Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీలమత పురాణం-68

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

“కనకవాహిని దగ్గర సకల భూతాలతో సంతోషంగా నివసించిన తరువాత మరో శరీరంతో నా దగ్గరకు రా.”

ఇలా నందికి వరాలు ప్రసాదించిన తర్వాత శత్రునాశనుడు, దేవ శత్రువుల శత్రువినాశుడు అయిన శివుడు మృత్యదేవతను నంది దగ్గరకు రావద్దని చెప్పి, ఓదార్చి పంపించాడు. నందిని తన వెంట తీసుకుని ఉత్తర మానవ సరస్సు దగ్గర ఉన్న హరముక్తమనే పవిత్ర పర్వతారోహణం చేశాడు.

ఇక్కడ దేవదేవుడు మహేశ్వరుడు ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు. దేవతలందరితో కలిసి వశిష్ఠుడు మహేశ్వరడిని ప్రతిమను ప్రతిష్ఠించాడు. భూతేశ్వరుడి విగ్రహనికి పశ్చిమాన నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

“ఓ శత్రు నియంత్రకా, ఇలా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత దేవతలు తమ నివాసాలకు వెళ్లారు. తపస్సు విధానంగా కల ఋషులు తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. పవిత్ర జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంది. అలా భృగువు శాపం వల్ల, శివుడిచ్చిన వరం వల్ల నది నిరంతరం మహేశ్వరుడిని దర్శిస్తూ ఉండిపోయాడు. అయితే దుష్టులకు నందీశ్వరుడి విగ్రహం కనబడదు. భూతేశ్వరుడి దర్శనం వల్ల సర్వపాపాలు నశిస్తాయి.

హర భూతేశ్వరుడిని, జ్యేష్ఠేశ్వరుడుని నందిని సాగరతీర్థంలో స్నానం చేసి పవిత్రమయాక తర్వాత దర్శనం చేసుకుంటే భూతగణాలలో ప్రాధాన్యం పొందుతారు.”

ఇక్కడ ఒక విషం… ఒక విషయం గురించి స్పష్టం చేసుకోవాలి.

నంది విగ్రహాన్ని పాపాత్ములు దర్శించలేరు. అది వారికి కనబడదు అనటాన్ని అర్థం చేసుకోవాలి.

‘నంది విగ్రహాన్ని పాపాత్ములు చూడలేరు’ అనటం వెనుక చిన్న లాజిక్ ఉంది.

మనిషి దృష్టి సంకుచితం. కాని మనిషి తన దృష్టి సంకుచితం అంటే ఒప్పుకోడు. తనకు కనబడిందే కరెక్టు అనుకుంటాడు. అదే నిజం అనుకుంటాడు. కంటికి మెదడుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కన్ను ఏది చూపిస్తే మెదడు అది చూస్తుంది. మెదడు దేన్ని చూడమంటే కన్ను అదే చూస్తుంది, అది అక్కడ ఉన్నా, లేకున్నా. అంటే తాను చూస్తున్నది నిజమా కాదా అన్నది ఒక వ్యక్తి సంపూర్ణంగా నిర్ధారించుకోలేడన్నమాట. అందుకే ‘నేను చూస్తున్నది సత్యం’ అని కొందరు పట్టుబడితే ‘నేను చూస్తున్నదే సత్యం ఎందుకంటే ఇతరులూ దాన్నే చూస్తున్నార’ని నిర్దారించాలని కొందరు ప్రయత్నిస్తారు. అధిక సంఖ్య ద్వారా సత్యాన్ని నిర్ధారించ ప్రయత్నిస్తారు. నందిని పాపాత్ములు దర్శించలేరు అన్న దాని వెనుక ఇంత కథ ఉంది.

నంది విగ్రహం భౌతికంగా ఉన్న చోట ఉంటుంది. ఇటు కదలలేదు. కాబట్టి కంటి చూపు ఉన్న ప్రతి వాడు దాన్ని చూడగలడు. అలాంటపుడు పాపాత్ములు చూడలేరనటంలో అర్థం కనబడదు. చూపున్న ప్రతి వాడూ చూస్తాడు. అయితే మన వారెప్పుడూ భౌతికాలకి ప్రాధాన్యం ఇవ్వలేరు. నంది విగ్రహం కనబడటంలో గొప్ప లేదు. విగ్రహంలో నందిని చూడటం అసలు రహస్యం.

‘రాతి బొమ్మకూ రవ్వలు తొడిగీ’ అంటారు. వారి దృష్టి అంతవరకే. అటువంటి వారికి విగ్రహం కనబడుతుంది. రాయి కనబడుతుంది. రాయి నంది రూపంలో కనబడుతుంది అంతే. రాయి నందిగా కనబడదు. అక్కడ సజీవమైన నంది కనబడదు. శివుడి ధ్యానంలో సర్వం మరచి అణువణువూ శివనామ ప్రతిధ్వనితో పరవశించి పోతున్న నంది కనబడదు. నందిని చూడలేక పోవటమంటే అది.

పాపాత్ములు అంటే దైవ భక్తి లేనివారు. దైవ భక్తి లేనివారంటే దైవాన్ని పూజించనివారు. దైవాన్ని నమ్మనివారు అని కాదు. భక్తి అన్నది సంపూర్ణంగా భగవంతుడిపై విశ్వాసం ఉంచటం. దాన్లో ఎలాంటి కల్తీ ఉండదు. సర్వం భగవదంకితం. అలాంటి వారికి రాయి కనబడదు. సజీవమైన నంది కనబడుతుంది. శివుడి దర్శనంతో నిరతరం పులకితాంతదారిగ అయి అర్ధ నిమీలిత నేత్రాలతో శివ ధ్యానంలో సర్వజగతిని మరచిన నంది దర్శనం ఇస్తుంది వారికి. పాపాత్ములకూ, పుణ్యాత్ములకూ తేడా ఇది. పాపాత్ములకు నంది కనబడదు అంటే అర్థం ఇది.

గుడికి వెళ్లి క్యూల్లో నిలబడి, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ విగ్రహం ముందుకెళ్ళి ఓ దండం పెట్టేయటం భక్తి కాదు. అణువణువునా జీవం తొణికిసలాడుతున్న సజీవమైన దైవాన్ని నిర్జీవమైన విగ్రహాంలో దర్శించటం భక్తి. అలాంటి వారు పుణ్యాత్ములు. వారికే నంది కబడుతుంది. దైవ దర్శనం అవుతుంది. కాబట్టి ‘పాపాత్ములకు నంది కనబడదు’ అంటే  నాకు కనిపిస్తుంది కాబట్టి నేను పుణ్యాత్ముడను అనటం నిజం కాదు. ‘కనబడటం’ మిధ్య. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుని మందుకు పోవాల్సి ఉంటుంది.

ఇందతా విన్న గోనందుడికి ఒక సందేహం వచ్చింది.

(ఇంకా ఉంది)

Exit mobile version