Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాయక శ్రేష్ఠులం

[శ్రీమతి షేక్ కాశింబి గారు రచించిన ‘నాయక శ్రేష్ఠులం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


విధిగా మా ఆదేశం పాటించండి
విరామం లేక విరివిగా తయారుచెయ్యండి
బాంబుల్ని మిస్సయిళ్ళని
బలమైన యుద్ధ విమానాల్ని!

కూలగొట్టి.. నేలమట్టం చెయ్యండి
‘వాళ్ళ’ ఫ్యాక్టరీల్ని.. ఆసుపత్రుల్ని
విద్యాలయాల్ని.. ఆయుధాగారాల్ని
విమానాశ్రయాల్ని.. పెద్ద పెద్ద మాళ్ళని!

ఉపాధి కల్పించే బృహత్ కేంద్రాల్ని
వృద్ధి చెందిన ఏళ్ల నాటి నౌకాశ్రయాల్ని
జన హితానికి వెలసిన ప్రకృతి వనరుల్ని
జాతి ప్రతీకలుగా పేరొందిన కట్టడాల్ని!

జనాలకు మాత్రం మినహాయింపెందుకు
జాలి పడక మారణాయుధాల్ని ప్రయోగించండి
చెట్లు -పుట్టలు వాగులు – వంకలు
వాటికవే నశించే వ్యూహం పన్నండి!

తప్పక మేమే గెలుస్తాం
తడబడక మీసాలు మెలేస్తాం
తొడలు కొట్టి చూపిస్తాం
జబ్బల చరుపులు వినిపిస్తాం!

స్వార్ధపు తేరులో ఊరేగుతూ
కొండరాళ్ళను.. సముద్రపు నీళ్లను
కొన ఊపిరితో కొట్టుమిట్టాడే ప్రాణుల్ని
కొరడా ఝళిపిస్తూ.. పాలిస్తాం!

శిధిలమైన ఎముకల గూళ్ల చేత
సేవలన్దుకుంటూ.. దర్పం వెళ్ళబోస్తాం!
ఆఖరి నెత్తుటి బొట్టునూ.. ఆవురావుమంటూ తాగుతూ
శవాల గుట్టలపై నర్తిస్తాం!

కసి తీర్చుకునేందుకే బ్రతికే నియంతలం!
పసివారినీ వదలక డునుమాడే పరమ క్రూరులం!
యుద్ధకాంక్షతో రగిలే సృష్టి నాశకులం!
పెద్ద పెద్ద దేశాధినేతలుగా చెలామణి అవుతున్న నాయకశ్రేష్ఠులం!

Exit mobile version