[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘నీవారెవరో తెలుసుకో!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తెల్లవారుతూ వెలుగు పంచుతోంది
జగతినంతా మెల్ల మెల్లగా
ఉదయం వేళ
చిగుర్లు మేసిన కోయిలలు
స్వాగతాలు పలుకుతూ
మేలుకొలుపు పాడుతున్నాయి
రేయంతా నిదురలేక
ఎప్పుడో మగతలోకి జారుకున్న
పడతులను లెలెమ్మని పిలుస్తున్నాయి
వెన్నెల సెలయేరుల విరబూసిన
కలువలు ఎండవేడికి తాళలేక
వసివాడిపోతున్నాయి
నింగీ నేలా కలిసినచోట
నీలిరంగు అందాలు
కనువిందు చేస్తున్నాయి
తొలకరివానకు పుడమి పులకించగా
పచ్చని వనాలు విరులతో అలరించాయి
చల్లగాలి మోసుకొచ్చిన రాగాలేవో
నా మదిలో ఆశలు రేకెత్తించాయి
నీ చూపులు సోకగానే
సిగ్గుతో విరబూసిన కుసుమమునయ్యాను
పులకించిన నా మదిలో అంబరాన్ని
అంటిన సంబరం అలుముకుంది
తేనెలూరు పెదవుల మాటున
ఒదిగిన మురిపెములెవ్వరికో తెలుసుకోవోయి
వలపంటే ఎరుగనిదానను
కలలుకనే వయసులేనిదానను
ఎదురుగా నువ్వుంటే చాలు
బంధమంటే తెలియని నేను
మరుని తూణీరాలను
పూలబాణాలని భ్రమసేను
ఎదలో దాచుకున్న మమతలన్నీ
బాహుబంధంతో అందిస్తున్నా
బదులేమి ఇస్తావో
తెలుసుకోలేక పోగొట్టుకుంటే
తిరిగి పొందలేవు
కాలం నీకోసం ఆగదు
మనసిచ్చేది ఒక్కసారే
అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావని
పగిలిన హృదయం అతుక్కోదని తెలుసుకో!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.