[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘నటన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
శిక్షణ పొందలేదు
శిష్యరికం చేయలేదు
లేదు అనుభవం కూడా
వరించి వచ్చింది కాదు
వారసత్వం అసలే కాదు
కాదు ఇది ఒకరు నేర్పింది
అవలీలగా ఒక లీలగా
నవరసాలొలికించు నటన
కాదు ఇది కృత్రిమ కదలిక
కల్పితమైన పాత్రలో
అద్భుత అభినయానికి
ప్రేక్షకుల చప్పట్లు ప్రశంసలు
ఈ విశ్వ వేదిక మీద
అశేష ప్రేక్షకుల ముందు
రంజిల్లజేయు నటవైదుష్యం
ఎన్నో పాత్రల్లో నటించి
అందర్ని మెప్పించిన కూడా
తృప్తిని పొందలేని ఏదో వెలితి
నటన నేర్చిన మనిషి
తన యథార్ధ పాత్రలో తానే
ఇముడలేక పోతున్న వైనము
