మహాభారత యుద్ధంలో పాల్గొనేందుకు కౌరవులు కానీ, పాండవులు కానీ కాశ్మీర రాజును ఎందుకని పిలవలేదన్న సందేహం జనమేజయుడికి వచ్చింది. దానికి వైశంపాయనుడు ఇచ్చిన సమాధానం తెలుసుకునే ముందు మనం అసలు మహాభారత యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవాల్సి ఉంటుంది.
మహాభారత యుద్ధం సంభవిస్తుందని నిర్ధారణ కాకముందే కౌరవులు రాజులను తమవైపు కూడగట్టుకునే పని ప్రారంభించారు. పాండవుల వనవాసం ఆరంభం కాగానే కర్ణుడు దిగ్విజయ యాత్ర ప్రారంభించాడు. ఈ యాత్రలో కర్ణుడికి దాసోహం అన్న రాజులందరూ కౌరవుల పక్షాన మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు. తాము స్వయంగా యుద్ధంలో పాల్గొనలేని వారు సైన్యాన్ని పంపారు. ఇతర రూపంలో సహాయం అందించారు. వంగ, పౌండ్ర, సుషమ, సింధు, గాంధార, కళింగ వంటి దేశాల రాజులు కౌరవులతో బంధుత్వం ఉండడం వల్ల కౌరవుల తరఫున పోరాడారు. జయద్రధుడు దుస్సలను వివాహమాడడంతో ‘సింధు రాజ్యం’, దుర్యోధనుడి మొదటి భార్య వల్ల త్రిగర్త, రెండవ భార్య వల్ల కళింగ, గాంధారి వల్ల గాంధారం వంటి దేశాలు కౌరవుల పక్షం వహించాయి.
పాండవుల తరఫున వారి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. ద్రౌపది వల్ల పాంచాల దేశం, అభిమన్యుడి భార్య ఉత్తర వల్ల మత్స్య దేశం, యుధిష్టరుడి భార్య వల్ల శివి దేశం, సహదేవుడి భార్య విజయ వల్ల మాద్ర దేశం, నలుడి భార్య కరేణుమతి వల్ల చేది దేశం, భీముడి భార్య బలాంధర వల్ల కాశి, మరో భార్య హిడింబి వల్ల ఘటోత్కచుడు, ఇతర రాక్షసులు; అర్జునుడి భార్య ఉలూపి వల్ల నాగులు, కృష్ణుడు, సాత్యకి, పాండ్య రాజులు పాండవుల పక్షం వహించారు.
మహాభారతంలో కౌరవుల సైన్యం ఎంత, పాండవుల సైన్యం ఎంత, ఏయే సైన్యంలో ఎంతమంది సైనికులు ఉండేవారు వంటి విషయాలు విపులంగా ఉన్నాయి. ఒకరకంగా చూస్తే ఈనాడు ఒక పరిశోధకుడు ప్రపంచంలోని అన్ని దేశాల సైనికులను లెక్కించి ప్రకటిస్తే ఎంత సవివరంగా చెప్తాడో, అంత వివరంగా ప్రతీ చిన్న విషయాన్నీ మహాభారతంలో చెప్పటం గమనించవచ్చు. అంటే మన పురాణాలపై పలువురు విమర్శించేట్టు కాకి లెక్కలు, గాలి లెక్కలు చెప్తున్నట్టు కాదన్నమాట.
పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు కాగా కౌరవుల సైన్యం పదకొండు అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 గజదళం, 21,870 రథ దళం, 65,610 అశ్వదళం, 109,350 పదాతిదళం.
ఈ లెక్కలు చూస్తే కళ్ళు తిరుగుతాయి.
ఒక అక్షౌహిణి సంఖ్య ఇంత అయితే ఏడు అక్షౌహిణిలు, పదకొండు అక్షౌహిణిల సంఖ్యను లెక్కించడం సులభం.
అసలు అంత సంఖ్యలో ఆ కాలంలో ప్రజలు ఎక్కడున్నారు? అని వాదిస్తారు కొందరు.
ఇంకో రెండు మూడు వందల ఏళ్ళ తరువాత 21వ శతాబ్దంలో మిలియన్ల సంఖ్యలో ప్రజలుండేవారంటే నమ్మని పరిస్థితులు రావచ్చు. ఇప్పటికే బ్రిటీషు కాలంలో వారు లేబర్ పనికి ఉపయోగించిన భారతీయుల సంఖ్య చూస్తే నమ్మబుద్ధి కాదు. ఇంకా బ్రిటీష్ పాలిత దేశాలకు (కామన్వెల్త్) వలసవెళ్ళి అక్కడే స్థిరపడిన భారతీయుల లెక్క చూస్తే నమ్మటం కష్టం. వంద, రెండు వందల ఏళ్ళ క్రితం లెక్కలే నమ్మ వీలుగా లేకపోతే, క్రీ.పూ. కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటి సంఖ్యలు నమ్మశక్యంగా లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ కాస్త ఊహాశక్తిని ఉపయోగిస్తే, భూమి ఆవిర్భావాన్ని, కల్పాలను కోట్ల సంఖ్యలలో లెక్కించిన వారి మేధాశక్తిని నిష్పక్షపాతంగా గమనిస్తే, సెకన్లలో వెయ్యోవంతు కూడా ఖచ్చితంగా లెక్కించి పాటించే వారి పట్టుదల, నిజాయితీలను అర్థం చేసుకుంటే ఈ లెక్కలపై అనుమానాలు జనించవు.
ఇక సైన్యంలో ఒక వీరుడిని అతను ఎంతమందిని మట్టి కరిపించగల శక్తి కలవాడో అన్నదాని ఆధారంగా వర్గీకరించడం కనిపిస్తుంది.
మహారథి అంటే 12 మంది అర్ధరథులతో పోరాడే శక్తి కలవాడు. అతిరథి అంటే 9 మంది రథులతో పోరాడేవాడు. అతిరథ, మహారథులని మనం చాలా తేలికగా వాడతాం. మహారథి కన్నా గొప్ప వీరుడు లేడు. అతడి తరువాత అతిరథి. మహాభారతంలో అశ్వత్థామ, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు (మాయాబజార్లో జోకర్), ఘటోత్కచుడు లాంటివారు అతిరథులు.
ఇంకా ఏకరథి (8 రథులతో పోరాడేవాడు), రథి (ఇద్దరు అర్ధ రథులతో పోరాడేవాడు), అర్ధరథి (2500 మందితో పోరాడేవాడు), అతి మహారథి (12 మహారథులతో పోరాడేవాడు), మహా మహారథి (24 అతి మహారథులతో పోరాడేవాడు) అనే వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణ ప్రకారం పాండవ సేనలో కృష్ణుడు ‘అతి మహారథి’. అర్జునుడు ఇద్దరు మహారథులతో సమానం. భీముడు (ఏకరథి), ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, ఉత్తర కుమారుడు (మరో జోకర్) వంటి వారు రథులు.
కౌరవ సేనలో భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామలు మహారథులు. కృతవర్మ, శల్య, కృపాచార్య వంటివారు అతిరథులు. ధుర్యోధనుడు ఏకరథి. శకుని, లక్ష్మణ కుమారుడు, జయద్రధుడు, నీల వంటి వారు రథులు. పాండవుల వైపు వ్యూహ రచయిత శ్రీకృష్ణుడు. కౌరవుల వైపు శకుని. అంటే ఆ కాలం లోని అతిరథ, మహారథులు, వీరులు, రాజ్యాలు అన్నీ దాదాపుగా యుద్ధంలో పాల్గొన్నాయి. రుక్మి, విదురుడు, బలరాముడు మాత్రమే యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయినవారు. ఇలాంటి పరిస్థితిలో కాశ్మీర రాజును కౌరవులు కానీ, పాండవులు కానీ తమ వైపు పాల్గొనమని ఎందుకని అడగలేదన్న ప్రశ్న జనించడం స్వాభావికం.
దీనికి సమాధానం అత్యంత కీలకమైనది. భారతీయ చరిత్రలో, సాంఘికంగా, మానసికంగా, భౌగోళికంగా, ధార్మికంగా కాశ్మీరు ప్రాధాన్యతని స్పష్టం చేస్తుందీ సమాధానం.
కశ్మీర మండలం చైవ ప్రధానం జగతి స్థితం। కథం నాసౌ సమూహృత స్తత్ర పౌండవకౌరవైః ॥ (5)
కిం నామాభూత స రాజా చ కాశ్మీరాణాం మహాశయః । కథం వాసౌ నిశమ్యౌతన్నాయాత శ్చాత్మనా తథా॥ (6)
ఎంతో ప్రాధాన్యం కల కశ్మీరుకి ప్రపంచంలోని దేశాలన్నీ పాల్గొన్న భారతయుద్ధంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానంగా గతంలో జరిగిన సంఘటనలు చెప్పడం ఆరంభిస్తాడు. ఇక్కడి నుంచి 30వ శ్లోకం వరకూ కశ్మీర చరిత్ర వివరణ ఉంటుంది. ఈ కథను రాజతరంగిణిలో కల్హణుడు నీలమత పురాణం నుండి దాదాపుగా యథాతథంగా వాడేడు.
కశ్మీరును కలియుగారంభంలో మొదటి గోనందుడు అనే రాజు పాలిస్తూండేవాడు. ఈయన యుధిష్టరుడికి సమకాలీనుడు. జరాసంధుడికి సన్నిహితుడు. మధురపై దాడి చేస్తూ జరాసంధుడు, తమకు సహాయంగా రమ్మని గోనందుడిని ఆహ్వానిస్తాడు. మిత్రుడి ఆహ్వానాన్ని మన్నించిన గోనందుడు జరాసంధుడికి సహాయంగా మధురపై దాడికి వెళ్తాడు.
జరాసంధుడు దాడికి వస్తున్నాడని తెలియగానే కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ యుద్ధంలో ఓడిపోతాడు. ఒక కథ ప్రకారం కృష్ణుడు నగరం వదిలిపోతాడు. చాలా కాలం యుద్ధం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితిలో బలరాముడు యుద్ధరంగంలోకి దూకుతాడు. చాలాకాలం యుద్ధం సాగుతుంది. చివరికి యుద్ధంలో గోనందుడు తీవ్రంగా గాయపడతాడు. మరణిస్తాడు. దాంతో జరాసంధుడు ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతాడు. కశ్మీర సైన్యం కశ్మీరు చేరుతుంది.
తండ్రి మరణించడంతో ‘దామోదరుడు’ కశ్మీరు రాజవుతాడు. అతడు చక్కగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. కానీ అతడికి ఆనందం ఉండదు. యుద్ధంలో తండ్రి మరణం అతడిని బాధిస్తూంటుంది. ఇలాంటి పరిస్థితులలో గాంధార రాజు కృష్ణుడిని, అతడి బంధువులను స్వయంవరానికి పిలిచాడని తెలుస్తుంది. ఆ స్వయంవరానికి పెద్ద సైన్యం తీసుకుని దామోదరుడు వెళ్తాడు. అక్కడ కృష్ణుడితో తలపడాల్సి వస్తుంది. కృష్ణుడు అతనిని సంహరిస్తాడు.
ఆ సమయంలో దామోదరుడి భార్య యశోవతి గర్భవతి. కృష్ణుడు యుద్ధంలో విజయం సాధించినా కశ్మీరును ఆక్రమించాలని ప్రయత్నించడు. కశ్మీరుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు చేపట్టడు. కశ్మీరు శత్రువుకు మిత్రదేశం. అంటే పరోక్షంగా శత్రుదేశం. అయినా సరే, కృష్ణుడు కశ్మీరును ఆక్రమించాలన్న ఆలోచనను కూడా ప్రదర్శించడు. గర్భవతిగా ఉన్న యశోవతిని కశ్మీరుకు రాణిగా నియమిస్తాడు. తాను గెలిచి సైతం ఓడిన రాజు బార్యకు సింహాసనం అప్పగించిన అతి అపురూపమైన సన్నివేశం ఇది.
ఓడిన శత్రువులను అవమానించి, వాడి భార్యలను తన రాణివాసానికి సేవకులుగా తరలించడమో, వారి సేనలకు భార్యలుగా చేయటమో మాత్రమే తెలిసిన ‘జాతుల’కు కృష్ణుడి ఈ చర్యలోని ఔన్నత్యం అర్థం కాదు. భారతీయ ధర్మంలోని గొప్పతనం బోధపడదు. ఎందుకంటే వారి బుద్ధికి అందని ఔన్నత్యం ఇది. శత్రువును చంపటం, అతడి స్త్రీలను అవమానించటమే ఆధిక్యత అనుకునే ఆత్మన్యూనతా భావంలో మగ్గుతూ, అభద్రతా బావానికి గురయ్యే ఆత్మవిశ్వాసం లేని జాతులకు ఇలాంటి గాథలు కల్పితాలుగా, కట్టుకథలుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ భారతీయులకు ఇలాంటి ఔన్నత్యం, ఔదార్యం, ఉత్కృష్ట వ్యక్తిత్వ ప్రదర్శన సర్వసాధారణం.
ఇంతవరకు ‘నీలమత పురాణం’లో ఉన్న కథను గ్రహించిన కల్హుణుడు కృష్ణుడు ఎందుకని కశ్మీరును ఆక్రమించలేదో వివరిస్తూ కృష్ణుడితో అద్భుతమైన శ్లోకం చెప్పిస్తాడు.
కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్ఞేయో హరాంశజః । వా వజ్ఞేయస్య దుష్టోపి విదుషా భూతి మిచ్ఛతా ॥
కశ్మీర భూభాగం పార్వతీమాత. రాజు శివాంశజుడు. అతడు దుష్టుడైనా పరలోక శ్రేయస్సు కోరి రాజును అవమానించరాదు.
ఇదీ భారతీయ ధర్మం. ఇదీ భారతీయాత్మ స్వచ్ఛమైన స్వరూపం.
కశ్మీరు రాజు తనపై కోపంతో ససైన్యంగా వచ్చి స్వయంవరంలో ఉన్న తనతో తలపడి ఓడినా కృష్ణుడికి ఆ రాజుపై ద్వేషం లేదు. రాజ్యంపై కోపం లేదు. రాజు చేసిన నేరానికి ప్రజలను ద్వేషించి వారిని హింసించాలని లేదు.
కశ్మీరు పార్వతితో సమానం. రాజు శివాంశజుడు. ఇంతే కావల్సింది ఆ రాజ్యాన్ని అతని భార్యకు అప్పగించేందుకు.
ప్రపంచంలో ఏ నాగరికతలో కూడా ఇలాంటి అత్యద్భుతమైన ఔన్నత్యం కంచుకాగడా పెట్టి వెతికినా లభించదు.
‘నీలమత పురాణం’లో ఈ ఘట్టంలో కేవలం కృష్ణుడికి కశ్మీరుపై ఉన్న పవిత్ర భావన వల్ల రాజ్యాన్ని యశోవతికి అప్పగించాడని ఉంటుంది. ఆ పవిత్ర భావన ఏమిటన్నది కల్హణుడు వివరించాడు రాజతరంగిణిలో (చూ. రాజతరంగిణి కథలు, కశ్మీరాః పార్వతీ కథ).
తతః స వాసుదేవేన యుద్ధే తస్మిన్నిపాతిత్ః । అన్తర్వత్నీం తస్య పత్నీం వాసుదేవో అభ్యషేచయత్ ॥ (26)
భవిష్యత్పుత్ర రాజ్యార్థే తస్య దేశస్య గౌరవాత్ । తతః సా సుషేవే పుత్రం బాల గోనన్ద సంజ్ఞితమ్ ॥ (27)
ఇదీ నీలమత పురాణంలో ఉంది. నరకుడికి వాసుదేవుడికి జరిగిన యుద్ధంలా దామోదరుడికి, వాసుదేవుడికి నడుమ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాసుదేవుడు దామోదరుడిని సంహరించాడు. కానీ కశ్మీరుపై గౌరవంతో ఆ గర్భవతి అయిన అతని భార్యను రాణిగా నియమించాదు భవిష్యత్తులో ఆ పుత్రుడు రాజవుతాడు. అతడి పేరు గోనందుడు.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే – ‘తనది కాని దాని కోసం ఆశ పడకపోవడం’ అన్న ఆధ్యాత్మికత, ధర్మంగా అమలు అవటం. అంతేకాదు, గెలిచిన వాడిది కాదు రాజ్యం. ఓడినా రాజ్యం వారిదే. గెలుపు ఓటములు దైవాధీనాలు. దాన్లో గొప్ప లేదు, కక్ష లేదు. క్రోధం లేదు. ద్వేషం లేదు. ఓడినవాడిపై చులకన భావం లేనే లేదు.
సాధారణంగా, ఆధునిక చరిత్రకారులు, చరిత్ర విశ్లేషకులు భారతదేశంలో రాజులను నీచులుగా, దుష్టులుగా చూపుతారు. భారతీయ మహిళలు వంటింట్లో బందీలయి, సంకెళ్ళలో మ్రగ్గుతూ వ్యక్తిత్వం అన్నది లేనివారని ప్రచారం చేస్తారు. దీనికి తోడు భారత దేశానికి ‘దేశం’ అన్న భావన స్వాతంత్ర్యం తరువాత సంస్థానల విలీనం తరువాతనే వచ్చిందని తీర్మానిస్తారు.
‘నీలమత పురాణం’లో దామోదరుడి మరణం తరువాత శ్రీకృష్ణుడు రాజ్యాన్ని గర్భవతి అయిన యశోవతికి కట్టబెట్టడం చూస్తే పై వాదనలన్ని శుష్క వాదాలనీ, పై పైన చూసేసి, పాశ్చాత్య దేశాల సామాజిక, రాజకీయ, మానసిక వికృతులను భారతదేశానికి ఆపాదించి, మనల్ని మనం తక్కువ చేసుకోవటం తప్పించి మరొకటి కాదని స్పష్టమవుతోంది. ఇది పులి, పిల్లిని చూసి తనని తాను మరచి పిల్లిలా కావడం లాంటిది (చూ. దేశభక్తి కథలు – ‘మన బెబ్బులి’ కథ).
ప్రాచీన కాలం నుంచి భారతీయులకు దేశానికి, ధర్మానికి అభేద ప్రతిపత్తి అనీ; రాజులు, రాజ్యాలు పోయినా ప్రజల దేశభక్తి అంటే ధర్మభక్తి తప్ప రాజభక్తి, రాజ్య భక్తి కాదని నిరూపించే సంఘటన ఇది. మానవ చరిత్రలో మరపురాని మహత్తరమైన ఘటన ఇది. అలాంటి పార్వతి లాంటి కశ్మీరు ఈనాడు రాక్షసుల్లాంటి తీవ్రవాదుల చేతిలో చిక్కి విలవిలలాడుతోంది.
(మిగతా వచ్చే సంచికలో)
‘Neelamata puranam’, while maintaining the tempo, is offering the vast unexplored areas of our ancient culture. With excellent readability, the Author Sri Muralikrishna deserves kudos for his work.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™