తేది 12-07-2026 న సాయంత్రం 06.00 గంటలకు నాందేడ్ లోని భసీన్ మంగళ్ కార్యాలయ సభాగృహంలో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య వక్త ఆచార్య శంకర్ రావు రామజీ కుంటూర్కర్ గారు మాట్లాడుతూ హైందవ స్వరాజ స్థాపకులు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వ్యక్తిత్వ ఎదుగుదలకు, వారి మాతృమూర్తి శ్రీమతి జీజాబాయి సంస్కారమే కారణమని నొక్కి వక్కాణించారు. అంతే కాదు మన తెలుగు వారు కూడా ఆ మహారాజుకు ఎన్నో విధాలుగా సహకరించారని వివరించారు.
అది గత తొమ్మిది నెలల్లో, మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా జరిగిన పదునాల్గవ సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమం. శ్రీ ఆశోక్ కంటే గారు ఆ కార్యక్రమం సూత్ర సంచాలనం చేయగా శ్రీ సౌరభ్ శిందే, శ్రీ హరీశ్ ఇర్నాక్ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా, కార్యక్రమ సమన్వయకులుగా డా. అంబల్ల జనార్దన్ నాందేడ్ కార్యక్రమ స్థానిక సమన్వయకులుగా శ్రీ గురం నర్సింగ్, శ్రీ సత్యానంద్ శివరాత్రి పాల్గొన్నారు. మొదట అతిథులందరు దీప ప్రకాశనంలో పాల్గొన్న తర్వాత మహారాష్ట్ర గీతం ఆలాపించ బడింది. ఆ తర్వాత వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటె గారు, ఆహుతులకు స్వాగతం పలికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు శ్రీ సౌరభ్ శిందే గారిని స్వాగత ప్రసంగం చేయవలసిందిగా ఆహ్వానించారు.
శ్రీ సౌరభ్ శిందే గారు మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలుగు సాహిత్య అకాడెమీ నెలకొల్పబడిన నేపథ్యం వివరించారు. అప్పటి సాంస్కృతిక విభాగం మంత్రి శ్రీ సుధీర్ మునగంటి వార్ చొరవతో మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ కాకుండా మరో నాలుగు భాషల సాహిత్య అకాడెమీలు ఏర్పడ్డ వైనం తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పది భాషల సాహిత్య అకాడెమీలు ఉన్నాయని తెలిపారు. అన్ని భాషల అకాడమీలు దేశంలోని మరే రాష్ట్రాల్లో లేవని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. అంతే కాదు, తెలుగు సాహిత్య అకాడెమీ మరే తెలుగేతర రాష్ట్రాల్లో లేదని కూడా చెప్పారు. మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలో తెలుగు ప్రజలున్న వివిధ ప్రాంతాల్లో సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆ కార్యక్రమాల ద్వారా మరాఠీ తెలుగు ప్రజల సాహిత్య, సాంస్కృతిక బంధం మరింత బలపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇరు భాషల సాహిత్యం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. వచ్చే ఆగస్ట్ నెలలో ముంబయిలో జరుగబోయే అనువాద కార్యశాలలో మరాఠీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి మరాఠీ లోకి అనువాదం చేయగలిగే వారందరిని పాల్గొనమని ఆహ్వానం పలికారు.
ఆ తర్వాత ముఖ్య వక్త ఆచార్య శంకర్ రావు రామజీ కుంటూర్కర్ గారు శ్రీ ఛత్రపతి శివాజీ గారి జీవిత విశేశాలను క్లుప్తంగా, చాలా ప్రభావవంతంగా వివరించారు. హైందవ స్వరాజ్య స్థాపకునిగా శ్రీ ఛత్రపతి శివాజీ తీసుకున్న చర్యలు ఇప్పటికీ ఆచరణ యోగ్యమన్నారు. అక్కన్న మాదన్న వంటి తెలుగు వారు శ్రీ ఛత్రపతి శివాజీ గారికి సాయ పడ్డ వైనం కూడా తెలిపారు.
అటు పిమ్మట శ్రీమతి వడ్నాల రజిత గారి నేతృత్వంలో బోనాల బృందం సభాగృహంలోకి వస్తూ సందడి చేసింది. ప్రముఖంగా పోతరాజు విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు బోనాల ప్రదర్శనను కనుల, వీనుల విందుగా ఆస్వాదించారు.
ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక వినూత్న స్థానిక, భక్తి భజనల బృందానికి అవకాశం కల్పించారు. శ్రీ మైలారం గణేశ్ గారి బృందం చక్కని భజనలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. హార్మొనీ, మద్దెలా, తాళాల తప్పెట్ల దరుకు, వారు పాడుతుంటే వీక్షకులు కూడా పెదవులు, కాళ్లు కదపడం గమనార్హం.
నాందేడ్ కార్యక్రమ స్థానిక సమన్వయకులు సర్వశ్రీ గుర్రం నర్సింగ్, సత్యానంద్ శివరాత్రి, నాందేడ్ పురపాలక సంఘ కార్పొరేటర్ శ్రీమతి కవిత నాగ్‌నాథ్ గడ్డం, ఇతర ప్రముఖులు శ్రీ గోగినేని నాగయ్య, ఎలందుల జయరాజ్, సామిలేటి నాగభూషణం గార్లను మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున శాలువా జ్ఞాపికలతో సన్మానించారు. బోనాలు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రసంసా పత్రాలు అందజేశారు.
చివరగా కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులందరు బతుకమ్మ పాటలకు లయబద్దంగా ఆడుతూ చప్పట్లు చరుస్తూ, తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టించారు. వ్యాఖ్యాత శ్రీ అశోక్ కంటే గారు వందన సమర్పణ చేసిన తర్వాత జన గణ మన ఆలాపనతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.
ఆహూతులందరికి మహారాష్ట్ర ప్రభుత్వం భోజనాలు ఏర్పాటు చేసింది.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

