[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో నయ్యిరా వాఁహీద్ రచించిన మూడు కవితలని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]
~
1) మొదటి కవిత- నా లోంచి (ఫ్రొం)
————————-
ఏమిటిది?
నేను కన్న నా కొడుకు లోలోపల.,
ఇంత దారుణమైన నరమేధం ఏం జరిగింది..?
ఎప్పుడు., ఎలా జరిగింది ఈ మార్పు?
నా చర్మం కిందనే నివసించిన అతనికి .,
నా కణాలను.,నా శరీర ద్రవాలను..
నా అవయవాలను తిని.. తాగి తయారైన అతనికి.. ఏమైంది?
మెల్లిగా అతని సుతిమెత్తని ఆత్మ క్రూరంగా మారుతున్నది ఎందుకు?
అతనికి తెలీదా అతనొక సగం స్త్రీ అని?
స్త్రీ లో నుంచి అంది పుచ్చుకున్న లాలిత్యాన్ని వదులుకోకూడదని?
నాలోపలి నుంచే ఆతను తయారయ్యాడని?
******
2) రెండవ కవిత – బర్త్ మార్క్
————————-
నేను నీ దాన్ని కాను.
ఇంత పెద్ద భూగోళాన్ని ఎంతో ప్రయాసకోర్చి నేను ఇంత దూరం ప్రయాణించింది..
ఒక మగవాడికి చెందిన సముద్రంలో కలిసిపోవడానికి కాదు!
నా శరీరం నీది కాదు.
నా నోరు నీది కాదు.
నా దేహం లోని నీరు నీది కానే కాదు.
నా లోని ఏదీ అసలు నీది కానే కాదు.
ఎప్పటి దాకా అనుకున్నావు?
నాకు నేనుగా., ఇష్టంగా
నా చేయి చాపి నీకు అందించే దాకా.. నేను నీ దాన్ని అని చెప్పేదాకా..
గుర్తు పెట్టుకో!
******
3) మూడవ కవిత -ద వర్క్- పని
————————-
చూడు., నా భుజాలు నీ ఆత్మ చేసిన
మాలిన్యంతో మరకలు పడిపోయాయి.
నా జీవితం అంతా నీ వాసన వేస్తోంది.
ఇప్పుడు నా రక్తంలో ఇంకిపోయిన
నిన్ను నా లోపలి నుంచి వదిలించుకోవడానికి.,
నన్ను నేను శుభ్రపరుచుకోవడానికి.,
కొంత సమయం పడుతుందిలే.. పట్టనీ!
…………………………………
మూలం: నయ్యిరా వాఁహీద్
అనువాదం-గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964