Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నీలమత పురాణం – 7

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

మారీచాయ సమాధత్స్య శ్రోతుం నామాని భూపతే।
తాసాం యస్థాశ్చ యే జాతాస్తేషాం నామాని మే శృంగు॥

అదితేస్తనయా దేవా దితేర్దైత్యాస్తథైవ చ।
గాంధర్వ్యా వాజినః పుత్రా భద్రాశ్చ సురభే సుతాః॥

“రాజోత్తమా కశ్యపుడి సంతానం నామాలు చెప్తాను విను. అదితి సంతానం దేవతలు. దితి సంతానం దైత్యులు. సురభి సంతానం భద్రులు.”

ఇక్కడి నుండి కశ్యపుడి పుత్రుల పేర్లను వివరించడం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పేరు సరిగ్గా తెలిసీ తెలియనివారు కూడా భారతీయ ధర్మం, భారతీయ తత్వం, పురాణాల విషయంలో మహా పండితులుగా పురాణ విజ్ఞాన సర్వస్వాలుగా తమని తాము భావించుకుంటూ తమ బుద్ధికి (ఉందన్నది అనుమానమే) తోచినట్టు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. తమ అజ్ఞానంతో, అదీ ద్వేషపూరితమూ, కుట్రపూరితమైన దౌర్జన్యంతో, లేని పోని దుష్ట భావనలు సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం వల్ల, ద్వేష భావనలు విస్తరింపజేయడం వల్ల కలిగే తాత్కాలిక లాభాలను ఆశించి వందిమాగధ భట్రాజ గణం ఆ ద్వేషాన్నీ, పొరపాటునీ ‘సవ్యం’గా భావించి చిందులు తొక్కుతున్నారు. అకాండతాండవం  చేస్తున్నారు. వారు చేస్తున్న విద్వేషపూరితమైన ప్రచారాలలో భాగమే దేవతలు అగ్రవర్ణాల వారని, దైత్యులు అల్పవర్ణాల వారని, దేవతలు రాక్షసులను సంహరించడం తరతరాలుగా అల్పవర్ణాల వారిపై జరుగుతున్న దౌష్ట్యానికి నిదర్శనం అని వాదించి ప్రచారం చేయడం. మరి కొందరు – దేవతలు ఆర్యులు, దైత్యులు స్థానికులు; బయట నుంచి వచ్చి ఆర్యులు స్థానికులపై జరిపిన యుద్ధాలే ఈ దేవతల, దానవుల యుద్ధాలు అనడం. ఏ మాత్రం కనీసం పురాణ పరిజ్ఞానం ఉన్నవారు కూడా అంగీకరించని ఈ దుష్ట వ్యాఖ్యలు సమాజంలో ఆమోదం పొందడం భారతీయ సమాజంలో పురాణాల పట్ల ఉన్న ఉదాసీనతను, తమ గురించి కాస్తయినా తెలుసుకోవాలన్న ఉత్సాహ రాహిత్యాన్ని స్పష్టం చేస్తుంది. తెలియనివాడిని మోసం చేయటం, మూర్ఖుడిని చేయటం, వాడిని తప్పుద్రోవ పట్టించి తనని తాను నాశనం చేసుకునేట్టు చేయటం చాలా సులభం. ప్రస్తుతం భారతీయ సమాజం అలాంటి స్వీయ నాశనకారి మూర్ఖుడి కన్నా అథమ స్థాయిలో ఉన్నవాడిలా ప్రవర్తిస్తోంది.

కశ్యపుడికి అదితికి జన్మించిన వారు దేవతలు. దితికి జన్మించిన వారు దైత్యులు అని దాదాపుగా ప్రతీ పురాణం స్పష్టం చేస్తోంది. ఆధునిక ప్రజాస్వామ్య విలువల ఆధారంగా లెక్కించినా, మెజారిటీ పురాణాలు ఇదే విషయాన్ని ప్రతీసారీ స్పష్టంగా నొక్కి చెప్తున్నాయి. అంటే, దేవతలు, దైత్యులకు తండ్రి ఒక్కడే. తల్లులు సోదరీమణులు. అంటే, వారి సంతానం కూడా వారి వంశానికి… ఆధునికంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒకే కులానికి చెందినవారు అవుతారు. ‘అదితి’ దక్ష ప్రజాపతి కూతురు. ఆమెకున్న పన్నెండుమంది సోదరీమణుల్లో దితి ఒకర్తె. బ్రహ్మ కాలి బొటనవేలి నుండి దక్షుడు ఉద్భవించాడు. బ్రహ్మ కులం ఏమిటి?  బ్రహ్మ బొటనవేలి కులం ఏమిటి? దక్షుడి కులం ఏమిటి? బ్రహ్మ ఆర్యుడా?. దక్షుడు ఆర్యుడా? ఒక వేళ బ్రహ్మ అర్యుడయితే, దక్షుడు ఆర్యుడు కావాలి. దక్షుడు ఆర్యుడయితే అతని పుత్రులూ ఆర్యులు కావాలి. పోనీ అతని ఇద్దరు భార్యలలో ఒకరు ‘అగ్రవర్ణం’, మరొకకరు ‘అల్పవర్ణం’ అయితే ఒకరికి పుట్టిన సంతానం ఆర్యులు, అగ్రవర్ణం వారు. మరొకరికి పుట్టిన సంతానం అనార్యులు, అల్పవర్ణాల వారు అనుకోవాలి. కానీ ఇలాంటి అవకాశం లేకుండా ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టినవారు. అక్కచెల్లెళ్ళు. ఏ రకంగా చూసినా ఇక్కడ అగ్రవర్ణం, అల్పవర్ణం, ఆర్యులు, అనార్యులు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ వారిని అణచివేశారు అన్న ఆలోచనలకు తావు లేదు. అసలు అలాంటి ఊహ తలపు లోకి వచ్చేందుకు ఆస్కారం కూడా లేదు. అయినా అలాంటి వెర్రి మొర్రి కుళ్ళు ఆలోచనలు రావడమే కాదు, అవి ప్రచారం పొంది చలామణీలోకి వచ్చి ప్రజల నడుమ అడ్డుగోడలు నిర్మించగలుగుతున్నాయంటే అవి తమ గురించి తమకు తెలియని అజ్ఞానం తప్ప మరొకరి గొప్పతనం కాదు. గమనిస్తే అసలు ఆ కాలంలో ఇప్పటిలాంటి కుల, జాతి భావనలు లేవని అర్థమవుతుంది.

కశ్యపుడిని కొన్ని పురాణాలు బ్రహ్మ మనవడిగా ప్రకటిస్తాయి, మరికొన్ని పురాణాల ప్రకారం కశ్యపుడు బ్రహ్మ సంతానం. ఏ రకంగా చూసినా ఆర్యుడు కానీ అగ్రవర్ణాలకు చెందిన వాడు కానీ అయ్యే అవకాశం లేదు. మహాభారతం ప్రకారం బ్రహ్మ మానసపుత్రుడయిన మారీచి సంతానం కశ్యపుడు. కాబట్టి బ్రహ్మ మనుమడు. వాల్మీకి రామాయణం ప్రకారం మారీచి, అత్రి, పులస్త్యుల తమ్ముడు కశ్యపుడు. అంటే బ్రహ్మ సంతానం. కొన్ని పురాణాలు కశ్యపుడు, కాశ్యపుడు వేర్వేరుగా చూపితే, ఇంకొన్ని ఇద్దరినీ ఒకరిగా చూపుతాయి. దీన్ని పక్కనబెట్టి చూస్తే, కశ్యపుడు బ్రహ్మల నడుమ సంబంధం విషయంలో మాత్రం ఇలాంటి సందేహం లేదని స్పష్టమవుతోంది. ఇప్పుడు మన పురాణ అజ్ఞాన సర్వస్వాలు దేవతలు, దైత్యులు, ఆర్యులు, అనార్యులు, అగ్రవర్నలు, అల్పవర్ణాలు అని భావించటానికి వారి ‘అజ్ఞానం’, ‘చిలిపితనం’ తప్ప మరొక ఆధారం లేదని స్పష్టం అవుతుంది.

కశ్యపుడి ఇతర జన్మల గురించి కూడా కొన్ని పురాణాలలో కథలున్నాయి. సుతపసుడు భార్య ప్రశ్నతో కలిసి 12000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడికి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వారు విష్ణువు తమకు సంతానంలా పుట్టాలని కోరుకున్నారు. తరువాత మన్వంతరంలో వారికి విష్ణువు ‘వామనుడి’లా జన్మించాడు. కశ్యపుడు తరువాత వసుదేవుడి తండ్రిలా జన్మించాడు. అదితి దేవకిలా జన్మించింది.

ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, పురాణాలలో ఇలా వ్యక్తులు, వారి సంతానం, వారి సంతానం ఇలా వివరాలు ఉండడం ఒక సామాజిక కార్యం నిర్వహిస్తుంది. సాధారణంగా మనిషి తాను క్షణికుడిని అనుకుంటాడు. రేపు అన్నది ఉందో లేదో తెలియని తన జీవితంలో ఉన్న ఈ క్షణాన్ని అనుభవించాలని భావిస్తాడు. తదనుగుణంగా సిద్ధాంతాలు సృష్టిస్తాడు. తనకు భవిష్యత్తు లేదనుకున్నవాడు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తాడు.  ఇందుకు భిన్నంగా వ్యక్తికి తన గతం తెలిసి, తన పూర్వీకుల గొప్పతనం, తన వారసత్వపు ఔన్నత్యం తెలిసి, తన ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, తన వారసులపై ప్రభావం చూపుతుందని గ్రహిస్తూ ఉంటే, ఆ వ్యక్తి తాను క్షణికుడు అనుకోడు. తాను కేవలం గతానికి భవిష్యత్తుకు నడుమ వారధి మాత్రమే అనుకుంటాడు. తన బాధ్యతను తెలుసుకుంటాడు. బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. ఇది గమనించిన ప్రాచీన సమాజాలన్నీ, ప్రతి వ్యక్తికీ తన గతం గురించి, తన వారసత్వం గురించి వివరించి, తమ జీవితం క్షణికం కాదు, ఇదొక నిరంతరం తరంతరం నుంచి తరానికి అందించే ప్రయాణం లాంటిదనికి తెలిపే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాయి. కొందరి పని ఇదే. ఊళ్ళు తిరుగుతూ ఊళ్ళోని వారందరికీ వారి పూర్వీకుల గురించి, పూర్వీకుల ఔన్నత్యం గురించి, వారసత్వం గురించి చెప్తుండేవారు. అందరి గురించి సమాచారం సేకరించేవారు. కొద్ది సంవత్సరాల క్రితం వరకు వ్యక్తులను వారి అసలు పేరుతో కాక, వారి పూర్వీకుల పేర్ల ఆధారంగా గుర్తు పట్టేవారు. ‘ఫలానా వారి మనవడు’గా గుర్తించేవారు.

అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్’ రచన ద్వారా ఆఫ్రికాలోనూ ఇలాంటి వ్యవస్థ ఉండేదని తెలుస్తుంది. ఇలా ఊరూరు తిరిగే వ్యక్తులకు తమ వారసత్వాన్ని గుర్తు చేసే ‘గ్రియోట్’ ద్వారా హేలీ తనవారిని కలుస్తాడు. ‘రూట్స్’ రచన మొత్తం ఈ సంఘటన వైపుకే పరుగెడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పరమాద్భుతమైన ‘పతాక’ సన్నివేశం లాంటిది ఆ సంఘటన. తనవారిని కలుసుకున్న హేలీ న్యూనతా భావంతో కుంచించుకుపోతాడు. ఎందుకంటే తన నలుపు స్వచ్ఛం కాదు. తెల్లవారి సంగమంతో కలుషితమైన నలుపు అది. కానీ ఆఫ్రికాలో ఉన్న అతనివారిది స్వచ్ఛమైన నలుపు. దాన్ని చూసి తనని తాను కలుషితుడిగా భావించి న్యూనతా భావానికి గురవుతాడు హేలీ. అమెరికాలో పెరిగినవాడు, విద్యావంతుడు, ఆధునిక సౌకర్యాలను, సౌఖ్యాలను అనుభవిస్తున్నవాడు, ఆఫ్రికాలో ఓ మారుమూల ఎలాంటి ఆధునిక విజ్ఞాన గంధం లేనివారు, ఇంకా ఆదిమానవుల స్థాయిలో జీవిస్తున్నవారితో తనను తాను పోల్చుకుని సిగ్గుపడతాడు. న్యూనతా భావాన్ని అనుభవిస్తాడు. ఇది ‘రూట్స్’ రచన ఆత్మను స్పష్టం చేసే సంఘటన. తనవారికి, తన దేశానికి, తన వారసత్వానికి దూరమైన వ్యక్తి తన సంస్కృతి, సంప్రదాయాలను నిలుపుకోవటం కోసం, తనని తనకు దూరం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జరిపిన పరమాద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది ‘రూట్స్’. అతని పోరాటం ఏడుతరాల తరువాత విజయం సాధిస్తుంది. ఈ రచన తెలుగు అనువాదంలో ఈ సంఘటన కనబడదు. ఒక వ్యక్తి తన సంస్కృతి సాంప్రదాయాలను నిలుపుకోవటం కోసం చేసే పోరాటం కనబడదు. కేవలం అణచివేత కనిపిస్తుంది. తెల్లవారి దౌష్ట్యం మాత్రం కనిపిస్తుంది. తెలుగులో సంక్షిప్త అనువాదం ముసుగులో దాగి, అనువాదకుడు తన సిద్ధాంతపు రంగుటద్దాలలో మూలంలోని జీవాన్ని, ఆత్మను చంపి  ‘రూట్స్’ను ఏడు తరాలుగా అందించాడు. మూలం చదవని వారంతా రంగుటద్దాలతోనే ‘రూట్స్’ను అర్థం చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనే ఒక రచన ప్రచురితమైన కొద్ది సంవత్సరాలలోనే ఇంతగా దుర్వాఖ్యానానికి గురయి, అసలు అర్థానికి భిన్నంగా ప్రచారంలోకి వచ్చి ఆమోదం పొందుతుంటే, ఎప్పుడో రచించిన పురాణాల గురించిన దుర్వాఖ్యానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంగ్లంలోని రచనను తెలుగులోకి తప్పుగా అనువదిస్తే, ఆంగ్లం తెలిసినవారూ చెప్పలేదు. తెలియనివారి గురించి చెప్పనవసరం లేదు. పురాణాలు సంస్కృతంలో ఉన్నాయి. అది తెలిసిన వారు చెప్తున్నా వినే స్థితిలో సమాజం లేకపోవటం మన సమాజంలోని వైచిత్రిని స్పష్టం చేస్తోంది.

ఇక ‘నీలమత పురాణం’ విషయానికి వస్తే, దితి అదితిల సంతానం పేర్లు చెప్పిన తరువాత వరుసగా ఎవరెవరు ఎవరెవరికి జన్మించారో ఓ జాబితా ఇవ్వటం ఉంటుంది. ఇది ఆవశ్యకమైన అంశం. ఇలా పూర్వీకుల గురించి తెలియటం వల్ల సమాజంలో వ్యక్తులకు తమ జీవితం బుద్భుద ప్రాయమైనా సృష్టి అవిచ్ఛిన్న ధారలో భాగమని తెలుస్తుంది. అనంతమైన ఈ మాలలో తాను ఒక పుష్పమన్న భావన కలుగుతుంది. ఇది మానవ జీవిత పరిణామ క్రమము, సామాజిక అభివృద్ధి గురించి అవగాహన కలిగిస్తుంది. నీటి అణువులు దేనికదే ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉన్నా అనంతమైన పాథోరాశితో కలిపి చూస్తే దాని అస్తిత్వం లేదన్న గ్రహింపు కలుగుతుంది. కుటుంబం కోసం వ్యక్తి, సమాజం కోసం కుటుంబం, ధర్మం కోసం సర్వం త్యాగం చేయాలన్న సిద్ధాంతమ్ అర్థమవుతుంది. అందుకని ఈ జన్మల పరంపరను పురాణాలు ప్రకటిస్తూ, వ్యక్తులకు వారి వారసత్వాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకే భారతదేశంలోని ప్రతి వ్యక్తీ, ఆ వ్యక్తిని ఇతరులు ఎంత తక్కువవడిగా భావించి, చులకనగా చూసినా, తన ఉనికిని ఏ ఋషికో, ఇంకో మహానుభావుడికో ముడిపెట్టి అటునుంచి తిన్నగా సృష్టికారుడి నుంచి తన పరంపరను వివరిస్తాడు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో వ్యవహరిస్తాడు. ఎవరెంత ప్రయత్నించినా అచంచలమైన విశ్వాసంతో నిలుస్తాడు. కానీ ఎప్పుడయితే అతని ఈ పరంపర గొలుసు తెగిపోతుందో, అప్పుడీ విశ్వాసం దెబ్బతింటుంది. దాంతో ఆత్మాభిమానరాహిత్యం, ఆత్మవిశ్వాస రాహిత్యం అతని మనస్సులో చోటు చేసుకుంటాయి. వ్యక్తి బానిస మనస్తత్వంలోకి దిగజారుతాడు. తనని తాను మరచిపోతాడు. అందుకే ‘గతం లేనివాడికి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు’ అంటారు. అందుకే ప్రపంచంలో ప్రజలను ఉత్తేజిత పరిచి, కార్యసాధనకు ఉన్ముఖులను చేసేందుకు ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం రగిలించేందుకు ‘గతం’ను ఒక ఆయుధంలా వాడతారు. లేని గతచరిత్రను సృష్టిస్తారు, వీరులను వెతుకుతారు. ప్రతీకలను సృష్టిస్తారు. అయితే ఇలా కృత్రిమంగా వెతికి, పద్ధతి ప్రకారం సృష్టించిన వాటి వల్ల ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం దురభిమానంగా, అహంకారంగా ముదిరితే తద్వారా చెలరేగే ద్వేషభావాల వల్ల  కలిగే ప్రమాదాలు కూడా చరిత్రలో సాక్ష్యాలుగా దొరుకుతాయి. ఇందుకు భిన్నంగా ఎలాంటి ద్వేష భావనలు, ఉచ్చ నీచ భావనలు లేకుండా అత్యద్భుతమైన చరిత్రను, పరంపరను మన పూర్వీకులు మనకు పురాణాల రూపంలో అందించారు. తద్వారా ప్రజలందరి నడుమ ఐక్యత ఏర్పడి, ఉచ్చ నీచ భావనలు తగ్గి, స్నేహ సౌభ్రాతృత్వ భావనలు నెలకొంటాయి. ఎవరు తమ గతాన్ని ఎవరెవరి ద్వారా నిర్మించుకున్నా చివరకు అన్నీ సృష్టికారుడి దగ్గరకు చేరాల్సిందే. అలాంటి అద్భుతమైన ఏర్పాటును అపార్థం చేసుకోవటం వల్ల, తృణీకరించి, తూష్ణీంభావం వహించడం వల్ల అంతులేని సంపద ఉండి కూడా బికారుల్లా నిలవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఏ ప్రాంతీయ పురాణం రాసినా, ఎంతగా ఆ పురాణం స్థానికమైనదైనా దానిలో ఈ పరంపరను పొందుపరిచారు. దానివల్ల కశ్మీరులో ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నవాడు కూడా కన్యాకుమారిలో ఓ మూల ఉన్నవాడితోనూ సంబంధం గుర్తించగలడు. వాడితో స్నేహం నెరపగలడు. తాము ‘ఒకటి’గా భావించగలడు. కాబట్టి ఎంతగా విసుగు అనిపించినా, అప్రస్తుతం అనిపించినా పురాణాలలోని ఈ వంశావళిని, పరంపరను తప్పనిసరిగా పరామర్శించాల్సి ఉంటుంది. గమనించి, గ్రహించి, విశ్లేషించాల్సి ఉంటుంది.

(మళ్ళీ రెండు వారాల తరువాత)

Exit mobile version