవితాన్నంతా తన విశ్వాసం చుట్టూనే నిర్మించుకుంది. ప్రతి శ్వాసలోనూ బైబిల్ వాక్యాలను కోట్ చేస్తుంది. తనను పెంచిన హిందూ ఆచారాలను, సంప్రదాయాలన్నింటినీ వదిలేసింది. కానీ చివరికి, తన తల్లి మృతదేహం మార్చురీలో ఉన్నప్పుడు – ఆమె దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇతరుల పలుకుబడిపై ఆధారపడి ఉంది.

ఆందోళన కంటే కుతూహలంతో రాజేష్ అడిగారు, “మీకు చర్చి మెంబర్‌షిప్ ఎందుకు లేదు? డానియేలు పాస్టర్ అని విన్నాను.. మీ కుటుంబం ఒక చర్చిని నడిపేది కదా?”

రూత్ ఉలిక్కిపడింది. “ఆయన పాస్టర్ కాదు,” ఆమె వెంటనే సరిదిద్దింది. “ఆయన ఒక ఎవాంజలిస్ట్”

రాజేష్ కనుబొమ్మలు ఎగరేశాడు కానీ ఏమీ అనలేదు. ఆ పదాల మధ్య తేడా ఆయనకు ముఖ్యం కాదు – కానీ వారికి మాత్రం చాలా ముఖ్యం. సారం కంటే పదవులకే ఎక్కువ ప్రాధాన్యత. సమాజం కంటే బయటి వ్యక్తుల ముందే తమ రూపం సరిగ్గా ఉండాలి. అయినా ఆమె స్వరంలో ఏదో దాస్తున్నట్టు అనిపించింది, అది ఏదో అపరిష్కృతమైన గతాన్ని సూచిస్తోంది. దీని గురించి తర్వాత శామీని అడగాలని ఆయన అనుకున్నారు.

ఆయన ఆ ఆలోచనలను పక్కన పెట్టారు. ప్రస్తుతం అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. నాగమ్మ దేహాన్ని ఏ గొడవ జరగకుండా గుంటూరుకు ఎలా తీసుకెళ్లాలన్నదే ప్రధానం.

విచిత్రమేమిటంటే, ఏ వ్యక్తులైతే అన్నింటినీ క్లిష్టం చేస్తున్నారో, వారే ఈ పని సాధ్యమయ్యే ఒక వీలును చూపించారు.

గది అవతలి వైపు, పాస్టర్ డేవిడ్ తన అనుచరులకు సూచనలు ఇస్తున్నారు. రాజేష్‌ను చూడగానే, ఆయన మాటలు ఆపి లాబీ బయటకు రమ్మని సైగ చేశారు.

రాజేష్ వెళ్లారు. డేవిడ్ గొడవకు సిద్ధమవుతున్నాడని ఆయనకు అర్థమైంది.

కానీ రాజేష్ ప్లాన్ అది కాదు.

ఇంకా సమయం ఉంది.

చాలా మర్యాదపూర్వకమైన ముఖం పెట్టి, రాజేష్ రెండు చేతులూ జోడించి నమస్కరించారు. “నమస్కారం పాస్టర్ గారు.”

“నేను పాస్టర్‌ను కాదు సార్,” డేవిడ్ కఠినంగా బదులిచ్చారు. “నేను ఒక ఎవాంజలిస్ట్‌ను.”

రాజేష్ బలవంతంగా నవ్వారు. “అవునా? తేడా ఏమిటో నాకు తెలియదు.”

డేవిడ్ వివరించడానికి ఆ అవకాశాన్ని అందుకున్నారు. “అవును అవును, ఎవాంజలిస్ట్. మా ఫెలోషిప్‌లో ఎవరూ పాస్టర్లు ఉండరు. మేమంతా ఎవాంజలిస్టులమే.”

ఫెలోషిప్. ఎవాంజలిస్ట్. బ్రదర్. సిస్టర్. ఈ కోడ్ భాషలో ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో రాజేష్‌కు తెలియదు. తన మామయ్య రాములు చివరి దశలో ఎందుకు అంత బాధపడ్డాడో ఇప్పుడు అర్థమైంది. ఇవి కేవలం పదాలు కావు – ఇవి సంకెళ్లు.

అయినా రాజేష్ నిశ్చలంగా ఉన్నాడు. తన మనసులో అనుకున్న మాటలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు.

“సార్, మాది పెద్ద కుటుంబం. చాలా మంది నాగమ్మ అత్తను చివరిసారిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇంత తక్కువ సమయంలో అందరూ హైదరాబాద్ రావడం కష్టం. మేము బాడీని గుంటూరు తీసుకెళ్తే, అందరికీ సులభంగా ఉంటుంది. నాగమ్మ అత్తకు గుంటూరు దగ్గర వ్యవసాయ భూమి కూడా ఉంది. ఎవరి అనుమతి లేకుండానే మనం అక్కడ అంత్యక్రియలు చేయవచ్చు.” ఆయన కొంచెం ముందుకు వంగి, “ఇక్కడ సిటీలో సమాధి స్థలం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక దారికి రాలేదు. గుంటూరులో అటువంటి ఇబ్బందులు లేకుండా పని పూర్తి అవుతుంది.” అని చెప్పారు.

డేవిడ్ వెంటనే సమాధానం చెప్పలేదు కానీ, ఆయన ఆలోచిస్తున్నాడని రాజేష్ గమనించారు.

అప్పుడే ఆయన వెనుక నుండి ఒక స్వరం వినిపించింది.

“డేవిడ్ అంకుల్,” శామీ చాలా మృదువుగా అన్నాడు, “రాజేష్ పెద్దనాన్న ఆలోచన చాలా బాగుందని నాకు అనిపిస్తోంది. పైగా, ఇది మా అమ్మ వైపు బంధువులందరికీ ఒక క్రైస్తవ అంత్యక్రియలను చూసే అవకాశం కలిగిస్తుంది. ఇది దేవుడు ఇచ్చిన అవకాశం, కదా?”

డేవిడ్ బదులిచ్చేలోపే శామీ రాజేష్ వైపు తిరిగాడు. “మనం గుంటూరులో క్రైస్తవ పద్ధతిలో అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయగలం కదా?”

డేవిడ్ ఉత్సాహంగా మాట కలిపాడు. “దాని కోసం మీ బంధువుల సహాయం ఎందుకు శామీ? గుంటూరులో మాకు ఒక ఫెలోషిప్ సెంటర్ ఉంది. పాల్ పీటర్ అక్కడ సీనియర్ ఎల్‌.ఈ.ఎఫ్ (LEF) ఎవాంజలిస్ట్.”

శామీ తల ఊపాడు. “అవును, నాకు తెలుసు. మనం వెంటనే ఆయనను సంప్రదిద్దాం.”

శామీ ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పుకు సంతృప్తి చెందిన డేవిడ్, వెంటనే తన ఫోన్ తీసి కాల్స్ చేయడం ప్రారంభించాడు. కొద్ది నిమిషాల తర్వాత, గుంటూరు ఫెలోషిప్ అంతా చూసుకుంటుందని, నాగమ్మ దేహాన్ని అక్కడికే తీసుకెళ్లాలని ఆయన రూత్‌కు చెప్పాడు .

రాజేష్‌కు తప్ప ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు – డేవిడ్ కనీసం రూత్‌ను అడగకుండానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. రూత్ కేవలం తన నమ్మకాలను మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని కూడా వదిలేసిందని రాజేష్‌కు అర్థమైంది. ఆమె తన జీవితపు స్టీరింగ్ చక్రం ఈ క్రైస్తవ మతబోధకులకు ఇచ్చేసింది. ఏది పవిత్రమో, ఏది ప్రేమో, చివరికి తన తల్లికి ఎలా వీడ్కోలు చెప్పాలో కూడా వారినే నిర్ణయించనిస్తోంది.

ఆ క్షణం ఆయనకు ఒకటి అర్థమైంది – వైఫల్యం అంటే కేవలం ఏమీ చేయకపోవడం మాత్రమే కాదు. ఇతరులు తన తరఫున మాట్లాడుతుంటే మౌనంగా ఉండటం కూడా వైఫల్యమే.

ఇది గనుక సాధారణ పరిస్థితి అయితే, రాజేష్ ఎదురు తిరిగేవాడు, దీన్ని వ్యతిరేకించేవాడు. కానీ ఇక్కడ ఏదీ సాధారణంగా లేదు. ఇది ఒక మాతృమూర్తి మరణానికి విలపిస్తున్న కుటుంబం కాదు – ఇది మతం ముసుగులో జరుగుతున్న ఆధిపత్య పోరు.

తానూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు. కానీ ఆయనకు వేరే దారి ఏముంది? ఇది ధర్మబద్ధంగా ఆడి గెలిచే ఆట కాదు. మిగిలి ఉన్న కొద్దిపాటి సత్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. “రెండు తప్పులు కలిస్తే ఒక ఒప్పు అవ్వదు” అని ఎవరైనా అంటే, వారు ఇలాంటి అంత్యక్రియలను చూసి ఉంటే ఆ మాటలు చెప్పరని ఆయన అనుకున్నారు.

ఈ పిచ్చి ప్రపంచంలో నీతికి తావు లేదు. ఇక్కడ మనం తక్కువ బాధ కలిగించే తప్పును ఎంచుకోవాలి. కొన్నిసార్లు, అదే న్యాయానికి అత్యంత దగ్గరగా ఉంటుంది.

అధ్యాయం 6:

నష్టపు అంచున

రాజేష్ నిశ్చలంగా నిలబడ్డాడు. మార్చురీ మూసి ఉన్న తలుపులకు, హాస్పిటల్ గ్రీన్-టైల్డ్ కారిడార్‌లో వినిపిస్తున్న అరుపులకు మధ్య అతను చిక్కుకుపోయాడు. చేతుల్లో కాగితాలు, స్ట్రెచర్లు, సూచనలతో జనం వేగంగా వెళ్తున్నారు. ఎదురుగా ఉన్న మరకల గోడను అతను తదేకంగా చూస్తున్నాడు, కానీ అతని మనస్సు మాత్రం కొన్ని నెలల క్రితం నాగమ్మతో గడిపిన ఒక ప్రశాంతమైన సాయంత్రం వైపు మళ్లింది.

ఆమె మాటలు అతనికి చాలా స్పష్టంగా గుర్తుకొచ్చాయి.

“రాజేష్,” ఆమె అతని వైపు చూడకుండానే అంది, “నా సమయం వచ్చినప్పుడు, ఎటువంటి గందరగోళం ఉండకూడదు.”

నాగమ్మ గొంతులో భయం లేదు, కేవలం నిశ్చయం మాత్రమే ఉంది.

“విషయాలు ఎలా జరుగుతాయో నేను దగ్గఱగా చూశాను. ఒకరు కన్నుమూసిన మరుక్షణమే, జనం వారి తరపున మాట్లాడటం మొదలుపెడతారు. వారి నోటికి మాటలు అద్దుతారు, వారి నిశ్శబ్దానికి ప్రార్థనలు జోడిస్తారు. నాకు అది ఇష్టం లేదు. నేను ఈ సంప్రదాయంలో పుట్టాను. దీని ప్రకారమే జీవించాను. మీ మామయ్యకి, ఆయన తండ్రికి గారికి నేనే కర్మకాండలు చేశాను. నా వంతు నేను చేశాను. నా విషయంలో కూడా అదే జరగాలని కోరుకుంటున్నాను.”

ఆ జ్ఞాపకం కరిగిపోయింది, మళ్ళీ ఆ హాస్పిటల్ కారిడార్ ప్రత్యక్షమైంది. మార్చురీ బయట నిలబడి ఉన్న రాజేష్ చెవుల్లో ఆమె గొంతు ఇంకా మోగుతూనే ఉంది – స్పష్టంగా. కానీ ఇప్పుడు ఆమెను వేరొకరి సత్యంతో పాతిపెట్టాలని చూస్తున్న వారు ఆమె మాటలను లెక్కచేయడం లేదు.

అక్కడ ఏం జరుగుతుందో తెలియని వారు ఎవరైనా లోపలికి వస్తే, ఇదంతా ఒక సాధారణ ప్రక్రియ అని అనుకుంటారు. ఎక్కడా తడబాటు లేదు. ఎక్కడా ఆగడం లేదు. ఏదో ఒక ఆచారాన్ని పాటిస్తున్నంత నిశ్చయంతో పనులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి.

నాగమ్మ మతం మారిందా లేదా అని ఎవరూ ప్రశ్నించలేదు. ఆ అవసరం కూడా లేదు. వీరందరూ ఒక కథను ముందే సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వారి పని దాన్ని – చాలా సాఫీగా, బహిరంగంగా అమలు చేయడం.

చల్లబడుతున్న మైనంపై ముద్ర వేసినట్లుగా, ఒకే ఒక్క క్షణంలో రక్షణ లభిస్తుందని వారు మాట్లాడుతున్నారు – దశాబ్దాల పాటు నాగమ్మ చూపిన ధిక్కారాన్ని ఒకే ఒక్క ప్రకటనతో చెరిపివేస్తున్నారు.

అదంతా ఎంత వేగంగా జరుగుతున్నదో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.

శామీకి ఇది ఒక గారడీ విద్యలా అనిపించింది.

ఒక్క మధ్యాహ్నం వ్యవధిలో నాగమ్మ దశాబ్దాల వ్యతిరేకతపై ముసుగు కప్పారు.

సంవత్సరాలుగా ఆమె వారి సహవాసానికి దూరంగా ఉంది – మతం మారడానికి నిరాకరించినందుకు ఆమెను కేవలం భరించారు, లోలోపల విమర్శించారు. నాగమ్మ ఒక పరిష్కరించాల్సిన సమస్యగా, రక్షించాల్సిన ఆత్మగా మాత్రమే వారికి కనిపించింది.

కానీ ఇప్పుడు, అకస్మాత్తుగా, ఆమె ‘అమ్మ’ అయిపోయింది – ఒక సెయింట్ అయిపోయింది, తన చివరి శ్వాసలో “అద్భుతంగా రక్షించబడిన” ఆత్మ. ఒక విజయ చిహ్నం. ఆదివారం సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక కథ.

కానీ వారికి ఆమె అంతరంగంతో సంబంధంలేదు.

భర్త, మామ గారు చనిపోయిన తర్వాత నాగమ్మ అనుభవించిన ఒంటరితనం వారికి తెలియదు.

ఆమె చురుకైన మనస్సు, ఆమె వ్యంగ్యం, ఆమె మాటల్లోని లోతు వారికి తెలియదు.

తనకు లభించిన జీవితాన్ని నాగమ్మ ఎంత హుందాగా గడిపిందో వారికి తెలియదు.

అయినా ఆమె జీవితాన్ని తమ సొంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు.

అదే శామీ క్షమించలేకపోతున్న విషయం.

అప్పటికే వాతావరణం మారిపోయింది. దుఃఖం యొక్క నిశ్శబ్దం పోయి హడావుడి మొదలైంది. ప్రార్థనలు నేపథ్య సంగీతంలా మారిపోయాయి.

డేవిడ్ తన గుంటూరు ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ఫోన్లు వెళ్లాయి. పాల్ పీటర్ తన బృందం “ప్రభువు పని కోసం” అందుబాటులో ఉంటుందని ధృవీకరించాడు. అంటే, మతం మారిందా లేదా అన్న సందేహం ఉన్న ఒక స్త్రీకి త్వరితగతిన అంత్యక్రియలు ఏర్పాటు చేయడం అన్నమాట.

డేవిడ్ ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా పనులను పంచుతున్నాడు.

వాహనం. శవపేటిక. పూలమాలలు. ఆడియో సిస్టమ్. సండే స్కూల్ అసైన్‌మెంట్‌లలా పనులు అప్పగించాడు. ప్రతిదానికి “అవును బ్రదర్”, “ప్రైజ్ ది లార్డ్” అనే సమాధానాలు వస్తున్నాయి.

వారు చాలా సునాయాసంగా క్రైస్తవ అంత్యక్రియలను ప్లాన్ చేస్తున్నారు

శామీ కొంచెం దూరంగా నిలబడి ఇదంతా అసహనంతో చూస్తున్నాడు.

అతన్ని చూస్తున్న రాజేష్‌కు మనస్సు ముక్కలైనట్లు అనిపించింది.

చూపులు కిందకు దించి, భుజాలు వాల్చి నిలబడిన శామీ, తాను మొదలుపెట్టని యుద్ధంలో చిక్కుకున్నట్లు ఉన్నాడు. బాధ్యత తీసుకోవడానికి చాలా చిన్నవాడు, కానీ ఆ బరువును అనుభవించడానికి సరిపడా వయస్సు ఉన్నవాడు.

రాజేష్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు.

ఈ వల నుండి ఆ అబ్బాయిని బయట పడేయగలిగితే –

ఈ ప్రదర్శన మధ్యలో కనీసం ఒక్క సత్యాన్నైనా కాపాడగలిగితే –

అప్పుడు బహుశా, అంతా కోల్పోయినట్లు కాదు.

అతను పైకి ఏమీ అనలేదు.

కానీ తన మనసులో, అతను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు.

అధ్యాయం 7:

నిశ్శబ్దం

నిర్ణయం తీసుకున్నప్పటి నుండి – లేదా నిర్ణయం తన చేతుల్లో నుండి జారిపోయినప్పటి నుండి – రూత్ పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖం వెలవెలబోయింది, అది కేవలం దుఃఖం వల్ల కాదు, అంతకంటే క్లిష్టమైన ఏదో కారణం వల్ల. బహుశా అది నిస్సహాయత కావచ్చు, లేదా అలసట కావచ్చు. ఆమె చేతులు ఒడిలో ముడుచుకుని ఉన్నాయి, తనను తాను నిగ్రహించుకోవడానికే ఆమె తన శక్తిని అంతా ఉపయోగిస్తున్నట్లు ఉంది.

రూత్ దూరంగా గోడకు ఆనుకుని నిలబడింది. జనం వెళ్తున్నా ఆమె కళ్లు కదలడం లేదు, కానీ ఆమె వేళ్లు మాత్రం ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. ఆమె శరీరంఅక్కడ ఉన్నా మనస్సు మారెక్కడో ఉంది. కారిడార్ హడావుడిగా ఉన్నా, ఆమె నిశ్శబ్దంగా  ఉంది.

చివరికి ఆమె మాట్లాడినప్పుడు, ఆ మాటలు ముందే ప్రాక్టీస్ చేసినట్లుగా ఉన్నాయి: మెల్లగా, జాగ్రత్తగా, వినయంగా.

“బ్రదర్.. ఒక చిన్న మాట,” ఆమె డేవిడ్ వైపు చూస్తూ గొణిగింది. “మనం గుంటూరు వెళ్ళాక.. అమ్మ ఇంట్లో క్రైస్తవ పద్దతిలో అంత్యక్రియలు చేయడం అంత సులభం అని నాకు అనిపించడం లేదు. మా బంధువుల్లో కొందరు ఎలాంటివారో మీకు తెలుసు కదా-”

ఆమె మాట పూర్తి చేయకముందే డేవిడ్ అడ్డు తగిలాడు. “రూత్, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడకు. ఫెలోషిప్ బ్రదర్స్, సిస్టర్స్ అంతా చూసుకుంటారు. అంతా ప్రభువు చేతుల్లో ఉంది.”

అతని భార్య తల ఊపింది, అప్పటికే ఆమె మనస్సులో ఏయే లేఖనాలు చదవాలి, పూల అలంకరణ ఎలా ఉండాలి అనే చెక్ లిస్ట్ సిద్ధమైపోయింది. ఆమె పెదవులు శబ్దం లేకుండా కదులుతుంటే రూత్ చూస్తూ ఉండిపోయింది. ఇలాంటివి ఎన్నోసార్లు చేసిన అనుభవం ఆమె ముఖంలో కనిపిస్తోంది.

“పైగా పాల్ పీటర్ గారికి రాజకీయంగా మంచి పట్టు ఉంది,” డేవిడ్ భరోసా ఇస్తూ అన్నాడు. “మనం అక్కడికి వెళ్ళాక ఆయన చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువు మనకంటే ముందే అక్కడికి చేరుకున్నాడు.”

రూత్ తల ఊపింది – ఇష్టంతో కాదు, ఒక అలవాటు ప్రకారం.

ఆమె చెప్పాలనుకున్నది చెప్పేసింది – చాలా మెల్లగా, వినయంగా. అది ఒక ఆలోచన మాత్రమే, నిరసన కాదు.

ఇప్పుడు డేవిడ్ ‘ప్రభువు చిత్తం’ అనేసరికి, ఇక మాట్లాడటానికి ఏమీ లేదు.

ఆ విషయం అక్కడితో ముగిసింది. కానీ రూత్ వెనక్కి తగ్గుతున్నప్పుడు,

ఆమెకు ఒక చిన్న సందేహం కలిగింది – అమ్మ మతం మారడం నిజంగా పూర్తయిందా? ఆమె మనస్సులో ఇంకా పాత పూజలు, పాత పద్ధతుల బరువు ఉండిపోయిందా? ఆ ఆలోచన ఆమె మనస్సును నీడలా కమ్మేసింది. ఒక క్షణం పాటు ఆమెకు తన తల్లి రెండు రూపాల్లో కనిపించింది – ఒకటి ఫెలోషిప్ వారు చెప్పుకుంటున్న రూపం, రెండోది పెరట్లో పసుపు అంటిన చేతులతో ఒట్టికాళ్లతో నిలబడే రూపం. ఈ రెండు రూపాల మధ్య ఆమె మనస్సు కొట్టుమిట్టాడింది.

ఆ ఆలోచన ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్లిపోయింది, కానీ ఒక రకమైన అపరాధ భావాన్ని మిగిల్చింది. అమ్మ రక్షణను శంకించడం అంటే, దేవుని పనిని శంకించడమే. రూత్ వెంటనే కళ్లు దించుకుంది, అలాంటి సందేహం వచ్చినందుకు సిగ్గుపడింది. ఒక్క చిన్న ఆలోచన కూడా ఆమెను వణికించింది.

ఆమె గుండె బరువెక్కింది. ‘నేనెందుకు ఈ సందేహాలను రానిస్తున్నాను?’ అని తనని తాను మందలించుకుంది. ‘చివరకు మనసు ఇలా దారి తప్పడం కూడా పాపమే.’ తాను పదేపదే విన్న ప్రసంగాలు ఆమె మెదడులో ప్రతిధ్వనించాయి:

“హృదయము అన్నిటికంటే మోసకరమైనది.” పెదవులను గట్టిగా బిగించుకుంది, అలా చేయడం వల్ల మనసులోని ఆలోచనలను కూడా ఆపవచ్చన్నట్లుగా.

అనుకోకుండా ఒక జ్ఞాపకం తట్టింది – సాయంత్రం వేళ అమ్మ తనని మెల్లగా పిలవడం, దగ్గరకు తీసుకుని జడ వేస్తూ కబుర్లు చెప్పడం, తల్లీకూతుళ్ల మధ్య ఉండే ఆ చిన్నపాటి అనురాగం. వెంటనే మరో దృశ్యం: ఏళ్ల క్రితం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మ, మెరిసిపోయే చీర కట్టుకుని, నుదుటన కుంకుమతో, జడలో పూలతో, అగరబత్తుల సువాసనల మధ్య కనిపిస్తోంది. తన ప్రపంచంలో తాను ఎంతో ఆత్మవిశ్వాసంతో, నైవేద్యాలు సిద్ధం చేస్తున్న అమ్మ రూపం ఆమె కళ్ల ముందు కదిలింది. ఆ దృశ్యం ఎంతో స్పష్టంగా, కాంతివంతంగా ఉంది, కానీ ఫెలోషిప్ (సంఘం) వారు అమ్మ గురించి చెప్పే మాటలకు అది ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఆ జ్ఞాపకం ఎంత బలంగా ఉందంటే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రూత్ ఆ జ్ఞాపకాన్ని దిగమింగుతూ, ఫెలోషిప్ వారు నేర్పిన సాక్ష్యం ప్రకారం దానిని మార్చుకోవడానికి ప్రయత్నించింది. తన తల్లి ఇప్పుడు కొత్తగా జన్మించిందని, ఆమె నవ్వు కూడా ఇప్పుడు భగవంతుడికే సొంతమని తనకు తాను చెప్పుకుంది. అయినా, ఆ జ్ఞాపకం ఆమెను లాగుతూనే ఉంది, రక్షణ అనే నలుపు-తెలుపు చట్రంలో ఇమడలేని ఎన్నో రంగులతో ఆ జ్ఞాపకం సజీవంగా ఉంది.

జారిపోతున్న ఆ జ్ఞాపకాల తునకలను ఆపుకోవడానికి ఆమె చేతులు జోడించింది. కారిడార్‌లో వినిపిస్తున్న ప్రార్థనా గీతం నెమ్మదిగా సాగుతోంది – అది భక్తులకు ఓదార్పునిచ్చేలా ఉంది, కానీ ఆమెను మాత్రం మరింత క్రుంగదీస్తోంది. ఇతరులకు అది ఒక భరోసా, కానీ ఆమెకు మాత్రం తాను ఎలా ఉండాలో, నిజంగా ఎలా ఉందో మధ్య ఉన్న అగాధాన్ని గుర్తుచేస్తోంది.

ఆమె బయటికి కనిపించనివ్వని ఆ మానసిక సంఘర్షణకు గుర్తుగా, ఆమె వేళ్లలో చిన్న వణుకును రాజేష్ గమనించాడు. ఒక్క క్షణం అతనికి జాలి కలిగింది, ఆమె భారాన్ని తగ్గించాలన్న కోరిక కలిగింది – కానీ దానిని తనలోనే అణచుకున్నాడు. ఫెలోషిప్ మార్గం ఇప్పటికే నిర్ణయించబడింది, ఆమె తీసుకున్న నిర్ణయంలో తాను జోక్యం చేసుకోకూడదని అనుకున్నాడు.

కారిడార్ నుండి ప్రార్థనా గీతం మరింత బిగ్గరగా వినిపించింది – మెల్లని స్వరాలన్నీ కలిసి ఒకే రాగంగా మారాయి. ఆ శబ్దం అటు ఓదార్పునిస్తూనే, ఇటు ఒత్తిడి తెస్తోంది, ఆమె లోబడాలని నిర్ణయించుకున్న ఆ క్రమశిక్షణను గుర్తుచేస్తోంది. రూత్, తనను తాను మరోసారి ఆ కట్టుబాట్లలోకి బిగించుకుంది.

రూత్ కళ్లు మూసుకుని, తన సందేహాలన్నీ ఆ సంగీతంలో మునిగిపోయేలా చేసుకుంది. ఆమె నిటారుగా కూర్చుంది, బయటికి ప్రశాంతంగా కనిపిస్తోంది.

(ఇంకా ఉంది)

Exit mobile version