[శ్రీ శ్రీను పైండ్ల రచించిన ‘నీదనుకుంటే నేరమే!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఏకబిగిన కురుస్తున్నవర్షాలకు నల్లకుంట వాగు గట్టు తెగింది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటంతా నీటిపాలై కొట్టుకుపోయింది. ఇప్పుడేం సేద్దామయ్యా..!?” అని అడిగింది సీతాలు. చెరువుగా మారిన తన పొలాన్ని చూస్తూ.. ఆమె ముఖంలో చెమటను తుడుచుకుంటూ, కంట్లో ఉబికి వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ.
“చేసేదేముందే.. ఈసారి రైతులంతా మునిగిపోయినట్టే. మనం తేలుతామేటే..? వాగు ఉప్పొంగినప్పుడు ఈ మాత్రమైనా బతికున్నాం. లేదంటే ఆ గంగాదేవి ఆగ్రహానికి బలైపోదుం కాదుటే..” అన్నాడు రాఘవుడు. ఆ గొంతులో మాటలు పూడుకుపోతున్నాయి. కొండల కింద ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లకుంట వాగు శాంతించడానికి కొన్నిరోజుల పట్టేట్టు ఉంది. రామాపురం గ్రామానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఇళ్ళకు చిన్నాచితకా రిపేర్లు వచ్చినా సులభంగానే మరమ్మత్తులు చేసుకోవచ్చు. సర్కారోళ్ళ సాయం వస్తుందో లేదోనని ఊరి పంచాయతీ పెద్దలు చర్చించుకుంటున్నారు. అందరి కన్నా పెద్ద నష్టం రాఘవుడి పొలానికే జరిగిందని కొందరు అయ్యో పాపం అన్నారు. మరికొందరు నవ్వుకున్నారు. కొందరైతే మనం నష్టపోయాం.. వాడూ నష్టపోయాడు.. లేదంటే ఈ ఏడు వాడి పంటకు మంచి రేటొచ్చి, టెక్కొచ్చేది నాకొడుక్కి అంటూ తిట్టుకున్నారు.. బంగారం లాంటి భూమి.. ఇప్పుడు చెరువైపోయింది.. ఇక వాడికి సేతులిరిగిపోయినట్టేనని దగ్గరి వాళ్ళు జాలిపడ్డారు.
రాఘవుడి పొలం ప్రత్యేకమైంది. ఎడమవైపు విస్తారమైన అరణ్యం.. కుడివైపు నల్లకుంట వాగు. కుంటకు కనుచూపు మేరలో పొలం. ఎలుగుబంటి మోకాలి మాదిరిగా రెండువైపుగా వంగిన కొండల మధ్యన ఉండే నేల. అది వారసత్వంగా వచ్చిన పదకొండు ఎకరాల ఆస్తి. అక్కడ పంటలు కాదు.. రాఘవుడి ఆశలు మొలుస్తాయి. భూమి అతని పేరుపైనే ఉంది. పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉంది. ఆస్తిపన్నుసకాలంలో చెల్లిస్తాడు. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ క్లియర్. ఎవ్వరు ఎన్నిచెప్పినా ఆ భూమిని అతను అమ్మలేదు. అక్కడి మట్టి వాసనంటే రాఘవుడికి చాలా ఇష్టం. పెరిగే పైరును కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడు. ప్రతీ చెట్టుతో మాట్లాడుతుంటాడు. వాటి భాష అతనికి మాత్రమే తెలుసు. అదేంటో రాఘవుడు ఒక్కరోజు రాకపోతే, అతన్ని చూడకపోతే, అవన్నీ అలుగుతాయి. అలక తీర్చేందుకు బ్రతిమాలాల్సివచ్చేది. మనుషులు మనసుతో మాట్లాడితే చెట్టూపుట్టా ఏదైనా వింటాయి. ప్రేమ అంత గొప్పది మరి! అయినవాళ్ళు చాలాసార్లు ద్రోహం తలపెట్టారుగానీ ఆ భూమి ఎన్నడూ రాఘవుడిని మోసం చేయలేదు. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా పంటలు బాగా పండేవి. ప్రకృతి అతనికి అందించే సహకారమది. ఇది గ్రామంలో చాలామంది కుళ్ళుకునేందుకు కారణమైంది!
రాఘవుడికి ఈసారి వింతగా అనిపించింది. నల్లకుంట వాగు పొంగి నీళ్ళు తన పొలంలోనే ఆగిపోయాయి. మొదటి రోజు తను పెద్దగా పట్టించుకోలేదు. రెండోరోజు నీరు కదలకుండా అలాగే ఉండిపోయింది. ‘అదేందబ్బా, ఇలా నీరు నిల్చిపోయింది’ అని ఆశ్చర్యపోయాడు. మూడు రోజులు.. నాలుగు రోజులు గడిచింది.
నీరు తగ్గలేదు.
ఐదో రోజు..
ఏ మార్పూ లేదు. దీనికి తోడు చిన్నచినుకు పడినా పొలంలో నిల్వ ఉండిపోయింది. చుట్టుపక్కల పొలాల్నుంచి చేరే నీటితో కలిసి, పెద్దసైజు చెరువును తలపించింది.. ఎందుకు ఇలా అయ్యిందో ఎవ్వరికీ అంతుబట్టలేదు. వర్షం కొంత నెమ్మదించింది కానీ ఇప్పుడు రాఘవుడి పొలం మాత్రం చెరువై కూర్చుంది.
రోజూ పొలం దగ్గరకు వెళ్ళడం, తిరిగిరావడం.. నీళ్ళు ఎంతకీ తగ్గలేదు. పైగా వాటిని తోడాలంటే అయ్యే పనిలా లేదు. ఎన్నని తోడి బయటపోస్తాం!?. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నరాఘవుడు తొలిసారి భయపడ్డాడు. ఊరందరి పొలాలు ఎండిపోయినా రాఘవుడి పొలం మాత్రమే తడిగా నిగనిగలాడుతూ ఉండేది. ఇప్పుడు మిగితా పొలాల్లో నీళ్ళు ఎండిపోతే రాఘవుడి పొలంలో మాత్రం నీళ్ళు నిలిచిపోయాయి. తన కూతురి చదువు ఎలా, కొడుకు ఏమైపోవాలి..?! ఇద్దరికీ పెళ్ళిచేయాలి..? ఏటికేడు చేపిన అప్పులు తీర్చాలి..? ఎట్లా..? ఎట్లా..? ఎట్లా..? అని మథనపడ్డాడు.
ఓ రోజు అతను నీళ్ళల్లో దిగాడు. గాలిలో తేలుతున్న గుబురుతో పాటూ లోతున చిన్నచేపలు కనిపించాయి. నల్లకుంట వాగు నుంచి కొట్టుకొచ్చినవి కావచ్చుఅనుకున్నాడు. వాటి చలాకీతనం చూసి అతనికి ముచ్చటేసింది. పంట లేదు కానీ ఈ నీళ్ళలో జీవం ఉంది అనుకున్నాడు. ఇక చేపల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తెప్పించి చెరువులో చల్లాడు. ఓ పది రోజుల్లోనే చేపలు ముద్దుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే రాఘవుడికి పట్టలేనంత ఆనందంవేసింది. సీతాలుకు భవిష్యత్తుపై భరోసాగా అనిపించింది. హమ్మయ్యా.. ముంచేసిన వరదే, ఉపాధికి మార్గం చూపించింది అనుకున్నారు.
చెరువులో పిల్లలు ఆడటం మొదలైంది. తీరంవెంట పశువులు సేద తీరడం, పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి చేరడంతో ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా మారింది. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని ఫోటోల్లో బంధించేందుకు సెల్పీపాయింట్ ఏర్పాటైంది.. రాఘవుడు చెరువుకు పేరు పెట్టాడు. బాహుబలి లాగా.. బహుజలి. అంటే ఎక్కువ నీళ్ళు కలిగిన పెద్దకొడుకు.. అని. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెక్కలోకి తీసుకోలేదు. పెద్ద బోర్డ్ రాయించి దారిపై పెట్టాడు. చుట్టుపక్కల చెట్లు నాటాడు. తాటిచెట్లు గట్టు చుట్టూ పెరిగి అందంగా తయారయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్దీ చేపల సంఖ్య పెరిగింది. ఆదాయం కొద్దికొద్దిగా రావడం మొదలైంది. రాఘవుడి-సీతాలలో మనశ్శాంతి. దాన్ని చెడగొట్టే ఘటనలు పురుడు పోసుకుంటున్నాయని వాళ్ళకు తెలియదు.
చలికాలం చివరి రోజులు. చెరువులో మంచు మిలమిల మెరిసిపోతోంది. కొందరు పిల్లలు జలాశయంలోకి దూకి ఈతకొడుతున్నారు. సీతాలు కట్టపై కూర్చుని చేపలు పడుతోంది. రాఘవుడు లోపలికి దిగి చేపల సైజు ఎంతుందో కొలుస్తున్నాడు. పంట చేతికొచ్చే సమయం వచ్చిందని సంతోషంలో సీతాలుకేసి చూసి నవ్వాడు. సీతాలు చాల్లే సంబడం అన్నమాదిరిగా సైగ చేసింది. ఆ సమయంలోనే తన పొలం దిశగా ఓ కారు రావడం గమనించి ఆశ్చర్యపోయింది సీతాలు. బొట్టుగాజులు వేసుకుని చేతిలో డాక్యుమెంట్లతో ఓ ఆఫీసరమ్మ.. ఆమెతో ఇద్దరు అధికారులు వచ్చారు. వెనకాల మరో రెండు బైకులు, వారి మెడలో గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరున్నఐడికార్డులు కనిపించాయి. పిల్లలు ఈత కొట్టడం మానేసి కారు చుట్టూ మూగారు. రాఘవుడికి అపశకునంలా అనిపించింది.
“ఈ భూమి మీదేనా” అని అధికారి ప్రశ్నించింది.
“అవునమ్మా.. తరతరాలుగా వచ్చిన ఆస్తి. సాగు చేస్తున్నాం.. ఈ ఏడాది నల్లకుంట పొంగి వరదలొచ్చాయి. మా పంట మొత్తం మునిగింది. ఇలా చెరువైపోనాది. పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. అన్నిపన్నులు కట్టేశాను. అమ్మా మీరు ఎవరు..?!” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఇప్పుడు ఇది మీ భూమి కాదు. ఇది ప్రాక్సిమల్ సర్పేజ్ వాటర్ బాడీ. సర్పేజ్ వాటర్ గవర్నమెంట్ యాక్ట్ 2015 ప్రకారం15 రోజుల కంటే ఎక్కువ కాలం నీటిని నిల్వ చేయాలంటే అనుమతి కావాలి” అంది.
“నేను చెరువును తవ్వలేదు. ఏకబిగిన వాన కురిసింది. నల్లకుంట వాగు పొంగింది. నా పొలాన్ని ముంచింది. నేనేం చెయ్యాలి చెప్పండి.” అన్నాడు అసహాయంగా.
“మీరు నీటిని వదలాలి. ఈ నీరు కమ్యూనిటీ రియలబుల్ రీసోర్స్. ఇది మీకు ఎన్‌క్లోజర్ లేకుండా వాడుతున్నారు. అది చట్టప్రకారంనేరం” అంది.
“ఈ భూమి నాది.. దీనిపై నీళ్ళు వచ్చి ఆగాయి. నేను ఆపలేదు. తోడేయడానికి వీళ్ళేనంతగా నిలిచిపోయాయి. అందుకు నన్ను నేరస్థుడిని చేస్తారా..? అన్నాడు రాఘవుడు.
“మీరు ఈ భూమిని వాటర్ బాడీగా మార్చారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. కోస్టల్ జోన్ రెగ్యులేషన్ యాక్ట్‌ను చూడలేదా.. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ క్లాజ్ ప్రకారం మీరు చిన్న చెరువు వేయాలన్నా డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి” అంది.
“నాకు ఇవేమీ తెలియదు మేడం. మా పొలంలో నీరు నిలిచిపోయింది. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. అంతే” అన్నాడు అమాయకంగా రాఘవుడు.
“అంత అమాయకంగా నటించొద్దు.. ఆగిన నీటిని వెళ్ళిపోనివ్వలేదు. చేపల పెంపకం కోసం ఉపయోగిస్తున్నారు. అంటే ఇది కాంట్రాక్ట్ లేని ఉపయోగం. పీనల్ క్లాజ్ 17బీ ప్రకారం 50 వేలు జరిమానా కట్టాలి. దీంతో పాటూ పదేళ్ళపాటూ జైలు శిక్ష పడుతుంది” అంది.
“మీరు చెప్పేదేం నాకు అర్థం కావడం లేదమ్మా.. నేనేం తప్పుచేశానని..? ఎందుకు జరిమానా కట్టాలి.?. ఎందుకు జైల్లోపెడతారు..?!” అని ప్రశ్నించాడు..
“తప్పొప్పులు మేం నిర్ణయించం రాఘవులు గారూ.. మేం కేవలం చట్టాన్నిఅమలుపరుస్తాం. చట్టం ఏం చెబుతుందో అదే శిక్ష మీకు పడుతుంది. దేశంలో నివసిస్తున్నారుగా. ప్రతీ ఒక్కరూ అన్ని రూల్సూ పాటించాల్సిందే.” అంది. నోటీసు లాంటి కాగితం ఇచ్చి ఆఫీసరమ్మ, ఆమె పటాలం వెళ్ళిపోయారు. రాఘవుడు చెరువు తీరాన్నిచూస్తూ కూర్చున్నారు. సీతాలు మౌనంగా భర్త పక్కనే కూలబడింది. బహుజలి నుంచి వీస్తున్న చల్లని గాలి వారిని తాకుతున్నాఇద్దరి లోపలంతా ఉక్కపోస్తోంది.
ఊరికి స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన చెరువుకు చెదలు పట్టిందని ప్రచారం జోరందుకుంది. సర్కారుకు అప్పజెప్పాలటగా! ఇన్నిరోజులు చేపల వేటతో బాగానే గడిచిపోయింది. ఇప్పుడా అత్యాశే వారి కొంప ముంచింది అనుకున్నారు జనాలంతా. ఇలా తలోమాట అనేసరికి ఆ ఇంట్లోఎప్పుడూ చూడని నిస్సత్తువ ఆవహించింది.
సీతాలు ఇంట్లో పిడుగుపడే వార్త ఒకటి ఆ రోజే వచ్చింది. బహుజలి ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి. ఏదో జిల్లా గెజిట్‌లో ప్రభుత్వ ప్రకటన. వాటర్ స్టోరేజ్ అస్సెర్ట్ #8721A – అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ కమ్యూనిటి రీసోర్స్.. అని. రాఘవుడు గది బాల్కనీలో కూర్చుని పేపర్ చూశాడు. దట్టమైన అక్షరాల వెనుక కనిపించింది తన పెద్దకొడుకు బహుజలి బొమ్మ. దాని పేరు ఆర్టిఫిషియల్ వాటర్ యూనిట్ అని చెప్పిఓ కోడ్ నెంబర్ కూడా ఇచ్చారు.
పరిస్థితి మరింత దిగజారింది.
రెండు రోజుల తరువాత,.. గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ అధికారులు మళ్ళీ వచ్చారు. ఈ సారి రాఘవుడి కుటుంబాన్ని ప్రశ్నించలేదు. ఎవ్వరికీ సమాధానమూ చెప్పలేదు. ఎవ్వరి అనుమతీ తీసుకోలేదు. వాళ్ళు వేట కొచ్చిన వారిమల్లే, ల్యాప్‌టాప్‌లు డ్రోన్ కెమెరాలు, టీటీబీఎల్ఆర్ పథకాల ప్రింటౌట్లతో చుట్టుముట్టారు.
రాఘవుడు చెరువు దగ్గరికి పరిగెత్తేసరికే అక్కడంతా సెటప్ చేసేశారు.
అతనితో ఓ అధికారి – “నోటీసు ఇచ్చాం.. ఇప్పుడు చెరువును స్వాధీనంచేసుకుంటున్నాం. అన్నట్టు మీరు ఈ చెరువులో జీతానికి పని చేయవచ్చు. ప్రభుత్వ అనుమతి తీసుకుని..”
“చెరువు మీదా..? మరి నా భూమి ఎక్కడుంది. సార్.. నేను పెంచిన చేపలు ఎవ్వడి సొత్తు సార్.. నా పంట కొట్టుకుపోయినప్పుడు ఏ ఒక్కడూ ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఆగిన నీటిలో చేపలు పెంచుకుంటుందే పెట్టుబడి ఇవ్వడానికీ ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం చెరువును స్వాధీనం చేసుకోవడానికి పొలోమని వేంచేశారు. చాలా బాగుంది సార్.. ” అన్నాడు వెటకారంగా.
“మీ శ్రమను గుర్తించాం. కానీ మీరు వాడిన వనరు సమాజానిది. నీరు, నేల వాడేందుకు అనుమతులు తీసుకోకపోవడం చట్టాల ఉల్లంఘన. మీరు లేబరర్. కాంట్రాక్ట్ లేకుండా పని చేసినందుకు పరిహారం కూడా పొందలేరు..” అన్నాడు, సీరియస్‌గా డాక్యుమెంట్లు చూసుకుంటూ.
“ఏంటయ్యా ఈ అన్యాయం.. నా భూమి.. నా చెరువు. నాకు ఒకడు జీతం ఇచ్చేదేందీ.. ఇది నా కొడుకు. నా బహుజలి” అన్నాడు ఎదిరింపుగా.
“మీ కోరిక ప్రకారం.. మిమ్మల్నిసీజనల్ వాటర్ రీసోర్స్ మెయింటెనెన్స్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నాం. దానికి నెలకు 8వేల రూపాయల జీతం వస్తుంది. కానీ ముందుగా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. అప్పటిదాకా చెరువులోకి రావొద్దు” అన్నాడు ఒకింత కటువుగా.
రాఘవుడి చేతిలో పనిముట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెరువు చుట్టూ బారికేడ్లు కట్టారు. సీసీటీవీలు పెట్టారు. ఫ్లెక్సీ పెట్టారు. అందులో – ఎంట్రీ రెస్టిక్టెడ్. ఆథరైజ్డ్ పర్సనల్ ఓన్లీ. అసెర్గ్ నంబర్.. డిపార్ట్మెంట్.. అన్ని వివరాలు ఉన్నాయి.
పిల్లలు ఈతకొట్టేందుకు చెరువులో దిగబోతుంటే గేటు దగ్గర వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. పాస్ ఉందా అంటూ కసురుకున్నాడు. పోలీసు నోటీసు కూడా వచ్చింది. ఆథరైజ్డ్ కాంట్రాక్ట్ విత్ నేషనల్ వాటర్ అసెర్ట్ ఈజ్ ఏ వయిలేషన్ అండర్ సెక్షన్ 34 w ఆప్ ది వాటర్ రీసోర్సెస్ ప్రొటెక్షన్ యాక్ట్- అని రాసుంది.
రాఘవ బహుజలి చెరువును చూస్తూ మౌనంగా నిల్చుండిపోయాడు. ఆ చెరువు తన ఊపిరిగా భావించాడు. ప్రాణంగా బాగు చేసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడో తనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అక్కడి ప్రవేశించాలంటే గగనం అయిపోయింది.
రాఘవుడు ఇప్పుడు రైతుకాదు. ఓ సీజనల్ అసిస్టెంట్ అట! తనను జీతం తీసుకునే పనివాడిని చేశాయీ దేశ చట్టాలు. ఈ నీళ్ళు బహుజలివే. కానీ తాకిన చేతులు మాత్రం నేరస్థులట..
రాఘవుడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.
కొత్తగా వచ్చిన కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు బహుజలిలో కలుస్తున్నాయి. నీళ్ళు పచ్చగా మారుతున్నాయి. చేపలు చచ్చిపోతున్నాయి. ఈసారి ప్రొడక్షన్ ఎక్కువ పెంచారు. దీంతో రాత్రివేళల్లోనే వ్యర్థాలు విడుదల చేస్తున్నారు. ఇది గమనించిన రాఘవుడు చాలాసార్లు అటు ప్రభుత్వానికి, ఇటు కంపెనీ యజమాన్యానికి ఎన్నో అప్లికేషన్‌లు పెట్టాడు.. స్పందన లేదు. వ్యర్థాలు రాకుండా అడ్డుకట్టవేయాలని గట్టుపై పెద్దగోడ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆగ్రహించిన కెమికల్ ఫ్యాక్టరీ యజమాని చెరువులో అక్రమ నిర్మాణాలు చేశారంటూ, వాటిని కూల్చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు. పలుకుబడి, డబ్బుకు అధికారగణాన్నివెంటనే నిద్రలేపే శక్తి ఉంది. ఒక్కరోజులోనే గోడను కూల్చడానికి అధికారులు వచ్చారు. రాఘవుడి మనసు రగిలిపోయింది. అధికారులతో వాగ్వాదానికి దిగాడు. వినిపించుకోకపోవడంతో నాలుగు తగిలించాడు. అంతే.. బహుజలి రణరంగంగా మారింది. అధికారులంతా ఈ చెరువు నీది కాదు. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. దీనిపై నీకు ఎలాంటి హక్కులేదు.. అని గట్టిగా అరిచారు.
“నా చెరువును కలుషితం చేస్తున్నారు. దీనిని అడ్డుకుంటే తప్పా” అంటూ నిలదీశాడు.
“చెరువును కలుషితం చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ, అక్కడ గోడ కట్టడానికి నువ్వెవరు..” అన్నారు.
“అది నా పొలం.. నా ఆస్తి.. నా చెరువు.. నా చేపలు..” గట్టిగా అడుగులేస్తూ బెదిరింపు దోరణిలో అన్నాడు రాఘవుడు.. అంతే పోలీసులు వచ్చారు.
అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సీతాలు విడిచేయండయ్యాఅని ప్రాధేయపడినా పట్టించుకోలేదు.
ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టులో రాఘవుడి నేరాన్నిపోలీసులు నిరూపించారు. శిక్షపడింది.
రాఘవుడు జైలుకు వెళ్ళాడు.
పక్కనే ఉన్నతోటి ఖైదీ.. ఇద్దరిని తెగనరికిన వ్యక్తి.
“నువ్వేం చేశావ్” అని రాఘవుడిని అడిగాడు.
“నా పొలం చెరువైంది. దానిలో చేపలు పెంచాను. పొలమూ నాదే. చేపలు నావే. అన్నాను. తీసుకొచ్చి జైల్లో పెట్టారు.”
“ఏదైనా నీది అనిపించుకోవాలని ప్రయత్నిస్తే నువ్వునేరస్థుడివి అవుతావు” అని తోటి ఖైది చెప్పిన మాటలు రాఘవుడికి నిజమే అనిపించాయి..
ఇంతకీ నా పొలంఏమైనట్టు..? అని మనసులో అనుకున్నాడు.
కొంతకాలం తర్వాత -.
జైలు నుంచి రిలీజైన రోజు నుంచి రాఘవుడు బయటికే రాలేదు. పట్నంనుంచి కొడుకు – కోడలు వచ్చారు. చాలా సందడిగా ఉంది. చాలారోజుల తర్వాత సీతాలు – రాఘవుడు ముఖాల్లో కళ వచ్చింది. కొడుకు – కోడలు ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఏ లోటూ లేదు. మనుమడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. ఊరు చూడాలంటేనూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టక రాఘవుడికి తప్పలేదు.. చెరువుకేసి వెళ్లకూడదనుకున్నాడు.. మనుమడు పరుగెత్తేసరికి అటుకేసి అడుగులు వేశాడు..
అమ్మానాన్నలు ఉండి కూడా అనాథగా మారిన బహుజలి.. తన ప్రాణం.. తన ఆశ. తన ధ్యాస.
“తాతా.. ఈ చెరువు మనదా” అని అడిగాడు మనుమడు.
చెరువుకేసి చూసి మౌనంగా తలొంచుకున్నాడు రాఘవుడు. లోపలికి రాకూదని వాచ్‌మెన్ సైగ చేశాడు.
గాలి వేగంగా వీయడంతో చెట్టుకొమ్మలు చెరువులోని నీటిని తాకి, కొన్ని చుక్కలు రాఘవుడిపై చిలకరించాయి. వాటికి తెలుసు ఎప్పుడేం చేయాలో. పెద్దకొడుకు ఏడిస్తున్నాడనిపించింది.
“ఏమీ చేతకాని తండ్రిని మన్నించరా కన్నా..?” అన్నాడు. కళ్ళ నుంచి నీళ్ళు ధారగా కారుతున్నాయి. దండం పెట్టి వెనక్కు కదిలాడు.
మనుమడు అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పలేకపోయాడు.
