Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-1

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

ను విన్నది చెప్పేక.. “నేను విన్నది నిజమా.” అడిగాడు శ్రీకర్.

“ముమ్మాటికి.” ఒప్పుకున్నాడు నరేంద్ర.

శ్రీకర్.. నరేంద్ర ఫ్రెండ్స్. ఇద్దరూ ఇంటర్మీడియట్ వరకు కలసి చదువుకున్నారు. తర్వాత వేరు వేరు చదువులకై వేరు వేరు ఊర్లకు మారారు.

“ఇంతకీ నీకు ఎవరు చెప్పారు.” అడిగాడు నరేంద్ర.

“మన ఇంటర్మీడియట్ క్లాస్‌మేట్ కామేశం.” చెప్పాడు శ్రీకర్.

“వాడా.. ఓ.. మేము ఈ మధ్య అనుకోకుండా కలిసాం. మాటల్లో వాడికి విషయం చెప్పాను. అబ్బో! వాడా నీకు నా విషయం మోసింది.” అన్నాడు నరేంద్ర.

“మా ఇద్దరవి వేరు వేరు ఆఫీసులైనా.. ఒకే ఊరిలో ఉంటున్నాంగా. అప్పుడప్పుడు కలుస్తుంటాం.” చెప్పాడు శ్రీకర్.

“చెప్పాడు చెప్పాడు. మీ ఇద్దరూ తరుచు కలుసుకుంటున్నారని.” చెప్పాడు నరేంద్ర.

“నీది పిచ్చి పనిలా అనిపిస్తోంది. బంగారం లాంటి ఉద్యోగం వదులుకోవడం బాలేదు. మరో మారు ఆలోచించు.” చెప్పాడు శ్రీకర్.

“ఆలోచించేది మరి లేదు. ఉద్యోగం వదిలేసాను. మాకు సుమారు వంద కిలోమీటర్ల దూరాన ఉన్న పల్లెలో పక్కా మూడు ఎకరాల పంట భూమిని కొనుగోలు చేసుకున్నాను. ఇక వ్యవసాయం మొదలెట్టడమే.” చకచకా చెప్పాడు నరేంద్ర.

శ్రీకర్ ఏమీ అనలేక ఆగాడు.

అంతలోనే.. “నాకు పనుంది.” చెప్పాడు నరేంద్ర.

శ్రీకర్ ఉసూరుమన్నాడు. చిరాగ్గా ఆ ఫోన్ కాల్ కట్ చేసేసాడు.

అటు కాల్ కట్ కాగానే.. ఇటు నరేంద్ర ఫోన్‌ను జేబులో పడేసుకున్నాడు.

***

తను పంట భూమి కొన్న పల్లెలో కనీస సౌకర్యాలతో ఉన్న ఓ ఇంటిని అద్దెకు సమకూర్చుకున్నాడు నరేంద్ర.

తొలుత నుండి ఆ పల్లెలో ఒక పెద్దైన అప్పలనర్సయ్య తనకు చేదోడు వాదోడయ్యాడు.

“మా పంతులు చెప్పాడు.. వస్తున్న గురువారం బాగుందట. మీరప్పటికి ఇక్కడికి వచ్చేస్తే.. ఆ రోజున వ్యవసాయం మొదలెట్టొచ్చు.” చెప్పాడు అప్పలనర్సయ్య.. నరేంద్ర తిరిగి తన తల్లిదండ్రుల ఊరు పురంకి బయలుదేరుతుండగా.

“అలాగే పెద్దాయన.” తలాడించాడు నరేంద్ర.

“నేను ఈ లోగా కూలీలను మాట్లాడి ఉంచుతాను.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“మీ సహకారానికి థాంక్స్. కానీ కూలీల కంటే ముందు నాకు పొలాలు అమ్మిన వారితో నేను మాట్లాడాలి. నేను మంగళవారం నాటికే వచ్చేస్తాను. ఆ రోజుకు పొలాలు అమ్మిన వారిని పిలిపించి ఉంచండి.” చెప్పాడు నరేంద్ర చాలా ఒబ్బిడిగా.

“అలా అంటారా. సరే. మీ ఇష్టం.” ఒప్పుకున్నాడు అప్పలనర్సయ్య.

నరేంద్ర అక్కడ నుండి బయలుదేరాడు బస్సు రావడంతో.

 ***

పురంలో..

“నువ్వు పూర్తిగా వెళ్లబోతోంది వస్తున్న మంగళవారమేనా.” కాస్తా దిగులుగా అంది పద్మావతి.

“అవునమ్మా. అక్కడ ఇల్లు కూడా దొరికింది.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “వ్యవసాయం ప్రారంభించేది వచ్చే గురువారం నాటి నుండి. మీరు ఆ రోజుకు మాత్రం తప్పక రావాలి.” చెప్పాడు.

“రాజా లాంటి ఉద్యోగం వదిలేసి మరీ కోరి అటు పోతున్నావు. మళ్లీ చెప్పుతున్నాను మాకైతే ఇప్పటికీ ఇష్టం కాదు.” చెప్పాడు నారాయణరావు.

“నాన్నా. అన్నీ మీతో చెప్పాను. ఉద్యోగంలో నాకు సంతృప్తి లేదు. ఏదో చేయాలి. ‘నేను నిలబడాలి. మరి కొందరికి చేయూతనవ్వాలి’ అన్నదే నాకు నచ్చింది. దయచేసి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. కానీ వెనుక్కు లాక్కండి.” చెప్పాడు నరేంద్ర.

“అది కాదు నాన్నా..” మాట్లాడబోయాడు నారాయణరావు.

అడ్డై.. “ఏమీ కాదు. మీరు నిశ్చింతకండి. నేను అక్కడ నిలదొక్కుకోగలను. నా ఆశయాన్ని నిలుపుకోగలను.” చెప్పాడు నరేంద్ర.

పద్మావతి బిక్కుబిక్కున కొడుకునే చూస్తోంది.

అది గుర్తించి.. “అమ్మా.. నువ్వూ నాన్నా దిగులవ్వకండి. నేను బాగుంటాను. బాగుపడగలను. ఐనా ఇక్కడికి గంట ప్రయాణం. బస్సులు ఉన్నాయి. మీరు నన్ను చూడడానికి అప్పుడప్పుడు అటు ఇటు తిరిగొచ్చు. పైగా మీకూ ఫోన్ ఇచ్చాను. నాకూ ఫోన్ ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. పైగా వీడియో కాల్ సౌకర్యం ఉందాయె.” తల్లిదండ్రులను తేలిక పరుస్తున్నాడు నరేంద్ర.

“సరే. నీ ఇష్టం.” అనేసాడు నారాయణరావు.

“ఆరోగ్యం జాగ్రత్త. పచ్చళ్లు కట్టేను. అప్పడాలు పెట్టాను..” చెప్పుతోంది పద్మావతి.

అడ్డై.. “అరె. పర్వాలేదమ్మా. అది పల్లెటూరు ఐనా.. అక్కడ కూడా ఇక్కడి సరుకులన్నీ దొరుకుతున్నాయి. నేను చూసానుగా. నాకు కాస్తా కూస్తో వంట చేసే విధం నేర్పావు. అదే నేను చదువుకునే రోజుల్లోనూ, ఉద్యోగం చేసే రోజుల్లోనూ నాకు ఉపయోగపడింది. అదే ఇప్పుడు కూడా ఉపయోగపడుతోంది. వర్రీ కాకు.” చెప్పాడు నరేంద్ర.

“అమ్మ కదరా.” నసిగాడు నారాయణరావు.

నవ్వేసాడు నరేంద్ర.

“ప్చ్. ఒక్కడివాయె. అదే నా తంటా.” అనేసింది పద్మావతి.

“అమ్మా అమ్మ. నేను పై చదువులు చదువుకున్నది.. ఉద్యోగం చేసింది ఒంటరిగానే. నాకు అలవాటే. నువ్వు దిగులవ్వకు.” చెప్పాడు నరేంద్ర. అతడు బేగ్‌లో బట్టలు సర్దుతున్నాడు.

“నీకు పెళ్లి ఐపోతే నాకు ఏ దిగులు ఉండదురా.” గొణుగుతోంది పద్మావతి.

“ప్లీజ్. ప్లీజ్. అమ్మా.. సందు దొరగ్గానే నా పెళ్లికి గగ్గోలు చేయకు.” గడగడా అన్నాడు నరేంద్ర.

“ఏంరా. పెళ్లి మాట ప్రతి మారు దాటేస్తావేమిటి. అది ఐతే నీకు చేయి సాయం ఉంటుంది. మాకు చింత పోతోంది.” అంది పద్మావతి.

“అమ్మా. కూల్. కూల్. పెళ్లి చేసుకుంటాను. కొద్దిగా స్థిరపడని.” చెప్పాడు నరేంద్ర.

“స్థిరపడ్డం ఏంట్రా. మూడేళ్లు ఉద్యోగం చేసి బాగానే వెనుకేసుకు వచ్చావు. దాన్ని పట్టుకుపోయి పొలాలు కొన్నావు. మళ్లీ అంత త్వరగా కూడడానికి నువ్వు చేయబోతోంది ఉద్యోగమా.. వ్యవసాయం. ఆటు పోటు ఉంటాయి.” కలగ చేసుకున్నాడు నారాయణరావు.

“నాన్నా. చెప్పాగా. ఉద్యోగంలో నాకు సంతృప్తి రావడం లేదు. సాహసించే వ్యవసాయం వైపు మొగ్గాను. నా బుర్ర పదునుతో పైగా ఇష్టపడి చేపట్టబోతున్నాను కనుక.. వ్యవసాయంలో గట్టి సంతృప్తి సాధ్యమైనంత వేగంగానే పొందగలనని తోస్తోంది.” గట్టిగానే చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “కొద్ది సమయం ఇవ్వండి. పెళ్లి చేసుకొని మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను.” చెప్పాడు నరేంద్ర.

ఆ తల్లిదండ్రులు మరి ఏమీ అనలేదు.

పల్లెకు తనతో తీసుకుపోవలసిన వాటిని సర్దుకుంటున్నాడు నరేంద్ర.

***

మంగళవారం సాయంకాలం..

పల్లెలో..

తన అద్దె ఇంటి ముందు.. తనకు పొలాలు అమ్మిన ఆసాములతో సమావేశమై ఉన్నాడు నరేంద్ర.

అందుకు అప్పలనర్సయ్య సాయపడ్డాడు. అతనూ అక్కడే ఉన్నాడు.

వాళ్లంతా అప్పలనర్సయ్య ఏర్పాటు చేసిన కర్ర బెంచీల మీద కూర్చొని ఉన్నారు.

“మళ్లీ గుర్తు చేస్తున్నాను. నేను వ్యవసాయం వైపు మొగ్గింది ఒక నిర్దిష్టమైన ఆశయంతో. దానికి మీ సహాయ సహకారాలను కోరుకుంటున్నాను. పైగా వాటిని ఇచ్చి పుచ్చుకొనే ధోరణిన మీ నుండి ఆశిస్తున్నాను.” చెప్పాడు నరేంద్ర.

“అంటే బాబు.” సంశయ పడుతున్నాడు అప్పలనర్సయ్య.

“అదే పెద్దాయన. నాకు పొలాలు అమ్మిన వీళ్లే ఇకపై కూడా వాటిన ఎప్పటిలాగే పంటలు పండించాలి. ఇప్పుడు మాత్రం ప్రతి ఖర్చు నాది. వచ్చే పంట ఫలితాన్ని.. 75:25 లెక్కన ఉభయలం పంచుకుంటాం. అంటే.. డబ్బై ఐదు శాతం పంట వీళ్లకి.. ఇరవై ఐదు శాతం పంట నాకు. అలాగే నా అభిరుచి మేరకు నా పరివేక్షణ ఉంటుంది. ఇది నా ఆలోచన.” చెప్పాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య విస్తుపోయాడు.

“ఏంటి బాబూ..” నసిగాడు.

“అవును పెద్దాయన. నేను బాగా ఆలోచన చేసే చెప్పుతున్నాను. నాకు ఏదోలా లాభాలు పొందేయాలని లేదు. నా ‘ఆశయం’ నెరవేర్చుకోవాలి అన్నదే నా లక్ష్యం.” చెప్పాడు నరేంద్ర.

నరేంద్ర పట్టుని గుర్తిస్తున్న అప్పలనర్సయ్య.. “చిన్నోడివైనా భేష్‌గా ఆలోచించావు. వీళ్లు తమ తమ అవసరాల కొద్దీ పొలాలు మీకు అమ్ముకున్నారు. వాటి మీద రాబడులు పోయాయనుకుంటున్న వీళ్లకు భలేగా తిరిగి రాబడులు వాటి నుండే అందడం గొప్పే కదా. మీరు గొప్పొళ్లు బాబూ.” అన్నాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే.. “ఏమంటారు.” పొలాలు అమ్మిన వారిని చూస్తూ అడిగాడు.

వాళ్లు చిన్నగా తబ్బిబ్బగుట గుర్తించిన అప్పలనర్సయ్య.. “భలే. బూర్ల గంప నుండి బయటికి తోయబడ్డవాడు తిరిగి అందులోకి వచ్చిపడ్డట్టు.. భలే ఛాన్స్ కొట్టేరు.” అన్నాడు.

వాళ్లను చూస్తూ.. “దయచేసి ఒప్పుకోండి. నాతో కలిసి పని చేయండి.” అడిగాడు నరేంద్ర.

వాళ్లు సంకోచించకుండా సమ్మతించేసారు.

“గురువారం నుండి పనులు మొదలు పెడదాం. అవసరం బట్టి మీరు ఎవరి పొలం మటుకు వాళ్లు కూలీలను పురమాయించుకోండి. వారి ఖర్చులు నేను పెట్టుకుంటాను. ప్రస్తుతానికి ఉన్నదున్నట్టు కానీద్దాం. త్వరలో బ్యాంకు లోన్ ద్వారా బోరు.. ట్రాక్టర్ లాంటి ఆధునికీకరణలను సమకూర్చి పెడతాను.” చెప్పాడు నరేంద్ర.

అప్పలనర్సయ్యతో పాటు అక్కడి మిగతా వారు మంచిగా సంతసించారు.

“పల్లెకే కాదు నాకూ మీరు పెద్ద. మీ పెద్దరికం నేను సమ్మతిస్తాను.. కోరుకుంటున్నాను కూడా. దయచేసి నాకు సాయపడండి. మీ చేయూతకు నా ఉడతా భక్తి తప్పక ఉంటుంది.” చెప్పాడు అప్పలనర్సయ్యతో నరేంద్ర.

అప్పలనర్సయ్య పొంగిపొర్లాడు.

***

ఆ రాత్రి..

నరేంద్రకు ఫోన్ చేసాడు అప్పలనర్సయ్య.

“బాబూ.. భోజనం పంపనా.. మీరు మా ఇంటికి వస్తారా.” అడిగాడు.

“లేదండీ. చెప్పాగా. వంట సామాగ్రి కూడా తెచ్చుకున్నానని. నేను వండుకోగలను. ప్లీజ్. అట్టివేం ఇక వద్దు.” చెప్పాడు నరేంద్ర.

ఇంతకు ముందు.. నరేంద్ర ఈ పల్లెకు వచ్చి వెళ్తున్న రోజుల్లో నరేంద్ర తిళ్లును అప్పలనర్సయ్యే సమకూర్చాడు.

“అంతే అంటారా.” అప్పలనర్సయ్య డీలా పడ్డాడు.

“ఏమీ అనుకోకండి. నేను సర్దుకుపోగలను.” నిలకడగా చెప్పాడు నరేంద్ర.

“మా చెంత మొగమాట పడవద్దు. మీకేదైనా సమకూర్చపెట్టగలం.” నికరంగా చెప్పాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే.. “మీ రీతి చూస్తున్నాం. మీ మూలంగా మా పల్లె ఒక ఆదర్శవంతం అవుతోందని మాకనిపిస్తోంది.” చెప్పాడు.

“పెద్దాయనా.. మీ సహకారం ఉండాలి. నేను పక్కా ఆలోచనతో వ్యవసాయం లోకి వచ్చాను. అందరం కలిసి మొండుగా మొప్పును సాధిద్దాం.” గొప్పగా చెప్పాడు నరేంద్ర.

“తప్పక బాబూ.” సరదా అయ్యాడు అప్పలనరసయ్య.

“మనం రేపు కలుద్దాం.” చెప్పాడు నరేంద్ర.

ఆ ఫోన్ కాల్‌ని అప్పలనర్సయ్యే కట్ చేసాడు.

***

మర్నాడు..

నిద్ర లేచాడు నరేంద్ర. ఫోన్ ద్వారా టైం చూసుకున్నాడు. ఉదయం ఐదవుతోంది.

మొహం కడుక్కున్నాడు. కాస్తా ఎరిగిన ఊరు కావడంతో నిబ్బరంగా ఇంటి వీథి గుమ్మంకి తాళం పెట్టి.. ఆ పల్లె చెరువు గట్టును చేరాడు.

ఆ గట్టు వెడల్పుగా.. పొడవుగా ఉంది. చెరువు నిండుగా ఉంది.

సన్నని చీకటి ఉన్నా.. ఆ దారిన పల్చగానైనా సుబ్బరంగానే ఎవరెవరో పొలాల వైపుకు పోతున్నారు.

నరేంద్ర ఆ గట్టున ‘బ్రిస్క్ వాకింగ్’ చేపట్టాడు. ఆ గట్టున అటు ఇటుగా తిరుగుతున్నాడు.

చీకటి మెల్లిగా కరిగి పోయింది. వెల్తురు పొడుచుకు వచ్చింది.

నరేంద్ర ‘మోర్నింగ్ వాక్’ ఆపి ఇంటిని చేరాడు.

ఫోన్ లో టైం చూసుకున్నాడు. ఆరవుతోంది.

తలుపు తాళం తీసి.. ఇంటి లోపలికి పోతుండగా.. ఒకడు వచ్చాడు.

“అయ్యా. మా అయ్యగారు తమరికి పాలు ఇమ్మన్నారు.” అన్నాడు.

అప్పలనర్సయ్య చెంత అతడిని చూసి ఉన్నాడు నరేంద్ర.

అతడి చేతుల్లోని లోటాను చూస్తూనే.. “ఇన్ని పాలా.” ఆశ్చర్యపోయాడు.

“అయ్. ఆవు పాలు. ఇప్పుడే పితికినవి.” వాడు చెప్పాడు.

ఆ లోటాను అందుకొని.. “ఎంత.” అడిగాడు నరేంద్ర.

“అయ్యా.” అన్నాడు వాడు అమాయకంగా.

“ఈ పాలు ఖరీదు ఎంత.” తిరిగి అడిగాడు నరేంద్ర.

“అబ్బే. అట్టిదేమీ సెప్పలేదు మా అయ్యగారు.” నసిగాడు వాడు.

“సరే. నేను మీ అయ్యగారితో మాట్లాడతానులే.” చెప్పాడు నరేంద్ర.

వాడు వెళ్లి పోయాడు.

నరేంద్ర ఇంటిలోకి వెళ్లి వీథి గుమ్మం తలుపు మూసేసాడు.

పాలు లోటాను టీపాయ్ మీద పెట్టి.. అప్పలనర్సయ్యకు ఫోన్ చేసాడు.

నరేంద్ర ఫోన్ కాల్‌కి కనెక్ట్ ఐన అటు అప్పలనర్సయ్య.. “చెప్పండి బాబూ.” అన్నాడు.

“పాలు పంపారు. థాంక్స్.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మీ వాడు అడిగితే చెప్పలేక పోయాడు. ఈ పాలుకు ఎంత ఇవ్వాలి.” అడిగాడు.

“అయ్యో. అదేం మాట. పాలు మా ఇంటివి. మీరు చూసారుగా. మా ఇంటి ముందు సాలలోని ఆవుల్ని, గేదల్ని. మీరు మా ఇంటి మనిషి. మీకు డబ్బులుకు ఇవ్వడమేమిటి.” అలజడయ్యాడు అప్పలనర్సయ్య.

“అది కాదండీ..” చెప్పుతున్న నరేంద్రకు..

అడ్డై.. “అబ్బే. మీరు అడ్డు పడకండి. ఈ మాత్రం సాయం చేసుకొనే అవకాశం మాకు వదలండి.” చెప్పాడు అప్పలనర్సయ్య.

అప్పటికీ నరేంద్ర ఏదో అనబోయాడు. అప్పలనర్సయ్య అడ్డు పడిపోయాడు.

ఇక చేసేది లేక.. “సర్లేండి. నా వైపు ఏదైనా సాయంకి మీరు కూడా అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.” చెప్పాడు నరేంద్ర.

“మీరు మొగమాటాలు వదుకోవాలి బాబూ. మనం మనం ఒకటవుదామనుకుంటున్నప్పుడు ఇలాంటివి పట్టించు కోరాదు.” పెద్దరికం చూపాడు అప్పలనరసయ్య.

చిన్నగా నవ్వేసి.. “ఉంటా మరి.” అనేసాడు నరేంద్ర. ఆ వెంబడే కాల్ కట్ చేసేసాడు.

అప్పుడే ఇంటి వీథి గుమ్మం తలుపు ఎవరో తడుతున్నట్టు ఐంది. వెళ్లి తలుపు తీసాడు నరేంద్ర.

పనావిడ వచ్చింది. తనని అప్పలనర్సయ్యే అప్పచెప్పాడు. తను నరేంద్ర ఇంటిని ప్రతి రోజు ఉదయం పూట శుభ్రపరిచి వెళ్తుంది. అందుకు ఆవిడకి నెల వారీ జీతం చెల్లించేలా నరేంద్ర మాట్లాడుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version