[శ్రీమతి వాణి వేమవరపు రచించిన ‘నీవు లేక’ అనే కథని అందిస్తున్నాము.]
‘ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను ఎలా భరించావు రాజ్యం’ ఇప్పటికే చాలాసార్లు అనుకున్నాడు రామారావు. 60 సంవత్సరాల సహచర్యం, రాజ్యం తన భాగస్వామిగా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి తన జీవితమే మారిపోయింది. ‘నన్ను నేను మరిచేలా చూసుకుంది. చంటి పిల్లాడిలా చూసుకుంది’. అనుకున్నాడు. అలా అలవాటు అయిపోయింది రామారావుకి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనను పిల్లాడిలానే చూసుకుంది. ‘నా చుట్టూ రాజ్యమే. ఏ టైం కి నాన్న ఏం తింటారు , కాఫీ ఎప్పుడు ఇవ్వాలి అంటూ తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు తన గురించి పిల్లలకు చెప్పడం విన్నాను’.
తనకు ఏ సమయానికి ఏమి కావాలో తనకన్నా భార్య రాజ్యానికి తెలుసు.
పడిన బాధను బయటను చూపేది కాదు. అలాంటి రాజ్యం తమను వదిలి వెళ్ళిపోయింది అన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నాడు రామారావు. కనులు మగతగా మూసుకుంటునాయి.
***
కాఫీ ఘుమఘుమలతో మెలకువ వచ్చింది రామారావుకి. ‘రాజ్యం అప్పుడే కాఫీ పెట్టేస్తుంది నాకన్నా ముందే తాగుతున్నట్టు ఉంది’ అనుకుంటూ మంచం మీద నుంచి ఒక్క ఉదుటన లేచాడు.
‘లేచారా మరి లేవండి లేవండి మీకోసమే చూస్తున్న కాఫీ చల్లారిపోతుంది’ అని, ‘ఈ రోజు లేట్ అయినట్టుంది’ అంటూంది రాజ్యం ఆయన మనసుతో.
‘నేను ఎప్పుడు లేస్తానని ఎదురుచూస్తున్నట్టుంది రాజ్యం’ అనుకున్నాడు రామారావు.
ఆ జ్ఞాపకాల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు రామారావు.
‘ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లేవారం. పిల్లల చదువులు ఆరోగ్యాలు పెళ్లిళ్లు ఇలా అన్ని విషయాలను రాజ్యం చూసుకునేది. చెక్కుచెదరని చిరునవ్వు రాజ్యం ఆభరణం. ఎంత అలసటగా ఉన్నా అది చెప్పేది కాదు’ అనుకున్నాడు.
పిల్లలు పెళ్లిళ్లు, తన రిటైర్మెంట్ అయ్యాక ఇంకా జాగ్రత్తగా తనని చూసుకోవడం గమనించాడు రామారావు. ప్రతి మజిలీ లోను రాజ్యం తన వెన్నంటే ఉంటుందన్న భరోసా అన్ని చూసుకుంటున్న భరోసా రామరావుది.
కానీ కాలచక్రం తిరుగుతోంది. ఇద్దరం పెద్దవారు అవుతున్నామని తెలుపుతోంది. రాజ్యం ఆరోగ్యం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. ఓ రోజు పిల్లలను కూర్చోబెట్టుకొని పిల్లలతో “నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. కోపధారి మనిషే కానీ చిన్నపిల్లల మనస్తత్వం. సమయానికి ఆహారం పెట్టండి. ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి” అని చెబుతోంది రాజ్యం.
“ఇప్పుడు ఏమైందని ఇవన్నీ చెబుతున్నావు. నువ్వు ఈమధ్య బాగా భయపడుతున్నావు అమ్మా, అన్నిటికీ” అంటూ పిల్లలు సున్నితంగా తల్లిని మందలించారు.
“చెప్పినప్పుడు వినండి రా” అంటూ రాజ్యం బాధగా పలికింది.
“మీరందరూ స్థిరపడ్డారు హాయిగా ఉండండి. నాన్నను జాగ్రత్తగా చూసుకోండి” అంటూ ఆమె కనుల వెంబడి నీరును తలుపు చాటు నుండి గమనించిన రామారావు కనిపెట్టాడు.
అక్కడికి వచ్చిన రామారావును చూస్తూ చేతిలో చేయి వేస్తూ తుది శ్వాస విడిచింది రాజ్యం.
అంతే రామారావుకి ప్రపంచం స్తంభించినట్లు అయిపోయింది. కళ్ళ ముందు రాజ్యం రూపు తప్ప వేరేవి ఏమీ కనబడటం లేదు. అలా మగతగా పడుకొని ఉంటున్నాడు. ఎక్కడో ఎవరిదో గొంతు వినిపిస్తోంది.
***
“ఆయన్ని నిద్రపోనివ్వండి, కాస్త ప్రశాంతంగా అన్నా ఉంటారు” అన్న మాటలు వినిపిస్తున్నాయి.
‘రాజ్యం ఇప్పుడు కాఫీ కోసం నన్ను నిద్ర లేపటం లేదు భోజనానికి ఎదురు చూడటం లేదు. ఎప్పుడు లేస్తున్నాను ఎప్పుడు తింటున్నాను తెలియటం లేదు రాజ్యం’ అనుకున్నాడు రామారావు. ‘నీకు నాకు తగాదా అయితే నీ మీద కోపంతో నే చొక్కా వేసుకుని బయటికి వెళ్లే వాడిని కదా. నేను వచ్చేదాకా నీ ఎదురుచూపులు విలువ ఇప్పుడు తెలుస్తుంది రాజ్యం. బయట నుండి రాగానే నా చూపు కూడా నీ కోసం వెతికేదని నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఆరు బయట పడుకొని నీవు అగుపడుతావని నా చూపులు నీ పిలుపు కోసం నా ప్రాణము రాజ్యం. నీ రూపు తప్ప నా కంటికి ఏమీ కనిపించడం లేదు. కనులు బాగా మసకబారుతున్నాయి అందరూ నాలో మార్పు వచ్చిందని అనుకుంటున్నారు. ఎంతో మంచి కుటుంబాన్ని ఏర్పరిచావు. ఎన్నో సమస్యలలో నాకు చేయూతని ఇచ్చి నిలిపావు .మంచి జీవితాన్ని నీతో పంచుకున్నాను రాజ్యం.
మనవడు మనవరాలు తాతా అని పిలుస్తున్నారు వారికి ఏమి సమాధానం ఇవ్వలేకపోతున్నా రాజ్యం. మామగారు, ఏమీ ఆలోచిస్తున్నారని కోడళ్ళు అడుగుతున్నారు. వారికి తెలియదా అని నా చూపుతోనే సమాధానం తెలుపుతున్నా. నాన్న, నాన్న అంటూ మన కొడుకులు కూతుర్లు పిలుస్తున్నా, బదులు తెలపలేకపోతున్నా నేను రాజ్యం. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. చల్లగాలి తగులుతుంది. శరీరము బాగా బరువెక్కుతుంది. నా ఎదురుగా ఉన్నది నీవే కదా రాజ్యం. ఇప్పుడు బాగా కనిపిస్తున్నావు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆనాడు నా చెయ్యి పట్టుకుని నా ఇంటికి వచ్చావు . ఈనాడు నీ చెయ్యిని అందించు రాజ్యం’ అంటూ చేయి జాపాడు రామారావు.
ఎక్కడో వినిపిస్తోంది “మావయ్య గారు ఎందుకు అలా చేయి జాపుతున్నారు” అని.
‘లేవలేకపోతున్నా ఇక నా చేయి అందుకో రాజ్యం’ అని చేయి జాపాడు రామారావు.
ఒకసారిగా ఆ ప్రాంతమంతా బాధగా రోదించింది.
“నాన్న అయినా ఉన్నారని అనుకున్నాం” అంటూ ఏడ్చారు సంతానం.
పెద్దాయన ఊరట పొంది ఉంటారు ఆవిడ దగ్గరికి వెళ్లి ఉంటారని కొందరి మాటలు, రాజ్యం గారు ఉంటే రామారావు గారు ఇంకొంతకాలం ఉండే వారంటూ మరికొందరి మాటలు.
రామారావు మాత్రం ‘రాజ్యం ఇక నా చేయి వదలకు’ అంటూ రాజ్యం చెయ్యి పట్టుకున్నాడు. “దంపతులు చాలా అన్యోన్యంగా ఉండే వారమ్మా” అన్న మాటలు వింటూ నవ్వుకుంటూ నిష్క్రమించారు ఆ దంపతులు.
