Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-6

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[నరేంద్ర ఏర్పాటు చేసిన సమావేశానికి అతనికి పొలాలమ్మిన రైతులు, హైస్కూలు టీచర్లు, నరేంద్ర ఇంటి చుట్టుపక్కల వాళ్ళు హాజరవుతారు. నరేంద్ర మాట్లాడుతూ,  తన గురించి, తన కుటుంబం గురించి, తన ఆశయం గురించి వివరిస్తాడు. మరింత మందిని కలుపుకుంటూ అందరం అభివృద్ధి చెందాలి తప్పా.. కేవలం తానొక్కడే ఆర్థిక పుష్టిని సాధించడం తన లక్ష్యం కాదని చెప్తాడు. తన ప్రణాళికను వివరిస్తాడు. ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే అడగమంటాడు. ఎవరూ మాట్లాడరు. ఎవరైనా మాట్లాడుతారా అని సభికులని అడిగితే, కొన్ని క్షణాల తర్వాత శ్యామల లేస్తుంది. నరేంద్ర ప్రణాళికని అభినందిస్తూ, అందరినీ అతనితో నడవమని కోరుతూ చిన్న సూచన చేస్తుంది. వాణిజ్యపంటల వైపు మొగ్గుతున్నా, ఆహారపంటలను నిర్లక్ష్యం చేయవద్దని అంటుంది. ఆహార ధాన్యాలతో పాటు చిరుధాన్యాల పంటలను కూడా పండించమంటుంది. అప్పలనర్సయ్య కూడా మాట్లాడుతాడు. సమావేశం ముగుస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. మర్నాడు ఉదయం హైస్కూల్లో టీచర్లు నరేంద్ర ప్రణాళికల గురించి, పోకడ గురించి మాట్లాడుకుంటారు. ఆ సాయంత్రం శివాలయం దగ్గర నరేంద్రని కలిసిన శ్యామల అతడిని అభినందిస్తుంది. కాసేపు మాట్లాడుకుని ఎవరిళ్ళకు వారు వెళ్తారు. – ఇక చదవండి.]

రెండు రోజుల తర్వాత..

ఉదయం పదకొండు గంటలు..

అప్పలనర్సయ్యతో కలిసి నరేంద్ర ఆ ఊరి బ్యాంక్ బ్రాంచీకి వెళ్లాడు.

ఆ ఇద్దరూ బ్రాంచీ మేనేజర్ కేబిన్‌లో.. ఆయన ఎదుట చెరో కుర్చీల్లో కూర్చొని ఉన్నారు.

ఆ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు.

“నరేంద్ర గారి రీతిని నేనూ విని ఉన్నాను. యువత ఆలోచనలు కొత్తగా అనిపించినా సరైన తీరున ఉంటున్నాయి. ఇట్టి వారిని ప్రోత్సహించాలి.” చక్కగా చెప్పాడు మేనేజర్.

ఆ వెంబడే.. “మీ విన్నపం సరైనదే. పైగా మా బ్యాంక్ నార్మ్స్‌కు తగ్గట్టుదే. అందుకు మీకు మా కన్సర్న్‌డ్ ఎంప్లాయ్ తప్పక సాయపడగలడు.” తెమిల్చేలా చెప్పాడు మేనేజర్.

“కావలసినవన్నీ సబ్మిట్ చేయడానికి అల్రడీ సిద్ధపర్చుకున్నాను. మీరు త్వరగా లోన్ శాంక్షన్ చేయాలి.” కోరాడు నరేంద్ర.

“తప్పక. ఆల్ ద బెస్ట్.” చెప్పాడు మేనేజర్.

“దయచేసి మీ వైపు ఆలస్యం కాకుండా చూడండి. ఈ బాబు పొలం చుట్టు పక్కల వాళ్లుతో పాటు నేను కూడా ఈ బాబుతో కలిసి వ్యవసాయం పని చేయడానికి సిద్ధపడి ఉన్నాను. మీరిచ్చిన అప్పును క్రమ పద్ధతిన తిరిగి కట్టించే పని నాది. నేను మీకు బాగా తెలిసిన వాణ్ణి. మీ మేలు మర్చిపోం. తప్పక సహకరించండి.” పెద్దరికంలా చెప్పాడు అప్పలనర్సయ్య.

“అయ్యో. నేను చేసి పెడతానన్నానుగా. మీలాంటి కస్టమర్స్ ను వదులుకోలేం.” చెప్పాడు మేనేజర్.

ఆ వెంటనే ఆ ఇద్దర్నీ  కన్సర్న్‌డ్ ఎంప్లాయ్ వద్దకు పంపాడు.

***

సాయంకాలం ఐదు దాటింది.

పొలం పరివేక్షణలు ముగించుకొని, నేరుగా నరేంద్ర శివాలయం చెంతకు వచ్చాడు.

తను ఇలా పని కట్టుకు వచ్చింది కేవలం శ్యామల కోసమే. ఆలయం వెనుకకు వెళ్లాడు.

శ్యామల అక్కడ కనిపించింది. తన విధంన తాను పూలు కోసుకుంటుంది. దరిగా వెళ్లాడు.

“హలో శ్యామలగారూ.” పలకరించాడు.

శ్యామల వెను తిరిగింది. నరేంద్రని చూస్తూనే చిన్నగా నవ్వింది.

“హలో.” మెత్తగా అంది.

నరేంద్ర కూడా పూలు కోస్తూనే.. “సాయంకాలం త్వరగా అవ్వాలని ఇప్పటి వరకు కోరుకుంటునే ఉన్నాను. మీతో మాట్లాడాలి.” చెప్పాడు.

“అలానా. ఏంటంటా.” చిత్రమయ్యింది శ్యామల.

“అదే. చెప్తాను..” నసుగుతున్నాడు నరేంద్ర.

ఇద్దరూ పూలు కోస్తూనే ఉన్నారు.

“మీ సూచనలు బాగుంటాయి. అందుకే వచ్చాను. మీ అభిప్రాయాలు కావాలి.” నానుస్తున్నాడు నరేంద్ర.

శ్యామల కను రెప్పలను టపటపా లాడిస్తోంది.

“ముందు విషయం చెప్పాలిగా. చెప్పండి.” తేరుకుంటూ అంది శ్యామల.

“కూర్చొని మాట్లాడుకుందామా.” అడిగేసాడు నరేంద్ర.

“ఇక్కడా.” సర్రున నవ్వింది శ్యామల.

ఇబ్బందిగా కదిలాడు నరేంద్ర.

“లేదు లేదు. పూలు కోసేక.. మండపంలో కూర్చొని మాట్లాడుకుందాం.” చెప్పగలిగాడు.

ఐదు నిముషాల లోపే ఆ ఇద్దరూ ఆలయం మండంలోకి వచ్చి కూర్చున్నారు.

చేతిలోని పూలు కవర్‌ని పక్కన పొందికగా పెట్టుకొని.. “ఉఁ. చెప్పండి.” అంది శ్యామల.. నరేంద్రని చూస్తూ.

ఉదయం అప్పలనర్సయ్యతో కలిసి వెళ్లి.. తను నెరిపిన బ్యాంక్ వివరాలు వివరించాడు నరేంద్ర.

“అంటే మీ భూమి పేపర్స్‌తో మీరు లోన్ తీసుకున్నారన్నమాట. దాంతో ట్రాక్టర్ సమకూర్చుకోబోతున్నారన్న మాట.” అంది శ్యామల.

అప్పుడే.. “త్వరలో అప్పలనర్సయ్యగారి పొలం పేపర్స్‌తో కూడా లోన్ తీసుకోబోతున్నాను. ఆయన పొలం పరిసరాల్లో బోరు ఒకటి వేయిస్తాను..”  చెప్పుతున్నాడు నరేంద్ర.

అడ్డై.. “సరి సరే. ముందు ఒక విషయం తేల్చుకోండి..” చెప్పుతోంది శ్యామల.

నరేంద్ర వింటున్నాడు.

“అప్పు ఒక ముప్పు. మీరు ఇక్కట్లు పడకూడదు. ప్రస్తుతం మీ సరళి కొత్త బిక్షగాడి చందాన ఉంది.” చెప్పుతోంది శ్యామల.

అడ్డై.. “అంటే.. అర్థం కావడం లేదు.” అన్నాడు నరేంద్ర.

“ముందు వెనుక ఆలోచనలు చేయక.. మీ రీతికి సపోర్ట్ రావడమే తడువుగా అన్నీ ఒకే మారు నెత్తిన ఎక్కించేసుకుంటున్నారు.” చెప్పుతోంది శ్యామల.

నరేంద్ర ఆమెనే చూస్తూ ఉన్నాడు.

“ముందుగా మీరనుకున్నది కొద్ది మేరగా చేసి ప్రాక్టికల్‌గా అనుభవం చవి చూడండి. ఆ తర్వాత విస్తరణకై కదలండి. మీది ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్. పెరగవలసిన ఏ బిడ్డ ఒకే మారు పరుగు పెట్టదు. తొలుత నడిచే ప్రయత్నంలో పడ్డ తప్పటడుగుల్ని ఓవర్‌టేక్ చేసుకుంటూ పరుగు వైపు వెళ్తుంది. మీరు అదే అనుసరించండి.  ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్ లెసన్.” చెప్పడం ఆపింది శ్యామల.

నరేంద్ర మాత్రం ఆమెనే చూస్తున్నాడు.

“అర్ధం అవుతుందా.” అడిగింది శ్యామల.

“అవుతోంది.” తలాడించాడు నరేంద్ర.

“నేను ఇలా చెప్పుతోంది మీ ఆశయం మంచిది కనుకనే. మీకు నేను అడ్డు పడడం మాత్రం కాదు.” శ్యామల తన సంజాయిషీ వ్యక్తపర్చింది.

“అబ్బబ్బే. లేదు లేదు. అలా ఏమీ అనుకోవడం లేదు. దయచేసి చెప్పండి.” నొచ్చుకున్నాడు నరేంద్ర.

“ఇప్పుడు మీ లోన్‌తో సరిపెట్టుకోండి. ట్రాక్టర్ అన్నారు.. కొనండి. మరో బోరు సంగతి అట్టి పెట్టండి. రాబోతోంది వర్షాకాలం. చెరువు నిండుతోంది. నీళ్లుకు ఇబ్బంది ఉండదు. పైగా ఒక బోరు ఉండనే ఉంది. తొలుత వరి పంటను.. తర్వాత మినుములు, పెసలు లాంటి ఇక్కడి వాడుక పంటలు కానీయండి. మీ ద్వారా మొదటి వ్యవసాయ సాగు ఫలితాన్ని రానీయండి. తద్వారా మీకు.. మీతో కలిసిన వాళ్లకి ఒక నమ్మకం వస్తోంది. అదే మీ ఆశయంకు పునాది అవుతోంది. దానిపై మీ కలల సౌధము చక్కగా వెలుస్తోంది.” చెప్పింది శ్యామల.

నరేంద్ర ఏమీ అనడం లేదు.

“నెవ్వర్, నోవేర్ డిడ్ ద స్లోనెస్ పుల్ బేక్. ఇట్ ఈజ్ ఎ స్పీడ్ బ్రేకర్. ఇట్ షుడ్ బి అండర్‌స్టుడ్.” శ్యామలే అంది.

“యా యా. ఐ కుడ్ అండర్‌స్టాండ్. ఐ అండర్‌స్టాండ్ టూ.” నరేంద్ర అన్నాడు.

ఆ వెంబడే.. “నిజమే. మీరు బాగా చెప్పారు. నిదానం ప్రదానమే. అలానే ఆచి తూచి విధం గొప్పది. నేను మీతో ఏకీభవించి తీరుతాను.” చెప్పాడు.

శ్యామల సంతోషపడింది.

“మీ అభిప్రాయాలు నాకు కావాలి. నా అవసరం మేరకు మీతో ముచ్చటించు కొనుటకు నాకు అవకాశం ఇస్తుండండి.” కోరాడు నరేంద్ర.

“అలా మీకు నేను ఉపయోగపడగలనని మీరు అనుకుంటే నా వైపు నుండి మీకు సదా వెల్కమ్.” ముచ్చట పడుతోంది శ్యామల.

“థాంక్స్.” చెప్పాడు నరేంద్ర.

“చీకటవుతోంది. మరి వెళ్దామా.” అంది శ్యామల, పూల కవర్‌తో లేస్తూ.

నరేంద్ర కూడా లేచాడు.

“నేను రెండు రోజుల్లో మా ఊరు పురం వెళ్తున్నాను ట్రాక్టర్‌కై.” చెప్పాడు నరేంద్ర.

“గుడ్. ప్రొసీడ్.” నవ్వింది శ్యామల.

ఇద్దరూ శివాలయం దాటి.. కొంత దూరం నడిచాక.. ఎవరి ఇళ్ల దారిన వాళ్లు కదిలారు.

***

మర్నాడు..

ఉదయం తొమ్మిది దాటుతోంది..

పొలాలన.. బోరు దరిన.. అప్పలనర్సయ్యతో కలిసి గట్టు మీద కూర్చొని ఉన్నాడు నరేంద్ర.

“ఎండ వేడి తగ్గడం లేదు.” అన్నాడు.

“మరే. వచ్చే వారంకి రుతుపవనాలు మన ప్రాంతం వైపుకి రాబోతున్నాయట. పైగా ఈ యేడు వర్షాలు ఎక్కువేనట. పంతులు గారు పంచాగం చూసి చెప్పారు. అలానే వార్తా పేపర్లో కూడా రాస్తున్నారు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“అవునా. సంతోషమే.” సరదా పడ్డాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “ప్రస్తుతానికి మీ పేరున లోన్ తీసుకోవడం లేదు. వర్షాకాలం పోయేకనే మీ పొలంలో బోరు వేయిస్తాను. తొందరపడక నిదానంగా పోదాం.” చెప్పాడు.

“అలా అంటారా. సరే బాబూ.. మీ ఇష్టమే.” అనేసాడు అప్పలనర్యయ్య.

“మీ పొలంన బోరే ఉండదు కానీ.. మిగతా నా విధం అంతా అందరిలానే మీకు అందుతోంది.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మీ సాయం మాత్రం నాకు కొనసాగుతూనే ఉండాలి.” కోరాడు.

“అయ్యో. బాబూ మీరు మళ్లీ మళ్లీ అడగాలా.” అనేసాడు అప్పలనర్సయ్య.

“నేను ట్రాక్టర్ తేవడానికి ఊరు వెళ్తాను. మీరు చెప్పినట్టే డ్రయివర్‌ని కూడా అక్కడే కుదుర్చుకొని తీసుకు వస్తాను. నేను ట్రాక్టర్ డ్రయివింగ్ నేర్చుకున్నన్ని రోజులు అతడు ఇక్కడే ఉండేలా మాట్లాడతాను.” చెప్పాడు నరేంద్ర.

‘సమ్మతిలా’ తలాడించాడు అప్పలనర్సయ్య.

“ఊరు ఎప్పుడు వెళ్తున్నావు బాబూ.” అడిగాడు.

“రేపు.. రేపు ఇక్కడి ఫస్ట్ బస్సుకే బయలుదేరతాను.” చెప్పాడు నరేంద్ర.

అప్పుడే అప్పలనర్సయ్య ఇంటికి వెళ్లిన సోములు అక్కడికి వచ్చాడు కొబ్బరి బోండాల గెలతో.

సైకిల్‌కు స్టాండ్ వేసి వాటిని దించాడు.

“కాయలు కొట్టనా.” అడిగాడు అప్పలనర్సయ్యను చూస్తూ.

“రెండు కొట్టు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే.. “కత్తి తెచ్చావా.” అడిగాడు.

సైకిల్ హేండిల్ నుండి గోనె సంచెను తీస్తూ.. “ఆఁ. తెచ్చాను.” చెప్పాడు సోములు.

“మా ఊరికి వెళ్తున్నానుగా..  నా బైక్‌ను కూడా నాతో తెచ్చుకుంటాను.” చెప్పాడు నరేంద్ర.

“ఈ గట్టుల మీద తిరగడం వీలు కాదేమో బాబూ.” అన్నాడు అప్పలనర్సయ్య.

“గట్లు వెడల్పుగానే ఉన్నాయిగా. వీలు అవుతోంది.” చెప్పాడు నరేంద్ర.

“గతుకులు జాస్తీ.” నసిగాడు అప్పలనర్సయ్య.

“ట్రాక్టర్ వస్తోందిగా. మన్ను తెచ్చి పోయిద్దాం.” ఈజీగా అనేసాడు నరేంద్ర.

అప్పలనర్సయ్య ఏమీ అనలేదు.

సోములు ఒక బొండాం కొట్టి.. అప్పలనర్సయ్యకు అందించబోయాడు.

“ముందు బాబుకు ఇవ్వు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

సోములు ఆ బొండాంని నరేంద్రకి ఇచ్చాడు.

నరేంద్ర దానిని అందుకొని.. అప్పలనర్సయ్యకు అందిస్తూ.. “ముందు మీరు తాగండి. పెద్దవారు.” చెప్పాడు.

అప్పలనర్సయ్య మురిసాడు. ఆ బొండాం అందుకున్నాడు.

సోములు మరో బొండం కొట్టి.. నరేంద్రకు అందించాడు. ఆ ఇద్దరూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారు.

“నేను ఊరెళ్లి రావడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. మీరు పొలాల వైపు వచ్చి చూసుకుంటుండాలి.” చెప్పాడు నరేంద్ర.

“అయ్యో. ప్రత్యేకంగా మీరు చెప్పాలా.” భరోసా ఇచ్చాడు అప్పలనర్సయ్య.

ఖాళీ బొండాలు పక్కన పెట్టి ఆ ఇద్దరూ లేచారు.

“ఎండ పెరుగుతోంది. మనం ఇంటికి వెళ్దాం. వీళ్లు పనులు కానిస్తుంటారు. సాయంత్రం రావచ్చు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

తర్వాత.. ఆ ఇద్దరూ అక్కడ నుండి కదిలారు. గట్టు మీద పక్క పక్కగా నడుస్తున్నారు.

కొద్ది దూరం పోయక.. అప్పలనర్సయ్య ఫోన్ మోగింది. కమీజ్ జేబు లోంచి ఫోన్‌ను తీసుకున్నాడు.

“అమ్మాజీ ఫోన్ చేస్తోంది.” అంటూనే లైన్ కలిపాడు.

“చెప్పు తల్లీ.” అన్నాడు.

అటు నుండి అమ్మాజీ మాట్లాడుతోంది.

“అట్లానా.” ఆనంద పడిపోతున్నాడు అప్పలనర్సయ్య.

అది గమనించాడు నరేంద్ర.

“ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. వచ్చేయి తల్లీ.” గలగలా అన్నాడు అప్పలనర్సయ్య.

ఆ ఫోన్ కాల్ కట్ చేసేక..

“మా కూతురు వస్తోంది.” చెప్పాడు అప్పలనర్సయ్య నిండుగా.

నరేంద్ర తికమకయ్యాడు.

“మీ కుటుంబం డిటైల్స్ నాకు తెలీయవు.” నసిగాడు.

“చెప్పలేదు కదూ. నేను, నా భార్య ఇక్కడ ఉంటున్నాం..” చెప్పుతున్న అప్పలనర్సయ్యకు అడ్డై..

“నాకు తెలుసు. అన్నపూర్ణమ్మ గారు. పేరుకు తగ్గ మనిషి.” అన్నాడు నరేంద్ర.

“మాకు ఒక మగ బిడ్డ.. ఒక ఆడ బిడ్డ.. మగ బిడ్డ సంగతి మీకు చెప్పాను. ఆడ బిడ్డ.. దాని పేరు అమ్మాజీ. తనను తన అమ్మమ్మ పట్టుతో తాముంటున్న నగరంకి ‘తనని చదివిస్తాను’ అని ఎప్పుడో తీసుకు పోయింది.  సెలవులప్పుడే అమ్మాజీ మా వద్దకు వస్తుంటుంది.”  సరదా పడిపోతున్నాడు అప్పలనర్సయ్య.

నరేంద్ర చిన్నగా నవ్వుతున్నాడు.

“అమ్మాజీ ఏదో డిగ్రీ చదువు పూర్తి చేసేసింది. బ్యాంక్ ఉద్యోగం అంటే తనకి ఇష్టం. అందుకు కోచింగ్ ఏదో తీసుకుంది. ఒక బ్యాంక్ పరీక్ష రాసి ఉంది. మరో బ్యాంక్ పరీక్ష ఇప్పటికే రాయవలసిందే. కానీ ఆ పరీక్షని మరో నెల పొడిగించేసారట. ఇంకా టైం ఉందని మమ్మల్ని చూడాలనే తను వస్తుందట.” మురిసిపోతున్నాడు అప్పలనర్సయ్య.

అంతలోనే.. దార్లు మారవలసి రావడంతో.. ఆ ఇద్దరూ ఎవరి దారిన వారు కదిలారు.. తమ తమ ఇళ్ల వైపుకు.

(ఇంకా ఉంది)

Exit mobile version