Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-16

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[శ్యామల ఇంట్లో, ఆమె, నరేంద్ర మాట్లాడుకుంటూంటారు. అమ్మాజీ విషయం కూడా తెల్చేస్తే బావుంటుందని అంటాడు నరేంద్ర. శ్యామల చికాకు పడుతుంది. ఉదయం తాను అప్పలనర్సయ్య ఇంటికెళ్తే అమ్మాజీ అడిగిందని చెప్తాడు. ఏమడిగిందని శ్యామల అంటే, “అన్నా.. ఎన్జీవో తీరు బాగుంది. అందుకు నాకు సాయపడండి అంది.” అని చెప్తాడు. అదే మాటని మళ్ళీ ఇంకోసారి చెప్పించుకుంటుంది శ్యామల. అమ్మాజీ ప్రతిపాదన మీకేమైనా ఉపయోగపడుతుందోమో ఆలోచిద్దామని నరేంద్రతో అంటుంది. కాసేపయ్యాక, ఇంటికి వచ్చేస్తాడు నరేంద్ర. మర్నాడు హైస్కూల్లో శ్యామల క్లాసులో ఉండగా, స్టాఫ్ రూమ్ లో ఉన్న టీచర్ల మధ్య శ్యామల నరేంద్ర విషయం చర్లల్లోకి వస్తుంది. సోషల్ టీచర్, ఇంగ్లీషు టీచర్ చెడుగా మాట్లాడితే, డ్రిల్ మాస్టారూ, తెలుగు మాస్టారు అడ్డుకుంటారు. ఇలాంటి విషయాలు మాట్లాడద్దని తెలుగు మాస్టారు గట్టిగా చెప్పడంతో, అప్పటికి సోషల్ టీచర్, ఇంగ్లీషు టీచర్ మౌనం వహిస్తారు. కాసేపయ్యాక, తన పీరియడ్ ముగియడంతో శ్యామల్ స్టాఫ్ రూమ్‍కి వస్తుంది. అప్పుడు అక్కడ తెలుగు మాస్టారొక్కరే ఉంటారు. అంతకు ముందు స్టాప్ రూమ్‍లో జరిగిన చర్చ గురించి చెప్పి, శ్యామలను జాగ్రత్తగా ఉండమని అంటాడు. తనని అపార్థం చేసుకోనందుకు, ఆయనకు, డ్రిల్ మాస్టార్‍కి కృతజ్ఞతలు చెప్తుంది. విరామం కావడంతో టీచింగ్ స్టాప్ అంతా స్టాఫ్‌కి రూమ్‍కి చేరుతారు. అప్పుడు శ్యామల అందరినీ ఉద్దేశించి మాట్లాడుతుంది. తనను హేళన చేసేవాళ్ళనీ, తన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళని తాను పట్టించుకోననీ, తానేం చేస్తున్నానో తనకి బాగా తెలుసని, తన హద్దులు కూడా తనకి తెలుసని చెప్తుంది. మూడు రోజులయ్యాక, ఓ రాత్రి నరేంద్ర శ్యామలకి ఫోన్ చేస్తాడు. తెలుగు మాస్టార్ గారి అమ్మాయి పుష్పవతి అయిందనీ, ఆ ఫంక్షన్‍కి తనని కూడా పిలిచారని చెప్పి, కానుక ఏమయినా ఇవ్వాలా అని అడుగుతాడు. డబ్బులిచ్చేయమని సూచిస్తుంది శ్యామల. మర్నాడు పొలంలో పనులయ్యాకా, ఫంక్షన్‍కి బయల్దేరుతాడు నరేంద్ర. – ఇక చదవండి.]

ధ్యాహ్నం.. పండెండు పదమూడు.

నరేంద్రని తెలుగు టీచర్ చక్కగా రిసీవ్ చేసుకున్నాడు.

షామియా నీడన.. ఓ పక్కగా కుర్చీ వేసి కూర్చుండ పెట్టాడు. కొబ్బరి బోండా ఒక్కటి కొట్టించి, స్ట్రా వేయించి, స్వయంగా ఇచ్చాడు. చెప్పి.. మిగతా పనులకై కదిలాడు.

నరేంద్ర చుట్టూ చూస్తున్నాడు.

శ్యామల కనిపించలేదు. కానీ అప్పలనర్సయ్య కుటుంబ సభ్యులు ఓ పక్కన భోంచేస్తూ కనిపించారు. వాళ్లు అప్పటికి నరేంద్రను చూడలేదు.

కొబ్బరి నీళ్లని తాగి.. నరేంద్ర లేచి.. ఖాళీ బోండాన్ని ఓ పక్కగా పడేసి.. తిరిగి వచ్చి కూర్చున్నాడు.

నిముషాలు గడుస్తుండగా అక్కడికి శ్యామల వచ్చింది. నరేంద్రని నవ్వుతూ పలకరించింది.

నరేంద్ర లేచి ఓ పక్కగా ఉన్న కుర్చీని తేబోతుండగా..

“ప్లీజ్. నేను తెచ్చుకుంటా.” ఆ కుర్చీని తీసుకుంది.

దానిని నరేంద్ర కుర్చీకి దరిన వేసుకొని కూర్చుంటూ..

“మీరూ కూర్చొండి.” అంది.

ఆ వెంబడే.. “ఎంతసేపయ్యింది వచ్చి.” అడిగింది.

“ఇప్పుడే. ఫ్యూమినిట్స్ బేక్.” చెప్పాడు నరేంద్ర.

శ్యామల చేతిలోని బట్టల కవర్ ని చూస్తూ..

“మీరు బట్టలు ఇస్తున్నారా.” అడిగాడు.

“అవును. డ్రిల్ టీచర్ పురం వెళ్తున్నట్టు చెప్పితే.. ఓ డ్రస్ తెప్పించాను.” చెప్పింది శ్యామల.

“నాకూ చెప్పవలసింది. నేనూ బట్టలు పెట్టేవాడిని.” అన్నాడు నరేంద్ర.

“మిమ్మల్ని ఫంక్షన్ కి పిలుస్తారని నాకు అప్పటికి తెలియదు.” మెల్లిగా చెప్పింది శ్యామల.

అప్పుడే అక్కడికి తెలుగు టీచర్ వచ్చాడు.

శ్యామలని పలకరించి.. “కొబ్బరి బోండా తెప్పిస్తాను.” చెప్పాడు.

“వద్దొద్దు.” అనేసింది శ్యామల.

“మొదటి పంక్తి ముగియబోతోంది. తర్వాత పంక్తికి మిమ్మల్ని పిలుస్తాను.” చెప్పాడు తెలుగు టీచర్.

ఆ వెంబడే.. “తల్లీ.. మీరు సార్‌కి కంపెనీ ఇవ్వండి.” చెప్పాడు శ్యామలతో.

“మీరు మీ పనులు కానివ్వండి.” చెప్పింది శ్యామల.

తెలుగు టీచర్ వెళ్లిపోయాడు.

“ఏమైనా విలేజీ తీరు వేరు. బాగుంటుంది.” అన్నాడు నరేంద్ర.

“ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా ‘మంచి పంట మధ్యన కలుపు మొక్క’ల్లా వలస తెగుళ్లు చేరుతున్నాయి.” శ్యామల దిగులవుతోంది.. ఇంగ్లీష్ టీచర్స్ లాంటి వాళ్ల తీరుని నెమరు వేసుకుంటూ.

అప్పుడే అక్కడికి ఒకాయన వచ్చాడు.

నరేంద్రతో.. “నమస్కారమండీ. నేను రెడ్డప్పనాయుడిని. మీతో మాట్లాడాలి.” చెప్పాడు.

“మీ పరిచయం లేదు. చెప్పండి.” నెమ్మదిగా అన్నాడు నరేంద్ర.

రెడ్డప్పనాయుడు చుట్టూ చూసాడు. దూరాన ఒక బల్లని చూసాడు. అటు కదిలాడు.

అప్పుడే.. “ఇతడు ఈ ఊరి పంచాయితీ ప్రెసిడెంట్ సయ్యమ్మ భర్త.” చెప్పగలిగింది శ్యామల.

అంతలోనే అక్కడికి చేరి.. చేతుల్లోని బల్లని వేసుక్కూర్చున్నాడు రెడ్డప్పనాయుడు.

“తమరి గురించి తెలుసు. మీ పనులు బాగుంటున్నాయి.” చెప్పాడు.

నరేంద్ర ఏమీ అనలేదు.

“తమరు అప్పలనర్సయ్య పక్క మనిషి కనుక తమరిని కలవలేదు. మీ పనితనంకి గొప్పయ్యి చాలా మంది మా పక్క వాళ్లు పోరుతున్నారు. అందుకే కలుస్తున్నాను. తమరు మాకూ సాయం అవ్వండి.” చెప్పుతున్నాడు రెడ్డప్పనాయుడు.

నరేంద్ర.. శ్యామలని చూసాడు.

తను రెడ్డప్పనాయుడుని చూస్తోంది.

“మాకూ పొలాలు ఉన్నాయి. మీతో కూడి మేమూ పనిచేస్తాం. మీరు వాళ్లకి లాగే మాకూ ఇవ్వొచ్చు. మీ పంట పనులు కొత్తగా ఉన్నాయి. మునుపెన్నడూ చూడని పంట దిగుబడిని మీ మూలంగానే అటు వాళ్ల వైపున చూసాం.” మాట్లాడుతూనే ఉన్నాడు రెడ్డప్పనాయుడు.

అప్పుడే కొద్దిపాటి గందిక వినిపించగా.. అటు చూసాడు నరేంద్ర.

పంక్తి భోజనాలు ముగిసినట్టుంది. అంతా లేచి కదులుతున్నారు.

రెడ్డప్పనాయుడు మాట్లాడుతూనే ఉన్నాడు.

అంతలోనే అక్కడికి తెలుగు టీచర్ వచ్చాడు.

రెడ్డప్పనాయుడును చూస్తూనే.. “సయ్యమ్మగారు రాలేదా.” అడిగాడు.

“వస్తోంది వస్తోంది. వార్డ్ మెంబర్స్ కూడేక వస్తోంది. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చారని తెలిసి నేను ఇలా వచ్చేసాను.” చెప్పాడు రెడ్డప్పనాయుడు.

“ఐతే మీరు మీ వాళ్ల వచ్చే వరకు ఆగుతారా.” అడిగాడు తెలుగు టీచర్.

“మరి అంతేగా. వాళ్లని వదిలి కూర్చొంటే మాట పడనూ.” నవ్వేడు రెడ్డప్పనాయుడు.

“ఐతే.. రెండో పంక్తి మొదలవుతోంది. వీళ్లని కూర్చుండ పెడతాను.” చెప్పాడు తెలుగు టీచర్.

ఆ వెంబడే.. నరేంద్రని, శ్యామలని భోజనంకి లేపాడు.

రెడ్డప్పనాయుడు ఏమీ అనలేకపోయాడు.

“తర్వాత మనం మాట్లాడదాం.” రెడ్డప్పనాయుడుతో చెప్పాడు నరేంద్ర.

తెలుగు టీచర్ వెంట రాగా.. నరేంద్ర, శ్యామల.. పుష్పవతైన అమ్మాయి వద్దకు వెళ్లారు. అక్షతలు వేసారు.

శ్యామల బట్టల కవర్‌ని ఆ అమ్మాయికి ఇచ్చింది. పిమ్మట నరేంద్ర వంక చూసింది. చిన్నగా నవ్వింది.

నరేంద్ర పర్సులో పక్కగా మడత పెట్టి ఉంచిన నోట్లకు రెండు నాణెలు కలిపి ఆ అమ్మాయికి అందించాడు.

అక్కడిలో ఒకామె ఈ ఇద్దరికి రిటర్న్ గిఫ్టు కవర్లు ఇవ్వబోతుండగా..

“వద్దు. నేను వీళ్ల ఇళ్లకి పంపిస్తాలే.” అన్నాడు తెలుగు టీచర్.

తర్వాత.. వీళ్లని తీసుకు పోయి.. పంక్తి భోజనాల వద్ద.. ఈ ఇద్దరికీ కేటాయించిన కుర్చీల్లో కూర్చోబెట్టాడు.

నరేంద్ర, శ్యామల పక్క పక్కనే భోజనాలకి కూర్చున్నారు.

వడ్డన మొదలు కావాలి. రెండో ఫంక్తికి వస్తున్న వాళ్లు సర్దుకు కూర్చుంటున్నారు.

తెలుగు టీచర్ మరో వైపుకు వెళ్తున్నాడు.

అప్పుడే నరేంద్ర దగ్గరికి అప్పలనర్సయ్య కుటుంబం చేరింది.

పలకరింపుల తర్వాత..

“ఆ రెడ్డప్పనాయుడు మీతో మాట్లాడుతున్నాడేమిటి బాబూ.” అవస్థవుతున్నాడు అప్పలనర్సయ్య.

“తాము మనతో కలుస్తామంటున్నాడు.” ఆగి చెప్పాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య ఏదో అనబోయాడు.

అడ్డై.. “మీతో మాట్లాడందే ఏమీ కాదు. తర్వాత మనం మాట్లాడదాం.” చెప్పాడు నరేంద్ర. తను కాస్తా ఇబ్బంది పడుతున్నాడు.

అది గ్రహించిన శ్యామల చొరవే.. అమ్మాజీతో.. “నరేంద్ర గారు మీ గురించి మాట్లాడేరు. మీది ఒక చొరవైన నిర్ణయం.” చెప్పింది.

అమ్మాజీ చిన్నగా తలాడించింది.

“మీ నరేంద్ర అన్నయ్య మంచి పనిని చేపట్టి ఉన్నారు. మీరు కూడా తోడవ్వండి. మీరు పారల్లెల్‌గా పని చేస్తే మేలు అవుతోంది.” చక్కగా చెప్పింది శ్యామల.

అంతలోనే వడ్డన మొదలైంది.

అక్కడికి స్వీట్స్‌తో తెలుగు టీచర్ వచ్చాడు.

“మనం సాయంకాలం కలుద్దాం.” చెప్పాడు నరేంద్ర.. అప్పలనర్సయ్యతో.

“అలానే.” అనేసి..

శ్యామలతో.. “అమ్మాయి.. మీ మాటలు బాగున్నాయి. మీరు కూడా అబ్బాయితో రండి.” చెప్పాడు.

ఆ వెంబడే..

నరేంద్రతో.. “సాయంకాలం టీచరమ్మని తీసుకొని ఇంటికిరా బాబూ.” చెప్పాడు.

శ్యామలని నరేంద్ర చూస్తాడు.

అప్పటికి శ్యామల నరేంద్రనే చూస్తుంటుంది.

చిన్నగా తలాడించింది.

“తప్పక వస్తాం పెద్దాయన.” అప్పలనర్సయ్యతో నరేంద్ర చెప్పేయగలిగాడు. అతడు హుషారయ్యాడు.

అప్పలనర్సయ్య వాళ్లు ఇంటికి బయలుదేరారు.

నరేంద్ర, శ్యామల భోంచేయడం మొదలెట్టారు.

“నాకు అన్నీ కలిసొస్తున్నాయి.” మెల్లిగా అన్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇదంతా మీ మూలంగానే.” గొణిగేసాడు శ్యామలనే చూస్తూ.

శ్యామల చిన్నగా నవ్వేసింది.

“మీ ప్లో మీదే. ఎక్కడా నన్ను వదలరేం.” మెల్లిగా అంది.

“నేచురల్. నేను చెప్పేది అతిశయోక్తి కాదుగా.” అన్నాడు నరేంద్ర.

“సరిసరే. తినండి.” అంది శ్యామల.

నిముషం తర్వాత.. “మరి.. అప్పలనర్సయ్య గారింటికి ఎలా వెళ్దాం.” అడిగాడు నరేంద్ర.

“కలిసే వెళ్దాం.” అనేసింది శ్యామల.

ఆ వెంబడే.. “మీరు మా ఇంటికి రండి. మనం కలిసి వెళ్దాం.” చెప్పింది.

“నా బైక్ మీద..” ఉత్సాహ పడుతున్నాడు నరేంద్ర.

“అవును.” అనేసింది శ్యామల ఈజీగా.

అప్పటి వరకు ఓ మార్జెన్ మెయిన్‌టెయిన్ చేసిన తను.. జరిగిన తన టీచింగ్ స్టాఫ్ సంఘటన తర్వాత.. ఆ మార్జిన్‌ని క్రాస్ చేయుటకు మొగ్గుతోంది శ్యామల.

వాళ్ల భోజనాలు కొనసాగుతున్నాయి.

***

సాయంకాలం ఐదుంపావు అవుతోంది.

అప్పలనర్సయ్య ఇంటికి నరేంద్ర, శ్యామల వెళ్లారు.. నరేంద్ర బైక్ మీద.

ఆ కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు.

“కాఫీలు కలిపి తెస్తా.” అన్నపూర్ణ అంది.

“లేదమ్మా. శ్యామలగారింటిలో మా కాఫీలయ్యాయి.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “శ్యామలగారు మంచి సూచనలు చేసారు.” చెప్పాడు.

వెంటనే.. “వీరికి మీరే తెల్పండి” శ్యామలకి చెప్పాడు.

“నరేంద్ర గారి కొత్త ఒరవడికి.. అమ్మాజీ విధం బాగా సూటవ్వుతోంది. ఎలా అంటే.. వీరు కొత్త పంటలు చేపట్టబోతున్నారు. అందులో ఆరోగ్యకరమైన, తేలికైన చిరుధాన్యాల పంట ఒకటి. వాటి అవసరం ఇప్పుడు.. పురం, పట్నం, నగరం లాంటి అన్నింటా అంతా గుర్తిస్తున్నారు. వాటి మార్కెట్ చాలా విస్తృత పడుతోంది. కనుక వాటిని పండిస్తూ.. వాటిని సాన పెట్టి ఫుడ్‌గా రూపొందించే ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్స్‌ని అమ్మాజీ చేత పెట్టిస్తే బాగుంటుంది. అలాగే పోను పోను మార్కెటింగ్‌నీ స్వంతంగా చేపట్టగలగాలి. అప్పుడు ఆశిస్తున్న ఆభివృద్ధి చక్కగా తప్పక, త్వరగా అందగలదు.” ఆగింది శ్యామల.

మిగతా వారంతా ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నారు.

“దీనికి ముందు.. క్రమంగా పంట పొలాలను సమకూర్చుకోవాలి. అలా ఐతేనే లాట్‌గా ఇట్టి వ్యవసాయ ఉత్పత్తులను ఒక దాని వెంట ఒకటిగా పెంచుకోవచ్చు. వివిధ ఉత్పత్తులతోనే ప్రతిఫలం బాగుంటుంది. అప్పుడే మరిన్ని వివిధ స్వచ్ఛతతో కూడిన పనులు చేపట్టే అవకాశం కలుగుతోంది. సాహసం పుడుతోంది. లక్ష్యం పెరుగుతోంది.” చెప్పడం ఆపింది శ్యామల.

“అమ్మాయి.. నువ్వు చెప్పేది అర్థం అవుతోంది. మాకా వైపు కొత్త. కనుక కాస్తా గందరగోళంగా ఉంది.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“పెద్దాయనా.. చెప్పేది చేయగలిగితేనే ఫలితాలు కనిపిస్తాయి. కనిపించేవే అర్థమగుతాయి.” చెప్పాడు నరేంద్ర.

“మీవి మంచి మంచి ఆలోచనలే. మీ వెంటే మేముంటామని ఎప్పుడో చెప్పేసాను. ఇకపై మీరు ఎలా అంటే అలానే బాబూ.” చెప్పాడు అప్పలనర్సయ్య.

అన్నపూర్ణ కలుగచేసుకోంది.

“అమ్మాజీ మక్కువ పడుతోంది. దానిని మీరే చూసుకోవాలి బాబు. మీ పనితనాన్ని వీళ్లు ఇంట్లో రోజూ మెచ్చుకుంటున్నారు. అన్నగా చెల్లికి తోడవ్వు బాబూ.”

అప్పుడే శ్యామల తల తిప్పి నరేంద్రని చూసింది.

నరేంద్ర అప్పటికి శ్యామలనే చూస్తున్నాడు.

చిన్నగా నవ్వి.. “అన్నగా బాధ్యత తీసుకోండి. అమ్మాజీకి చేదోడు కండి.” చెప్పింది శ్యామల. తను మనసు తేలికపడి ఉంది.

శ్యామల చెప్పేక..

“పెద్దాయన.. అమ్మాజీ సంగతి ఐనట్టే. మేము కలిసే పనిచేస్తాం.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ఇప్పుడు మీరు చెప్పండి. రెడ్డప్పనాయుడు వాళ్ల గురించి.” అప్పలనర్సయ్యని అడిగాడు.

అప్పలనర్సయ్య కాస్తా చలించాడు.

పిమ్మట.. “వాడు ముందు మా వాడే. వాడిదో మచ్చు. మా వాడని కాదనేసి.. అవతల వాడ పిల్లని ప్రేమించి మనువాడేడు. మేము వెలి పెట్టాం. కోటా ప్రకారం ఆ పిల్ల గత రెండు దఫాలుగా సర్పంచి కాగలిగింది. దాంతో వాడు మమ్మల్ని కన్నెత్తి చూసేదే లేదు. ఇప్పుడు.. ఏం పుట్టిందో. మీ ద్వారా కలవడానికి చూస్తున్నాడు.” చెప్పాడు.

నరేంద్ర.. శ్యామలని చూసాడు.

శ్యామల చిన్నగా కదిలి.. చొరవగా..

“చూడండి.. గాలి, నీరు, ఎండ, వాన లాంటివి అందరివీ. అవి మనుషుల్లో తేడాలు చూడవు. అవి అందరికీ ఒకేలా అందుతుంటాయి. అటువంటప్పుడు వాటికి లేని పట్టింపులు, రాని పంతాలు మనకు అవసరమా.” అంది.

అప్పుడే.. “మనిషి సంఘజీవి. మనిషి పుట్టుక ఒక వరం. దాన్ని మనిషే కాపాడుకోవాలి. కనీసం మనమైనా ముందుందాం. అందర్నీ కలుపుకు పోయేలా నడుద్దాం. మనం మార్పు ఫలితాన్ని చూపిద్దాం.” చెప్పాడు నరేంద్ర.

శ్యామల ఉబ్బి.. నరేంద్రనే తనివిగా చూస్తూ..

“వెల్ సెడ్. నరేంద్రగారు పట్టు గొప్పది. మనం వీరితో కలుద్దాం. కొద్ది మందికైనా ఆదర్శమవుదాం.” పూనకం పట్టిన దానిలా కదిలిపోతూ అంది.

అమ్మాజీ అప్పుడే హుషారై..

“వీళ్ల ఆలోచనా తీరు బాగుంది. వీళ్లతో కలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు.” అంది.

దాంతో అప్పలనర్సయ్య వంతై..

“సరే బాబూ.. మీరు చెప్పింది బాగుంటుంది. మీరన్నదే కానీయండి. ఆ రెడ్డప్పనాయుడుతో మనం మాట్లాడదాం.” అనేసాడు.

“గుడ్. ఇదే స్పిరిట్‌తో కలిసి పని చేద్దాం. సరైనా మార్గాన్న అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం.” అన్నాడు నరేంద్ర.

అక్కడి వారు ముక్తకంఠంన ‘సై’ పలికారు.

తిరిగి అప్పలనర్సయ్య ఇంటి నుండి బయలు దేరారు నరేంద్ర, శ్యామల.

దారిలో..

“నన్ను శివాలయం వద్దకు తీసుకు వెళ్లండి.” అంది శ్యామల.

“ఇప్పుడా. చీకటి పడింది.” అన్నాడు నరేంద్ర.

“ప్లీజ్.” అంది శ్యామల.

మారు మాట ఆడక.. నేరుగా శివాలయం వైపు బైక్‌ని పోనిచ్చాడు నరేంద్ర.

వాళ్లు అక్కడికి వెళ్లే సరికి లైట్లు వెలిగి ఉండడంతో.. ఆ ప్రాంతం వెలుగుతో బాగుంది.

ఎప్పటిలాగే జోళ్లు వదిలి మండపం ఎక్కారు ఆ ఇద్దరు.

అక్కడ కూర్చోబోతున్న నరేంద్రని వారించి..

“రండి. దేవుడికి మొక్కుకుందాం. అందుకై ఇక్కడికి తెచ్చాను.” చెప్పింది శ్యామల.

తలుపులు మూసిన నిలువెత్తుకి మించిన ఆ ఆలయ ద్వారబందం ముందు నిల్చింది శ్యామల.

కళ్లు మూసుకొని చేతులు జోడించింది.

అది చూసి.. నరేంద్ర అలానే చేసాడు.

తర్వాత ముందుగా శ్యామలే కళ్లు తెరిచింది. కదిలింది. విభూతి ఉన్న గోడ గూటిని చేరి నిల్చుంది.

నరేంద్ర కళ్లు విప్పాడు.

అతడిని రమ్మంది.

నరేంద్ర ఆమె వద్దకు వెళ్లగానే.. విభూతి బొట్టు పెట్టింది.

ఇద్దరూ అక్కడ నుండి బైక్ వైపు నడిచారు జోళ్లేసుకొని.

దార్లో..

“మీ శుభంకై మొక్కుకున్నాను.” చెప్పుతోంది శ్యామల.

“అవునా. నేను ‘శివా శివా’ అనుకున్నాను.” చెప్పాడు నరేంద్ర.

‘నువ్వెప్పటికి అర్థమవుతావురా.’ మృదువుగా అనుకుంది శ్యామల.

నరేంద్ర.. శ్యామలని ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేసి ఇంటికి రిటర్నయ్యాడు.

ఇంటికి చేరిన నరేంద్రతో..

“తెలుగు మాస్టార్ వచ్చి.. దీనిని మీకు ఇమ్మని ఇచ్చారు.” చెప్పాడు కోటి.

“ఓ. రిటర్న్ గిఫ్టా.” దానిని అందుకుంటూ అన్నాడు నరేంద్ర.

అందులో స్టీల్ టిఫిన్ బాక్సులో ఉన్న స్వీట్స్‌ని కోటితో పంచుకుంటూ తింటున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version