Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీలమత పురాణం – 20

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

వేదంలో, పురాణాలలో అనేక భౌగోళిక విషయాల వర్ణనలున్నాయి. ఈ వర్ణనలను ఆధారం చేసుకొని పరిశోధనలు చేసే వీలుంది. పలు పాశ్చాత్య శాస్త్రవేత్తలు నదుల వర్ణలను ఆధారం చేసుకుని పరిశోధనలు చేశారు. ఋగ్వేదంలో ‘సరస్వతి సప్తతి సింధు మాత’ (నదులకు మాత సరస్వతి) అన్న ప్రకటన కనిపిస్తుంది. 1930లో మొహెంజోదారో, హరప్పా నాగరికతల అవశేషాలు బయల్పడినప్పుడు శాస్రవేత్తలు సింధు, రావి నదుల తీరాలలో విస్తరించిన నాగరికతగా భావించారు. ‘సింధు నాగరికత’ అని నామకరణం చేశారు. కాని తరువాత జరిగిన పరిశోధనల ఫలితాలు ఈ ఆలోచన పొరపాటని నిరూపించాయి. 80 శాతం ‘సింధు నాగరికత’ అవశేషాలు అదృశ్యమైన సరస్వతి నదీ తీరాన ఉన్నాయి. అంటే ‘సింధు నాగరికత’ అనుకున్నది నిజానికి సింధు నాగరికత కాదన్నమాట. అది సరస్వతి నదీ తీరాన వెలిసిన నాగరికత అన్నమాట. దాంతో వేదం క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితం నాటిదన్న పాశ్చాత్య శాస్త్రవేత్తల సిద్ధాంతాలు తలక్రిందులయి వేదనాగరికత దాదాపు క్రీ.పూ.8500 సంవత్సరాల నాటిదయిందన్న మాట. శాస్త్రవేత్తలు సరస్వతి నదిని గుర్తించడానికి, అది ప్రవహించే దారిని కనుగొనటానికీ వారికి ఆధారం వేదంలో ఋషులు చేసిన వర్ణనలు. ఋషులు ఎంత అద్భుతమైన రీతిలో నది ప్రవాహ గతిని, ఉపనదులను, నది మార్గాన్ని, అది తిరిగే వంపులను వర్ణించారంటే, ఈనాడు అంతరిక్షం నుండి ఉపగ్రహాలు అందించిన చిత్రపటాలను వారు వివరించినట్లు అనిపిస్తుంది. ఉత్తారాఖండ్ లోని ‘హిమాద్రి’ పర్వాతాలలో జనించి, ఘఘ్ఘర్ నదిని ఉపనదిగా చేసుకుని ప్రవహించిన విధానం, అది మార్చిన మార్గాలను ఋషులు వర్ణించారు. ఆ కాలంలో విమానాలు లేవు, ఇప్పటి కాలంలోఉన్నటువంటి ప్రయాణ సాధనాలు లేవు. ఫోటోగ్రాఫులు లేవు. అయినా సరే, వారు అంతరిక్షం నుంచి చూసి నది పరివాహక ప్రాంతాన్ని వ్యక్తిగతంగా పరిశీలించినట్లుగా వర్ణించారు. ఇది కేవలం సరస్వతి నది విషయంలోనే కాదు, పురాణాలలో పలు సందర్భాలలో కనిపిస్తుంది. నీలమత పురాణంలో కశ్యపుడు జరిపిన తీర్థయాత్ర వివరాలు, విశేషాలు, దర్శించిన స్థలాల వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మహాభారతంలో బలరాముడి తీర్థయాత్ర వివరాలు అద్భుతం అనిపిస్తాయి. రామాయణంలో వానరులను సీతను వెతికేందుకు పంపిస్తూ ఏ వైపు వెళ్తే ఏమి వస్తాయో చెప్పడం ఆ కాలంలో వారి భౌగోళిక పరిజ్ఞానాన్ని, వారి విజ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది. ఈనాడు శాటిలైట్ ఇమేజ్‌లు, ఇతర సాంకేతిక పరిభాషాలో సామాన్యులకు అర్థం కాని సత్యాలు దాగుంటే, ఆనాడు మామూలు గాథలలో, మంత్రాలలో వారు ఈ సత్యాలను పొందుపరిచి సామాన్యులకు చేరువ చేశారు. వారు చేసిన వర్ణనలు, ఇచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తాయి. వారి భౌగోళిక శాస్త్ర పరిజ్జ్ఞానానికే కాదు, వారి పరిశీలనా శక్తికి జోహార్లు అర్పించాలనిపిస్తుంది.

“వైవస్వత మన్వంతరంలో శ్రీహరి పత్ని ‘కశ్మీరు’గా జన్మించింది కాబట్టి కశ్మీర ప్రభువులను శ్రీహరిలో సగభాగంగా, శ్రీహరి అంశగా భావించాలి. రాజు  మాటను మన్నించాలి. రాజుకు ఎదురు చెప్పకూడదు.”

ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం.

భారతీయ సామాజిక జీవనంలో రాజును విష్ణ్వాంశలా భావించడం ఉంది. విశ్వాన్ని పరిపాలించేది విష్ణువు. కాబట్టి రాజ్యాన్ని పాలించే రాజును విష్ణువుగా భావించడం అన్నది స్వాభావికం. రాజు దైవాంశ కాబట్టి భారతీయులకు ‘దేశభక్తి కన్నా రాజభక్తి ఎక్కువ’ అని కొందరు మేధావులు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనికి వారు రాజుల నడుమ జరిగిన పోరులను ఉదాహరణగా చూపుతారు.  కానీ వారు విస్మరించిన అంశం ఏమిటంటే రాజు దైవాంశ కలవాడే తప్ప దైవం కాడు. దైవం ఎప్పుడవుతాడంటే, అతను పాలన సక్రమంగా చేసినప్పుడు. సక్రమ పాలన లేనప్పుడు అతడిని దైవంగా భావించడం కుదరదు. అయితే భారతదేశంలో దైవం కూడా ధర్మ సంరక్షణకే ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి దైవం కన్నా ధర్మం మిన్న. అందుకే భారతీయులకు ‘ధర్మభక్తి’ ప్రాధాన్యం తప్ప, రాజ్యానికి, రాజుకి కాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version