[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అమ్మాజీకి బ్యాంకు పరీక్షలో పాఠాలు చెప్పడానికి సిద్ధమవుతాడు నరేంద్ర. ఆ సాయంత్రం గుడికి వెళ్ళి శ్యామలని కలుస్తాడు. క్రితం రాత్రి తొమ్మిదింటికి ఫోన్ చేయమని సైగ చేస్తే నరేంద్ర అర్థం చేసుకోలేకపోయినందుకు విసుక్కుంటుంది. ఆమె చేస్తుందో, తాను చెయ్యాలో అర్థం కాక ఫోన్ చెయ్యలేదంటాడు. ఇంతలో చినుకులు మొదలవుతాయి. ఇద్దరూ బయల్దేరిపోతారు. ఇంటికి చేరాకా కరెంట్ పోతుంది. శ్యామల ఫోన్ చేస్తే మాట్లాడాలని నరేంద్ర వీధి అరుగు మీద కూర్చుంటాడు. కాసేపయ్యాకా ఫోన్ చేస్తుంది. రెండు విషయాలలో మీ అభిప్రాయం కావాలంటూ కోటి చేసిన ప్రతిపాదన చెప్పి, ఏం చేయమంటారని అంటాడు. రెండోది చెప్పమంటుంది. అమ్మాజీ సంగతి చెప్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాంక్ పరీక్షలకి కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి, కానీ తనకి మేలు చేస్తుందో లేదో అని సంశయం వ్యక్తం చేస్తాడు. ఇంతలో కోటి తలుపు తీసి వంట పూర్తయిందని చెప్తాడు. వస్తున్నానని చెప్తాడు. కోటిని కొనసాగించమనీ, అమ్మాజీ విషయంలో – తానిక్కడకి ఎందుకు వచ్చాడో మరిచిపోకుండా, మెసలమని సూచిస్తుంది. సరేనంటాడు. మూడు నెలలు గడిచిపోతాయి. నరేంద్ర ప్రవేశపెట్టిన కొత్త విధానంతో పంటలు బాగా పండుతాయి. రైతులంతా ఆనందిస్తారు. అమ్మాజీ రిటెన్ టెస్ట్ పాసయి ఇంటర్వ్యూకి పిలుపు అందుకుంటుంంది. ఓ రోజు ఉదయమే శ్యామల ఫోన్ చేసి, వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదనీ, వెంటనే ఊరు బయల్దేరుతున్నాననీ చెప్తుంది. రానా అని నరేంద్ర అంటే వద్దంటుంది. నరేంద్ర అన్యమనస్కంగా ఉంటాడు. – ఇక చదవండి.]
అప్పలనర్సయ్య ఇంటిలో..
చావిడిన కూర్చొని కాఫీ తాగుతోంది అమ్మాజీ. ఆమె దరిన ఆమె తల్లిదండ్రులు కూడా కూర్చొని ఉన్నారు.
అప్పలనర్సయ్య న్యూస్ పేపరు చదువుకుంటున్నాడు. అన్నపూర్ణ పొడువు చిక్కుళ్లను తురుముకుంటుంది.
“నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లను నాన్నా.” మెల్లిగా కదిపింది అమ్మాజీ.
అన్నపూర్ణ ముందుగా రియాక్టయ్యింది.
“అదేమిటే. దాని కోసమే పుట్టానన్నట్టుగా ఇన్నాళ్లు మమ్మల్ని తంటాలు పెట్టావుగా.” అంది.
“ఏమ్మా.” కుదురుగానే అడిగాడు అప్పలనర్సయ్య.
“ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ పనుల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి..” చెప్పుతోంది అమ్మాజీ.
అడ్డై.. “మరే.. నరేంద్ర బాబు చలువ. నేను అనుకోలేనివి జరుగుతున్నాయి.” అన్నాడు.
అన్నపూర్ణ తన పనిలో తాను ఉంది.
“అదే నాన్నా.. వ్యవసాయంన ప్రవేశపెడుతున్న సాంకేతికత నాకు నచ్చింది. ఇన్నాళ్లు లేనిది.. ఇప్పుడు ఆ వరి పంటే మన పొలాల్లో ఎంత ఏపుగా వస్తోంది. దిగుబడి గొప్పగా ఉంటుంది.” ఒబ్బిడిగా మాట్లాడుతోంది అమ్మాజీ.
“అవును తల్లీ. నాకే గొప్పగా ఉంది. నరేంద్ర విధం బాగుంది. అతడు కొత్త పంటలు కూడా తీసుకు రాబోతున్నాడు. మనం వ్యవసాయంని గొప్పగా చూడగలం.” తనివిగా చెప్పాడు అప్పలనర్సయ్య.
“అవి సరే. ఇంతకీ నువ్వు కొలువుకు పోనంటావేమిటే.” కలగచేసుకుంది అన్నపూర్ణ.
“అవునమ్మా. నేను బ్యాంక్ జాబ్‌కై మోజు పడ్డాను. కానీ ఇక్కడి సాంకేతిక ప్రగతి చూసేక ఆలోచనల్లో పడ్డాను. నేను ఇటు మొగ్గేసినట్టే.” తన్మయమవుతోంది అమ్మాజీ.
అన్నపూర్ణ వింతవుతోంది.
“ఏమంటావమ్మా.” అడిగాడు అప్పలనర్సయ్య.
“నరేంద్ర కోచింగ్ విధంతో అతని నైపుణ్యము ఎఱిగాను. అతని చొరవన మేలైన సాగు తీరు అగుపిస్తోంది. సో.. నేను నా ఆలోచన మార్చుకున్నాను. ఓ నిర్ణయానికి వచ్చేసాను.” చెప్పింది అమ్మాజీ.
ఆ తల్లిదండ్రులు కూతురునే చూస్తున్నారు.
“నరేంద్ర సాంగత్యము ఉన్నతమైనదని తలుస్తున్నాను. అందుకే అతడితోనే ఉండి.. ఒక ఎన్జీవోని నిర్వహించాలనుకుంటున్నాను. వ్యవసాయానికి నా వంతు వన్నెని అద్దాలనుకుంటున్నాను.” చెప్పుతోంది అమ్మాజీ.
అడ్డై.. “హెహే. నీ అడ్డదిడ్డం వాగుడు ఆపు. గూబకెక్కేలా చెప్పు.” కసురుకుంది అన్నపూర్ణ.
ఆ తర్వాత.. “ఈ ఎన్జీవో ఏమిటమ్మా.” చిన్నగా అడిగాడు అప్పలనర్సయ్య.
“నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.. అంటే.. పేదరికం, పర్యావరణం లాంటి మొదలైన సమస్యలను పరిష్కరించగలిగే మరియు ఆర్థిక మెరుగుదలతో పాటు సాధికారత కోసం పనిచేసే ఒక సామాజిక వ్యవస్థ. అలాగే ఇది స్వచ్ఛంద వ్యక్తుల సమూహం.” చెప్పింది అమ్మాజీ.
“ఏమోనమ్మా. ఇవన్నీ మాకు కొత్త. కానీ నరేంద్ర బాబుతో కలిసి చేస్తానన్నావుగా. నాకు ఇష్టమే. నీ ఇష్ట ప్రకారమే కానీ.” చెప్పేసాడు అప్పలనర్సయ్య.
“ఏమిటయ్యా.. ఆ అబ్బాయిని అంతగా నమ్మేస్తున్నావు.” గుణుస్తోంది అన్నపూర్ణ.
“అవునే. ఆ అబ్బాయి తీరు అంత. నేనే కాదు ఇప్పుడు నాలా ఎంతో మంది అతనిని నమ్ముతున్నారు.. నమ్మబోతున్నారు.” చెప్పాడు అప్పలనర్సయ్య.
“ఏమో. మీరు మీరు చూసుకోండి.” లేచింది అన్నపూర్ణ తన ముందున్న సరుకులతో.
ఆ తర్వాత.. “నరేంద్రను తీసుకు వస్తాను. మాట్లాడమ్మా.” చెప్పాడు అప్పలనర్సయ్య.
తలాడించింది అమ్మాజీ. ఖాళీ టీ గ్లాస్ పట్టుకొని అక్కడ నుండి కదిలింది.
అప్పలనర్సయ్య తిరిగి న్యూస్ పేపరు చదవడం కొనసాగిస్తున్నాడు.
***
కోటి ఇచ్చిన ఇంటి తాళం అందుకొని.. బైక్‌తో మధ్యాహ్నం భోజనంకై ఇంటికి బయలు దేరాడు నరేంద్ర.
ఇంటికి వెళ్లి తన భోజనం కానిచ్చి.. తిరిగి పొలాల వైపుకి వచ్చాడు కోటి.
అప్పటికి రెండు మార్లు శ్యామలతో మాట్లాడేడు నరేంద్ర.
మొదటి సారికి.. బస్సు మారి తమ ఊరికి శ్యామల బయలుదేరిందని.. తను ఇంటిని చేరే సరికి సుమారుగా గంటన్నర పడుతోందని తెలుసుకున్నాడు.
రెండో సారికి.. శ్యామల తండ్రిని హాస్పిటల్‌లో ఆమె వెళ్లే సరికే చేర్చారని.. అతడు లంగ్స్ ప్రాబ్లమ్‌తో స్పృహ తప్పాడని.. ఇప్పుడు అతడికి తెలివి వచ్చిందని.. శ్యామల హాస్పిటల్ లోనే ఉన్నట్టు, ఆమె తల్లి తిరిగి ఇంటికి వెళ్లినట్టు తెలుసుకున్నాడు.
ప్రస్తుతం శ్యామల వైపు దృష్టి తగ్గి నరేంద్ర కుదురై ఉన్నాడు.
రిప్రెషై.. వడ్డన చేసుకొని.. భోజనం మొదలెట్టాడు.
***
సాయంకాలం పొలాల వైపు నుండి తన ఇంటికి నరేంద్రను తోడ్చుకు పోయాడు అప్పలనర్సయ్య.
ఆ ఇద్దరూ అమ్మాజీతో కలిసి కూర్చున్నారు ఆ ఇంటి హాలులో.
భర్తకి, నరేంద్రకి టీ కలుపుతోంది అన్నపూర్ణ.. వంట గదిలో.
“అమ్మా.. ఉదయం నాతో చెప్పింది నరేంద్ర బాబుకు చెప్పు.” చెప్పాడు అమ్మాజీతో అప్పలనర్సయ్య.
అమ్మాజీ తన ఆలోచనలను క్లుప్తంగానైనా వివరంగా చెప్పగలిగింది.
ఆ వెంబడే.. “మీతో నడుస్తాను. మీ సాయం అందించండి.” కోరింది.
చిన్నగా కదిలాడు నరేంద్ర.
పిమ్మట.. “గుడ్. స్వశక్తి మెచ్చుకోతగ్గదే. కానీ అవకాశాల్నే బేరీజు వేసుకోవాలి. నేను ఆలోచిస్తాను. చెప్తాను.” పొడి పొడిగా అనేసాడు. శ్యామల సూచనను అతడు మర్చిపోవడం లేదు. తొలుతగా ఆమె ఆభిప్రాయం పొందనదే తను ముందు పడరాదని అతడు గట్టిగా అనుకొని ఉన్నాడు.
“అలానే.” అనేసింది అమ్మాజీ.
అప్పుడే అన్నపూర్ణ పిలవడంతో వంట గదిలోకి వెళ్లింది.
“వాళ్లకి టీ ఇచ్చి నువ్వు రా. మనం టీ తాగుదాం.” చెప్పింది అన్నపూర్ణ.
తల్లి చెప్పినట్టు చేసింది అమ్మాజీ.
టీలు తాగుతూ తమ వ్యవసాయ సాగు ముచ్చట్లాడుకుంటున్నారు అప్పలనర్సయ్య, నరేంద్ర.
***
డిన్నర్ తర్వాత.. తలుపు మూసి.. ఇంటి అరుగు మీద కూర్చొని.. శ్యామలకు ఫోన్ చేసి.. తనతో మాట్లాడుతున్నాడు నరేంద్ర.
“ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు.” అడిగాడు నరేంద్ర.
“ఇంట్లో. అమ్మ హాస్పిటల్‌లో ఉంది.” అటు శ్యామల చెప్పింది.
“మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు.” అడిగాడు నరేంద్ర.
“పర్వాలేదు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. రేపు డిశ్ఛార్జి చేస్తారట.” చెప్పింది శ్యామల.
“భోజనమయ్యిందా.” అడిగాడు నరేంద్ర.
“లేదు. వంట చేస్తున్నాను. మీరు భోంచేసారా.” అటు శ్యామల ఆగి ఆగి మాట్లాడింది. తను బంగాళదుంప కోస్తోంది. ఫోన్ ఆమె ఎడమ చెవికి, ఎడమ భుజంకి మధ్య నొక్క బడి ఉంది.
“నా భోజనం ఇప్పుడే ఐంది.” చెప్పాడు నరేంద్ర.
అర నిముషం లోపునే.. “ఇంకేంటి.” అటు నుండి అంది శ్యామల.
“మీ భోజనం తర్వాత మాట్లాడుకుందాం.” చెప్పాడు నరేంద్ర.
“సరే. నేనే చేస్తాను.” చెప్పింది శ్యామల. ఫోన్ కాల్ కట్ చేసేసింది.
నరేంద్ర లేచి.. తలుపు తోసుకొని ఇంటి లోకి వెళ్లాడు.
అప్పటికే నరేంద్ర పడకకు పక్క పరిచేసేసి పెట్టాడు కోటి.
కోటి తన పక్క మీద నడుము వాల్చేసి ఉన్నాడు.
తలుపు దగ్గరగా మూసేసి.. వెళ్లి.. తన పక్క మీద కూర్చున్నాడు నరేంద్ర.
“గడియ పెట్టడం మరిచారు. నేను పెట్టేయనా సార్.” అడిగాడు కోటి.
“లేదు. ఫోన్ వస్తోంది. వెళ్లి మాట్లాడవలసి ఉంది.” చెప్పాడు నరేంద్ర.
“అరటి పండు ఇవ్వనా.” అడిగాడు కోటి.
“వద్దు. పొట్ట హెవీగా ఉంది.” చెప్పాడు నరేంద్ర.
“ఏం తిన్నారు లెండి. శ్యామల మేడమ్ సంగతికి తెగ ఆందోళన పడుతూనే ఉన్నారు.” అన్నాడు కోటి.
ఆ వెంబడే.. “ఇప్పుడు మేడమ్ నాన్నగారికి ఎలా ఉందట సార్.” అడిగాడు.
“పర్వాలేదట. గాభరా ఏమీ లేదు.” చెప్పాడు నరేంద్ర.
ఆగి.. “మేడమ్ మీకు ముందు నుండి తెలుసనుకుంటాను.” అన్నాడు కోటి.
“లేదు లేదు. ఇక్కడే అనుకోకుండా పరిచయమయ్యారు. మంచిని కోరుకొనే మంచామె.” చెప్పాడు నరేంద్ర.
కోటి ఏమీ అనలేదు.
నరేంద్ర చేతిలోని ఫోన్‌నే చూసుకుంటున్నాడు.
అరగంట లోపునే శ్యామల ఫోన్ చేస్తోంది.
అప్పటికే అటు తిరిగి కోటి పడుకున్నాడు.
నరేంద్ర లైటార్పి.. తలుపు మూసి.. అరుగున చేరాడు.
లైన్ కలిపి.. “అప్పుడే వంట.. భోజనం అయ్యిపోయాయా.” అడిగాడు ఆశ్చర్యంగా.
“ఆఁ. మాట్లాడండి.” అటు నుండి శ్యామల అంది. తను మంచం మీద నడుము వాల్చి ఉంది.
“అమ్మాజీ నా సాయం కోరుతోంది.” చెప్పాడు నరేంద్ర.
“మళ్ళీ దేనికంటా.” పెడసరంగా అడిగింది శ్యామల.
అమ్మాజీ చెప్పిందంతా చెప్పాడు నరేంద్ర.
శ్యామల గమ్మత్తయ్యింది.
“ఇదేమిటి. బ్యాంక్ జాబ్ కాదనుకోవడం ఏమిటి. ఎన్జీవో నడపాలను కోవడమేమిటి.” చికాకవుతోంది శ్యామల.
నరేంద్ర ఏమీ చెప్పలేక పోయాడు.
“మీరేమన్నారు.” టక్కున అడిగింది శ్యామల.
“ఇప్పుడు మీ అభిప్రాయం లేకుండా నా అంతట నేను ఏమీ చేయనుగా.” చెప్పాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “నేను ఆలోచించి చెప్తానని చెప్పి వచ్చేసాను.” చెప్పాడు నరేంద్ర.
శ్యామల కుదరయ్యింది. అంతలోనే చిన్నగా నవ్వుకుంటుంది.
అటు నుండి శ్యామల మాటలు లేకపోయే సరికి..
“హలో.. ఏమంటారు. మీ అభిప్రాయం ఏమిటి.” అడిగాడు నరేంద్ర.
“దీనికి అంత తొందరేముంది. నేను అక్కడికి వచ్చేక మాట్లాడుకుందాం.” తేల్చేసింది శ్యామల.
వెంటనే కోరి టాపిక్ మార్చేసింది.
“ఈ రోజు మీ పొలం పనులు ఎలా జరిగాయి.” అడిగింది.
నరేంద్ర చెప్పాడు.
“మరో పది రోజులు పాటు వర్షం రాకుంటా ఉంటే బాగుంటుందన్న మాట.. పంట బేషక్కుగా అందుకోడానికి.” సరదా పడుతోంది శ్యామల.
“అవును.” అన్నాడు నరేంద్ర.
“మీ కష్టం వృథా కాదులెండి.” చెప్పింది శ్యామల.
“థాంక్సండీ.” పొంగాడు నరేంద్ర.
ఆ తర్వాత.. రెండు నిముషాలలోపే ఆ ఇద్దరూ ఫోన్ సంభాషణ ఆపేసి.. నిద్రలకు ఉపక్రమించారు.
***
మర్నాడు..
ఉదయం.. పొలాల్లో..
అప్పలనర్సయ్య అడగ్గా..
“ఈ ఎన్జీవో వ్యవహారం చాలా సున్నితమైనది పెద్దాయన. ఆచి తూచి అడుగులు వేద్దాం. తొందర పడొద్దు. నేను చెప్పేవరకు ఆగాలి.” చెప్పాడు నరేంద్ర.
“సరే బాబూ. మీ ఇష్టం. అమ్మాయి అడగమంది.. అడిగాను. అంతే.. మీరు ఆలోచించుకోండి.” అనేసాడు అప్పలనర్సయ్య.
ఆ తర్వాత.. ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు.
***
రాత్రి..
అరుగున కూర్చొని.. శ్యామలకు ఫోన్ చేసి..
“మీరు ఎప్పుడు వస్తారు.” అడిగాడు నరేంద్ర.
“ఏం.” టక్కున అనేసింది శ్యామల.
ఆ వెంబడే.. “ఆ అమ్మాజీ కోసమా.” బరువుగా అడిగింది.
“అబ్బే. అది కాదు..” నసిగాడు నరేంద్ర.
“మరి.” బేలయ్యింది శ్యామల.
“మరి.. మరి..” తడబడుతున్నాడు నరేంద్ర.
“చెప్పండి సార్.” సర్రున అడిగింది శ్యామల.
“మరే. మరే. మిమ్మల్ని చూడాలనిపిస్తోంది..” ఆగాడు నరేంద్ర.
అటు శ్యామల.. తన ఎడమ చెవి వైపు ఫోన్ ని కుడి చెవి వైపుకు తొందర తొందరగా మార్చేసుకుంది. ఆ చెవిని నిక్కించింది.
“వీడియో కాల్ చేయవచ్చా.” అడుగుతున్నాడు నరేంద్ర.
శ్యామల ఒళ్లు చిన్నగా కంపిస్తోంది. తను వెంటనే మాట్లాడలేక పోతోంది.
“హలో. మీరు వద్దంటే వద్దు.” నరేంద్ర గాభరా పడుతున్నాడు.
అర నిముషం పిమ్మట.. అటు శ్యామల ఆ కాల్‌ని కట్ చేసేసింది.
నరేంద్ర బెంబేలవుతున్నాడు. తన ఫోన్‌నే చూస్తూ ఉండిపోయాడు.
అర నిముషం తర్వాత.. వచ్చిన శ్యామల వీడియో కాల్‌కు కనెక్టయ్యాడు.
తన ఫోన్ తెర మీద శ్యామల కనిపించేసరికి..
నరేంద్ర సంబరపడ్డాడు.
ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. మాట్లాడలేక పోతున్నాడు.
అటు శ్యామల నవ్వుతోంది.
“మీరు సరిగ్గా అగుపడడం లేదు. తక్కువ లైటింగ్2లో ఉన్నారా.” అడుగుతోంది.
నరేంద్ర కీ ఇచ్చిన బొమ్మలా కదిలాడు. ఆ వీథి లైట్ స్తంబం కిందకి వెళ్లాడు.
“ఆఁ. ఇప్పుడు బాగా అగుపిస్తున్నారు.” చెప్పింది శ్యామల. తను చాలా ఉత్సుకతన ఉంది.
నరేంద్ర తననే చూస్తూ ఉండిపోవడంతో..
“మాట్లాడరా.” అంది శ్యామల. తను నవ్వుతూనే ఉంది.
“మీరు నైటీలు వేస్తారా.” అడిగాడు నరేంద్ర.
“ఏయ్. ఏమిటా పరిశీలనా. ఛుప్.” చిరు కోపం అగుపరుస్తోంది శ్యామల.
“సారీ. సారీ.” గింజుకుంటున్నాడు నరేంద్ర.
‘అయ్యో రామా. మీరు ఇంత బెదురుగొడ్డు మాదిరియా.’ శ్యామల అనుకుంది. ముసి ముసిగా నవ్వింది.
నరేంద్ర తల గొక్కోవడం గుర్తించి..
“సరి సరే. నన్ను చూసారుగా. ఇక ఈ కాల్ ఆపుతాను. అమ్మ కదులుతోంది.” అంటూ తను ఉన్న గదిని చూపుతోంది శ్యామల.
ఆ గదిలో శ్యామల తల్లి పార్వతి, నాన్న అప్పారావు వేరు వేరు మంచాల మీద పడుకొని ఉన్నారు.
“మరి మీరు ఎక్కడ పడుకుంటారు.” అడిగాడు నరేంద్ర.
అతడికి ఆ కాల్ కొనసాగించాలని ఉంది.
“మా అమ్మ పక్కన.” నవ్వుతూనే ఉంది శ్యామల.
ఆమెనే చూస్తూ ఉన్నాడు నరేంద్ర.
శ్యామలే చెప్పింది.. “ఇంకా సెలవులు ఉన్నాయి. నాన్నని మరో మారు హాస్పిటల్‌లో చూపాలి. అవి కాగానే బయలుదేరుతున్నాను.”
“అవునా. సరే మరి.” గందికయ్యిపోతున్నాడు నరేంద్ర.
“గుడ్‌నైట్.” చెప్పేసింది శ్యామల.
తప్పక తలాడించేసి.. “గుడ్‌నైట్.” అనేసాడు నరేంద్ర.
అక్కడితో ఆ ఫోన్ల వీడియో కనెక్టవిటీ కట్ కాబడింది.. శ్యామల నుండే.
ఇటు నరేంద్ర ఇంటిలోకి కాళ్లీడ్చుకుంటూ వెళ్లగలిగాడు.
అటు శ్యామల బరువెక్కిన తన ఒళ్లును తల్లి మంచం ఓరన పర్చేసింది.
(ఇంకా ఉంది)