[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[పట్నంలో శ్యామల అమ్మవాళ్ళ ఇంట్లో ఆమె తల్లి పార్వతి పిల్లలకి ట్యూషన్లు చెప్తూ ఉంటుంది. చీకటి పడుతుండటంతో, వంటింట్లోకి వెళ్ళి కుక్కర్ పెట్టి వస్తుంది. పిల్లలు వ్రాసిన నోట్స్ చూస్తూ, కుక్కర్ మూడు విజిల్స్ రాగానే ఆపేసి వచ్చి కూర్చుంటుంది. కాసేపటికి ఆమె భర్త అప్పారావు ఇంటికి వస్తాడు. అతను తాగి ఉంటాడు. నేరుగా లోపలికి వెళ్ళి, ముఖం కాళ్ళూచేతులు కడుక్కుని హల్లోకి వస్తాడు. వంటయ్యిందా అని అడిగితే, పార్వతి లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఏర్పాటు చేసి, తినమని చెప్పి, ట్యూషన్ చెప్పడం కొనసాగిస్తుంది. కాసేపయ్యాకా, పిల్లలు వెళ్ళిపోతారు. తాను కూడా తిని నిద్రపోతుంది. అక్కడ గ్రామంలో నరేంద్ర, అప్పలనర్సయ్య మాట్లాడుకుంటూంటారు. తన ప్రతిపాదనల గురించి మాట్లాడడానికి సమీప పొలాల రైతులతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తాడు నరేంద్ర. ఆ ఏర్పాట్లు అప్పలనర్సయ్య చూస్తుంటాడు. హైస్కూలు టీచర్ శ్యామల్ పరిచయమయిందనీ, బడిలో టీచర్లకి కూడా మన ఆలోచనలు నచ్చుతున్నాయని చెప్పిందని ఆయనతో అంటాడు నరేంద్ర. టీచర్లని కూడా రేపటి సమావేశానికి పిలుద్దామని అంటాడు నరేంద్ర. సరేనంటాడు అప్పలనర్సయ్య. అక్కడ పట్నంలో నరేంద్ర తల్లిదండ్రులు కొడుకు ప్రయత్నాల గురించి మాట్లాడుకుంటారు. తల్లి సంశయిస్తుంటే, తండ్రి ఆమెకు ధైర్యం చెప్తాడు. గ్రామంలో, మర్నాడు ఉదయం నరేంద్ర ముందు శ్యామలనీ, ఆమె ద్వారా ఇతర టీచర్లనీ కలిసి తమ సమావేశానికి ఆహ్వానిస్తాడు. పొలంలో పనిచేస్తున్న సోములు – మోటర్ ఆగిపోయిందని, ఆయిల్ కావాలని చెబితే, అతనికి తాళంచెవులిచ్చిన తన ఇంట్లో ఉన్న ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాని తెమ్మంటాడు నరేంద్ర. పొలంలో పనిచేస్తున్న జోగులు – నరేంద్రకి ఓ సైకిలన్నా ఉంటే బావుంటుందని అంటాడు. తనకి బైక్ ఉందని, కానీ అది ఇక్కడ అంత ఉపయోగపడదని తేలేదని చెప్తాడు నరేంద్ర. మోటర్‍కి కరెంట్ కనెక్షన్ రాగానే పొలంలోనే చిన్న గది కట్టిస్తాననీ, అవసరమైనవన్నీ అక్కడే పెట్టుకోవచ్చని అంటాడు. – ఇక చదవండి.]
ముందుగా అనుకున్నట్టే.. నరేంద్ర ఇంటి ముందు.. కావలసిన వాళ్లని రప్పించి సమావేశం ఏర్పర్చాడు అప్పలనర్సయ్య.
నరేంద్ర ఆహ్వానం మేరకు శ్యామల అండ్ స్టాఫ్ కూడా హాజరై ఉన్నారు.
వీళ్లంతా సమావేశం ఐంది.. వీథిన కనుక.. పరిమిత మేరకే బల్లలు, కొద్ది కుర్చీలు వేయడం జరిగింది.
పిలవకపోయినా ఆసక్తితో నరేంద్ర ఇంటి చుట్టు పక్కల వాళ్లు హాజరయ్యారు. వాళ్లు నిల్చునే ఉన్నారు.
నరేంద్ర నిల్చుని మాట్లాడుతున్నాడు.
“అనుకున్న వాళ్ల కంటే ఎక్కువ మందే హాజరయ్యారు. సంతోషం. కానీ అందరికీ కూర్చొనే సౌకర్యాన్ని ఏర్పర్చలేక పోయాం. అందుకు మన్నించండి.
దయచేసి విసుక్కోవద్దు. నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను తొందరగానే నా మాటలను ముగిస్తాను. సహకరించండి.
ఇక.. నా గురించి కాస్తా చెప్పి.. తర్వాత మిమ్మల్ని పిలిపించుకొనే కారణం వివరిస్తాను.
నా పేరు నరేంద్ర. నా తల్లి గృహిణి. నా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాది పురం. మీ ఊరికి మా ఊరు దగ్గరనే ఉంది కనుక.. మీలో చాలా మందికి మా ఊరు తెలిసి ఉంటుంది.
నేను ఇంజనీరింగ్ చదువు చదివాను. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాను. నేను ఉద్యోగం చేస్తున్నానే కానీ.. నాకు ఏదో అసంతృప్తి. సంపాదన బాగానే ఉన్నా ఏదో వెలితి.
నా ఆలోచనలు.. స్వయం ఉపాధి వైపుకు నన్ను నెట్టేవి. మరింత మందిని కలుపుకొని సరళంగా సమిష్టిగా అభివృద్ధి కావాలన్నదే నా ఆశయం.
నా నాన్న చాన్నాళ్ల క్రితం ఎలక్షన్స్ డ్యూటీన ఈ ఊరు వచ్చారు. అప్పుడు మీ ఊరి పెద్ద అప్పలనర్సయ్యగారు మా నాన్నకి పరిచయమయ్యారు.
నా నాన్నతో నా ఆశయం చెప్పాను. తొలుత అందరిలానే నా తల్లిదండ్రులు ఇబ్బందయ్యారు. ‘నీకు వ్యవసాయం ఏం తెలుస’ని నన్ను వెనక్కు లాగారు. చివరికి నా మొండి పట్టుకు లొంగారు.
నా నాన్న సూచన మేరకు నేను ఈ ఊరు వచ్చాను. నా నాన్న మాట ప్రకారం అప్పలనర్సయ్యగారిని కలిసాను. వారి సాయంతోనే నేను ఇక్కడ మూడు ఎకరాల పొలం భూములు కొనుగోలు చేసుకున్నాను. ‘నేనంటూ స్థిరంగా ఉండాలన్నా’.. ‘నాపై మీకు నమ్మకం కలగాలన్నా’.. ‘నాకంటూ ఇక్కడ సొంత సొత్తు’ ఉండాలన్నదే ముఖ్య కారణం. అందుకే ఇక్కడ పొలాలు కొన్నాను.
అప్పలనర్సయ్యగారి అండతో మరియు నాకు పొలాలు అమ్మిన వారి చేదోడుతో నేను వ్యవసాయం మొదలెట్టాను. నా ఆలోచనల మేరకు నీటి వసతిని వెంటనే ఏర్పర్చు కున్నాను. బోరు వేయించాను. కానీ నేను మరింత చేపట్టాలి.
చెప్పాగా.. మరింత మందిని కలుపుకుంటూ అందరం అభివృద్ధి చెందాలి తప్పా.. కేవలం నా ఒక్కడి ఆర్థిక పుష్టిని నేను కోరుకోవడం లేదని.
సమిష్టి అభివృద్ధికై నా ఆలోచనలు విస్తృతంగా ఉన్నాయి. నేను సమకూర్చుకున్న కొద్దిపాటి పొలాలతో వాటిని నేరవేర్చలేను. అలా అని మరిన్ని పొలాలు కొనుగోలు చేసుకోలేను.
కానీ సమిష్టి అభివృద్ధికై మరిన్ని పొలాల్ని సమకూర్చుకుంటే బాగుంటుం దనిపిస్తోంది. అందుకు మీ సహకారం తప్పక కావాలి.
మీరు వ్యవసాయంలోనే ఉన్నారు. కానీ ఎవరి పనులు వారివిలా సాగుతున్నారు. అలా కాక ఒకే వృత్తిలో ఉన్న మనం సంఘీభావంతో ఏకమైతే సంవృద్ధి సాధన చేపడితే బాగుంటుంది.
ఇక్కడ వివరణ ఇస్తాను. శ్రద్ధగా వినండి.
తొలుత నా పొలాల చుట్టు పక్కల పొలాల వాళ్లు నాతో కలిసి వ్యవసాయం చేయుటకు ముందుకు రావాలి. మీ మీ పొలాలకు.. మీరే హక్కుదార్లు. మరో మాట.. నేను పొలాలు కొన్నా.. వాటిని నాకు అమ్మిన వాళ్లకే.. ఆయా పొలాల వ్యవసాయాన్ని అప్పగించాను. మీకు తెలిసే ఉంటుంది.
నా ఆలోచనల ప్రకారం మూస పంటలు తగ్గించి కొత్త మరియు వాణిజ్య పంటలను చేపట్టాలి. అందుకు కొత్త కొత్త వనరులను సమకూర్చుకోవాలి. అట్టివి నేను సమకూర్చి పెట్టగలను.
మదుపులు నావి. ఖర్చులు నావి. పొలాలు మీవి. సాగు సామర్ధ్యాలు మీవి.” కొద్ది సేపు చెప్పడం ఆపాడు నరేంద్ర.
అక్కడి పొలందారులు ముఖాలు చూసుకుంటున్నారు.
అప్పలనర్సయ్య ప్రేక్షకుడు మాదిరిన ఉన్నాడు. శ్యామల అండ్ స్టాఫ్ ఎవరికి వారు తర్జనభర్జనల్లో ఉన్నారు.
నరేంద్ర తిరిగి చెప్పనారంభిచాడు.
“మీకు మరింత వివరణ ఇస్తాను. విత్తనాలకు, ఎరువులకు, పంట సాగున అవసరం పడే ప్రతి ఖర్చును నేనే చెల్లిస్తుంటాను. అలాగే అవసరం కొద్దీ ట్రాక్టర్ ల్లాంటివి కొనుగోలు చేస్తుంటాను. అవసరం కొద్దీ మరిన్ని బోరులు సమకూర్చి పెడతాను. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ వారిని రప్పిస్తుంటాను. వారి పరివేక్షణను ముమ్మర పరుస్తుంటాను.
నేను చెప్పుతోంది మీకు ప్రస్తుతం గందరగోళంగా తోచొచ్చు.. నమ్మకం కూడా కుదరక పోవచ్చు.. కానీ నన్ను విశ్వసించమని కోరుకుంటున్నాను. భూములు మీవి. వాటిని తస్కరించుకు పోయే వీలు ఎవరికీ ఉండదు. పంట మదుపులన్నీ నావి. నా పొలాలు కూడా మీతోనే ఇక్కడే ఉన్నాయి.
ఇక నా అసలు హామీ.. ఒక పొలంన వచ్చిన ఫలసాయాన్ని.. 75:25 లెక్కన ఉభయలం పంచుకుందాం. అంటే.. ప్రతి పొలందారుడుకు తన పొలంలో తాను పండించిన పంటన డబ్బై ఐదు శాతం ముడుతోంది.. ఇక అన్ని రకాల ఖర్చులు నేనే పెడతాను కనుక.. ఇరవై ఐదు శాతం పంట నాకు. ఈ రీతిని నేను పొలాలు కొన్న పొలందారులకు చెప్పి ఉన్నాను కూడా. వాళ్ల చేతుల్లోనే ఆయా పొలాలను పెట్టాను కూడా.
వేరు వేరు పంటలైనా ఇదే తీరు అయా పొలాల యజమానులకు మరియు నాకు వర్తిస్తోంది.
ఇదంతా నోటి మాటగానే కాదు.. ఈ ఊరి పెద్దల సమక్షంన రాత పూర్వకంగా పేపర్లు రాసి ఇస్తాను. మీరు శ్రమించవలసింది మేలైన పంట సాగుకు.. నేను పరిశ్రమించవలసింది ఉభయత్రా మేలుకు. ఇదే మన మధ్య ఒడంబడిక” చెప్పడం ఆపాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “ఏమైనా మీరు అడగలా.” అడిగాడు.
ఎవరూ ఏమీ అనడం లేదు.
రమారమీ రెండు నిముషాల పిమ్మట.. “మీలో ఎవరైనా మాట్లాడతారా.” అడిగాడు నరేంద్ర.
అర నిముషం తర్వాత.. శ్యామల లేచి నిల్చుంది.
“గుడ్. మీ చొరవకు ముందుగా ధన్యవాదాలు. తటస్థ వ్యక్తుల అభిప్రాయాలు మెరుగు పరుస్తాయి. అందుకే మీ తరహా వాళ్లను పిలిచింది. దయచేసి మాట్లాడండి.” చెప్పాడు నరేంద్ర.
అందరూ శ్యామల వైపు తలలు తిప్పారు.
శ్యామల చెప్పడం మొదలెట్టింది.
“అందరికీ నమస్కారం. నరేంద్ర సార్.. మీ ఆలోచన విధం కొత్తది. కొత్తది నలుగుటకు సమయం పట్టవచ్చు. మాత్రం నరేంద్ర సార్ ఆలోచన స్ఫూర్తివంతమైనది.
నేడు ఎవరి సొదన వారు పోతున్నాం. పరస్పర విధం విడ్చేస్తున్నాం. దీనిని ‘కాల ప్రభావం’ అంటూ దాటేస్తున్నాం. కానీ నరేంద్ర సార్ లాంటి వారు అప్పుడప్పుడు తారస పడుతుంటారు. ఆ తారస పడడం మనకందితే దానిని విస్మరించడం శ్రేయస్కరం కాదు. దయచేసి బాగా ఆలోచించుకుందాం. నరేంద్ర సార్ వెంట పడదాం. తనతో పాటు మనమూ మేలు పొందుదాం.” చెప్పడం ఆపింది శ్యామల.
ఆ తర్వాత.. “మీ స్పందన బాగుంది. మీ స్పందన వీళ్లని ప్రేరేపిస్తోందని ఆశిస్తున్నాను.” అన్నాడు నరేంద్ర.
అప్పుడే.. “నరేంద్ర సార్.. నాది ఒక సూచన ఉంది. మీ అనుమతితో చెప్పాలనుకుంటున్నాను.” అంది శ్యామల. తను నరేంద్రనే చూస్తోంది.
“ఆఁ. తప్పక. గో హెడ్ శ్యామలగారూ.” అనేసాడు నరేంద్ర.
“మీరు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మంచిదే. స్వాగతించ వలసిందే. కానీ నిత్యావసరమైన వరి, అపరాలు లాంటి పంటలను విడవకూడదు. అవే ఇక్కడి మన ఆహార అవసరాలు.” చెప్పుతోంది శ్యామల.
అంతలోనే నరేంద్ర అడ్డై.. “అయ్యో. వాటిని విస్మరించ లేదు. అవసరం మేరకు వాటిని తప్పక పండించుకోవడం అవుతోంది.” చెప్పాడు.
“సంతోషం. కానీ నేను పూర్తిగా చెప్పేక మీ క్లారిఫికేషన్.. ఐ మీన్.. మీ స్పష్టీకరణ ఆశిస్తున్నాను.” మెత్తగా చెప్పింది శ్యామల. ఆ వెంబడే చిన్నగా నవ్వింది.
“య య. అలానే అలానే. దయచేసి కొనసాగించండి.” తడబడ్డాడు నరేంద్ర.
“వరి, అపరాలు లాంటి పంటలతో పాటు చిరుధాన్యాల పంటలు కూడా పండించగలిగితే మేలు. నేడు ఆరోగ్యకరమైన సాగులు మృగ్యమవుతున్నాయి. వాటిని మీరు చేపట్టగలిగితే బాగుంటుంది.” ఆగింది శ్యామల.
నరేంద్ర మాట్లాడ లేదు. కానీ అక్కడ వారిలానే ఆమెనే చూస్తున్నాడు.
“ఇక్కడనే మీ క్లారి.. అదే.. మీ స్పష్టీకరణ కావాలి.” చెప్పింది శ్యామల.
“సరే. చెప్పాగా.. వరి, అపరాలు లాంటి ఇప్పటి పంటలతో పాటు.. మీరు సూచినట్టు ఆ చిరుధాన్యపు పంటలు కూడా తప్పక చేపట్టడం అవుతోంది. పైగా ఆరోగ్యకరపు పంటలను పండించడమే నా అభిమతం.” చెప్పడం ఆపాడు నరేంద్ర.
ఆ వెంబడే.. “శ్యామలగారూ.. మీకు కృతజ్ఞతలు. మీరు సరైందే ఎత్తి చూపారు. తొందరన మరిచినా నా ఆలోచనను మీ మూలంగానే చెప్పగలిగాను. అలానే అందుకు తగినన్ని పొలాలు సమకూరాలి. అందకే వీళ్లని మీలాంటి అందరి ఎదుట సహకరించమని కోరుకుంటున్నాను.” చెప్పాడు నరేంద్ర.
శ్యామల.. “థాంక్స్” చెప్పి కూర్చుంది.
“మంచిగా మాట్లాడేరు.” శ్యామలను మెచ్చుకుంటున్నాడు తెలుగు మాస్టారు.
అప్పుడే.. “మీరు మాట్లాడితే బాగుంటుంది.” అప్పలనర్సయ్యకు చెప్పాడు నరేంద్ర.
అప్పలనర్సయ్య లేచాడు.
“ఈ బాబు.. టీచరమ్మ చెప్పేది విన్నాక నాకు ఇదంతా మంచిగానే తోస్తోంది. నాకు ఇదంతా సమ్మతమే. నాకు బాబు పొలాల దగ్గరన పొలాలు లేవు. ఉంటే నేను బాబుతో కలిసే వాడ్ని. బాబు పొలాల చుట్టు పక్కల పొలాలు ఉన్న మీరు మాత్రం తప్పక బాబుతో కలవడానికి రండి. మీకు నా సహాయం అందిస్తూనే ఉంటాను.” చెప్పాడు.
ఆ వెంబడే.. “అప్పలనర్సయ్యగారూ.. మీ పొలాలు దూరంగా ఉన్నా.. అవి అన్నీ దగ్గర దగ్గరగానే ఉంటే.. కనీసం మూడు ఎకరాలు వరకు ఒకే చోట ఉంటే.. వాటి మధ్యన బోరు తీసి పెడతాను. ఇక్కడిలాగే ఆ చుట్టు పక్కల వారిని కలుపుకుంటూ ఇలానే నా మద్దతు అందిస్తాను. మనకు కావలసింది కలిసి మెలిసి సాగడమే.” చెప్పాడు నరేంద్ర.
దాంతో అప్పలనర్సయ్య చురుకయ్యాడు. చొరవగా వెంటనే తన సమ్మతిని తెల్పాడు. నరేంద్ర రీతికి వత్తాసు పలికేసాడు.
అప్పలనర్సయ్య భరోసా తెల్పడంతో అక్కడ కూడిన పొలందారులు నరేంద్ర పక్షంకు రావడానికి నిశ్చయించుకున్నారు.
నరేంద్ర అవస్త పల్చబడడంతో హుషారయ్యాడు.
అక్కడ చేరిన వారికి.. పేరు పేరున.. కలివిడిగా తిరుగుతూ ‘వందనాలు’ పెట్టాడు.
***
మర్నాడు..
ఉదయం..
హైస్కూలు స్టాఫ్ రూంన..
“కంగ్రాట్స్.” శ్యామలతో అన్నాడు సోషల్ టీచర్.
“ఎందుకో.” చిత్రమయ్యింది శ్యామల.
“అదే. రాత్రి నేను నరేంద్రగారి మీటింగ్‌కు రాలేకపోయాను. తెలుగు మాస్టారు ఇప్పుడే చెప్పారు. రాత్రి మీరు చక్కగా మాట్లాడేరట. మంచి సూచన కూడా ఇచ్చారటగా.” చెప్పాడు సోషల్ టీచర్.
చిన్నగా నవ్వేస్తూ.. “థాంక్స్.” చెప్పింది శ్యామల.
“ఆ నరేంద్ర పోకడ బాగుంది. మెచ్చుకోతగ్గదే.” అన్నాడు తెలుగు టీచర్.
“ఆచరణలో చూడాలి. ముందుకు సాగేకనే అసలు ఏమిటో తెలుస్తోంది.” నసిగాడు ఇంగ్లీష్ టీచర్.
“నాకు మాత్రం తొలుతనే మంచిగా తోస్తోంది. అతడు మాట తీరు చక్కగా అర్ధమవుతోంది. అతడిది మేలైన పట్టుగా తెలుస్తోంది. అతడు చెప్పింది చేసి చూపగలడు అనిపిస్తోంది.” చెప్పింది శ్యామల.
“అలానే జరగాలని కోరుకుందాం. ఆ అబ్బాయిని గమనిస్తే చేసేవాడిలానే అనిపిస్తున్నాడు.” చెప్పాడు తెలుగు టీచర్.
“నాకూ అలానే అనిపిస్తోంది.” కలగచేసుకున్నాడు డ్రిల్ టీచర్.
ఇంగ్లీష్ టీచర్ తిరిగి ఏమీ అనలేదు.
***
సాయంకాలం..
శివాలయం చోటున.. కోరి శ్యామలను కలిసాడు నరేంద్ర.
శ్యామల పూలు కోసుకుంటుంది.
నరేంద్రను చూస్తూనే చక్కగా పలకరించింది.
“మీటింగ్తో స్పందన బాగా వచ్చింది. కంగ్రాట్స్.” అంది.
“థాంక్స్. ముందుగా మీకు నా ధన్యవాదాలు. మీ చొరవ కూడా బాగా పని చేసింది. నాకు తెలుస్తుంది.” చెప్పాడు నరేంద్ర.
“నాదేముంది లెండి. మీ కొండంత యత్నం ముందు నాదే మాత్రం.” అంది. నవ్వింది.
“లేదు లేదు. నాకు మరింత పట్టు దొరికింది. అలానే మరింత బాధ్యత పెరిగింది.” చెప్పాడు నరేంద్ర.
తర్వాత.. ఆ ఇద్దరూ మరిన్ని విషయాలు ముచ్చటించుకున్నారు.
వేళ మించుతుంటే ఎవరి ఇళ్లకు వాళ్లు కదిలారు.
(ఇంకా ఉంది)