[శ్రీ చిట్టాప్రగడ శ్రీరామ నరసింహ మూర్తి రచించిన ‘నమ్మలేని నిజం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
1967.
నాకు ఇరవై సంవత్సరాల వయస్సు.
సాయంత్రం 5 గంటలకి నాన్న చెప్పిన పనులన్నీ యరకాపురంలో ముగించుకుని పెదమల్లాపురం మునసబు గారి ఇంటికి చేరుకున్నాను. నౌకరు గంగులు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
“అబ్బాయి గారండీ పొద్దున్నుంచి మీ కోసం ఊరంతా గాలిస్తున్నాను, ఇప్పటికి దొరికేరు.”
“ఏమైందిరా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు?”
“నిన్న సాయంత్రం కరణం గారు నాకు ఈ కవరిచ్చి ‘ఒరే గంగులూ నువ్వు రేపు ఉదయం బయల్దేరి పెదమల్లాపురం వెళ్ళి మా అబ్బాయికి ఈ కవరిచ్చి వెంటనే రౌతులపూడి రమ్మన్నానని చెప్పు. చాలా అర్జంట్. నువ్వు ఉదయం 6 గంటల కల్లా బయలుదేరితే 11గంటలకి చేరుకుంటావు. తక్షణమే వాడు బయలుదేరితే ఇక్కడికి సాయంత్రం లోగా చేరుకోవచ్చు. మిగతా పనులు తర్వాత చూసుకోవచ్చు’ అని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చారు.” అని కవరు అందించాడు.
అందులో ఓ టెలిగ్రాంతో పాటు మా బావ రాసిన ఉత్తరం ఉన్నాయి. ఎల్లుండి విశాఖపట్నంలో ఓ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కి ఇంటర్వూ, వెంటనే రమ్మని మా బావ దగ్గర నుంచి ఆ టెలిగ్రాం. మా బావ రాసిన ఉత్తరంలో సారాంశం ఏమిటంటే ‘ఇక్కడి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో క్లార్క్ పోస్ట్‌కి పలానా తారీఖున ఇంటర్వూ, రిటెన్ టెస్ట్ ఉన్నాయి రమ్మని ఎంప్లాయమెంట్ ఎక్సేంజ్ నుంచి లెటర్ వచ్చింది. మా ఇంట్లో ఒక పోర్షన్లో అద్దెకి ఉంటున్న మూర్తి గారు ఆ ఆఫీసు లోనే పనిచేస్తున్నారు. నీ కాల్ లెటరు ఆయనకి చూపించి ఏమైనా సహాయం చేస్తారా నా బావమరిదికి అని అడిగాను. ప్రయత్నం చేద్దాం రమ్మన్నారు. అందుచేత ఈ ఉత్తరం అందిన వెంటనే నీ సర్టిఫికెట్లు తీసుకుని రా’. దీంతో అప్పచెప్పిన పనులన్నీ అవకపోయినా వెంటనే రౌతులపూడి రమ్మని నాన్న రాసిన మరో చీటీ. నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనని సంబరపడ్డాను. ఆనందం తారాస్థాయికి చేరింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆ వెంటనే సాఫ్ట్వేర్ ఉద్యోగం. అప్పట్లో కంప్యూటర్ లేదు. సెల్ ఫోన్ లేదు. చదువుకోవడం గురించి మా రౌతులపూడి నుంచి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న శంఖవరం నడిచి వెళ్ళేవాళ్ళం.
***
సాయంత్రం 5 గంటలయింది. ఇప్పుడు బయల్దేరితే ఎట్టి పరిస్థితుల్లో నేను చీకటి పడకుండా రౌతులపూడి చేరడం కష్టం. అడవిలో వెళ్ళాలి. నడిచి వెళ్ళే కాలిబాట తప్ప వేరే దారి లేదు. అప్పటికి ఆ వూళ్ళు అన్నీ ఏజెన్సీ ప్రాంతాలు. బస్సు సౌకర్యం లేదు. కనీసం సైకిల్ మార్గం కూడా లేదు. రెండు కొండలు ఎక్కి దిగి పదకొండు మైళ్ళ దూరం నడిస్తే రౌతులపూడి. అమ్మో.,! ఎలా? అని కంగారు పడుతున్నాను. మునసబు నా కంగారు గమనించి,
“అబ్బాయి గారూ.. ఉదయం ఐదు గంటలకి బయల్దేరి వెళ్ళండి, కంగారు పడకండి” అన్నాడు. కానీ ఆలోచిస్తే నాకనిపిస్తోంది, రేపు ఉదయం రౌతులపూడిలో బస్ ఎక్కితే సాయంత్రం లోగా విశాఖపట్నం చేరుకోవచ్చు. ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్యూ ప్రదేశానికి చేరాలి.
చీకటి అయినా ఎలాగోలా రాత్రికి రౌతులపూడి చేరుకోవాలి అనుకుంటూ నాన్న అప్పచెప్పిన కాగితాలు, రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన భూమి పన్ను డబ్బు సంచీలో పెట్టుకుని మునసబుకి చెప్పి పెదమల్లాపురం నుంచి బయలుదేరాను. మరోసారి మునసబు హెచ్చరించాడు. “అబ్బాయి గారూ.. మీరు యరకాపురం చేరేసరికే చీకటి పడుతుంది, అక్కడ నుండి అంతా అడివిలో వెళ్ళాలి, చీకటిలో వెళ్ళడం క్షేమం గాదు. మీకు తోడుగా పంపడానికి నౌకర్లు లేరు. నా మాట విని రేపు ఉదయం వెళ్ళండి,” అన్నాడు.
“కాదండీ వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను ఎలాగోలాగ వెళ్తాను. టార్చ్‌లైట్ ఉంటే ఇవ్వండి” అని అడిగి తీసుకుని నడవడం మొదలుపెట్టాను.
మా ఊరు రౌతులపూడి. మా నాన్న గారు మావూరి నుంచి పదకొండు మైళ్ళ అవతల ఉన్న మన్యం గ్రామాలు మల్లాపురం, యరకాపురం, శృంగధార, శిధ్ధావారిపాలెంకి కరణం. ఆ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. కొండల మీద నడిచి వెళ్ళేవారు. నెలకోసారి వెళ్ళేవారు. మలేరియా జ్వరాల భయంతో నౌకరుతో నీళ్ళు కూడా పట్టించుకుని వెళ్ళేవారు. స్వయంగా వంట చేసుకునేవారు. ఆయనకి అరవై దాటే సరికి నేను స్కూలు ఫైనల్ పాసయ్యాను. కాకినాడలో పి.యూ.సి. అయ్యేక నేను డిగ్రీ చదువుకుంటానంటే, ఇంకా పై చదువులు నిన్ను కాకినాడలో పెట్టి చదివించడం నా వల్ల కాదు. సర్వే ట్రైనింగ్ పూర్తి చేసి కరిణీకం పరీక్షలు రాసి నా కరిణీకం చెయ్యి. ఇంకా ఈ వయసులో నేను తిరగలేక పోతున్నాను అన్నారు. ససేమిరా అన్నాను. ఓసారి విశాఖపట్నంలో ఉన్న మా అక్క గారి ఇంటి కి వెళ్లి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చాను.
ఏ విధమైన కాల్ లెటరు రాకపోవడంతో నిరాశతో నాన్నతో పాటు ఆ గ్రామాలకు వెళ్లడం, పనులు చెయ్యడం నేర్చుకున్నాను. ఆ గ్రామాలకు మా నాన్న పెద్దకరణం నేను చిన్న కరణం అయ్యేం.
ప్రస్తుత సమాచారంతో నా ఆశలు చిగురించి మొగ్గలు తొడిగేయి.
దారి బాగా తెలిసిన దారే. చాలా సార్లు నడిచిన దారి. నాకు నేనే ధైర్యం చెప్పుకుని నడక సాగించాను. యరకాపురం చేరేసరికి చీకటి అలుముకుంది. దారిలో తెలుసున్న రైతు కనిపించి “అబ్బాయి గారూ ఈ టైం లో ఎక్కడికండీ?” అంటే, “మా ఊరు తొందరగా వెళ్ళాలి” అన్నా.
“అబ్బాయి గారూ చీకటి పడుతోంది కొండ దారి, జంతువుల భయం ఉండదు. అప్పుడప్పుడు ఎలుగుబంటి తిరుగుతోంది. జాగ్రత్త . ఇదిగో ఈ కర్ర పట్టుకుని చూసుకుని వెళ్ళండి” అని చేతి కర్ర ఇచ్చేడు.
టార్చ్‌లైట్ వేసుకుని చీకటి వెలుగుల్లో పాటలు పాడుకుంటూ నడుస్తున్నాను. చేతి వాచీ చూసుకుంటే ఏడు గంటలయింది. నక్కల అరుపులు తప్ప అడవంతా నిశ్శబ్దంగా ఉంది. నా చెప్పుల అడుగుల శబ్ధం తప్ప ఏం వినిపించడం లేదు. భయం మొదలైంది. నిశ్శబ్దం మరీ భయపెడుతోంది. ఓ పక్క ఉద్యోగం వస్తుందని ఆశ. చీకటి అడవి నిశ్శబ్దం భయపెడుతున్నాయి. ఏదో కదిలినట్టు అలికిడికి ఆగేను. టార్చ్ చుట్టూ ఫోకస్ చేసి చూసేను. నా వెనక ఓ పెద్ద మనిషి. హరికేన్ లాంతరు పట్టుకుని నించున్నాడు. గుండె ఝల్లుమంది. రామలింగేశ్వర స్వామి ని తలుచుకుని గొంతు పెగలదీసుకుని, “ఎవరు?” అని అరిచేను. రైతులిచ్చిన పన్ను డబ్బు ఉంది. దొంగాడేమో. భయమేస్తోంది. ఆ మనిషి దగ్గర కు వచ్చి లాంతరు నా మోహం మీద పెట్టి “మీరు చిన్న కరణం గారు కదా అయ్యా?” అన్నాడు. కొంచెం భయం తగ్గింది. హమ్మయ్య.. ఎవడో తెలుసున్న వాడే అయి ఉంటాడు. అయినా ఈ రాత్రి సమయంలో అడవి మధ్యలో ఏం చేస్తున్నాడు అనుకున్నా.
“ఎవరయ్యా నువ్వు? ఈ అడివిలో ఇంత రాత్రి వేళ ఎం చేస్తున్నావు? ఎక్కడకి వెళ్తున్నావు?” ప్రశ్నల వర్షం కురిపించాను.
“అబ్బాయి గారూ.. నా పేరు సత్యం. నేను మీ నౌకరు గంగులు తండ్రినండి. మీరు నాకు తెలుసు. నేను మీకు తెలియదు. మీరు ఒక్కరూ ధైర్యం గా రావడం చూసి మీ దగ్గరకు వచ్చాను. బాబయ్య గారు ఎలా ఉన్నారండీ? ఈమధ్య మీరే మన్యం లోకి వస్తున్నారు. బాబయ్య గారు చాలా కాలం నుంచి రావడం లేదు. ఆయనకి ఆరోగ్యం ఎలా ఉంది?” అని అడిగాడు.
“ఆయన బాగానే ఉన్నారు గానీ నువ్వేంటి ఇక్కడ? నేను తొందరగా వెళ్ళాలి” అని నడవడానికి సాగేను..
“అబ్బాయి గారూ.. తొందరపడొద్దు. ఈ అడివిలో ఒంటరిగా వెళ్ళకండి. నేను మీకు తోడు వస్తాను” అని నాతో పాటు వస్తున్నాడు. “ఈమధ్య ఎలుగుబంటి తిరుగుతోంది. మీ వెనుక నేనుంటా. పదండి”
ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం. తను తోడు ఉండడంతో అడుగుల వడి పెరిగింది.
“నువ్వు ఎక్కడ ఉంటావు?”
“ఇక్కడే ఈ అడివి లోనే.”
“మరి గంగులు దగ్గర ఉండటం లేదా?”
సమాధానం లేదు.
“పెద్ద కరణం గారు చాలా మంచోరండి. నేను జబ్బుతో మంచం పట్టేస్తే మా ఇంటికి వచ్చి ధైర్యం చెప్పి మందులు కొనిచ్చిన ధర్మపెబువు. నేను ఇంక ఈ ఉద్యోగం చెయ్యలేనండి బాబయ్యా, నా కొడుకు ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నాడు, వాడికి నా ఉద్యోగం వేయించి పుణ్యం కట్టుకోండి బాబయ్యా అని కరణం గారికి మొరపెట్టుకున్నారు. ధర్మపెబువు మా మంచి మారాజు. ఆడికి ఉద్యోగం వేయించి పుణ్యం కట్టుకున్నారు. నాన్న గారి దయవల్ల ఆడు స్తిర పడ్డాడు.”
ఇలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ బంగారయ్య పేట పరిసరాల్లోకి వచ్చేం. “ఇంక మీరు వెళ్ళండి అబ్బాయి గారూ. అడివి దాటేసేం. రోడ్డు మీద ఇంకో గంట నడిస్తే ఇంటికి చేరుకుంటారు” అని వెనక్కి తిరిగి పోయాడు.
“ఆగు. ఇప్పుడు ఎక్కడకి పోతావు. ఇంత దాకా వచ్చిన వాడివి ఇంటికి వచ్చి రాత్రి పడుకుని రేపు వెళుదువుగాని. నాన్నని చూద్దువు గాని.” అన్నాను.
“ఇంక మీరు వెళ్ళండి” అని సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి పోయాడు.
కొంత సేపు అతను వెళ్ళిన దారి వేపు చూసి నడక సాగించాను. రౌతులపూడి ఇంటికి చేరే సరికి రాత్రి పదకొండు గంటలయింది. తలుపు కొడితే నాన్న తలుపు తీసి ఆశ్చర్యపోతూ, “ఇంత రాత్రి ఎలా వచ్చేవు?”
“ఎవరో తోడు వచ్చేరు. అతనితో కలిసి వచ్చేను. ఉదయం ఆరు గంటల బస్సుకి విశాఖపట్నం వెళ్తాను.” అని లుంగీ కట్టుకుని పెరట్లోకి వెళ్లబోతుంటే,
“నీకు తోడు వచ్చిన వాడు ఏడీ? ఇంటికి రమ్మనకపోయావా?” అన్నారు నాన్న.
“నాన్నా.. వాడి పేరు సత్యంట. నౌకరు గంగులు తండ్రి అని చెప్పాడు. బంగారయ్య పేట దాకా వచ్చి వెనక్కు వెళ్లి పోయాడు. రమ్మన్నాను. రానన్నాడు.” అని స్నానం చెయ్యడానికి వెళ్ళాను.
అమ్మతో నాన్న గాబరాగా చెప్తూంటే వినిపిస్తోంది – “వాడు చచ్చి చాలా కాలమయ్యింది గదా. వీడికి తోడుగా రావడం ఏంటీ?”
