[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘నాటి ‘నేగంటి’యే నేటి ‘యాగంటి’ క్షేత్రం’ అనే వ్యాసం అందిస్తున్నాము.]
కర్నూలు జిల్లా అనేక శైవక్షేత్రాలకు నిలయం. బనగానపల్లె ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటి ఒక సుప్రసిధ్ధ శైవక్షేత్రం. ఈ క్షేత్రమున ఉమాహేశ్వరులు ఏకశిలలో స్వయంభువుగా వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రమున కాలూనితే ఆధ్యాత్మిక భావనలు మనసున వెల్లివిరుస్తాయి.
దక్షిణ దేశాన్ని పాలించిన విజయనగర రాజులు పాలించిన సమయంలో యాగంటి క్షేత్రము మనోరంజకంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో సహజ సిద్ధముగా ఏర్పడిన గుహలు, పుష్కరిణులు ఈ క్షేత్రము యొక్క ప్రకృతి సౌందర్యమును పెంపొందించుచున్నవి. ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరులు నంది ప్రసిధ్ధమైనవి. ఈ క్షేత్రమున గల సహజ సిద్ధమైన గుహలు, పుష్కరణులు, గోపురములు కనువిందు కలిగించును. ఇక్కడ ఏకశిలా రూపులైన శివపార్వతులను పరమేశ్వరుని లింగాకృతిలోను, పార్వతి దేవిని విగ్రహా రూపంలోను భక్తులను అనుగ్రహించుచున్నారు.
ఈ యాగంటి క్షేత్రము విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయలు తదనంతర రాజుల చేత భావించినట్లుగా చెప్పబడుతున్నది. ఈ నిర్మాణములలో పల్లవ, చోళ, చాళుక్య విజయనగర రాజుల శిల్పకళా చాతుర్యముతో అలరారుతున్నది. ఈ ఆలయము పై ఉన్న విమానం మెట్లు కోలగా పిరమిడ్ ఆకారంలో కనిపిస్తాయి. ఇటువంటి విమాన నిర్మాణాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్మాణము క్రీస్తుశకము 8, 10 శతాబ్దాల కాలంలో నిర్మించినట్లు ఉన్నది. ఆలయంలో మహామండపము, కళ్యాణ మండపము, పుష్కరిణి మొదలగునవి ఉన్నాయి.
ఈ క్షేత్రమును గురించిన ఒక పురాణగాథ ఉన్నది. ఉత్తరాది ఉత్తరము నున్న కాశీ క్షేత్రమున నివాసమున్న అగస్త్యమహాముని లోకకళ్యాణార్థము దక్షిణ దిశకు రావలసివచ్చింది. ఒకప్పుడు వింధ్య, మేరు పర్వతములు ఎవరికివారు పోటీపడి పెరగసాగారు. అప్పుడు వింధ్య పర్వతము మేరు పర్వతాన్ని మించి పెరిగింది. ఆ వింధ్య పర్వతం యొక్క పెరుగుదలవలన సూర్యచంద్రుల గమనమునకు ఆటంకం కలిగింది. దానితో దేవతలందరూ తమను కాపాడమని శివకేశవులను ప్రార్థిస్తారు. అప్పుడు వారు అగస్త్యునితో తమ శిష్యుడైన వింధ్యుని గర్వమును అణచవలసినదిగా అగస్యుని కోరారు. వారి మాట మేరకు కాశీలో ఉన్న అగస్త్యుడు దక్షిణ దిశకు బయలుదేరాడు.
అలా వస్తున్న సమయంలో వింధ్యపర్వతము తన గురువైన అగస్త్యునికి సాష్టాంగపడి నమస్కరిస్తుంది. వెంటనే అగస్త్యులవారు వింధ్యపర్వతాన్ని అలానే ఉండమని, తాను దక్షిణ దేశ యాత్రకు వెళుతున్నాను తిరిగి వచ్చేంతవరకు అలాగే ఉండమని అంటాడు. ఎందువలన అనగా నీవు ఎత్తు పెరిగితే నేను తిరిగి దాటి వెళ్ళటం కష్టం అందువలన అలాగే ఉండమంటున్నాను. దేవతల కోరిక మేరకు వింధ్యని అలా ఉంచడానికి మహర్షి దక్షిణముననే శాశ్వతముగా ఉండిపోతాడు. ఈ విధముగా అగస్త్యులు దక్షిణ దేశమున కొలువై ఉండెను.
అగస్త్యు మహాముని దక్షిణ దేశ యాత్ర చేసిన సమయమున అందమైన పర్వతములచే గుహలచే ప్రకృతి రామణీయకతతో ప్రకాశించు ఒక సుందర ప్రదేశమును చూసి అచట విష్ణువు ఆలయమును నిర్మించదలచెను. అందులో శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింపదలచి స్వామి విగ్రహమును ఏర్పాటు చేశాను. కానీ ప్రతిష్ఠ సమయమున ఆ విగ్రహం యొక్క బొటనవేలి గోరు శిథిలముకాగ ఆ విగ్రహమును సమీపమున ఉన్న గుహలో ఉంచెను. అదే నేటి వేంకటేశ్వర స్వామి గుహ. సంకల్పరహితుడైన అగస్త్యమహాముని తన ప్రతిష్ఠకు కలిగిన విఘ్నమునకు బాధపడి శివపార్వతుల అనుగ్రహం కొరకు అక్కడ ఘోర తపస్సాచరించెను. పార్వతీ పరమేశ్వరులు అగస్త్యుని తపస్సుకు మెచ్చి కోరుకొమ్మనెను. అప్పుడు అగస్త్యుడు నేను ఇచ్చట వేంకటేశ్వర స్వామి ఆలయమును నిర్మించి వేంకటేశ్వరుని ప్రతిష్ఠించబోగా నా కార్యమునకు విఘ్నం కలిగింది. అందుకు కారణమేమని పార్వతీ పరమేశ్వరులను అడిగెను. అప్పుడు వారు ఇక్కడ గల పర్వతములు, జల ప్రవాహములు, సహజసిద్ధమైన గుహలు, ప్రకృతి సౌందర్యము అంతా రెండవ కైలాసమా అనునట్లు ఉన్నవి. కనుక ఇచ్చట వైష్ణవాలయమున కంటే శివాలయమునకు అనుకూలంగా ఉండును అని పలికిరి. అప్పుడు అగస్త్యుడు వారితో ఆదిదంపతులైన మీరు ఈ జగత్తుకు మాతా పితరులు. కనుక ఈ క్షేత్రమున ఉమామహేశ్వరులుగా ఏకశిలలో స్వయంభువులుగా నిలిచి భక్తులను అనుగ్రహించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను. దానికి ఆ ఆది దంపతులు తధాస్తు అని ఏకశిలలో ఉద్భవించిరి. అప్పుడు అగస్త్య మహాముని ఏకశిలలో ఉద్భవించిన పార్వతీ పరమేశ్వరులను ఉమామహేశ్వరులుగా దర్శించి “నేగంటి, నేగంటి” అని స్వామిని చూసి ఆనందముతో నర్తించెను. అందువలన ఈ క్షేత్రము ‘నేగంటి’ అని పేరున పిలువబడినది. కానీ కాలక్రమమున ఈ క్షేత్రము జనముచే ‘యాగంటి’ అను పేరున ప్రసిద్ధమైనది.
ఈ క్షేత్రములో ప్రముఖముగా చెప్పదగినది నంది యొక్క ప్రధాన ఆలయం. ఈశాన్యదిశలో గల నందీశ్వరుని విగ్రహము ఒక చిన్న పర్వతమువలె నిలిచి చూపరులను ఆకర్షిస్తుంది. ఈ నంది కూడా స్వయంభువు. మండపంలో నాలుగుస్తంభాల నడుమ ఉన్న ఈ నంది కొన్ని సంవత్సరముల క్రితం వరకు భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేది కాని అది కాలక్రమంగా తిరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఆ స్తంభాలను ఆనుకున్నది. ఈ నంది తల ఎత్తి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. ఈ నందీశ్వరుని గురించి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ యాగంటి బసవన్న కలియుగ అంతం వరకు అంతకంతకూ పెరిగి నేను వీరభోగవసంత రాయలుగా వచ్చినప్పుడు లేచి రంకె వేయునని చెప్పి ఉన్నారు. అందుకే యాగంటి బసవన్నా! లేచి రావయ్య అని భక్తులు ఆలపిస్తారు. ఈ ప్రధాన ఆలయానికి సమీపంలో వీరభద్రాలయము, అగస్త్య పుష్కరిణి, పెద్ద కోనేరు, రోకళ్ళగుహ, శ్రీ వేంకటేశ్వరుని గుహ, శంకరగుహ ఇలా అందమైన అనేక గుహలు, మార్నీళ్ళ చలమ అను ఒక చిన్న నీటికొలను ఉన్నది. ఇచ్చట కాకులు మనకు కనపడవు. అగస్త్య మహాముని తపస్సు చేస్తున్న సమయంలో కాకాసురుడనే రాక్షసుడు తన కాకుల సమూహముతో అక్కడికి వచ్చి ఆయన తపస్సుకు భంగము కలిగించగా అద్దానికి అగస్త్యుడు ఈ క్షేత్ర ప్రాంతమున కాకులు సంచరించరాదని శపించెను. అందువలన ఇక్కడ కాకులు కనపడవు. శనీశ్వరుని వాహనమైన కాకి ఇక్కడ ప్రవేశించదు. కనుక ఈ క్షేత్రమున శని ప్రభావం లేదు. ఈ క్షేత్రమును యాగంటి అంటారు. ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి పూజించడం వల్ల శని దోషం తొలగిపోతుందని భక్తుల నమ్మకం.
ఈ పుణ్యక్షేత్రమున ప్రతి సోమవారము, ప్రతి పౌర్ణమి దినములందు భక్తులు ఉమామహేశ్వరులను విరివిగా దర్శించి సేవించి స్వామి కృపకు పాత్రులగుచున్నారు. కార్తీకమాసమున మాసోత్సవము, దీపోత్సవములు జరుపబడును. మహాశివరాత్రికి మూడు రోజులు ఉత్సవములు అత్యంత వైభవముగా జరుగును. ఉత్సవం నందు స్వామివారికి కళ్యాణం, రథోత్సవ, పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమమునకు భక్తులు తండోపతండములుగా వచ్చి స్వామిని దర్శించి పునీతులవుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమామహేశ్వరుల పారువేట ఉత్సవము అత్యంత వైభవముగా జరుపబడును. స్వామివారు యాగంటి క్షేత్రం నుండి బయలుదేరి పాటపాడు, వీరాపురం సాదుకొట్టము, యాగంటిపల్లె, మాదాసిపల్లె గ్రామములలో ఉత్సవములు నిర్వహించి పాత పాడు గ్రామం మీదుగా యాగంటి చేరుకొనును.
ఈ క్షేత్రమున నిత్య, వార, పక్ష, మాస, సంవత్సర ఉత్సవములు జరుగును.

