నీలమత పురాణంలో ప్రస్తావనకు వచ్చే కొన్ని జాతుల గురించి టూకీగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పురాణాలు పనికిరానివంటూ, చారిత్రకంగా వాటి నుంచి ఎలాంటి ప్రధానమైన సమాచారం లభించదని వ్యాఖ్యానిస్తారు. కానీ తరచి చూస్తే పురాణాలు అత్యంత విలువైన సమాచారాన్ని అందించటమే కాదు, ప్రాచీన భారతం గురించి ఒక అవగాహన కలిగిస్తాయని బోధ పడుతుంది. ముఖ్యంగా నీలమత పురాణాన్ని పరిశీలించటం వల్ల భారతదేశంలో ఏ ప్రాంతమైనా, ఎంతగా ఇతర ప్రాంతాలకు దూరంగా ఉన్నా సరే, భారతీయ ధర్మం వల్ల ఇతర ప్రాంతాలతో ఏకత్రితమవటం తెలుస్తుంది. భారతీయ ధర్మం దేశాన్ని నిలపటం అర్థమవుతుంది.
నీలమత పురాణంలో, రాజతరంగిణిలో ‘దార్వు’ల ప్రసక్తి పలుమార్లు వస్తుంది. మహాభారతం సభాపర్వంలో దార్వం అన్న ప్రాంతానికి చెందిన దార్వులనే క్షత్రియుల ప్రసక్తి వస్తుంది. దార్వం అన్న రాజ్యానికి ‘దార్వ’ అన్న క్షత్రియ రాజు అన్న మాట. అయితే ఈ దార్వ అన్నది ప్రాంతం పేరా? జాతి పేరా? అన్న విషయంలో ఇంకా చర్చలు సాగుతున్నాయి. మహాభారతం భీష్మపర్వంలో ‘దార్వ’ అనే ప్రాచీన భారత భూభాగం ప్రస్తావన వస్తుంది. ద్రోణపర్వంలో ‘దార్వాభిసార’ అన్న తక్కువ జాతి వారి ప్రస్తావన ఉంటుంది. దరదలు, షూరులు, ఔదుంబరులు, కశ్మీరీలు, త్రిగర్తలలో పాటు దార్వుల ప్రస్తావన వస్తుంది. దార్వ ప్రాంతాన్ని జమ్మూలోని జిల్లాగా గుర్తించారు.
కైరాతా దరదా దర్వాః షూరా వై యమకాస్తథా।
ఔదుంబరా దుర్విభాగాః పారదా బాహ్లికైః సహ॥
కశ్మీరాశ్చ కుమారాశ్చ ఘోరకా హంసకాయనాః।
శిబిత్రిగర్తయౌధేయా రాజన్యా భద్రకేకయాః॥
(మహాభారతం, సభాపర్వం)
దీన్ని బట్టి మహాభారతం కాలం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలు, అక్కడక్కడి రాజులు, జాతుల గురించిన అవగాహన దేశమంతా ఉందని అర్థమవుతోంది. అంటే, ఎక్కడికి అక్కడ వేర్వేరు రాజ్యాలు, రాజులు ఉన్నా, సంబంధ బాంధవ్యాలు ఉండటమే కాదు, అందరినీ ధర్మం వేర్వేరు పూలను ఒకే దారంతో బంధించినట్టు కట్టి ఉంచిందన్న మాట.
అభిసారులు:
అభిసారులు అలెగ్జాండర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. తరువాత అతనితో సంధి చేసుకున్నారు. నీలమత పురాణంలోనూ, రాజతరంగిణిలోనూ దార్వాభిసారం అన్న ఒక ప్రత్యేక రాజ్యంగా ప్రస్తావించటం కనిపిస్తుంది. వితస్త, చంద్రభాగ నదుల నడుమ ఉన్న ప్రాంతం ఒకప్పటి దార్వాభిసారంగా భావిస్తున్నారు. ఇప్పుడు తరచూ వినిపించే ‘పూంఛ్’ ప్రాంతం కూడా దార్వాభిసారంలో భాగమే. మహాభారతంలో ప్రాచీన భారతానికి చెందిన ‘జానపదం’గా అభిసారాన్ని వర్ణించటం ఉంది. అర్జునుడు దిగ్విజయ యాత్రలో ఈ ప్రాచీన నగరాన్ని గెలుచుకున్నాడు.
గాంధారులు:
గాంధారులు మనకు బాగా తెలుస్తారు ‘గాంధారి’ వల్ల. సింధునది తీరం నుంచి కాబుల్ వరకు ఉన్న ప్రాంతాన్ని గాంధారంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ‘సుబల’ అనే శక్తివంతమైన రాజు పాలించేవాడు. అతని కూతురు గాంధారి ధృతరాష్ట్రుని వివాహమాడింది. యవనులు, కాంభోజులు, కిరాతులు, బర్బరులతో పాటు గాంధారులను ప్రస్తావిస్తుంది మహాభారతం. ‘మిళిందపన్హా’ కశ్మీరులు, గాంధారుల నడుమ సత్సంబంధాలున్నట్టు చెప్తుంది. గాంధార రాజు కనిష్కుడు కశ్మీరును జయించినట్టు భావిస్తుండటంతో, గాంధారులకు, కశ్మీరులకు నడుమ అనుబంధం ఉండడంలో ఆశ్చర్యం లేదు. రాజతరంగిణిలో కొన్ని సందర్భాలలో రాజులు గాంధారంలో తల దాచుకోవటం కనిపిస్తుంది.
జుహుందరులు:
‘దరదాన్జ గురారిశ్చైవ గాంధార జూరసాన్కుహున్‘ అంటుంది మత్స్య పురాణం. జుహుందరులు, జగుడులు, జుహుడాలు అందరూ ఒకటేగా భావిస్తున్నారు చరిత్రకారులు. వీరుండే ప్రాంత్రం దక్షిణ అఫ్ఘనిస్తాన్ అనీ, ‘గజ్ని’ వీరి రాజధాని అని అనుకుంటున్నారు.
యవనులు:
నీలమత పురాణంలో ఒక నాగు పేరు ‘యవనప్రియ’. యవనులు అనగానే పాశ్చాత్యులు ముఖ్యంగా ‘గ్రీకులు’ అన్న ఆలోచన ప్రచారంలో ఉంది. కానీ పురాణాలు పరిశీలిస్తే యవనులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినవారు కారనీ, వేదభ్రష్టులై దేశం వదిలి వెళ్ళినవారిని యవనులు, మ్లేచ్ఛులు అన్న పదాలతో సూచించేవారని తెలుస్తుంది. పలువురు యవనులు అంటే అయోలు అని తీర్మానించారు. మహాభారతంలో కాంభోజ రాజు సుదక్షిణుడు యవనులతో కలిసి పెద్ద సైన్యం తీసుకుని దుర్యోధనుడితో కలుస్తాడు. వీరు భారత యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడారు. మహాభారత అనుశాసన పర్వం ప్రకారం యవనులు క్షత్రియులు. శాపం వల్ల వారు శూద్రులయ్యారు. దీన్ని బట్టి చూస్తే కూడా యవనులు ఎక్కడి నుండో వచ్చినవారు కాదన్న ఆలోచన కలుగుతుంది. యయాతి కొడుకు తుర్వసు యవనుల ఆవిర్భావానికి కారణం. మరో గాథ ప్రకారం ‘నందిని’ నుండి యవనులు జన్మించారు. ఇవన్నీ చూస్తుంటే మన పురాణాలను పుక్కిటి పురాణాలన్న దృష్టితో కాక, అవి అందించే చారిత్రక, భౌగోళిక, సామాజిఒక, ధార్మిక అంశాల విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే నిజం బోధపడుతుంది. ‘నీలమత పురాణం’ ముగించే ముందు చర్చించాల్సిన మరో ప్రధానమైన అంశం- నీలమత పురాణం ఆధారంగా ప్రాచీన కశ్మీరులో స్త్రీల స్థితిగతులను విశ్లేషించటం.
(ముగింపు త్వరలో)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

