[డా. వేంపల్లి గంగాధర్ రచించిన ‘నీలి కళ్ళ పిల్ల’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
ఈ రోజు గురువారం. బడి దగ్గర సంత జరుగుతుంది.
నిజానికి ప్రతివారం సంతకు వెళ్ళవలసిన అవసరం నాకు ఉండదు. కానీ ఈమధ్య తరచూ వెళ్తున్నాను. కొండకు అవతల ఉన్న అడవి పల్లె నుంచి నెత్తిన చిన్న గంప నెత్తుకొని వాళ్ళ అమ్మతో పాటు ఆ చిన్ని ‘నీలి కళ్ళ పిల్ల’ వస్తుంది. ఆ గంపలో ఏమి ఉండవు. ఒక్కొక్కసారి కొన్ని ఉసిరికాయలు మాత్రం ఉంటాయి. చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. చాక్లెట్లు ఇస్తే తీసుకోవాలా, వద్దా అన్నట్లు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ చేయి చాస్తుంది.
వాళ్ళ అమ్మ ఏమో “తీసుకో ఏమి పరవాలేదు.. మనసారే” అన్నట్లు చెబుతుంది. ఈ చిన్న అమ్మాయి అటు ఇటు చూస్తూ టక్కు మని నా చేతిలోని చాక్లెట్ లాగేసుకుంటుంది. నాకు చాలా సరదాగా ఉంటుంది. అంతకుమునుపు సంతకు వెళ్లాలంటే చిరాకుగా ఉండేది. కానీ ఈ పిల్ల పరిచయమయ్యాక తరచూ వెళ్లాలనిపిస్తోంది. నిజానికి ఈ చిన్నమ్మాయి నాకెందుకు నచ్చిందా? అని నాకు నేను ఒకసారి ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పిల్ల ‘నీలి కళ్ళు’ నన్ను ఆకట్టుకున్నాయి అని. ఈ నీలి కళ్ళనే చాలామంది, చాలాచోట్ల సహజంగానో , హేళన గానో ‘పిల్లి కళ్ళు’ అని అంటూ ఉండడం విన్నాను. కానీ ఇందులో ఏమి విశేషం లేకపోవచ్చు. అట్లా నీలి కళ్ళ వాళ్లను చూడడం నాకు కొత్త కూడా కాకపోవచ్చు. కానీ ఎందుకో ఆ చిన్ని పిల్ల చూసే చూపు, నవ్వే నవ్వు నన్ను కట్టిపడేశాయి అని మాత్రం చెప్పగలను.
ఆ అమ్మాయి పేరు అఖిల. వాళ్ళ అమ్మ పేరు దుర్గమ్మ. సంతలో ఎండు చేపలమ్ముతుంది. ఒక్కోసారి తన భర్త వెంకటరాముడు మద్రాసుకు పోయి సరుకు కొనుక్కొని వస్తాడు. వాడు పలకని రోజున తానే దగ్గర్లోని పట్నంలో ఉన్న మార్కెట్ వ్యాపారుల దగ్గరకు వెళ్లి సరుకు తెచ్చుకుంటుంది. దాన్ని సంతలో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకొంటోంది. వెంకటరాముడికి ఆటో ఉంది. వాడు ఒక తాగుబోతు అని, ఇంకో దాన్ని పడమటి పల్లెలో ఉంచుకొని ఉన్నాడని, ఇంటికి వాడికి నచ్చిన రోజున వచ్చిపోతూ ఉంటాడని, వాడు ఈ జన్మకు మారడని ఎప్పుడూ తిట్టి పోస్తూ ఉంటుంది. ఈ పిల్ల కోసమే తాను ఇంకా బతికి ఉన్నానని చెబుతూ అప్పుడప్పుడు దుఃఖ పడుతూ ఉంటుంది. సంతలో ఎండు చేపలు ఈమె తప్ప ఎవరూ అమ్మరు. వీటిని ఇష్టపడి కొనేవారూ ఉంటారు. దగ్గరికి రాగానే ముక్కు మూసుకొని వెళ్లిపోయే వారూ ఉంటారు. ఆమె బతకడానికి, ఆ పిల్లను పోషించుకోవడానికి తన రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. సంత లేని రోజుల్లో దగ్గర్లో తయారు చేస్తున్న ‘సిమెంటు ఇటుకల’ ఫ్యాక్టరీకి పనికి పోతుంది.
ఈ రోజు సంతకి రంగులరాట్నం కూడా వచ్చింది.
దాని దగ్గర పిల్లల కేరింతలు వినిపిస్తున్నాయి. కోలాహలంగా ఉంది. ఆ పిల్లకు ఇష్టమైతే ఒకసారి ఎక్కి తిప్పించాలని మనసులోనే అనుకున్నాను.
ఆ పిల్ల తో మాట్లాడటం చాలా సరదాగా ఉంటుంది. ఇష్టంగానూ ఉంటుంది.
“వస్తావా నువ్వు నా వెంట.. తీసుకెళ్లి పోతాను. మా ఇంటికి. నా కూతురితో పాటూ నువ్వు కూడా ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు” అని అంటాను.
ఆ పిల్లకు అర్థం కాదు. వాళ్ళ అమ్మ వైపు తిరిగి చూస్తుంది.
“తీసుకపోయి సాక్కో పోండి సారూ..” అని నవ్వుతూ వాళ్ళ అమ్మ జవాబిస్తుంది.
దూరంగా అటువైపు మర్రి చెట్టు వద్ద పిల్లల ఉత్సాహంతో, సంబరంగా తిరుగుతున్న రంగులరాట్నం వైపు చూపిస్తూ “నువ్వు కూడా తిరుగుతాను అంటే చెప్పు.. తీసుకెళ్తాను!” అని అన్నాను హుషారుగా.
వెంటనే పరుగు పరుగున వెళ్లి వాళ్ళ అమ్మ వెనుక దాక్కుంది.
ముడుక్కొని కూర్చొంది . భయపడుతున్నట్లు ఉంది.
“సరే వద్దులే” అని అన్నాను సముదాయిస్తూ.
అక్కడి నుంచే దొంగ దొంగగా చూస్తోంది. చేతి లోని బొమ్మను ముఖానికి అడ్డంగా పెడుతూ తీస్తూ ఆడుకుంటోంది.
వారం రోజుల్లో దసరా పండుగ. సంత అంతా సందడి సందడిగా ఉంది. జనం అటు ఇటు తిరుగుతూ పైకి లేపుతున్న ఎర్రటి దుమ్ము.
అటువైపు వేపచెట్టు నీడలో సైకిల్‌కు రంగురంగుల గౌన్లు తగిలించుకొని కేకలు వేస్తున్న వ్యక్తి నా కంట పడ్డాడు.
“నాతో వస్తావా అదిగో అక్కడ సైకిల్ పైన గౌన్లు అమ్ముతున్నారు. మంచిది ఒకటి కొనిస్తాను. రా వెళ్దాం..” అంటూ చేయి అందించాను.
ఆ చిన్న పిల్ల మళ్లీ వాళ్ళ అమ్మ వైపు చూసింది.
“ఎందుకులే సారూ.. మొన్ననే దీనికి ఒక గౌను కొన్నాను. దాన్నే పండక్కు తొడుగుతాను.” అని వాళ్ళ అమ్మ సమాధానమిచ్చింది.
ఆ పిల్ల నాతో రావడానికి సమాయత్తం అవుతూ తను కూడా చెయ్యి అందిస్తూనే వాళ్ళ అమ్మ అనుమతి కోసం కళ్ళతో వెళ్తాను అన్నట్లు చూస్తోంది.
“పర్వాలేదు లేమ్మా.. ఈసారి పండక్కు నేను కొనిస్తాను.” అంటూ ఆ పిల్లను నాతోపాటు తోడ్కొని అటువైపుకు కదిలాను.
ఆ పిల్ల ఎంతో సంబరపడుతోంది. కాసేపు పైకి ఎగురుతూ కాళ్లు ఊపుతూ నాతో పాటు నడుస్తూ వచ్చింది.
“నీకు ఏ గౌను కావాలి?” అని అడిగాను.
అందులో ఎర్రటి రంగు కు గులాబీ పూల డిజైన్ ఉన్న గౌను కావాలన్నట్లు చూపించింది.
నాకు నవ్వొచ్చింది. అది చాలా పెద్ద సైజు గౌను.
“అలాంటిదే చిన్నది ఉందా” అడిగాను నేను.
“లేదు సార్” అని మరో కలర్ గౌను ఏదో అతను చూపించాడు.
దాన్ని ఆ పిల్ల చేతికి ఇవ్వబోయాను. తీసుకోలేదు తను. ఆ కలర్ నచ్చనట్లు ఉంది. “సరే ఇంకొకటి చూపించు” అన్నాను. అతను మరొకటి చూపించాడు. తెల్లటి గౌను పైన పొద్దు తిరుగుడు పూల డిజైన్. “ఇది నీకు నచ్చిందా? ఇది నీకు బాగుందా?” అడిగాను ఆ గౌను ఆ పిల్ల చేతికిస్తూ. తను తీసుకుంది. నచ్చింది అన్నట్లు తలాడించింది.
“సైజు కొంచెం పెద్దదవుతుంది సార్.. పెరిగే పిల్లే కదా సరిపోతుందిలే. సార్” అంటూ ఆ గౌనును కవర్లో పెట్టి నా చేతికి అందించాడు.
ఆ పిల్ల తనకి ఇమ్మన్నట్లు చెయ్యి చాచింది. నేను తనకి ఇచ్చేశాను.
పర్సులో నుంచి డబ్బు తీసి అతడికి ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి కదిలాము.
ఆ పిల్ల రెట్టింపు హుషారుతో ఉంది. గౌను చేతిలో పట్టుకొని వేగంగా గాల్లో ఊపుతోంది.
పరుగు పరుగున వాళ్ళ అమ్మ వద్దకు వెళ్లి కవర్లో నుంచి గౌను తీసి ఇష్టంగా చూపిస్తోంది.
“ఎందుకు సారూ మీకు అనవసర ఖర్చు” అని అంటూనే గౌనుని చూసి వాళ్ళ అమ్మ మురిసిపోతోంది.
“నిజంగా దేవుడు దుర్మార్గుడు సారూ..” అని అనింది వాళ్ళ అమ్మ కాసేపాగి.
“ఎందుకమ్మా అంత మాట అంటున్నావు..” అన్నాను.
“పిల్ల కళ్ళ గురించే సారు నా బాధంతా.. ఊర్లో అందరూ ‘పిల్లి కళ్ళ పిల్ల’ అని పిలుస్తా ఉంటారు. అదే నా దిగులు.” అని కళ్ళనిండా నీళ్లు నింపుకుంది.
“మీ కుటుంబంలో ఇలాంటి కళ్ళు ఎవరికైనా ఉన్నాయా?” ఆసక్తిగా అడిగాను నేను.
“అఖిల వాళ్ళ నాయన వెంకటరాముడుకి కొంచెం ఇట్లాంటి కళ్ళే ఉండాయి సారూ.. ఆయనకు కొంచెం ఉండాయి. పిల్లకు పూర్తిగా వచ్చినాయి. అదే నేను పెళ్లికి ముందు నుంచి ఆ దేవున్ని ప్రార్థించుకుంటూ వచ్చాను. పుట్టే పిల్లలకు అట్లాంటి కళ్ళు రాకూడదని మనసులో ఎప్పుడూ అనుకుంటూ ఉండే దానిని. ఆ దేవుడు నా మొర ఆలకించలేదు.” ఆమె ముఖంలో విషాదం. కళ్ళల్లో కన్నీళ్లు.
“అట్లా ఎన్ని రోజులు పిలుస్తారు.. ఆ తర్వాత అంతా మామూలే అయిపోతుంది. కళ్ళ దేముంది లేమ్మా.. నీ కూతురు బంగారు బొమ్మ” అని అన్నాను కాస్త ఓదార్పుగా.
“ఈ పిల్ల పుట్టిన తర్వాత పిల్లి కళ్ళతో ఉందని అందరూ భయపడ్డారు. ఎవరికి తోచింది వారు మాట్లాడుకున్నారు. కొందరేమో ఇట్లా కళ్ళతో పుట్టడం అదృష్టం అన్నారు. ఇంకొందరు అరిష్ట మన్నారు. నాకు ఎప్పుడూ అదే బాధగా ఉండేది. మొదట్లో చుట్టుపక్కల పిల్లలు కూడా ఈ పిల్లతో ఆడుకోవడానికి ముందుకు రాలేదు. భయపడుతూ ఉండేవారు. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు. అదే కొంచెం ఆనందం. ఏమిటో జీవితం సారూ” తన ఆవేదన చెప్పుకుంటోంది.
ఎవరైనా బాధపడుతూ ఉంటే నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేను.
కన్నీళ్లతో నిండిన కళ్ళను కూడా చూడలేను. బహుశా అది నా బలహీనత కూడా కావచ్చు.
ఆ పాపకు టాటా చెబుతూ, అక్కడినుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను.
ఆ రోజు సాయంత్రం నాతోపాటూ చదువుకొని ప్రస్తుతం టౌన్‌లో నేత్ర వైద్యుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు ఫోన్ చేశాను. చాలా రోజుల తర్వాత కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నాం.
ఆ తర్వాత ఆ నీలి కళ్ళ పిల్ల విషయం మాట్లాడాలని సిద్ధ పడ్డాను.
కొందరి పిల్లలకు పుట్టుకతోనే నల్ల కనుగుడ్డు కాకుండా మరో రంగులో వస్తాయి కదా, పిల్లి కళ్ళు లాంటివి. దీనికి ఏమిటి కారణం ఏమిటి? ఇది ఏమైనా ఒక జబ్బు అనుకోవచ్చా? దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదమా? దీనికి పరిష్కారం ఏమిటి?.. ఒకదాని వెంట ఒకటి నా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాను.
చంద్రశేఖర్ పగలబడి నవ్వుతున్నాడు.
“కాసేపు ఊపిరైన పీల్చుకోనివ్వు నన్ను”. అని అన్నాడు.
బహుశా ఆ చిన్న పిల్ల పట్ల నాకు ఉన్న అభిమానం, ఆప్యాయత అలా వ్యక్తం అయిందేమో!
“అట్లా వేరే రంగులో కళ్ళు రావడం వ్యాధి కానీ, రుగ్మత కానీ, జబ్బు కానీ కాదు. దాని గురించి అంతగా ఆందోళన చెందవలసిన ఏమీ లేదు. కేవలం జన్యుపరంగా మాత్రమే వస్తుంది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవచ్చు. కాలక్రమంగా కనుపాప ముందు భాగంలో ఉండే వర్ణద్రవ్యం పరిమాణం, ఐరిస్ లోని మెలనిన్ ఉత్పత్తి కంటి రంగుకు బాధ్యత వహిస్తాయి. ఇది ఒక సహజ వైవిధ్యం. ఇది అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదు.” చంద్రశేఖర్ చెప్తున్నమాటలు వింటుంటే హృదయం పైన వెన్నెల వాలినంత సంతోషంగా ఉంది .
ఏ మాటలు అయితే వినాలని కోరుకున్నానో , అవే మాటలు వింటున్నాను.
చాలా ప్రశాంతంగా ఉంది.
డాక్టర్ చంద్రశేఖర్ ఇంకా ‘క్యాట్ ఐ సిండ్రోమ్’ గురించి వైద్య భాషలో దాని శాస్త్రీయ గురించి కూడా కొన్ని వివరాలు చెప్పాడు. నాకు సంతృప్తిగా ఉంది.
భోజన సమయం కావస్తూ ఉండడంతో అతడితో సంభాషణకు ఆత్మీయంగా ముగింపు పలికి సెలవు తీసుకున్నాను.
ఇట్లా చూస్తుండగానే మరో వారం రోజులు గడిచిపోయాయి.
“ఇవాళ గురువారం కదా సంతకు వెళ్లలేదు ఏమిటి..?” దారిలో ఎదురొస్తూ కనబడిన గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసే వెంకటేశు గుర్తు చేశాడు.
ఈ దైనందిక ఉద్యోగ పనుల హడావిడిలో పడి మర్చిపోయాను.
కాసేపాగి సంత వైపుకి బయలుదేరాను.
బయట ఎండ మండిపోతోంది.
సంతలో జనం తక్కువగా ఉన్నారు. అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్లి ఆ చివర ఎప్పుడూ పెట్టుకొనే ‘దుర్గమ్మ ఎండు చేపల అంగడి’ వద్దకు చేరుకున్నాను.
అక్కడ ఎండు చేపల అంగడి అయితే ఉంది.
అందులో దుర్గమ్మ లేదు, వాళ్ళ పాప అఖిల కూడా లేదు.
ఆశ్చర్యం వేసింది. ఆ అంగట్లో ఆకు కిళ్ళీ నములుతూ, నల్లగా వింత ఆకారంలో ఒక లావుపాటి ఆడమనిషి కూర్చొని ఉంది. నమిలిన కిళ్ళీ పక్కనే ఎర్రగా రోడ్డు పైకి ఊసేస్తూ ఉంది.
“దుర్గమ్మ ఎక్కడ? ఇవాళ రాలేదా?” అడిగాను నేను.
నోటి నిండా కిళ్ళీ పెట్టుకునే నముల్తూ.. “ఇంకెక్కడి దుర్గమ్మ,.. నా మొగుడు దాన్ని నిన్న రాత్రి తాగి పోయి తన్నితరిమేశాడు. అది పిల్లని ఎత్తుకొని ఊరు విడిచి వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంక అది వచ్చేది లేదు, చచ్చేది లేదు. చేపల అంగడి నా మొగుడు నాకే ఇచ్చినాడు. ఏమి.. దానితో నీకు అవసరం? అప్పు ఏమైనా ఇచ్చి ఉండావా? అయితే ఆ సొమ్ము పోయినట్టే.”
ఇంకా ఏదో చెబుతూనే ఉంది. వినాలని నాకు అనిపించడం లేదు.
బహుశా వెంకటరాముడి రెండవ పెళ్ళాం ఈమేనేమో!
దుర్గమ్మ విషయం పాపం అనిపించింది.
అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను.
అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ, కళ్ళ ముందు ఆ ‘నీలి కళ్ళ పిల్ల’నే కదలాడుతోంది. పదే పదే గుర్తుకొస్తోంది.
ఇవాళ సంత బోసి పోయినట్లు ఉంది. నిర్మానుష్యంగా ఉంది.!