పుష్కరాదీని తీర్థాని వితస్తాద్యశ్చ నిమగ్నాః।
శచీ వనస్పతీ గౌరీ ధూమ్రోర్ణా రూచిరాకృతిః॥
పుష్కర వంటి పవిత్ర స్థలాలను, వితస్త, నిమగ్నా వంటి తీర్థాలను, శచి, వనస్పతి, గౌరి, ధూమ్రోర్ణాలను, సినీవాలి, కుహు, రాకా, చానుమతి లను పూజించాలి.
అయతి, నియతి, ప్రజ్ఞ, మతి, వేలా, ధారిణిలతో పాటు విధాతలను పూజించాలి. ఛాందాంసిను పూజించాలి. ఐరావణ, సురభి, ఉచ్ఛైశ్రవసులను పూజించాలి. శాఖ, విశాఖ, స్కంద, నైగమేశ, వాయుదేవతలను, అనారోగ్యాన్ని కలిగించే దేవతలను, జ్వరాలను కలిగించే రోగదేవతలను, వినాయకుడు, కుమారస్వామిలను పూజించాలి. ఋషులు వాలఖిల్య, కశ్యప, అగస్త్య, నారదులను పూజించాలి. అప్సరసలను, సోమరసపానం చేసే దేవతలను పూజించాలి. ఆదిత్యుడు, రుద్రుడు, విశ్వదేవతలు, అశ్వినిలు, భృగులు, అంగీరసుడు, సాధ్వి, మరుత్తులను పూజించాలి.
12 ఆదిత్యులు, ధాత, మిత్ర, ఆర్యమ, పూష, శక్ర, అంశ, వరుణ, భగ, త్వష్ట, వివస్వత, సవిత, విష్ణువులను పూజించాలి.
అప, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాసలనే ఎనిమిది ‘వాసు’లను పూజించాలి. అంగారక, సూర్య, నృత్తి, ఘోష, అజైనపాద, అహిర్భుధ్న్య, ధూమకేతు, ధ్వజ వాహన, ఈశ్వర, మృత్యు, కాపాలి, కంకణ అనే ముల్లోకాల రుద్రులను పూజించాలి. క్రతు, దక్ష, హసు, సత్య, కాల, ధ్వని, మరు, వాక్, ధనుజ లనే పది విశ్వదేవులను పూజించాలి. నాసత్య, దస్త్ర అనే ధ్వనులను పూజించాలి. భువన, భనవ, సుజన్య, సుజాత, త్యాజ, సువ, మర్ధ, దక్ష, చాయ, బంధూక, ప్రశవ, వ్యాయ అనే 12 భృగువులను పూజించాలి.
ఆత్మ, ఆయూష్, మానస, దక్ష, మద, ప్రాణ, హవిస్మ, గరిష్ట, ఋత, సత్య అనే పది శక్తివంతమైన అంగీరసులని పూజించాలి.
మనస, మద, ప్రశ్న, నర, పాల, దితి, హాయ, నయ, హంస, నారాయణ, విభు, ప్రభు అనే 12 సంధ్యలను పూజించాలి.
శక్తివంతమైన 49 మరుత్తులను పూజించాలి.
ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, జ్యోతి, ఏకచక్ర, ద్విచక్ర, త్రిచక్ర, ఋతుజిత్, సుశిణ, సేనజిత్, అగ్నిమిత్ర, అరిమిత్ర, ప్రభుమిత్ర, అపరాజిత, ఋత్, బుల్‌వాన్, ధార్త, నిధార్త, వరుణ, ధృవ, విధారణ, దేవదేవ, ఇద్రక్ష, అద్రక్ష, ఇహద్రక్, అమల్‌సాన, క్రితిన, ప్రసాకృద, దక్ష, సమర, ధాత్, ఉగ్ర, ధానం, భాగ్మ, అభియుక్త, సదసహ, ద్యుతి, వసురాభ, అదృశ్య, వామ, కామజయ, విరాట్ అనే 49 మరుత్తులను పూజించాలి.
కళాత్మక నిర్మాణాలకు ఆద్యుడు విశ్వకర్మను పూజించాలి. విశ్వకర్మను పూజించేటప్పుడు ఆయుధం, వాహనం, గొడుగు, ఆసనం, దుందుభి, చిహ్నం వంటి వాటన్నింటినీ ప్రత్యేకంగా వేర్వేరుగా పూజించాలి. పూలమాలలతో, రంగులతో, దీపాలతో, ధూప దీప నైవేద్యాలతో వాటిని పూజించాలి.
విశ్వకర్మను, అతని వస్తువులు ప్రత్యేకంగా పూజించిన తరువాత గ్రహాన్ని ప్రత్యేకంగా పూజించాలి. భవిష్యత్తులో వచ్చే గ్రహాన్ని, నాగులను, ఆ నెల అధిష్ఠాన దేవతను పూజించాలి.
గ్రహము, మాసము, ఖగోళ శాస్త్రవేత్త ‘నోటి’ లాంటివి. ఖగోళ శాస్త్రవేత్త నుంచి నెల, సంవత్సరం, రోజు, వంటి వాటిని తెలుసుకుని, పూలతో నైవేద్యాలతో పూజించాలి.
ఫలవేద నుంచి నాగుల సంవత్సరాన్ని తెలుసుకుని పూలతో, పళ్ళతో పూజించాలి. మంత్రోచ్చారణతో వెన్న, బార్లీ, యవలు, తిలలతో నిరంతరం పూజించాలి.
బ్రాహ్మణులను వారు పూజించిన గ్రహాన్ని బట్టి ధనం చెల్లించాలి. తరువాత బంధు, మిత్ర, కళత్ర, సేవకులు, బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయాలి.
ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చరిత్ర వంటి శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులను ప్రత్యేకంగా ధనం, వస్త్రం, ధాన్యం ఇచ్చి సత్కరించాలి.
ఇతిహాసాలు, పురాణాలు పఠించే, వినిపించే బ్రాహ్మణులను ప్రత్యేకంగా గౌరవించాలి. ప్రతి వ్యక్తి తనను తాను పూలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలతో అందంగా అలంకరించుకోవాలి. దీన్ని ‘మహాశాంతి’ అంటారు.
మహాశాంతి అంటే అన్ని పాపాలను నశింపజేసేది. అన్ని దుష్టశక్తులను శాంతింపజేసేది. కలికి సంబంధించిన దుష్టస్వప్నాలను నశింపజేసేది. దీర్ఘాయుష్షును, ధనధాన్య ఐశ్వర్యాన్ని ఇచ్చేది. రోగనాశిని. శత్రునాశిని. దేశాభివృద్ధికారిణి. ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేది మహాశాంతి.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

