[శ్రీ బ్నిం గారి ‘నరసింహాస్యాలు’ అనే రచన అందిస్తున్నాము.]
ఈ నరసింహాస్యాలు.. ఈ శీర్షిక కోసం కుదిరిన కామెడీ కింగ్‌లు.. పేరు చూస్తే ‘నరసింహం’.. తీరా తీరు చూస్తే.. ‘హాస్యోహం’ అంటారు!
నేను ఈ రోజు జూలు పట్టుకుని ఆడుతున్న సింహాలు..
- కాంతం గారి మొగుడు
- గణపతి గారి తండ్రి
- ప్రగల్భాల బారిష్టర్ గారు
- తూటా మాటల జంఘాల శాస్త్రి
- మద్దాలి వెంకటలక్ష్మి నరసింహారావు.
ఈ ఐదుగురు మంచి రచయితలే గాని.. సింహం లాంటి తమ పేరుని కాపాడుకోలేక పోయారు. మనల్ని నవ్వులు పాలు చేశారు.
ఇంక ఒక్కొక్క సింహాన్ని చూసుకుంటే వెళ్ళిపోదాం!!
1) కాంతం గారి మొగుడు
“కాంతంతో దాంపత్యం
సరాగాల సాహిత్యం
సరదా కథలకి తలమాణిక్యం
మునిమాణిక్యం నరసిం హాస్యం”
నిజం!!
మొగుడు పెళ్ళాలు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళయినా.. లేటెస్ట్.. లవ్ మ్యారేజాడిన.. న్యూలీ మారీడ్ కపుల్ ఎవరైనా సరే .. తెలుగు వాళ్లయితే ఆ అమ్మాయి పేరు కాంతం. మొగుడి పేరు: కాంతం మొగుడు!
కాంతం మొగుడు అనే ఈ పెద్దాయన పేరు: మునిమాణిక్యం నరసింహారావు!
ఒకళ్ళ నొక్కళ్ళు అమాయకుల్ని చేసుకుంటూ.. గేలి చేసుకుంటూ.. నేనే గెలిచాననుకుంటూ.. నవ్వేసుకోవడమే.. మనకి తెలిసిన ఎవర్‌గ్రీన్ కాంతం కథలు!!
ఆయనది సెపరేట్ స్టైల్.. అందులో.. కనీ కనపడనంత రొమాన్స్ ఉంది!
అందులో స్పష్టంగా వినబడేటంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది!
వాళ్ల గుమ్మంలోకి వెళ్ళగానే నిలువెత్తుగా తెలుగుతనం ఉంది!
1898 గుంటూరు జిల్లాలో తెనాలి తాలూకా అమృతలూరు మండలంలో మద్దిపాడు అనే ఊరు మట్టిలో.. ఈ మాణిక్యం మెరిసింది. 1973 దాకా హాస్యం రాస్తూ తను రాసిన హాస్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్న వాళ్ళని చూస్తూ చూస్తూ చూస్తుండగానే కన్నుమూశారు.
హాస్యము.. వ్యంగ్యము.. చమత్కారము.. వెటకారము.. ఇలా చతుర్విధాలుగా చతురత చూపించిన.. మునిమాణిక్యం వారు.. ‘దాంపత్యోపనిషత్తు’.. అని ఒక చక్కటి పుస్తకం కూడా రాశారు.. ఒక రకంగా అది ఆయన కాంతం.. ‘కథా సారం..’ లేదా సినాప్సిస్.. మేనిఫెస్టో అనొచ్చు దాన్ని!
“మీ ఆవిడకి మీకు గొడవలు వస్తాయా.. వస్తే ఎలా సర్దుకుంటాయి..” అంటే, “ఆవిడ ఏదో అంటుంది..! నేను అనుకుంటాను. ఇంకా గొడవ వచ్చే.. గొడవేముంది?” అంటారాయన.
ఎన్ని రాసినా కథలు నాటకాలు వ్యాసాలు అంటూ ఏవేవో రాసినా .. అన్నింటికి అప్పటికప్పుడు చప్పట్లు కొట్టి శభాష్ అన్నా.. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి ఆయన కాంతం మనిషి!!
కాంతం ఆయనకి పేరు తెచ్చిన మనిషి!! తెలుగు పాఠకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కాంతం పేరు వింటేనే పెదవుల మీద నవ్వు చిగురిస్తుంది.
మధ్య తరగతి కుటుంబాల జీవన గమనంలో.. చిన్న చిన్న కష్టాలు సంతోషాలు.. మాట పట్టింపులు.. చిలిపి తగాదాలు.. వాదనలు ప్రతి వాదనలు.. గడుసుదనాలు.. మాయకత్వాలు.. అమాయకత్వాలు.. అపార్థాలు.. ఎన్నెన్నో..
ఇలా ప్రతి కదలికకి, కథ కదలికలకి ఒక్కో రంగు కనిపిస్తూ ఉంటుంది..!
కాంతం కథల్లో ప్రతి కథ ఒక చిన్న హాస్యభరిత ఘట్టం! ఆమెకి కోపం వస్తే పడే తిప్పలు.. ఆమెను బుజ్జగించడానికి చేసే ప్రయత్నాలు.. సహజంగా ఉంటాయి.
అంతం అమాయకత్వం తర్కవిహీనమైన ఆలోచనలు ఆశాన్ని పండిస్తాయి. చుట్టాలు పక్కాలు చుట్టుపక్కల అమ్మలక్కలు కాంతం దంపతుల్ని తికమకలు చేస్తుంటారు. భర్త ఎవరికో రాసిన ఉత్తరం చూసి కాంతం అపార్థం చేసుకోవడం.. నానా హడావిడి పడడం.. పెట్టడం.. కడుపుబ్బ నవ్విస్తుంది !!
కాంతం మామూలు గృహిణి అయినప్పటికీ.. ఆమెలో ఉండే బలం, ప్రేమ, కోపం, అల్లరి, అమాయకత్వం, ఇవన్నీ కలిసి ఆమెను బాగా పరిచయమైన పాత్రగా నిలుపుతుంది!
కథ వాస్తవంగా కనిపించి మానవ సంబంధాలలో ఉండవలసిన.. సత్యాన్ని వాళ్ళ దాంపత్యం చెబుతూ ఉంటుంది! మజిలీలు అనే కథ చదివే ఉంటారు మీరు.
కథ గురించి చెప్పాలనుంది కానీ.. ఒక్క నరసింహ గారితో నేను ఆగిపోతే.. మిగిలిన సింహాలు గర్జిస్తారు కదా!!
రహస్యంగా.. చెబుతున్నాను.. ‘మజిలీలు’ కథ ఇంతకుముందు చదవకపోతే ఒక్కసారి చదవండి..
తీర్థయాత్రలకు ఎక్కడికో వెళ్లిన భార్యాభర్తలు ఇద్దరూ రకరకాల మజిలీలలో పడ్డ అవస్థలలో నవరసాలు కనిపిస్తాయి. కొన్ని కొత్త రసాలు కూడా విహరిస్తాయి. కానీ హాస్యం డామినేట్ చేసేస్తుంది. మునిమాణిక్యం గారి విశ్వరూపం ఈ కథలో అత్యద్భుతం అనిపిస్తుంది!
2) గణపతి గారి తండ్రి
సాహిత్యంలో కొన్ని పాత్రలు కాలాతీతంగా, నిత్య నూతనంగా, సజీవంగా.. నిలిచిపోయాయి. ముఖ్యంగా హాస్య పాత్రలు!
అలాటిదే.. మరో నరసింహాస్యం సృష్టించిన హాస్య పాత్ర గణపతి!
గణపతి నిజానికి నవల. అందులో వర్ణనలో కథానాయకుడు గణపతిని చాలా అనాకారంగా పరిచయం చేశారు.. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు!
పైగా.. అందులో సన్నివేశాల్ని సంఘటనల్ని కథానాయకుడు పక్షాన వహించి చెప్పలేదు. వాడి ఆత్మవిశ్వాసం వాడిని నడిపిస్తుంది! బొక్క బోర్లా పడేస్తుంది! వాడి మూర్ఖత్వం మనని నవ్విస్తుంది!
మహా మోసకారిగా నడిచే అతని జీవితం అభాసు పాలైతే మనం కేరింతలు కొడతాం!
డబ్బు సంపాదన కోసం అతను పడే అగచాట్లు.. ఆనాటి సమాజంలో ఉన్న అజ్ఞానం, మోసం, స్వార్థం, వెర్రి నమ్మకాలు, మూఢాచారాలు లాంటి వాటిపై ఘాటైన విమర్శా వ్యంగ్యం కనిపిస్తుంది!
ఇంకా ఆయన ఎన్నో ప్రహసనాలు ,హాస్య కేళికలు రాశారు. ఇంతకన్నా గొప్ప విషయం ఆయన గయోపాఖ్యానం పద్య నాటకం .. అత్యద్భుతః!
చిలకమర్తి వారికి సమాజ సంస్కరణా భావజాలం.. దేశభక్తి.. మెండుగా ఉండేవి!
ఆయన గొప్ప చమత్కారి!
భరతఖండం చక్కని పాడి యావు..
హిందువులు లెగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు..
పితుకు చున్నారు మూతులు బిగియ కట్టి!
మనందరికీ తెలుసు ఇది చాలా ఫేమస్ పద్యం!
ఇది చెప్పకుండా చిలకమర్తిని వదిలేయడం కష్టం!
ఆ తర్వాత google చెప్పిన కొన్ని విషయాలు.. ఆయన 1867 సెప్టెంబర్ 26వ తేదీని జన్మించారు. 1946 జూన్ 17 మనకు స్వతంత్రం రాకుండానే గతించారు.
ఆయన చమత్కార పద్యం మరొకటి.. పకోడీ మీద రాశారు..
కోడిని తినుటకు సెలవున్ (సెలవు అంటే పర్మిషన్)
వేడిరి..మును.. బ్రాహ్మణులును వేధ, నతండున్
కోడిని వలదా బదులుగ.. ప
కోడిం దినమంచు జెప్పె కూర్మి పకోడీ..
ఇలా నవ్వు ఇష్టమైన వాళ్ళకి నిత్య స్మరణీయుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు.
3) ప్రగల్భాల బారిష్టర్ గారు
ఇంక తర్వాత చెప్పుకోదగ్గ సింహం.. బారిష్టర్ నరసింహ శాస్త్రి! అదేనండి బారిష్టర్ మొక్కపాటి..!
బారిష్టర్ పార్వతీశం అనే అద్భుతమైన నవల రాసిన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు!!.. ఆయన 1981 వరకు మన మధ్యనే ఉన్నారు. 1892లో జన్మించారు.
ఆయన నెమ్మదిగా.. పార్వతీశం అనే పేరుగల బారిష్టర్ గారి దగ్గర కూర్చుని వారి ఆత్మకథ రాసిపెట్టారు!
ఆత్మకథ కదా.. బారిష్టర్ పార్వతీశం ఫస్ట్ పర్సన్ లో చేసిన అద్భుతమైన ప్రయోగం.
‘బారిష్టర్ పార్వతీశం’ నవలలో నవ్వు ఆపుకోలేని ఘట్టాలు చాలా ఉన్నాయి,
కానీ అందులో స్టీమర్ (ఓడ) ఎక్కేటప్పుడు పార్వతీశం పడే తిప్పలు చెప్పన్నలవి కాదు!
ఓడలో మొదటిసారి.. ఫోర్క్, స్పూన్‌తో భోజనం చేయడానికి ప్రయత్నించే సీన్ క్లాసిక్ అని చెప్పవచ్చు.
అందులో ముఖ్యంగా ఓడలో భోజనం చేసే ఘట్టం అందులో ఫస్ట్ ప్రాబ్లం స్పూన్ చెంచా యుద్ధం చేయడం నవ్వుల జలపాతమ్!!
పార్వతీశం మొట్టమొదటిసారిగా ఓడలో ఇంగ్లీష్ వారి పద్ధతిలో భోజనం చేయడానికి డైనింగ్ హాల్‌కి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని తమాషాలు ఆయనే స్వయంగా చెప్తుంటే.. నవ్వాపుకోలేము.
మనవాడికి అప్పటివరకు చేత్తో తినడమే తెలుసు. అక్కడ ప్లేటు పక్కన రకరకాల చెంచాలు, ముళ్ల గరిటెలు (forks) చూసి కంగారు పడతాడు. ఎదుటివారు ఎలా తింటున్నారో చూసి కాపీ కొట్టాలని నిర్ణయించుకుంటాడు.
ఒక ఫోర్క్‌తో ఏదైనా ముక్కను గుచ్చి నోటి దాకా తెచ్చుకునే లోపు అది జారి కింద పడిపోతుంటుంది. లేదా ప్లేటులో అటు ఇటు గెంతుతుంటుంది. ఆ ముక్కను పట్టుకోవడానికి పార్వతీశం చేసే యుద్ధం చాలా హాస్యభరితంగా ఉంటుంది. వేడి వేడి సూప్‌ను ఎలా తినాలో తెలియక, చెంచాతో నోట్లో వేసుకోగానే నాలుక కాలుతుంది. అది మింగలేక, ఉయ్యలేక ఆయన పడే అవస్థలు చూస్తే నవ్వు ఆగదు.
ఒకవేళ పొరపాటున చేయి తగిలితే అక్కడున్న దొరలు ఏమనుకుంటారో అని, తన వేళ్లను తనకే తెలియకుండా దాచుకుంటూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు.. పార్వతీశం.
అతన్లో చార్లి చాప్లిన్ కనిపిస్తాడు!
పార్వతీశం తన అమాయకత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ, అందరి ముందు “నాకు అన్నీ తెలుసు” అన్నట్లుగా బిల్డప్ ఇవ్వబోయి మరిన్ని తప్పులు చేస్తాడు. ఆ తప్పులను ఆయన తన మనసులో (ఫస్ట్ పర్సన్ లో) విశ్లేషించుకునే విధానం పాఠకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.
తను పడే తడబడలు.. తనని తాను సమర్ధించుకుంటూ తనే చెబుతున్నప్పుడు.. ఇంత గొప్ప హాస్యం దొర్లుతుందని రచయిత వేసిన ప్రణాళిక మాత్రం అద్భుతః!!
తను పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి పళ్ళు తోమే పుల్ల
‘పందుంపుల్ల’ లేదు.. బ్రష్ ట పేస్టుట..!
చక్కగా చెంబు పట్టుకుని బయటికి వెళ్లడం లేదు!
రెంటికి వెళ్లాలంటే..కుర్చీలో కూర్చున్నట్టు కమోడుట..
స్నానానికో రూమట.. డ్రెస్సింగ్.. అన్ని అక్కడ చిరాగ్గానే ఉన్నాయి.
వికృతంగానే కనిపిస్తున్నాయి.. !!
సణుక్కుంటు.. నవ్వుకుంటూ.. సెటైర్లు వేసుకుంటూ.. నాతిప్పలు పడుతూ.. ఏది మాంసము ఏది బ్రాహ్మణ భోజనమో తెలియక తిప్పలు.. చెప్పనలవి కాదు..
ఎక్సలెంట్ గా రాశారు.. బారిష్ఠరు గారి ఆత్మకథ!
ఇందులో సిట్యువేషనల్ కామెడీ.. స్లాబ్స్టిక్ కామెడీ..
డైలాగ్ కామెడీ.. ఇగ్నోరెన్స్.. కామెడీ.. ఇలా పేర్లు లేని కామెడీలు చాలా దొరుకుతాయి.
ఆయన జర్నీయే ఒక అద్భుతమైన కామెడీ ప్రయాణం!
తర్వాత రెండు భాగాలు ఈ నవల రాయబడింది. నిజమే.. రా..య..బ..డిం..ది!
కానీ మొదటి భాగమంత మనసుకు పట్టదు. మన పార్వతీశం గారు నిజంగా బారిష్టర్ అయ్యాక తెలివైనవాడు అయ్యాక.. హాస్యం ఏం పుడుతుంది కనుక.
మూడో భాగంలో మరీ స్వాతంత్ర ఉద్యమం పోరాటంలో పాల్గొనడం.. గాంధేయుడిగా మారడం.. ఇలా సాగుతుంటే.. మన మొదటి భాగంలో చార్లీ చాప్లిన్ ఇందులో ఉండడు.
మొక్కపాటి నరసింహ శాస్త్రి గొప్ప హాస్య రచయితగా తెలుగులో తరతరాలుగా నిలిచిపోతూనే ఉన్నారు !
ఇంక.. నరసింహాస్యాల్లో.. మరో సింహం నోట్లోకి వెళ్దాం!
4) తూటా మాటల జంఘాల శాస్త్రి
ఈయన నోరెట్టుకొని పడిపోయే మహా వక్త!
తిట్టంటే తిట్టు కాదు.. అలాగని పట్టనట్టు వదిలేయలేదు. ఆయన గారు 1865 లో పుట్టి 1940లో హాయిగా వెళ్లిపోయాడు.
ఇప్పటికి గనక ఉంటే పేక బెత్తం పట్టుకుని ఫ్యాషన్ పేరిట రెచ్చిపోతున్న సోకాల్డ్ సినిమా నటుల్ని చితక్కొట్టేసి ఉండేవాడు.
అప్పట్లోనే ఆయన గుండెలు బాదేసుకుని.. ఆనాడు నెమ్మదిగా మారుతున్న భారతీయుల కట్టు, బొట్టు, జుట్టు, ఇంగ్లీష్ మోజు, విదేశీ వ్యామోహం మీద గొగ్గోలు పెట్టాడు! నిర్ధాక్షిణ్యంగా ఏకి పారేశాడు..
ఆ దెబ్బతో తెలుగు సాహిత్యానికి.. ఒక విలక్షణమైన శైలిని.. దాంట్లో వ్యంగ్యాస్త్ర హాస్యాన్ని… పరిచయం చేసిన గొప్ప రచయితగా నిలిచి పోయారు.. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు!
ఆయనలోని ఆవేదనలోంచి జంఘాలశాస్త్రి పుట్టుకొచ్చాడు.. ఒక మీమాంసకుడు.. తర్కవాది, న్యాయవాది, సాక్షి, ఇలా కొంత సైన్యాన్ని కూడగట్టుకున్నాడు ఆ జంఘాల శాస్త్రి.. అసలు హాస్యం రాశాను అనే ఆయన అనుకోలేదు.. అసహ్యం వేసిన ఆ నాటి పరిస్థితులను చెరిగి పారేశారు.
పాశ్చాత్య నాగరికత పేరుతో జరుగుతున్న.. అనుకరణ.. అసలైన భారతీయ సంస్కృతిని వదిలేయడం వంటి వాటిని నిశితంగా విమర్శిస్తారు.
ఆయనతో ఒక్క ఉపన్యాసం ఎలా సాగిందో చూద్దాం..
“ఓ సజ్జనులారా! నేటి నాగరికత విచిత్రమైనది. పూర్వం మనవారు కాలికి చెప్పుల్లేకుండా, తలకు గుడ్డ చుట్టుకుని, ఒంటినిండా మురికితో తిరిగేవారు. అది అనాగరికతట! ఇప్పుడు చూడండి, సూటు, బూటు, టై, టోపీ.. ఇవన్నీ ఉన్నవారే నాగరికులు! కానీ వీరికి తెలుగు సరిగ్గా రాదు, సంస్కారం అంతకంటే రాదు. విదేశీ భాష నేర్చుకుని, స్వభాషను చిన్నచూపు చూస్తారు! ‘ఫ్యాషన్’ పేరుతో అర్ధనగ్న దుస్తులు ధరిస్తారు, కానీ అది ‘సంప్రదాయం’ పేరుతో పరుష వస్త్రధారణ చేసేవారి కంటే నాగరికతకు ఆమడ దూరం. ఇంగ్లీషు మాట్లాడితే గొప్ప, తెలుగు మాట్లాడితే తక్కువ!
ఇది నిజంగా విడ్డూరం కాదా? స్వదేశీ వస్తువులను తృణీకరించి, విదేశీ వస్తువులకు ప్రాధాన్యతనిస్తారు. పాత సంప్రదాయాలను ఛాందసమని కొట్టిపారేసి, కొత్త అంధానుకరణలను ‘ప్రగతి’ అని పొగుడుతారు. మన సొంత సంస్కృతి, విజ్ఞానం పక్కనపెట్టి, పరాన్నభుక్కుల్లా జీవిస్తున్నాం. ఇదేనా నాగరికత? అనాగరికతలో కూడా ఒక నిజాయితీ ఉంటుంది, ఈ నాగరికతలో మాత్రం కేవలం బూటకమే మిగిలింది.”
ఈ ఉపన్యాసం ద్వారా జంఘాల శాస్త్రి కేవలం అది హాస్యం అనుకుని అప్పుడు ఇప్పుడు నవ్వేస్తాం గానీ.. అది హాస్యంలో ఒక ఒరవడి.. వ్యంగ్యం!
5) మద్దాలి వెంకటలక్ష్మి నరసింహారావు.
ఇంక ఐదవ సింహం.. బాపు రమణ గార్ల హాస్యం ట్రూపులో మూడో సింహం.. మద్దాలి వెంకట లక్ష్మి నరసింహారావు.
ఆయననీ ఎవరో మీ పేరు ముళ్ళపూడి వెంకటరమణ కదా.. ఎం.వి.ఆర్. కాకుండా ఎం.వి.ఎల్. అని రాస్తున్నారేంటి అని ఎవరో పాపం అడిగారు .. దానికి ఈ ఎమ్వీయల్ గాలు “నాకు ‘లా’ పలకడం లాకా ముళ్ళపూడి వెంకట లమణ అని చెప్పాను. పేపలు వాడు ఎం.వి.ఎల్. అని లాసేసాలు” అనేసాలు.
నిజానికి ఎమ్వీయల్ చాలా సీరియస్ పండితుడు. మంచి సాహితీ వక్త! ఆయన సాహిత్య వ్యాసాలు కూడా రాశారు సీరియస్‍గా.
రహస్యం ఏంటంటే.. ఆయన శ్వాస భాష కూడా హాస్యం.
‘అధిక ప్రసంగం’, ‘తాగుడు మూతలు’ లాంటి ఫీచర్ వ్యాసాలు ఆయన హాస్య ప్రియత్వాన్ని సృజనని తెలియజేస్తాయి!
అన్నిటికన్నా యువతని ఉర్రూతలూగించిన హాస్య ప్రధానమైన యువజ్యోతి.. ఆంధ్రజ్యోతి శీర్షిక.. హాస్యంలో చమత్కారం, సమయస్ఫూర్తి, సత్యసృష్టి .. ఎం.వి.ఎల్. గారిలో పుష్కలంగా ఉండేవి.
ఆయన చమత్కార వాగ్ ప్రవాహమే బాపూ రమణలు ఆలింగనం చేసుకున్నారు. వారి ఆర్బిట్‌లో ప్రవేశించి ఒకటైపోయారు.
తెలుగు క్లాసు ఎగ్గొట్టకుండా డిగ్రీ స్టూడెంట్ లని కూడా కూర్చోపెట్టి క్లాసులు చెప్పిన చతురుడు ఎం.వి.ఎల్. ముళ్ళపూడి వెంకటరమణ కాకుండా బాపుగారు డైలాగ్స్ వ్రాయించుకున్న రెండు సినిమాల రైటరు ఆయన.. తూర్పు వెళ్ళే రైలు, స్నేహం. సినిమాలు ఎలా నడిచేయి అనేది పక్కన పెట్టండి.. థియేటర్లో నవ్వులు కురిశాయి. పొరపాటున సినిమా చూసిన వాళ్లు మాటలను ప్రేమించి మరోసారి చూస్తారు.
ఇదండీ నేను చెప్పదలుచుకున్న నరసింహాస్యాల సంక్షిప్త వ్యాసం.
చివర్లో ఒక్క మాట చెప్పేస్తాను..
నాకు బాపు రమణల ప్రేమ దొరికిన కారణం హాస్య ప్రియత్వం.. చమత్కార గ్రాహ్య శక్తి..కి కారణం కూడా నా పొడుగు పేరు నరసింహమే.. నరసింహ మూర్తి..
ఈ ఫినిషింగ్ లైన్ కైనా చప్పట్లు కొట్టండి.
థాంక్యూ

