Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నరేంద్ర ఐ యామ్ విత్ యు-9

[శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొత్తగా కొనుక్కుని వచ్చిన ట్రాక్టరుతో నేరుగా అప్పలనరసయ్య ఇంటికి వస్తాడు నరేంద్ర. తమ ఊరికి మొదటి ట్రాక్టరును తెచ్చినందుకు ఎంతో సంతోషిస్తాడు అప్పలనరసయ్య. తన కూతురు అమ్మాజీని పరిచయం చేస్తాడు. సాయంత్రం శివాలయం వద్ద శ్యామలని కలుస్తాడు నరేంద్ర. ట్రాక్టరు కొన్నందుకు అభినందనలు చెప్తుందామె. మర్నాడు ఉదయం ట్రాక్టరు పని ప్రారంభిస్తున్నామనీ, ఆ వేడుకకి తప్పక రమ్మని ఆహ్వానిస్తాడామెను. మీ అమ్మానాన్నలని పిలిచారా అని శ్యామల అడిగితే, ముహూర్తం హఠాత్తుగా కుదిరిందని, ఇప్పుడు పిలిస్తే వారు రాలేరని చెప్తాడు. అయినా పట్నంలో అమ్మానాన్నలు తమ ట్రాక్టరుని చూసారని చెప్తాడు. మర్నాడు అనుకున్నట్టే ట్రాక్టరుకు పూజ చేయిస్తారు. పది రోజులు గడుస్తాయి. డ్రైవరు కోటి సాయంతో, ట్రాక్టర్ నడపటం, దాన్ని ఉపయోగించటం నేర్చుకుంటాడు నరేంద్ర. ఓ సాయంత్రం ఆలయం వద్ద శ్యామలని కలుస్తాడు. తనకి ట్రాక్టర్  డ్రైవింగ్ వచ్చేసిందనీ, ఇక కోటిని పంపించేయనా అని అడిగితే, పూర్తి నెల జీతం చెల్లించారు కదా, నెల రోజులూ వాడుకోండి అని సలహా ఇస్తుంది శ్యామల. అవీ ఇవీ మాట్లాడుకున్నాకా, తాను ఆమెను ఇష్టపడుతున్నట్టు, ఆమె సలహాలు సంప్రదింపులు తనకి జీవితాంతం కావాలని అంటాడు. తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. భారంగా ఇంటికొస్తాడు నరేంద్ర. – ఇక చదవండి.]

మయం.. ఆరు-ఆరు పి.యం.

నరేంద్ర తనుంటున్న ఇంటికి వచ్చేసరికి.. కోటి వంట చేస్తున్నాడు.

తను రిప్రెష్ అయి వచ్చేక.. “ఈ పూట ఏం వండుతున్నావు.” అడిగాడు.

“ఆమ్లెట్‌లు వేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను. అన్నం, పచ్చి పులుసు చేసి పెట్టాను.” చెప్పాడు కోటి.

“నేను ఉల్లిపాయలు తరిగి పెట్టనా.” అడిగాడు నరేంద్ర.

“వద్దు సార్. మీరు కూర్చొండి. పది నిముషాల్లో భోంచేద్దాం.” చురుగ్గా చెప్పాడు కోటి.

నరేంద్ర కదిలాడు. అక్కడికి దగ్గరగానే నేల మీద కూర్చున్నాడు.

“వంట సరుకులు ఉన్నాయా. కొనుక్కోవాలా.” అడిగాడు నరేంద్ర.

“బియ్యం పది రోజుల వరకు సరిపోతాయి. వెచ్చాలు అన్నాళ్లకు ఉన్నాయి. కూరలు ఎప్పటికి అప్పుడు కొనిపిస్తున్నారుగా.” కోటి ఉల్లిపాయలు తరుగుతున్నాడు.

“నువ్వు నాకు బాగా తోడనిపిస్తున్నావు కోటి.” ఏదో ఆలోచనలో ఉన్నట్టు అన్నాడు నరేంద్ర.

కోటి ఏమీ అనలేదు.

“నిజమే కోటీ.. పంట పనుల్లో.. వంట పనుల్లో నీ నేర్పరితనం చక్కగా ఉంది.” అన్నాడు నరేంద్ర.

“అంతా మీ చలవే సార్. మీరు.. నన్ను అంతలా తిప్పుతున్నారు. మీతో పని చేయడం నాకు చాలా సుఖంగా ఉంది సార్.” చెప్పుతున్నాడు కోటి.

అంతలోనే నరేంద్ర ఫోన్ మోగుతోంది. నరేంద్ర లేచాడు. స్టూల్ మీది ఫోన్ అందుకున్నాడు.

అప్పలనర్సయ్య నుండి తనకు ఫోన్ కాల్ వస్తోంది.

లైన్ కలిపి.. “చెప్పండి.” అన్నాడు నరేంద్ర.

“బాబూ.. ఎక్కడ. ఇంట్లోనే కదా.” అప్పలనర్సయ్య ఆందోళన పడుతున్నాడు.

నరేంద్ర గ్రహించగలిగాడు.

“ఏమయింది పెద్దాయన.” అత్రంగా అడిగాడు.

“ఓ మారు ఇంటికి రా బాబూ.” చెప్పాడు అప్పలనర్సయ్య.

కోటి వైపు చూసాడు నరేంద్ర. కోటి ఆమ్లెట్ వేస్తున్నాడు.

“భోజనం చేసి రానా.” అడిగాడు నరేంద్ర.

అటు నుండి అప్పలనర్సయ్య.. “అలా అంటారా. అలానే కానీ బాబూ.” అనేసాడు.

అప్పుడే ఆ కాల్ పుసుక్కున ఆగిపోయింది.

నరేంద్ర ఫోన్ వైపు చూసాడు.

ఛార్జింగ్ ఐపోయి ఫోన్ స్విచ్ఛాప్ ఐపోయింది.

ఛార్జర్ తీసుకొని.. ఫోన్‌ను స్విచ్చ్ బోర్డ్ దరిన స్టూల్ మీద ఛార్జింగ్ కై పెట్టాడు.

కోటి భోజనానికి పిలిచాడు.

ఇద్దరూ భోంచేస్తున్నారు.. ఎదురెదురుగా నేల మీద కూర్చొని.

“సార్.. బాగా ఆలోచించుకున్నాను. మీతో మాట్లాడాలి.” మెల్లిగా చెప్పాడు కోటి.

“సరే.. చెప్పు కోటి.” ముభావంగా అన్నాడు నరేంద్ర. అతడు అప్పలనర్సయ్య పిలుపు గురించే ఆలోచిస్తున్నాడు.

“మీకు ట్రాక్టర్ వ్యవహారం బాగా వచ్చేసింది. నన్ను ఇక ఏ రోజైనా పంపేయవచ్చు. కానీ..” నసుగుతున్నాడు కోటి.

అప్పుడే పచ్చి పులుసు అన్నం ముద్దలు తింటూ.. “కోటీ.. భలే కమ్మగా ఉంది పచ్చి పులుసు. గుడ్.” అంటున్నాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “చెప్పు కోటీ.” అన్నాడు తలెత్తి కోటిని చూస్తూ.

“సార్.. నాకు ట్రాక్టర్ పనులు, వంట పనులుతో పాటు పొలం పనులు కూడా వచ్చు. నేను వ్యవసాయ పనులకు కూడా రోజు వారీ కూలీగా వెళ్లేవాణ్ణి.” చెప్పాడు కోటి.

“అవునా.” అన్నాడు నరేంద్ర.

“మీరు అనుమతిస్తే ఇక్కడే ఉండిపోయి మీరు అప్పగించిన పనులు చేస్తుంటాను. ఇదే నాకు బాగు అనిపిస్తోంది. మీ దగ్గర తిరగడంతో మీ స్టామినా చూసాను. మీరు పని చేయించుకొనే విధానం బాగుంది. అందుకే మీ చెంత పనికి కుదిరిపోవాలనుకుంటున్నాను.” చెప్పుకుపోతున్నాడు కోటి.

అడ్డై.. “సరి సరే. మీ వాళ్లతో మాట్లాడేవా.” అడిగాడు నరేంద్ర.

“లేదు సార్. ఐనా వాళ్లు కాదనరు. అమ్మా, నాన్న, అక్కే. వాళ్లు రోజు వారీ కూలీలే సార్. మాది ఎవరి పూట సంపాదన వాళ్లదే.” చెప్పాడు కోటి.

కొద్దిసేపు ఆగాడు నరేంద్ర.

“ఇప్పటికైతే నెల జీతం ఒప్పందం ఉంది. ఇకపై నువ్వు ఏం ఆశిస్తావో..” భోజనం ముగించి లేచాడు నరేంద్ర. తన తిన్న పళ్లెంని, తను నీళ్లు తాగిన గ్లాసుని తానే కడుక్కుంటున్నాడు.

కోటి ఇంకా తింటున్నాడు.

కడిగిన పళ్లెంని, గ్లాసుని పక్కన పెట్టి వచ్చాడు నరేంద్ర.

“సార్.. మీరు ఎంతిస్తే అంతే. మీ వద్ద ఉంటే మంచి సంతృప్తి లభిస్తోంది. అంతే.” కోటి లేచాడు. తను వాడిన పళ్లెంని, గ్లాసుని తీసుకొని షింక్ వైపు కదిలాడు.

కోటి వచ్చేక.. “రేపు మాట్లాడుకుందాం. అప్పలనర్సయ్య గారింటికి నేను వెళ్లాలి.”  చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “నువ్వు తలుపేసుకో. పడుకో. నేను ఏ టైంకైనా వస్తాను.” అంటూ ఎకాఎకీలా బయటికి నడిచేసాడు.

కోటి తలుపు మూసుకున్నాడు.. నరేంద్ర బైక్‌తో కదిలేక.

***

అప్పలనర్సయ్య ఇంటిని చేరాడు నరేంద్ర.

ఇంట్లోకి వచ్చిన నరేంద్రని చూస్తూనే.. “బాబూ. ఈ రాత్రికి రారేమో అనుకుంటున్నాం.” చెప్పాడు అప్పలనర్సయ్య.

“భోజనం ఆలస్యమైంది. అంతే.” నరేంద్ర ఒక కర్ర కుర్చీలో కూర్చున్నాడు.

అక్కడే అప్పలనర్సయ్యతో పాటు అన్నపూర్ణ ఉంది. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చొని ఉన్నారు.

అమ్మాజీ అక్కడ లేదు.

“పెద్దాయనా చెప్పండి.” అన్నాడు నరేంద్ర.

తటపటాయిస్తున్నాడు అప్పలనర్సయ్య.

“ఏమైంది పెద్దాయనా.” నరేంద్ర కాస్తా ఆతృత పడ్డాడు.

“అమ్మాజీ పరీక్ష తప్పింది.” చెప్పింది అన్నపూర్ణ.

ఆవిడ చాలా దిగులు పడుతున్నట్టు నరేంద్రకు అగుపిస్తోంది.

“రిజల్ట్స్ వచ్చేసాయా.” అడిగాడు.

“అదేదో ఆన్లైనట. సాయంకాలం తెలిసిందట.  తన తాతయ్య ఫోన్ చేసి చెప్పాడు.” చెప్పాడు అప్పలనర్సయ్య.

ఆయన చాలా హైరానా అవుతున్నట్టు నరేంద్రకు తోస్తోంది.

“పెద్దాయనా.. కూల్ అవ్వండి.” అన్నాడు.

ఆ వెంబడే.. “మీ అమ్మాయి ఏదీ.” అడిగాడు.

అమ్మాజీకై కేకేసాడు అప్పలనర్సయ్య ఒక గది వైపు చూస్తూ.

అటు అలికిడి లేదు.

“వెళ్లి దాన్ని తీసుకురా.” భార్యని పురమాయించాడు అప్పలనర్సయ్య.

అన్నపూర్ణ వెళ్లి, అమ్మాజీతో వచ్చింది.

‘అమ్మాజీ బాగా ఏడినట్టు ఉంది.’ అనుకున్నాడు ఆమెను చూసిన నరేంద్ర.

చిన్నగా నిట్టూర్పు వదిలి.. “కూల్ తల్లీ. ఇవన్నీ సహజం. ఇలా కూర్చో.” అన్నాడు తనకి దగ్గరిగా ఉన్న ఖాళీ కర్ర బల్లని చూపుతూ.

అమ్మాజీ కూర్చుంది. అన్నపూర్ణ తిరిగి కుర్చీలో కూర్చుంది.

“పరీక్షల్లో పాస్, ఫైల్ లుంటాయి. ఏదైనా స్పోర్టీవ్ గా తీసుకోవాలి.” చెప్పాడు నరేంద్ర.

ఆగి అడిగాడు.. “బాగా రాసానన్నావుగా.”

అమ్మాజీ చిన్నగా తలాడించింది.

ఆ వెంబడే.. “లైట్ తీసుకో. మరో బ్యాంక్ ఎగ్జామ్ ఉందిగా. డోన్ట్ వర్రీ.” అన్నాడు తేలిగ్గా.

“నేను మొదటిది చాలా బాగా రాసాను. ఇప్పుడు రెండోది రాయడానికి భయమేస్తోంది.” దిగులవుతోంది అమ్మాజీ.

“నోనో. అలా అనుకోకు.  డీలా పడిపోకు. ఇదీ బాగా రాస్తావు. జాబ్ కొట్టేస్తావు.” అనేసాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “నాన్న ఒక గంభీర వ్యక్తి.. అమ్మ ఒక అన్నపూర్ణమ్మ.. మరి వీళ్ల బిడ్డవైన నువ్వు.. మరీ ఇంత మెత్తదానివా. వీళ్లని చూసే నేను షైన్ అవుతున్నాను. మరి వీళ్ల రక్తం ఉన్న నీలో బేలతనం తగునా. నోనో. బి బ్రేవ్.” చకచకా చెప్పాడు.

“ఏమో.. నాకు ఏమీ తోచడం లేదు. ఎంతో మంచిగా కోచింగ్ తీసుకున్నాను. ఏం లాభం.” నసుగుతోంది అమ్మాజీ.

“తప్పిదాలు వదిలేయ్. నేను ఉన్నానుగా. నేను కోచింగ్ ఇస్తాను. నీకు ఎందుకు పాస్ అందదో చూస్తాను.  యు మస్ట్ బి ఎ జీనియస్. యా.” తేలికపరుస్తున్నాడు నరేంద్ర.

“మరేం తల్లీ. బాబూ మాటంటే మాటే. బాబు సంగతి నాకు తెలుసుగా.” అన్నాడు అప్పలనర్సయ్య గొప్పగా.

“ఆ పుణ్యం కట్టుకో నాయనా. ఇందాకటి నుండి దీని బాధని చూడలేక పోతున్నాను.” అనేసింది అన్నపూర్ణ.

“మీరు నిశ్చింతగా ఉండండి. ఇక అమ్మాజీ పాస్ పూచీ నాది.” అనేసాడు నరేంద్ర.

ఆ ముగ్గురు నిమ్మళం కాగలిగారు.

“ఇంతకీ మీరు భోజనాలు చేసారా.” అడిగాడు నరేంద్ర.

“ఏదీ.. ఈ విషయం తెలిసినాక అవస్థలో పడి ఆకలినే పట్టించుకో లేదు.” అన్నాడు అప్పలనర్సయ్య.

ఆ వెంబడే.. “అన్నాలు పెట్టు.” అన్నాడు అన్నపూర్ణతో.

“లేచి.. భోజనాలు చేయండి. వర్రీస్ అన్నీ విడిచి పెట్టేయండి.” చెప్పాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “మరి నేను వెళ్తాను. రేపు కలుస్తాను.” లేచాడు.

నరేంద్ర వెళ్లేక.. భోజనాలు చేసి.. ప్రశాంతంగా పడుకున్నారు అప్పలనర్సయ్య వాళ్లు.

***

నరేంద్ర రెండు మూడు మార్లు ఇంటి తలుపు కొట్టేకనే కోటి తలుపు తీయగలిగాడు.

అతడికి చిక్కటి నిద్ర నుండి మెలుకవ రావడానికి కష్టమైంది. అదే నిద్ర మత్తున తలుపు మూసి పడిపోయే వాడిలా పక్కను చేరాడు.

నరేంద్ర టైం తెలుసుకోడానికి యత్నించగా.. అప్పుడు గుర్తుకు వచ్చింది తను తన ఫోన్‌ని ఛార్జింగ్‌లో పెట్టి ఉన్నానని.

ఫోన్ ఆన్ చేసాడు. డబ్బైమూడు శాతం ఛార్జింగ్ ఐంది. టైం చూసుకున్నాడు.

సమయం పది నలభై మూడు పియం.

తిరిగి ఛార్జింగ్ పెట్టక.. ఫోన్‌ని బల్ల మీద పెట్టేసి, పర్చి ఉన్న తన పక్కని చూస్తూనే..

‘థాంక్స్ కోటీ.’ అనుకున్నాడు. దాని మీద నడుము వాల్చేసాడు నరేంద్ర. వెంటనే నిద్ర పోగలిగాడు.

***

మర్నాడు.. ఉదయం ఏడు..

ఈ మధ్య రెండు రోజులు పగటి పూట కొద్ది సేపైనా వానలు పడి పొలాలు తడవడం.. చెరువు నీళ్లు తడికి కలిసి రావడం.. గట్టి దుక్కులకు వీలు చిక్కింది.

కోటి పరిశీలనలో ట్రాక్టర్‌తో నరేంద్ర తన సాగు చేయవలసిన పొలాలను కొంత మేరకు చక్కగా దున్నేక.. ట్రాక్టర్‌ని కోటికి అప్పచెప్పాడు.

పిమ్మట మిగతా సంబంధీకులు చేస్తున్న పనులను పరివేక్షిస్తూ పొలాల్లో కలివిడిగా తిరిగి.. వచ్చి.. ఒక గట్టున నిలిచాడు. అప్పటికి అప్పలనర్సయ్య కూడా అక్కడికి చేరి ఉన్నాడు.

సమయం పదకొండు దాటుతుండగా..

“మేఘాలు కమ్ముతున్నాయి. వాన పడొచ్చు.” అన్నాడు అప్పలనర్సయ్య.

అక్కడికి  చేరువనే ఉన్న కోటి.. “మరో తడి కుదిరితే ఆకు మడ్లు పెట్టేయవచ్చు” అన్నాడు.

“అంతేగా.  కోటికీ వ్యవసాయ పట్టులు తెలిసినట్టున్నాయే.” నవ్వేడు అప్పలనర్సయ్య.

“ఇతడు పొలం పనులు చేసిన వాడే.” చెప్పాడు నరేంద్ర.

“అలానా. ఇతడు ట్రాక్టర్ పనుల్లో మాత్రం గట్టోడుగా కనిపించేసాడు.” నవ్వేడు అప్పలనర్సయ్య.

చినుకులు మొదలయ్యాయి. అంతా పనులు కట్టి పెట్టి.. ఇళ్లకు బయలు దేరారు.

***

సాయంకాలం నాలుగున్నర అవుతోంది..

అప్పటికే పడి ఆగిన వాన మూలంగా పొలాలు కాస్తా తప్పడి తప్పడిగా ఉన్నాయి. ఆకాశం నిండా ఇంకా మేఘాలు ఉన్నాయి.

అప్పలనర్సయ్య ఆ పూట పొలాల వైపు రాలేదు. మిగతా వారు ఏవేవో పనులు కానిస్తున్నారు.

“రేపు పూర్తిగా ఎండ కాస్తే ఎల్లుండి విత్తనం కట్టేద్దాం సార్.” చెప్పాడు కోటి.

“అంతే అంటావా.” నాన్చాడు నరేంద్ర.

“మీకు కొత్త. తర్జన భర్జన వద్దు. నాకు పట్టే.” చెప్పాడు కోటి.

అక్కడికి దగ్గలోనే పనులు చేస్తున్న వారిలోని జోగులు కలగ చేసుకున్నట్టు..

“డయివర్ గోరు సెప్పింది నిజమే.” చెప్పాడు.

“విత్తనాలు రడీగా పెట్టుకున్నాంగా. సమయం మించకనే ఆ పనులు కూడా కానిద్దాం.” చెప్పాడు నరేంద్ర.

కొద్ది సేపు తర్వాత.. “నాకు మరి ఇక్కడ పని లేదు. నేను ఇంటికి వెళ్తాను. వంట పని చేస్తాను.” చెప్పాడు కోటి.

ఆ వెంబడే.. “ట్రాక్టర్‌ను శివాలయం వద్ద పెట్టేస్తాను.” చెప్పాడు.

‘అలానే’ అన్నట్టు తలాడించేసాడు నరేంద్ర.

ఆ వెంబడే.. “నువ్వు వెళ్లు. నేను మరో కొంత సేపు ఉండి వస్తాను.” చెప్పాడు నరేంద్ర.

కోటి ట్రాక్టర్‌తో వెళ్లి పోయాడు.

వెళ్తూ.. “సార్.. గట్టు మీద బైక్ స్కిడ్ కావచ్చు. జాగ్రత్త.” చెప్పాడు నరేంద్రకు.

అర గంట లోగానే.. అక్కడ నుండి బైక్‌తో బయలుదేరాడు నరేంద్ర.

తనుంటున్న ఇంటికి వెళ్లాడు.

తలుపు తీసిన కోటి అప్పుడే స్నానం చేసినట్టు అగుపించాడు.

నరేంద్ర రిప్రెషయ్యాడు.

“నేను అరగంటలో వస్తాను.” చెప్తూనే బయట పెట్టిన బైక్ వద్దకు నడిచాడు.

“వంకాయలు, బంగాళదుంపలు ఉన్నాయి. కలిపి కర్రీ చేస్తాను.” తలుపు వద్ద ఆగిన కోటి చెప్పాడు.

“సరే. నీ ఇష్టం.” అనేసి బైక్ స్టార్ట్ చేసాడు నరేంద్ర.

తలుపు మూసేసాడు కోటి.

(ఇంకా ఉంది)

Exit mobile version