Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేలమ్మే గరిమనాభి

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నేలమ్మే గరిమనాభి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గాలిలో తిరిగినా
ఆకాశంలో ఎగిరినా
నేలమ్మే నాకు గరిమనాభి

సముద్రం స్నానాలు చేసినా
పాదముద్రల ఊపిరి ఊయలూగినా
పిలిచే గంధం మట్టి బంధం నేను

కొన్ని అక్షరాలు నన్ను రాసుకున్నా
కొన్ని పదవులు బిరుదులు నన్ను
అందలం ఎక్కించవచ్చు
అయినా,
నను పెంచిన బతుకే మట్టి వాకిలి

పిడికెడు ఆశల కెరటాలన్నీ
గుప్పెడు మనసు మౌనభాషలే

ఆడి పాడిన రాగాలన్నీ
ఆత్మీయ అంతరంగాల పలికించే
శబ్దనిశ్శబ్దాల వాయిద్యాలు

మట్టి పిండిన బంగారుపంటలో
చెమట తడిపిన తనువు నేను
మట్టి ఎదల దాగిన
ఒట్టిపోని గట్టి ఘటం వారసత్వపు అస్తిత్వం నేను

Exit mobile version