Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీ గుడి వాకిట ముంగిట ఆశగా నిరీక్షిస్తూ..!

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘నీ గుడి వాకిట ముంగిట ఆశగా నిరీక్షిస్తూ..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

జీవన గమ్యాన్ని చేరుకోవాలని
జీవితం పడవలో బైలుదేరాను!
నేనో గొప్ప నావికుణ్ణని..
జీవన సాగరాన్ని అలవోకగా ఈదగలనని..
అహంకరించాను జ్ఞానహీనుడనై!

అయితే.. ఎంత గొప్ప నావికుడైనా
క్షణం క్షణం మారిపోయే
సముద్ర తత్వాన్ని పసిగట్టలేక
సుడిగుండాల బారినపడి
కొట్టుకుపోయే చందాన..

ఓపిక నశించగా శక్తిహీనుడనై
కష్టాల కడగండ్లలో చిక్కుకుపోయి..
ఆపన హస్తం కోసం
నీ గుడి వాకిట ముంగిట
వేచి వున్నాను ప్రభూ!

నీ సృష్టిలో..
రాజ్యమేలుతున్న కసాయితనాన్ని
ఎదిరించి నిలవాలని
పోరాడి గెలవాలని
దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంటే..
నా చుట్టు వున్న ప్రపంచంలో
క్రూర మానవ మృగాలు
విశృంఖలంగా వీర విహారం చేస్తూ
నన్ను భయకంపితుణ్ణి చేస్తున్నాయి!

నా అంతరంగంలో నిక్షిప్తమై
నన్ను పతనం అంచున నిలిపిన అహంకారం..
నా హృదయంలో నిబిడీకృతమై వున్న
సంకల్ప బలాన్ని నిర్వీర్యం చేసిన వేళ..
నా జీవన నౌక
తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది!

హృదయం లోతులన్నీ
దుఃఖ సాగరాలై..
గెలుపు తీరం కానరాక
తల్లడిల్లిపోతున్నాను!

నీ కరుణా కటాక్ష వీక్షణాల కోసం..
నీ మహాలయం ముగింట
ఆశగా నిరీక్షిస్తున్నాను!

నీ గుడి తలుపులు తెరిచి..
నీ అనుగ్రహ దృక్కులను
నా పై ప్రసరింపజేసి..
నన్నావహించి వున్న
వ్యథలనూ, వ్యాకులతలనూ
పూర్తిగా నిర్మూలించి..
నన్ను అనుగ్రహించు ప్రభూ!

Exit mobile version