Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నటగాయకుడుగా అక్కినేని

[జనవరి 22 అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి]

ద్మశ్రీ, పద్మవిభూషణ్, నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు అంటేనే పరిచయం అవసరం లేని పేరు. ఆయన గొప్ప నటుడు, సినీ స్టూడియోస్ నిర్మాత. అనేక పురస్కారాలు, అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కూడా!

అయితే ఆయన ‘నటగాయకుడు’ కూడా అని చాలామందికి తెలియదు. ఆయన సినీరంగంలో ప్రవేశించేనాటికి నేపథ్యగానం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.

కథానాయకునిగా నటించిన తొలి చిత్రం ‘సీతారామ జననం’ (1944) లో గురువు విశ్వామిత్రునితో పాటు బయలు దేరుతూ “గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వరః” అంటూ తన స్వరం నుండి వెలువరించిన పద్యమే ఆయనని నటగాయకునిగా పరిచయం చేసింది.

అయితే ఆయన కనిపించిన మొదటి చిత్రం ‘ధర్మపత్ని’. ఇందులో కొంత మంది పిల్లలతో కలసి నటించారు. “ఇందుగలడందులేడని సందేహము వలదు” అనే పద్యాన్ని ఆలపించారు.

1945లో ‘మాయాలోకం’ సినిమా లోని శరాబంది రాజు పాత్రలో నటించి “మందులున్నాయ్ బాబు – మందులున్నాయ్” అంటూ పాడుకున్నారు. అయితే సినిమా నిడివి ఎక్కువయిన కారణంగా ఈ పాటను సినిమాలో ఉపయోగించలేదు.

ప్రతిభా సంస్థ 1946లో నిర్మించిన ‘ముగ్గురు మరాఠీలు’ సినిమాలో ప్రముఖ నటి, బిలియర్డ్స్ క్రీడాకారిణి టి. జి. కమలాదేవితో కలసి నటించి పాడుకున్నారు. ఈ సినిమాలో ఈమెతో కలసి “చల్ చల్ వయ్యారీ షికారీ!” అనే పాటని ఆలపించారు.

ప్రతిభా వారి పతాక టైటిల్ గీతం “జై జై భైరవ త్రిశూలధారి” పాటని వివిధ గాయనీ గాయకులతో కలసి ఆలపించారు. ఈ పాటని వారి తరువాత చిత్రాలలో పతాక టైటిల్ గీతంగా ఉపయోగించుకున్నారు.

1948 నాటి ‘పల్నాటి యుద్ధం’ సినిమాలో అక్కినేని బాలచంద్రునిగా, యస్ వరలక్ష్మి మాంచాలగా నటించారు. ఈ సినిమాలో ఘంటసాల పాటలు పాడారు కాని అక్కినేనికి కాదు. అక్కినేని తన పాటలు, పద్యాలు, తనే స్వయంగా పాడుకోవడం విశేషం. అంతేకాదు ఘంటసాలతో తన స్వరం కలపి పాటలను రసస్ఫోరకంగా ఆలపించడం ఒక సినీ చారిత్రక విశేషం.

“ఓహో! చారుశీలా! ఓహోహో వీరబాలా!
విరాళి తీర్పవే నా వరాల జవరాలా!
…………….
కలత తీరా వలపుమీర చేరరావే!
మాంచాలా!”

అంటూ సుస్వర గాయని యస్. వరలక్ష్మి స్వరానికి దీటుగా ఆమెతో కలసి ఆలపించారు. ఈ ప్రేమగీతం సినిమాని సుసంపన్నం చేసింది.

“మాచర్ల అడవులే మాకు రేపల్లె..” పాటకి కొనసాగింపుగా యుద్ధానికి సన్నద్ధం కమ్మని బోధించే ప్రబోధగీతం యువకులని ఉత్సాహపరిచి, ఉత్తేజపరుస్తుంది. ఈ పాటలో ఘంటసాలతో స్వరం కలిపారు అక్కినేని.

“రండోయీ! రండోయీ!
నవయువకులు రండోయీ!
త్వరగ రండోయీ!
దండులోన చేరండి దండులోన చేరండి
త్వరగా రండోయి”

అంటూ కొనసాగిన ఈ చరణాలు మొదలయ్యే ముందు నేపథ్య సంగీతం కూడా యుద్ధవాతావరణాన్ని తలపిస్తుంది. వింటున్న మనకీ ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన ‘పల్నాటి వీర చరిత్ర’ మంజరీ ద్విపదలో వ్రాయబడింది. ఈ ద్విపదకావ్యం లోని ద్విపదలకు ‘పల్నాటియుద్ధం’ సినిమాలో స్థానం లభించడం ముదావహం, ఈ పద్యాలు మాంచాల, బాలచంద్ర పాత్రధారులయిన యస్. వరలక్ష్మి, అక్కినేని నాగేశ్వరరావుల స్వరం నుండి వీరరసం ఉట్టిపడేట్లు వెలువడడం విశేషం.

“మానవ నైజంబు మానలేనైతి”
…….
“నాగమ్మ తలగొట్టి నలగాము పట్టి
నీ మాట రణసీమ నిక్కమ్ము జేతు
దీవించి పంపే దేవి మాంచాలా”

అనే ఈ ద్విపదలు యసెస్వరలక్ష్మి (యస్. వరలక్ష్మి), అక్కినేనిల స్వరాలలో రంగస్థల పద్యాల పోకడ అ(వి)నిపిస్తుంది.

‘బాలరాజు’ సినిమాలో “చాలుగా వగలు..” అనే చిన్నపాటను అక్కినేని పాడారు. ఇది సినిమాలో ఉంది. ఈ సినిమాలో అక్కినేనే ఆలపించిన ఓ విరహ నిస్పృహ గీతానికి ఒక ప్రత్యేక చరిత్రే ఉంది.

“చెలియా కనరావా! నిరాశబూని పోయితివా
ఓ చెలియా కలయేనా మన గాథ
ఏ కోనలలోన నిను కాన
ఏ దారి బోయితివో నా దారి ఏ దారి ఏమో చెలియా
తనువూ, మనసూ నీదే
నీదేనని బాస చేసినావే జవరాలా
రారాని కోపాలూ నా పైన నీకేల
కలయా మన గాథ”

అనే విరహ నిస్పృహ గీతాన్ని ఆలపించారు (భరాగో తన ‘మరో నూటపదహార్లు’ గ్రంథంలో విరహ నిస్పృహగీతం అనే పదాన్ని ఉపయోగించారు.).

తను పాడిన పాట కంటే ఘంటసాల గారు పాడినదే బావుందనిచెప్పి సినిమాలో ఆ పాటనే ఉంచమని అక్కినేని కోరడంతో సినిమాలో ఘంటసాల పాటనే ఉంచారు. రికార్డులలో మాత్రం అక్కినేని ఆలపించిన పాటే ఉంది.

1955 లో మిస్సమ్మ సినిమా లోని “మీకు మీరే! మాకు మేమే!” అనే బిట్ సాంగ్ చాలా చిన్న ఖండిక. నిజానికి ఈ పాట చెప్పుకోదగింది కాకపోయినా శ్రీ వి. ఏ. కె. రంగారావు వంటి విజ్ఞులు ఆ క్రెడిట్ అక్కినేని ఖాతాలో జమ చేయవలసిందేనని వాదిస్తుంటారు – వి. ఏ. కె. గారు అక్కినేని పాటలతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయన నటగాయకుడిగా యస్. వరలక్ష్మి, టి. జి. కమలాదేవి వంటి అగ్రశ్రేణి నటగాయనీమణులతో కలసి గీతాలను ఆలపించడం అంత తేలిక కాదు.

గుడివాడలో రంగస్థల నాటకాలలో స్త్రీ పాత్రలలో నటించారు అక్కినేని. వై.భద్రాచారి, మోటూరు వీర రాఘవయ్య, బుద్ధి రాజు శ్రీరామమూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు వంటి హార్మోనిస్టులు, సంగీత దర్శకుల వద్ద నేర్చిన పద్యాలు, పాటలే తనని నటగాయకుడిగా తీర్చిదిద్దాయని డా. కంపల్లె రవిచంద్రన్ గారికిచ్చిన జాపకాలు ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపారు అక్కినేని (రవిచంద్రన్ గారికి కృతజ్ఞతలతో).

పైన ఉదహరించిన గురువుల శిష్యరికం, రంగస్థలం మీద పద్యాలు, పాటలు పాడుకున్న అనుభవమే ఆయనని తొలినాటి తెలుగు సినిమాలలో నటగాయకుడిగా విజయవంతం చేశాయని చెప్పచ్చు.

***

2024 సెప్టెంబర్ 20 వ తేదీన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయ్యింది. ఈ స్టాంపు మీద ఆయన చిత్రం, ఆ వెనుక కుడివైపున సినిమా రీలు చిత్రాన్ని ముద్రించారు.

ఎడమవైపున కెమెరా చిత్రం పైన 100 సంఖ్యను ముద్రించారు. స్టాంపు క్రింది భాగంలో 100th Birth Anniversary of Akkineni Nageswara Rao అని వ్రాసి ఉంది. భారత ప్రభుత్వ తపాలా శాఖ ఈ స్టాంపుని ముద్రించి, గౌరవించడం ముదావహం.

ఫస్ట్ డే కవర్

అక్కినేని వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

Exit mobile version