Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవలోకం

[శ్రీ అన్నవరం దేవేందర్ రచించిన ‘నవలోకం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

వ నవ మెరుపు తీగ
ఇపుడిపుడే ఉదయించిన పొద్దు
లే లేత ఆకులా నవజాత దీపిక
లోకం మీదికొచ్చిన సరికొత్త జీవిక

పరి పరి ప్రసవ వేదనల మైమరచి
మురిపాల మాతృత్వ మధురిమ చూపులకు
పెదిమలు తింపే ప్రాకృతిక పరితపన
ఎంతో ఆత్రంగానే ముర్రుపాల ఆస్వాదన
తల్లీ తనయల మధ్య అనురాగ అంకురం
ఏడుపు లాలింపుల స్పర్శా మొదలైంది

ఇప్పుడిప్పుడే గాలిలో స్వర తరంగాలు
చిన్ని చేతులతో చిత్రాలు గీస్తున్న అలికిడి
బుడ్డ పాదాల ఊపుల స్పందనలైతే
అడుగుల కోసమా ఆ తహతహలు అన్నట్టు
ఆ కదలికలే నవ శిశువు పదనిసలు

చిన్ని చిన్నారి ముఖ వర్చస్సు
పొడుస్తున్న బాల సూర్యబింబమే
పూల రిక్కల్లాంటి బుజ్జి బుజ్జి చేతుల్లో
కదులుతున్న చైతన్యమేదో స్ఫురిస్తుంది

నిమిష నిమిషం కేర్ కేర్‌ల శబ్ద చిత్రం
అది భూమిని జయిస్తున్న పొలి కేక
నవ నవ నవ్య మనుమరాలా
లోకం మీదికి రెండు చేతులా స్వాగతం.

Exit mobile version