ఆకాశం మేఘావృతమైంది అంతులేని దిగులుతో ఆదిత్యునికి
తన మొగము చూపలేక దిగులెందుకు చెప్పు ఓ మేఘమాల!
సూర్య కిరణాలూ సోకనిదే… కమలం విరియదు
లోకం మసక వెలుతురులో బద్ధకంగా కదులుతుంది!
ఉరకలువేసే ఉత్సాహం చల్లారిపోతుంది ప్రకృతి మౌనం వహిస్తుంది
మేఘమా నీకు వాయువు తోడై ప్రచండమైన గాలి విజృంభిస్తుంది.
సకల జీవులను భయానికి లోనుచేస్తుంది పట్ట పగ్గాలు
లేకుండా చెట్లను ఇళ్లను కూల్చి జీవరాశులను నిరాశ్రయులను చేస్తుంది .
నీ దిగులంతా వానగా కురిపించి యెదలో భారాన్ని దింపుకొని
స్వచ్ఛమైన తెల్లని దూది పింజలుగా మారి తేలిపోయావు.
మేఘాలు తొలగి దినకరుడు వెలుగుతూ నీకు వీడుకోలు చెప్పగా
రాజీ పడి బిడియంతో దూర దేశాలకు తరలిపోయావు.
పంచభూతాలు వాటి కర్తవ్యాన్ని నెరవేర్చిన్నప్పుడే మనుగడ సాధ్యం
దిగులును దిగమింగినపుడే ధైర్యం ఊపిరి పోసుకుంటుంది.
ప్రకృతి నెరవేర్చు ధర్మాలు మానవ కోటి మనుగడకు సోపానాలు
మానవులు వాటిని కాపాడుకున్నప్పుడే జగతిపై నిల్చు శాశ్వత అందాలు.
సహజసిద్ధమైన వనరులతో అలరారు ప్రపంచం మనకు అద్భుత వరం
మానవుడు సక్రమంగా వినియోగించుకుంటే మరో సృష్టికి అంకురార్పణం.
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది.
రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి.
మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే!
ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్‌గా హైదరాబాదులో పనిచేశారు.