Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నటన

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘నటన’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

సంఘ రంగస్థలం
అభినయాల నిలయమౌతూ బాధిస్తున్నది!
మారు రూపంలో
మనిషి మసలుతున్న మాయ
విష వలయమౌతూ వేధిస్తున్నది!
అత్యాధునిక అభినయ చాతుర్యం
బ్రతుకులో భాగమై
చికిత్సలేని స్వాభావిక రోగమై
సహజత్వాన్ని సమూలంగా సమయజేసే
విలయమౌతూ విస్తరిస్తున్నది!

స్వలాభ లాలస కల్మషం
స్వచ్ఛ ప్రేమగా
నాణ్యమైన నటనా కౌశల్యాన్ని ప్రకటిస్తున్నది!
అంతరంగ కౌటిల్యాన్ని చాటు చేసుకుంటూ
నయవంచక నకిలీ
అసిలీలా మభ్యపెడుతున్నది!

అత్యధికులిప్పుడు
అభినయ విద్యా విశారదులే!
నిర్మలంగా, నిండుగా
బ్రతుకులో జీవిస్తున్నట్లు
బహు చక్కగా నమ్మించేలా నటించే
కళా కోవిదులు కోకొల్లలు!
సహజత్వం క్షీణిస్తున్న దాఖలాలు
దండిగా ప్రబలుతున్నాయి!
కృతకం రాణిస్తున్న దారుణాలు
దర్జాగా ప్రవర్ధిల్లుతున్నాయి!

ఉప్పొంగే ఉల్లాసంతో సందర్శిస్తూ
మనను సమీపించే దృక్కులు,
ఉక్కిరి బిక్కిరి స్థితిని కల్పిస్తూ
సరదాగా మనతో సంభాషించే వాక్కులు,
ఉబలాటపడుతూ
సరాగంతో మనను స్పర్శించే చేతులూ
అభినవ అభినయ ప్రావీణ్యంతో
మనసులోని మర్మాన్ని
నేర్పుగా మాటుచేస్తున్నాయి!

బ్రతుకు భద్రతకై, బాగుకై
అన్యులను కష్టపెట్టకుండా
లౌక్యంగా నటించడం ఆపధ్ధర్మం!
పరులను వంచించి పీడించే
అభినయ వ్యాపారం పాపం!

బిచ్చగాడు
దాతల సానుభూతి కోసం
వికలాంగునిలా నటిస్తున్నాడు!

గొప్పోళ్ళు
కటకటాలను తప్పించుకునేందుకు
ఆకస్మిక మాయ రోగుల్లా నటిస్తున్నారు!

విషాదాశ్రువులను దిగ మ్రింగుతూ
వీక్షకులకు వినోదాన్ని పంచుతూ
విదూషకుడు విశిష్టంగా నటిస్తున్నాడు!

భోగాలపై ఆసక్తి భక్తి వేషం దాల్చి,
స్వ ప్రయోజనాసక్తి
ప్రజా సేవానురక్తి వేషాన్ని ధరించి
పకడ్బందీగా నటిస్తున్నది!
నిజ రూపాన్ని నిగూఢంగా దాచుతూ
కపట రూపం చతురతతో చరిస్తున్నది!

కల్లను, డొల్లనూ
కన్విందు జేసే వస్తు ప్రపంచంలా,
ఆశాశ్వతాలను శాశ్వతాలుగా,
అల్ప కాలిక బంధాలను
జన్మ జన్మ అనుబంధాలుగా
భ్రమింపజేసే సృష్టి కర్త నటన
పలుకులకందని
పరమోన్నత జగన్నాటక ఘటన!

Exit mobile version