Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నమ్మకం-3

[మేరీ సురేష్ అయ్యర్, డా. బొమ్మరాజు సారంగపాణి గార్లు సంయుక్తంగా రచించిన ‘నమ్మకం’ అనే పెద్ద కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 3వ భాగం.]

అధ్యాయం 8

అయినా, వారు ఆమెను మోస్తూనే ఉన్నారు

రాజేష్ శామీని పక్కకు పిలిచి రహస్యంగా అడిగాడు, “శ్యామూ, హాస్పిటల్ పేపర్లలో ‘వారసుల’ (Next of kin) దగ్గర ఎవరి పేరు ఉంది?”

“మమ్మీ పేరు అనుకుంటా,” శామీ సమాధానమిచ్చాడు.

రాజేష్ అసహనంతో గొణుక్కున్నాడు. “సరే, ఆమెతో ‘అభ్యంతర పత్రం’ మీద సంతకం చేయించాలి. చట్టబద్ధంగా మృతదేహాన్ని గుంటూరుకు తరలించాలంటే అది తప్పనిసరి.”

వారు రూత్‌ దగ్గరకు వెళ్ళారు. రాజేష్‌కి ఆ పేరుతో ఆమెను పిలవడం ఇష్టం లేదు. ‘రూత్’ అనేది చర్చి ఆమెకు ఇచ్చిన పేరు. తన ప్రియమైన మేనత్త నాగమ్మ కూతురి అసలు గుర్తింపుపై కప్పబడిన పొర అది. నాగమ్మలాగే రాజేష్ కూడా ఆ పేరును ఎప్పుడూ అంగీకరించలేదు.

అతని దృష్టిలో ఆమె ఇంకా పెరట్లో నాగమ్మకు మసాలా నూరడంలో సహాయం చేస్తూ, జడలు గట్టిగా అల్లుకునే ఆ పాత అమ్మాయే. కానీ ఇప్పుడు చర్చి ప్రభావంతో రూపం మార్చుకుని, పేరు మార్చుకుని ఎవరో కొత్త వ్యక్తిలా తిరిగి వచ్చిన ఈ స్త్రీ కాదు. ఆమె తను గతంలో ఎరిగిన ఒక వ్యక్తి యొక్క ఛాయలా ఉంది. చర్చికి లొంగిపోవటంతో ఆమెలోని చైతన్యం మొద్దుబారిపోయింది. అయినా, ఆ వేషధారణ పొరల కింద ఇంకా ఏదో పాత పరిచయం కనిపిస్తూనే ఉంది. ఆమె మాటల్లో కాదు, ఆమె దాచుకున్న మౌనంలో అది తెలుస్తోంది.

ఆమె హాస్పిటల్ లాబీలోని ఒక మూలలో కూర్చుని ఉంది. కళ్లు శూన్యంగా ఉన్నాయి, చేతులు ఒడిలో ముడుచుకుని ఉన్నాయి. ఆమె ముఖంలో ఎటువంటి భావం లేదు – ప్రశాంతత లేదు, కోపం లేదు, కనీసం దుఃఖం కూడా లేదు. ఎక్కడో ఉన్నట్టుగా ఉంది.

రాజేష్ నిశ్శబ్దంగా ఆమె దగ్గరకు వెళ్లాడు. “మనం కొన్ని ఫారమ్‌లపై నీ సంతకం తీసుకోవాలి. బాడీని తరలించడానికి,” అని మామూలు స్వరంతో అన్నాడు.

ఆమె మెల్లగా కళ్లు ఆర్పింది. “అంటే ఇక నిర్ణయమైనట్టేనా – గుంటూరుకేనా?”

“అవును,” రాజేష్ బదులిచ్చాడు. “డేవిడ్ గారితో ముందే మాట్లాడాను. ఆయన ఇప్పటికే పాల్ పీటర్‌తో మాట్లాడాడు. అన్నీ సిద్ధమయ్యాయి.”

ఆమె కారిడార్ అవతల ఉన్న డేవిడ్ వైపు చూసింది. ఆయన అప్పుడే మృతదేహాన్ని తరలించే ముందు ప్రార్థన చేయమని అక్కడున్న వాళ్ళతో చెబుతున్నాడు. ఆమె మళ్ళీ రాజేష్ వైపు తిరిగింది, ఆమె పెదవులు గట్టిగా బిగించి ఉన్నాయి. ఆమె లోపల ఏదో కదిలింది – ఏదో నిరసన తెలపాలని, తన అధికారాన్ని చాటుకోవాలని అనిపించింది.

ఆమె తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి ఆధార్ కార్డు కోసం వెతికింది, ఆమె వేళ్లు వణుకుతున్నాయి. రాజేష్ ఆ సంఘర్షణను గమనించాడు, కానీ తనను తాను నిలదొక్కుకున్నాడు; సమయం తక్కువగా ఉంది, ఇప్పుడు ఓదార్పులకు చోటు లేదు – సంతకాలు కావాలి, అంబులెన్స్ ఆలస్యం కాకూడదు.

సాయంత్రం 4 గంటలకల్లా నాగమ్మ మృతదేహాన్ని మార్చురీ నుండి బయటకు తీసుకువచ్చారు. తెల్లటి నూలు వస్త్రంతో చుట్టి, స్థానిక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ సరఫరా చేసిన ఒక సాదా శవపేటికలో ఉంచారు.

ఆ శవపేటిక కింద ఒక బైబిల్ వాక్యం రాసి ఉంది: “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది.” – కీర్తనలు 116:15.

రాజేష్ అది చదివి, ఒక్క క్షణం కళ్లు ఆర్పాడు, కానీ ఏమీ అనలేదు. ఆ వాక్యం ఆమె కోసం రాసింది కాదు. అది అక్కడ ఉన్న వారి కోసం – ఆమె జీవితాన్ని ఒక మతపరమైన సాక్ష్యంగా మార్చాలనుకుంటున్న వారి కోసం. కానీ రాజేష్‌కు ఇప్పుడు కోపగించుకునే సమయం లేదు. చక్రం తిరగడం మొదలైంది, అతను అందరికంటే ముందుండాలి.

అంత్యక్రియలు గుంటూరులో ఉంటాయని డేవిడ్ ప్రకటించిన వెంటనే, రాజేష్ నిశ్శబ్దంగా ఒక ఫోన్ చేశాడు. శారద కారులో ముందుగానే బయలుదేరుతుంది. ఆమె అందరికంటే కొన్ని గంటల ముందే అక్కడికి చేరుకుంటుంది – ఇల్లు తెరిచి, పొయ్యి వెలిగించి, గడప ఊడ్చి, బయట తప్పుడు ప్రచారం జరగకముందే పొరుగువారితో మాట్లాడటానికి ఆమెకు సమయం దొరుకుతుంది. అతనికి ఆమె మీద పూర్తి నమ్మకం ఉంది.

ఆమెకు ఆ నిబ్బరం, లౌక్యం ఉంది, అన్నింటికంటే ముఖ్యంగా మనుషులతో సంబంధాలు ఉన్నాయి. శారద ఎప్పుడూ గొంతు పెంచదు, అందరి దృష్టిని ఆకర్షించదు. ఆమెకు దాని అవసరం లేదు. అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. అందుకే ఆమె మాట వింటారు.

ఇన్నేళ్లుగా ఆమె అతనికి ఒక అండగా నిలిచింది. రాజేష్ నాగమ్మ కోసం చేసిన దాంట్లో పదో వంతు కూడా శారద లేకుండా చేయలేకపోయేవాడు. అది కేవలం ఆమె పనులు చేయడం వల్ల కాదు, ఆమె చేసే పద్ధతి వల్ల – ఎప్పుడూ బాధ్యత అనుకోలేదు, ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

ఆమె నాగమ్మను ఎప్పుడూ ఒక భారంలా చూడలేదు. వారి మధ్య బంధం చాలా సహజంగా పెరిగింది. నాగమ్మ కథలు చెబుతుంటే విసుగు పడకుండా వినడం, ఆమె అలసిపోయినప్పుడు కొంచెం స్ట్రాంగ్‌ కాఫీ ఇవ్వడం, ఏ జాకెట్ కుట్టించాలో, ఇంట్లో ఏ పప్పులు అయిపోయాయో గుర్తుంచుకోవడం – ఇలాంటి చిన్న చిన్న పనులతోనే ఆ బంధం పెరిగింది.

నాగమ్మకు ఆమె అంటే ప్రాణం. శారదలో ఆమె ఒక కూతురిని చూసుకుంది. శారద కూడా అంతే గౌరవంతో, ప్రేమతో ఆమెను చూసుకుంది. ఉదయం నడకలు, వంటింట్లో ముచ్చట్లు, పనులు ముగిశాక సాయంత్రం వేళల్లో చెప్పుకునే కబుర్లు – ఇవే వారి ప్రపంచం.

శారదను ముందుగా పంపడం ద్వారా రాజేష్ కేవలం ఏర్పాట్లు చేయడం లేదు. నాగమ్మ జ్ఞాపకాలను ఎవరూ మార్చలేని ఒక చోటును ఆమె సిద్ధం చేస్తుంది.

శవపేటికను అంబులెన్స్‌లోకి ఎక్కించి, హాస్పిటల్ అలజడి తగ్గి, ఇంజిన్ శబ్దం మొదలైనప్పుడు రాజేష్‌కు మనసు కుదుట పడింది. గుంటూరులో శారద అన్నీ సిద్ధం చేస్తోంది, పక్కన శ్యామూ ఉన్నాడు – తను ఒంటరి కాదు.

వారిద్దరూ అంబులెన్స్ వెనుక భాగంలో కూర్చున్నారు – వారి మోకాళ్లు శవపేటికను తాకుతున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్‌లో అంబులెన్స్ ముందుకు సాగుతుంటే, ఆ ఇరుకైన చోటే వారికి ఒక రకమైన ఉపశమనాన్ని ఇచ్చింది. శామీ ఇక్కడ ఎవరికీ వివరణ ఇచ్చుకోనవసరం లేదు. రాజేష్‌కు ఎవరినీ ఒప్పించాల్సిన పని లేదు. తమ కళ్లముందే ఏదో కోల్పోతున్నామని ఇద్దరికీ తెలుసు, దాన్ని వదులుకోవడానికి ఇద్దరూ ఇష్టపడటం లేదు.

ఆ రోజంతా బిగబట్టిన శ్వాసను శామీ మొదటిసారిగా వదిలాడు. వారు ఇంకా ఆ కష్టాల్లోనే ఉన్నారు – కానీ కనీసం, ప్రస్తుతానికి ఇద్దరూ కలిసే ఉన్నారు.

రూత్ మౌనంగా చర్చి బృందంతో కలిసి ఒక ఎస్‌యూవీ (SUV) కారులో ఎక్కింది. వారు అప్పుడే మెల్లగా ప్రార్థనా గీతాలు ఆలపించడం మొదలుపెట్టారు.

అంబులెన్స్ హాస్పిటల్ గేట్లు దాటి హైదరాబాద్ ట్రాఫిక్‌లోకి ప్రవేశించినప్పుడు, రాబోయే సవాళ్ల గురించి రాజేష్‌కు అర్థమైంది. నాగమ్మ వారసుడు పక్కన ఉన్నాడన్న ధైర్యం రాజేష్‌ది. రాజేష్ పక్కన కూర్చున్న శామీకి కూడా మనసు కుదుట పడింది అది ఉపశమనం కాదు, శాంతి కాదు, కానీ ఒక భరోసా. చుట్టూ అన్నీ వేగంగా మారిపోతున్నా, రాజేష్ పెద్దనాన్న రూపంలోతను ఒక బలమైన పునాదిని పట్టుకున్నానన్న భావన కలిగింది.

అధ్యాయం 9

స్వంత మూలాలకు

రాజేష్ తన ఫోన్ వైపు చూశాడు. శారద నుండి ఒక కొత్త మెసేజ్ వచ్చింది.

“ఏమండీ.. కొందరు చుట్టాలు వచ్చారు. తెనాలి, మాచెర్ల నుండి వచ్చిన వాళ్ళు పాత ఇంట్లో అన్నీ సిద్ధం చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు.. చర్చి వాళ్ళు.. అప్పుడే రావడం మొదలుపెట్టారు. అర్ధరాత్రి ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నారు. కాంపౌండ్ బయట టెంట్ వేశారు, స్పీకర్లలో పాటలు పెడుతున్నారు.”

శామీ నావైపు చూస్తూ “ఏమైంది?” అని ప్రశ్నించాడు.

రాజేష్ కాసేపు ఆగి, అతని వైపు చూస్తూ, “అప్పుడే మొదలైంది,” అన్నాడు.

“వాళ్లు చాలా వేగంగా ఉన్నారు. స్పీకర్లు, ప్రార్థన సంగీతం, టెంట్ కూడా వేసేశారు. శారద చెప్పింది, కాంపౌండ్ బయట టెంట్ వేశారట. అప్పుడే పాటలు కూడా మొదలుపెట్టారు.”

శామీ దవడలు బిగించాడు. “వాళ్ళు కనీసం ఆగలేదు.”

శామీ వెంటనే స్పందించలేదు. అతని కళ్లు ముందున్న రోడ్డుపైనే ఉన్నాయి.

“అయితే మనం వారికి ఒక్క క్షణం కూడా అవకాశం ఇవ్వకూడదు,” అన్నాడు చివరికి.

రాజేష్ తల ఊపాడు. “శారద లోపల అంతా చక్కదిద్దుతోంది. మనవాళ్లు గదిని సిద్ధం చేస్తున్నారు. గడపలు కడిగి, దీపాలు వెలిగిస్తున్నారు. కానీ బయట మాత్రం అప్పుడే టెంట్ తయారైపోయింది.”

రాజేష్ తన చొక్కా జేబులో నుండి మడతపెట్టిన ఒక కాగితం తీసి బయటకు తీశాడు. “నాగమ్మ అత్త రాసినది. రెండేళ్ల క్రితం నాకు ఇచ్చింది.”

శామీ వణికే వేళ్లతో దాన్ని అందుకున్నాడు. ఆమె చేతిరాత అతనికి స్పష్టంగా కనిపిస్తోంది:

“నన్ను గుంటూరు తీసుకెళ్లండి. నాకంటే ముందు వెళ్ళిన వారిలాగే నన్ను దహనం చేయండి. సమాధులు వద్దు, సిలువలు వద్దు. అబద్ధాలు అసలే వద్దు – నాగమ్మ”

శామీ ఆ అక్షరాల వైపు చాలా సేపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత చూసి మళ్ళీ ఆమె గొంతు విన్నట్లు అనిపించింది. దుఃఖం పొంగుకొచ్చింది, ఆమె దీన్ని నిరాశతో రాయలేదు, స్పష్టతతో రాసింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అతనిదే.

“ఇలాజరుగుతుందని నాగమ్మకు ముందే తెలుసు” అన్నాడు రాజేష్.

శామీ తలెత్తి చూశాడు. “అయితే మనం వెనక్కి తగ్గేది లేదు.”

“మనం వెళ్ళగానే ఆమెను లోపలే ఉంచుదాం. నువ్వు, నేను ఆ శవపేటిక పక్కనే ఉంటాం.”

అంబులెన్స్ హైవే నుండి మళ్ళీ లోపలికి తిరిగింది. కిటికీల నుండి దుమ్ము మరియు పేడ వాసన వస్తోంది. అది పరిచయమున్న నేల. రాజేష్ శవపేటికపై ఒక్కసారి తట్టాడు.

“మనం వచ్చేసాం అత్తా,” అని మెల్లగా అన్నాడు. “అంతా సరిగ్గానే చేస్తాం. నీకు మాట ఇస్తున్నాను.”

శామీ కూడా రాజేష్ చేతి పక్కనే శవపేటికపై తన చేయి వేశాడు.

ఒక నిశ్శబ్ద ఒప్పందం. ఒక జరుగబోయే ఘట్టానికి సరిహద్దు రేఖ నిశ్శబ్దంగా గీయబడింది.

వాహనం గుంటూరు పొలిమేరలకు చేరుతుంటే, శామీ మౌనంలోకి జారిపోయాడు. పరిసరాలు పరిచయమున్నవే, కానీ అతని ఆలోచనలు జ్ఞాపకాల్లోకి వెళ్ళి పోయాయి.

అతనికి ఒక రాత్రి గుర్తువచ్చింది – అతనికి అప్పుడు పన్నెండు లేదా పదమూడేళ్లు ఉంటాయి. మరుసటి రోజు వచ్చే తన తల్లి కంటే ముందే అతను నాగమ్మతో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఆ సమయంలో తన తల్లి ఆంక్షలు లేకుండా నాగమ్మతో గడిపే అవకాశం అతనికి దక్కింది. ఆ సాయంత్రం ప్రార్థనల తర్వాత, దీపం వెలుగులో నాగమ్మ అతన్ని దగ్గరకు తీసుకుని ఒక కథ చెప్పింది – అగ్ని పుత్రులను కాపాడే నదీ దేవత కథ. ఆ దేవత ఎలా ప్రవహిస్తుందో, ఎలా మన కోరికలను అలలపై తీసుకెళ్తుందో, నీటిపై చిన్న చిన్న దీపాలు నక్షత్రాల్లా ఎలా మెరుస్తాయో చెప్పింది. అప్పుడు అతనికి ఆ కథ అర్థం కాకపోయినా, ఆమె గొంతులోని ఓదార్పు, అతని తలపై ఉన్న ఆమె చేయి బరువు అతనికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ఇల్లు ఎంతో వెచ్చగా, భయం లేకుండా ఉండేది.

కానీ మరుసటి రోజు ఉదయానికి వాతావరణం మారిపోయింది. రూత్ వస్తుందని తెలిసి, ఇంట్లో అన్నీ మారిపోయాయి. గడప దగ్గర వెలుగుతున్న దీపాన్ని పక్కకు పెట్టడం, తన తల్లి రాకముందే అగరుబత్తీల వాసన రాకుండా చేయడం శామీ గమనించాడు. ఆ ఇల్లు కూడా తన మూడ్‌ని మార్చుకున్నట్టు అనిపించింది. అప్పుడు అది సాధారణ విషయమే అనుకున్నాడు, కానీ నాగమ్మ ఇదంతా ఎంత నేర్పుగా చేసేదో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. ఒక్క పసుపు రేణువు కూడా బయటపడకుండా, దీపం నీడ కూడా కనిపించకుండా ఆమె జాగ్రత్త పడేది. రూత్‌ను తనకు దూరం చేసే ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని ఆమె ఇదంతా చేసేది.

రూత్ ఆ ఇంట్లోకి ఎప్పుడూ నమ్మకం లేని వ్యక్తిలాగే వచ్చేది. ఆమె నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె చూపులు మూలల్లో, అలమరల్లో ఏదో వెతుకుతున్నట్టు ఉండేవి. ఆమె అసౌకర్యం మాటల్లో చెప్పకపోయినా అర్థమైపోయేది.

నాగమ్మ ఆ అసౌకర్యాన్ని ఏళ్ల క్రితమే గ్రహించింది. అందుకే ఆమె తన పద్ధతులను వదులుకోకుండా, శామీ దగ్గర ఉన్నప్పుడు వాటిని చాలా సున్నితంగా మార్చుకునేది. అది ఎప్పుడూ అవమానంగా భావించలేదు. అది గొప్ప ప్రేమకు చిహ్నం.

శామీ ఇప్పుడు ఆ ప్రేమను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. తాను దేనికి చెందినవాడో తెలియని సందిగ్ధంలో ఉన్నా, ఇల్లు దగ్గర పడుతుంటే ఆ మంచుతెరలు తొలగిపోతున్నాయి.

ఆమె అతన్ని దేనికీ దూరం చేయలేదు. అతను స్వయంగా అటువైపు వస్తాడని ఆమె నిశ్శబ్దంగా ఎదురుచూసింది.

వాహనం కదులుతుంటే అతను సీటుకు ఆనుకుని కూర్చున్నాడు. ఎవరూ చెప్పకపోయినా, తను దాటకూడని ఒక గీత ఉందనే విషయం చిన్నప్పుడే అతనికి అర్థమైంది. అది భయంతో గీసిన గీత. ఇప్పుడు ఆ గీత మళ్ళీ స్పష్టంగా కనిపిస్తోంది – కానీ ఈసారి శామీ ఆ గీతను దాటాడు.

పాత ఇల్లు లోపల అంతా సిద్ధమవుతుంటే, బయట చర్చి టెంట్ హడావిడి మొదలైంది. లోపల ఆమె నిజమైన వ్యక్తిత్వానికి వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు జరుగుతుంటే, బయట ఆమెను మరో రకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

నాగమ్మ వ్రాసినది చదివినప్పటి నుండి మాట్లాడకుండా ఉన్న రాజేష్ వైపు శామీ చూశాడు.

“మనం ఆమె పక్కన నుండి కదిలేదే లేదు” అన్నాడు శామీ.

రాజేష్ గట్టిగా తల ఊపాడు. “వాళ్ళు ఎంత అరిచినా పర్లేదు. కానీ మనం గట్టిగా నిలబడదాం..”

అధ్యాయం 10

ఆచారాల సాక్షిగా

బయట అలజడి పెరుగుతున్నా, గుంటూరు ఇల్లు నాగమ్మ కోసం నిరీక్షిస్తూ నిశ్శబ్దంగా నిలుచుంది.

గడపపై ముగ్గు లేదు. తోరణాలు, పూలమాలలు లేవు. ఇది తనవారిని చివరిసారిగా ఆహ్వానించడానికి వేచి ఉన్న ఇల్లు.

ఆమె రాకకు అవసరమైనవి మాత్రమే ఉన్నాయి.

లోపల, ఒక తెల్లటి నూలు వస్త్రాన్ని పరిచారు. దానిపై ఒక వెదురు చాప ఉంది. తల వైపున ఉన్న ఒక ఇత్తడి పళ్ళెంలో తులసి దళాలు, కర్పూరం, మామిడి ఆకు ఉన్న చిన్న నీళ్ల లోటా, దాని పక్కనే ఎంతో జాగ్రత్తగా ఉంచిన ఒక రుద్రాక్ష మాల ఉన్నాయి. చాప కింద ఆమె పాత చెప్పులు ఉంచారు – అరిగిపోయి, ఆమె పాదాలకు అలవాటైనట్టుగా ఉన్నవి.

ఆమె స్వయంగా ఎంచుకున్న నూలు చీర – తెల్లగా, ఎటువంటి జరీ లేకుండా, ఎప్పుడో పడిన చిన్న పసుపు మరకతో ఉన్నది – మడత విప్పి సిద్ధంగా ఉంచారు.

“ఆమె ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేది,” అని ఒక ముసలావిడ అంది. “తప్పకుండా చేసేది. సూర్యుడు అస్తమించగానే దీపం వెలిగించి, జప మాల పట్టుకుని భజనలు చేసేది..”

“నాగక్కకు ఎప్పుడూ ఎటువంటి సందేహం లేదు,” అని మంగమ్మ అనే పెద్దమ్మ కూతురు తువ్వాలు మడతపెడుతూ అంది. “ఆమె ఎవరో వేసిన దారిలో వెళ్లలేదు. మన అమ్మమ్మల నుండి, మన నేల నుండి వచ్చిన సంప్రదాయాన్నే ఆమె అనుసరించింది.”

“ఆమెకు పెద్దగా ఏమీ అవసరం లేదు,” అన్నాడు దాసన్న. “ఆమె దీపం, ఆమె జప మాల, గోడపై ఉన్న అమ్మవారి లేదా కులదైవం సుబ్రహ్మణ్యస్వామి పటం – అవే ఆమెకు చాలు. ఆమె ఎక్కడికి వెళ్లినా, వాటి కోసం ఒక చోటును కేటాయించేది. హైదరాబాద్‌లోని ఆ ఫ్లాట్‌లో కూడా అలాగే చేసింది.”

“ఆమె పని చేస్తూ భజనలు పాడేది,” అని కమలమ్మ అనే మేనకోడలు అంది. “పాత పాటలు. తన తల్లి నుండి, వాళ్ళ అమ్మమ్మ నుండి నేర్చుకున్నవి. ఆ పాటలకు కాగితం అక్కర్లేదు. ఆమె శరీరంలోనే ఆ పాటలు ఉండేవి.”

“ఆమెకు ప్రతి తిథి తెలుసు,” అని మంగమ్మ అంది. “తమ పూర్వీకుల నుండి నేర్చుకున్నదాన్నే ఆమె పాటించింది. చుట్టూ ఉన్న మనుషులు మారారని ఆమె మారలేదు. ‘ఇది మనది. ఇదే నన్ను నిలబెట్టింది’ అని ఆమె చెప్పేది.”

ఒక పెద్దాయన “ఆమెకు అది ఎంత కష్టమైందో తెలుసా? ఆమె కూతురు మతం మారిన తర్వాత, ఇక్కడ గుసగుసలు, సందేహాలు మొదలయ్యాయి. కొందరు పొరుగువారు ఆమె పద్ధతులపై ప్రశ్నలు వేశారు. కానీ మన కుటుంబం – మేము ఎప్పుడూ ఆమెను వదలలేదు. ఆమె వాటన్నింటినీ తల ఎత్తుకుని ఎదుర్కొంది, తను నమ్మిన దాన్ని ఒక్కసారి కూడా వదులుకోలేదు.” అన్నాడు

“తన దేవుళ్లకు ఆ ఇంట్లో చోటు ఉండేలా చూసుకుంది – కనీసం వారి పేర్లు కూడా ఉచ్చరించని ఆ ఇంట్లో కూడా,” అన్నాడు రాఘవయ్య తన పంచె సర్దుకుంటూ.

“అది ఎవరినో వ్యతిరేకించడానికి కాదు. తను ఎవరో అలాగే ఉండటానికి.”

“ఆమె ఒకసారి నాతో చెప్పింది,” అని ఒక మేనకోడలు అంది,

“నేనెందుకు మతం మారాలి? నాకేం తక్కువ అయిందని? నన్ను నాలాగే ఉండనివ్వు. అది ఒంటరి ప్రయాణమైనా సరే.”

ద్వారం దగ్గర కూర్చున్న సుబ్బమ్మ చివరికి మాట్లాడింది. “రాములు మామయ్య చనిపోయినప్పుడు నాగమ్మ అత్త చలించలేదు. ఆమె దుఃఖించింది, కానీ కుంగిపోలేదు. ‘నా మార్గం ముగియలేదు – అది ఇప్పుడు కొంచెం నిశ్శబ్దమైంది అంతే’ అని చెప్పింది.

“ఆమె తన దేవుళ్లను, తన పద్ధతులను – ఆరని అగ్నిలా పట్టుకుంది.” అని మంగమ్మ నిట్టూర్చింది.

బయట, చర్చి టెంట్ హడావిడి పెరిగింది. మైక్ శబ్దం వినిపించింది. ఎవరో దాన్ని తట్టి పరీక్షించి, ప్రార్థన గీతాలు మొదలుపెట్టారు, లైట్లు వెలిగాయి.

లోపల, ఎవరో ఇత్తడి పళ్ళెంలోని తులసి ఆకులను మెల్లగా చీర కొంగుతో తుడుస్తూ సర్దుతున్నారు. మరో బంధువు మల్లెపూలను మాలగా కడుతోంది. ఆ పరిమళం జ్ఞాపకంలా వ్యాపిస్తోంది.

బయట, క్లిప్‌బోర్డ్ పట్టుకున్న ఒక యువకుడు వాలంటీర్లకు కుర్చీలు వేయమని చెప్తున్నాడు. “సంగీతం మొదలయ్యాక ఇంకా చాలా కుర్చీలు కావాలి. గుంటూరు జనం పాటలకు బాగా స్పందిస్తారు.”

బయట, టెంట్ పైన ఒక పెద్ద బ్యానర్ కట్టారు – దానిపై పెద్ద అక్షరాలతో ఉంది: ఆయన చివరి శ్వాసను కూడా విమోచిస్తాడు.

“నాగమ్మ కూతురు మాకు అనుమతి ఇచ్చారు,” అని మైక్‌లో ఒక స్వరం వినిపించింది. “ఆమె చివరలో క్రీస్తులో శాంతిని పొందింది. ఇక మనం ఈ ప్రార్థన సభను మొదలుపెడదాం – పాటలు, లేఖనాలు, సాక్ష్యాలు.”

గళ్ళ చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి మరొకరితో ఇలా అంటున్నాడు, “ఈ ఇల్లు చాలా బాగుంది. కొన్ని మార్పులు చేస్తే వారానికోసారి ప్రార్థనకూటాలు పెట్టుకోవచ్చు. వరండాలోనే యాభై మంది పడతారు.”

లోపల, ఎవరో అగరుబత్తి వెలిగించారు. ఆ పొగ మెల్లగా పైకి లేస్తోంది. నాగమ్మకు ఆ వాసన అంటే ఇష్టం కాబట్టి మల్లెపూల మాలలు లోపలికి తెచ్చారు. చాప పక్కన ఒక తెల్లటి తువ్వాలు పరిచారు, మరొకరు ఆమె చీర మడతలను జాగ్రత్తగా సర్దుతున్నారు.

గదిలోకి టెంట్ నుండి వస్తున్న శబ్దం వినడానికి కష్టంగా ఉంది – అది చాలా బిగ్గరగా, ఆ సమయానికి తగని ఉత్సాహంతో ఉంది. అప్పుడు ఎవరో మెల్లగా అన్నారు, “మనకు ఎటువంటి గొడవ వద్దు. ఇప్పుడు వద్దు. ఆమె వయసుకి, ఆమె మరణానికి అది గౌరవం కాదు.”

“గొడవా?” శారద లోపలికి వచ్చి తన నూలు చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ అంది. “ఆమె పరిపూర్ణమైన జీవితం గడిపింది. నిజాయితీ గల జీవితం. ఒకవేళ అక్కడ గొడవ జరిగితే, అది వేరే వాళ్లు బలవంతంగా చేస్తున్న గొడవ. మన వల్ల కాదు.”

“ఆమె మా పెద్దమ్మ,” అని ద్వారం దగ్గర ఉన్న ఒక తమ్ముడి కొడుకు అన్నాడు. “పూడ్చిపెట్టడానికి ఆమె వాళ్ల మనిషి కాదు. ఏళ్ల తరబడి ఈ ఇంటిని ఆమె నిలబెట్టింది.”

అందరూ తలలు ఊపారు, అవునన్నట్టుగా గుసగుసలాడారు. సాధారణంగా ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండే పెద్దలు కూడా గేటు వైపు చూశారు. వారిలో ఒకరైన లక్ష్మయ్య గొంతు సవరించుకుని, “మనం దుఃఖాన్ని రకరకాలుగా పంచుకున్నాం. కానీ ఇది – ఈ శబ్దం, ఈ అధికారం – ఇది సరికాదు. కనీసం ఈ రోజున ఇది తగదు,” అన్నాడు.

బయట శబ్దం మళ్ళీ పెరిగింది – కోరస్ పాటలు, తంబురా శబ్దాలు, మైక్‌లో ఒక పాస్టర్ అందరినీ రమ్మని పిలుస్తున్న గొంతు.

“ఆమెకు ఎవరి ఆమోదమూ అక్కర్లేదు,” అని శారద అంది. “ఆమె తను ఎలా ఉందో అలాగే జీవించింది. ప్రతి పూజ, ప్రతి ఆచారం – అది ఆమె స్వంతం. అరువు తెచ్చుకున్నది కాదు. దాచుకున్నదీ కాదు.”

ఆమె అసలు బంధువులు అందరూ ఆమెను తిరిగి తన మూలాల్లోకి చేర్చడానికి సిద్ధమయ్యారు.

ఆమెను మలిచిన ఈ నేలలోకి.

ఆమె పేరు పెట్టి పిలుచుకున్న దేవుళ్ల దగ్గరకు.

ఆమె ఎన్నడూ వదలని ధర్మం వైపు.

వీళ్ళ ప్రయత్నాలు ఇలా సాగుతుండగా, బయట శబ్దం మాత్రం పెరుగుతూనే ఉంది.

అధ్యాయం 11

ఈ నేల, ఆమె సత్యం

గేటు ముందు అంబులెన్సు ఆగింది. బయట టెంట్ నుండి వస్తున్న సంగీతం ఇప్పుడు మరింత బిగ్గరగా వినిపిస్తోంది – చప్పట్లు, పాటలు పాడుతున్న గొంతులు .

శామీ మొదట బయటకు అడుగు పెట్టాడు. అతని పాదం ఆ ఎర్రటి మట్టిని తాకగానే, తానెప్పుడూ ఆ నేలను వదిలి వెళ్ళనట్టుగా అనిపించింది.

వ్యాన్ వెనుక నుండి, రాజేష్, మరో ఇద్దరు శవపేటికను జాగ్రత్తగా కిందికి దించారు.

వారు చాలా నిదానంగా, జాగ్రత్తగా కదిలారు. మరొకరు గడప వెంబడి పసుపు నీళ్లను చల్లారు.

లోపల ఉన్న మహిళలు నేలపై ఉన్న తెల్లటి దుప్పటిని సరిచేశారు. శరీరాన్ని లోపలికి తీసుకువచ్చి నేల మీద పడుకోబెట్టగానే, ఒక పెద్దావిడ ఆమె తల పక్కన దీపం పెట్టింది. తులసి ఆకులు , చిటికెడు విభూతిని ఉంచారు.

ఆమె ఇంటికి వచ్చింది.

శామీ చుట్టూ చూశాడు. ఆ ఇల్లు కేవలం ఈ క్షణం కోసమే కాదు, తన కోసమే ఊపిరి బిగబట్టి వేచి చూస్తున్నట్లు అనిపించింది. అతనికి సరిగా గుర్తులేని బంధువులు గౌరవపూర్వకంగా తలలు ఊపారు. కానీ అక్కడ కొంత దూరం కూడా ఉంది. అతను ఎక్కడో పెరిగిన వ్యక్తి. కేవలం కథల్లో మాత్రమే వినిపించే పేరు.

వారి చూపులు తనపై ఉండటాన్ని అతను గమనించాడు – అవి ప్రశ్నిస్తున్నాయి. అతను తమలో ఒకడిగా తిరిగి వచ్చాడా, లేక మరొక సువార్త, మరొక జీవనశైలి ఉన్న ప్రపంచంలో పుట్టిన వ్యక్తిగా వచ్చాడా అని వారు ఆలోచిస్తున్నట్లుంది. ధూపం వేయడం అంటే అనుమానంగా చూసే, భజనలను నిశ్శబ్దం చేసే ఇంట్లో పెరిగిన అబ్బాయి అతను.

ఒక చిన్న తమ్ముడు అతనికి నీళ్లు ఇచ్చాడు. అతను తీసుకున్నాడు. వారి వేళ్లు ఒకదానికొకటి తగిలాయి.

“నువ్వు నాన్నమ్మలాగే ఉన్నావు. అవే కళ్లు,” అన్నాడు ఆ తమ్ముడు.

శామీ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఏం చెప్పాలో అతనికి తెలియలేదు. కానీ అతనిలో ఏదో కదిలింది -ఎందుకంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఈ వ్యక్తుల గురించి, ఈ గొంతుల గురించి నాగమ్మ తరచూ చెప్పడం అతనికి గుర్తొచ్చింది. ఆమె గుంటూరు నుండి వచ్చిన ప్రతిసారీ, ఆమె ఎవరిని చూసింది, ఎవరు తన గురించి అడిగారు, వారు ఏం చెప్పారు అన్నది పేరుపేరునా చెప్పేది. రూత్ అతనిని ఇక్కడికి పంపడానికి ఇష్టపడేది కాదు; అతను ఈ ప్రపంచానికి అలవాటు పడటం ఆమెకు ఇష్టం లేదు.

అందుకే నాగమ్మ ఒక వారధిలా మారింది. తన మనుషుల సమాచారాన్ని మనవడికి, మనవడి విశేషాలను తన మనుషులకు చేరవేసేది. ఈ కుటుంబ పటంలో అతను మాయమైపోకుండా ఆమె చూసుకుంది.

అతను ఈ ప్రపంచానికి, ఇక్కడి వాసనలకు, పాటలకు, అర్థాలకు దూరంగా పెరిగాడు. ఇక్కడ సమయం కేవలం నెలల ద్వారా కాదు, తిథులు, వ్రతాలు, నైవేద్యాలు, స్మరణల ద్వారా లెక్కించబడుతుంది. ఇది ఆరాధనతో అల్లిన క్యాలెండర్, అపాయింట్‌మెంట్లతో కాదు. రూత్ అతన్ని దీనికి దూరం చేయడమే కాదు, పూర్తిగా వేరుచేసి ఉంచింది. హైదరాబాద్‌లోని రూత్ ఇంట్లో కూడా నాగమ్మ చాలా జాగ్రత్తగా ఉండేది. తన మనవడిని చూసే చిన్న అవకాశం కూడా ఎక్కడ పోతుందో అని ఆమె తన భక్తిని, తన వ్యక్తిత్వాన్ని దాచుకుని బతికింది.

ఇప్పుడు, ఈ ఇంటి ప్రశాంతతలో – ఆ వెలుగులు, ఇత్తడి పాత్రలు, జ్ఞాపకాలతో నిండిన గోడల మధ్య-శామీ తనకు తెలియని, కానీ అర్థం చేసుకోగలిగిన ఒక కొత్త భాషలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది.

ఎవరో ఒక చిన్న ఇత్తడి గిన్నెను తెచ్చి, దీపం దగ్గర జాగ్రత్తగా ఉంచారు. కిటికీ దగ్గర అగరుబత్తీ వెలిగించారు; ఆ పొగ నెమ్మదిగా పైకి పాకుతోంది.

ద్వారం దగ్గర రాజేష్ బయట వైపు చూస్తూ, “నాగమ్మ కూతురు నేర్చుకున్న మాటలతో వస్తుంది. కానీ మనం ధైర్యంగా, ప్రశాంతంగా ఉండాలి.”

బయట శబ్దం పెరిగింది. చప్పట్లు. హల్లెలూయా కేకలు. ప్రసంగం మొదలవుతున్న సూచనలు.

అప్పుడు అడుగుల శబ్దం వినిపించింది. చర్చి టెంట్ నుండి ముగ్గురు వ్యక్తులు గేటు దగ్గరకు వచ్చారు -ఒకరు వృద్ధుడు, ఒకరి చేతిలో ప్లాస్టిక్ ఫోల్డర్ ఉంది, మూడవ వ్యక్తి భుజాన చిన్న స్పీకర్ ఉంది. వారు రాజేష్, శామీల వైపు చూశారు.

“మేము ఆమెను బయటకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము,” అని ఆ వృద్ధుడు మర్యాదగా కానీ గట్టిగా చెప్పాడు. “టెంట్ కింద అంత్యక్రియల సేవకు ఏర్పాట్లు జరిగాయి. శవపేటిక కోసం బెంచ్, పూలమాలలు సిద్ధం చేశాం. ఖననం త్వరగా జరగాలి, ప్రజలు వేచి చూస్తున్నారు.”

శామీ మాట్లాడలేదు. రాజేష్ వైపు చూశాడు.

రాజేష్ ప్రశాంతంగా, కానీ కచ్చితంగా సమాధానమిచ్చాడు. “ఆమె ఈ ఇల్లు వదిలి వెళ్లదు. ఇది ఆమె స్థలం. హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయాలనే ఆమె జీవితకాల కోరికను మేము నెరవేరుస్తున్నాము.”

ఆ వృద్ధుడు ముందుకు వచ్చి, “డాక్టర్ రూత్ ప్రకారం, ఆమె తల్లి తన చివరి క్షణాల్లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆమె చివరి కోరిక క్రైస్తవ పద్ధతిలో ఖననం చేయబడటమే అని మాకు చెప్పారు,” అన్నాడు.

లక్ష్మయ్య మధ్యలో ప్రవేశించి, “మా దగ్గర కూడా ఆమె మాటలు ఉన్నాయి. స్వయంగా ఆమె రాసినవి. ఈ చర్చలన్నీ మొదలవ్వడానికి చాలా కాలం ముందే రాసినవి,” అన్నాడు.

కుటుంబంలోని ఒక పెద్దాయన ముందుకు వచ్చి, “మీరు ఒక కథ విని ఉండవచ్చు, కానీ మేము ఆమెతో కలిసి జీవించాము. ఆమె తన పద్ధతుల నుండి ఒక్కసారి కూడా పక్కకు తప్పలేదు,” అన్నాడు.

దాసన్న అనే మరో బంధువు చేతులు కట్టుకుని, “ఆమె ప్రతిరోజూ దీపం వెలిగించేది. ఉపవాసం ఉండేది. తన తల్లి నేర్పిన భజనలు పాడేది. చనిపోయే కొన్ని రోజుల ముందు ఇవన్నీ వదిలేసిందని మీరు అనుకుంటున్నారా?” అని ప్రశ్నించాడు.

మరొక యువకుడు, “మేము ఇక్కడ మతాల గురించి వాదించడానికి రాలేదు. కానీ ఆమె ఎవరో మాకు చెప్పకండి. మాకు తెలుసు,” అన్నాడు .

అక్కడ ఉన్నవారంతా తలలు ఊపుతూ ఏకీభవించారు. చర్చి మనుషులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారు ఇక పట్టుబట్టలేదు.

“మాకు గొడవలు వద్దు,” అన్నాడు ఆ పాస్టర్.

“అయితే గొడవ సృష్టించకండి,” అని రాజేష్ బదులిచ్చాడు.

ఆ వ్యక్తులు తిరిగి టెంట్ వైపు వెళ్ళిపోయారు.

అంతా సర్దుమణిగాక, ఒక మూల కూర్చున్న వృద్ధురాలు చేదుగా ఇలా అంది, “ఆమె కూతురు జీవితాంతం ఆమెను బాధపెట్టింది. బతికున్నప్పుడు ప్రశాంతత ఇవ్వలేదు – ఇప్పుడు చనిపోయాక కూడా ప్రశాంతంగా వెళ్లనివ్వడం లేదు.”

ఆ మాటలకు రాజేష్ మనసులో బాధపడ్డాడు. అతను శామీ వైపు చూశాడు. శామీ ముఖంలో ఎలాంటి భావం లేదు, కానీ అతని కళ్లలో ఏదో బరువు ఉంది. నాగమ్మ తరపున మాట్లాడిన ఆ మాటలు శామీని కుదిపేశాయి. రూత్ ఎన్ని తప్పులు చేసినా, ఆమె శామీ తల్లి. ఒకరి తల్లి గురించి అంత నిష్కర్షగా మాట్లాడటం విన్నప్పుడు ఎలా ఉంటుందో రాజేష్‌కు తెలుసు. అది నిజమే అయినా, అది గాయపరుస్తుంది.

అతను శామీ దగ్గరకు వెళ్లి, “వారి మాటలను మనసులోకి తీసుకోకు. వారు బాధలో, కోపంలో ఉన్నారు,” అని మెల్లగా అన్నాడు.

శామీ మెల్లిగా తల ఊపాడు. “వారు చెప్పింది తప్పు కాదు పెద్దనాన్నా! మా అమ్మ కేవలం నాగమ్మనే కాదు – తన తండ్రిని, తాతను కూడా బాధపెట్టింది. వారందరికీ ఆమె వెన్నుపోటు పొడిచింది. వీరు అతిగా చెప్పడం లేదు; ఆమె చేసిన పనుల జ్ఞాపకాలతోనే వీరు బతుకుతున్నారు. బహుశా ఆ నిజాన్ని ఎవరో ఒకరు స్పష్టంగా ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది,” అన్నాడు.

రాజేష్ అతని భుజంపై చేయి వేసి, “అయినా.. నువ్వు దీని మధ్యలో నలగకూడదు,” అన్నాడు.

“నేను ఎప్పుడూ మధ్యలోనే ఉన్నాను. బహుశా ఇప్పుడు నేను ఒక వైపు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు శామీ.

రాత్రి చాలా సుదీర్ఘంగా ఉంది.

బయట సంగీతం పెరుగుతుంటే, శామీలో ఒక రకమైన స్పష్టత స్థిరపడింది.

“నన్ను గుంటూరుకు తీసుకువెళ్లండి. నా పూర్వీకులలాగే నన్ను దహనం చేయండి. సమాధులు వద్దు.” అన్న నాగమ్మ మాటలు అతని అంతరాత్మలో నాటుకుపోయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version