[డా. కాళ్ళకూరి శైలజ గారి ‘నేలపాట’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ అవధానుల మణిబాబు.]
సాహిత్యపథంలో ఏ రెండు అడుగులూ ఒకేలా పడకుండా, మొదట మహాత్ముని ఆదర్శాలపై వ్యాసాలతో మొదలుపెట్టి ఆ తర్వాత అనువాదం, కవిత్వం, డావో తాత్త్వికత, కథలు – ఇలా అయిదడుగులేసిన డా. కాళ్లకూరి శైలజ నలభైమూడు కవితలతో కవిత్వప్రక్రియలో తన రెండవ ప్రయత్నాన్ని ‘నేలపాట’గా వినిపిస్తున్నారు. ఇంతమాత్రమే చెబితే వారి సాహిత్యానుభవం స్పష్టం కాదు. ఇంతవరకూ వారు చేసిన ప్రసంగాలు, వ్రాసిన సమీక్షలు కూడా వారి సృజనకు కారకాలు, ప్రేరకాలూనూ.
అనాదిగా నేలను అమ్మగా తలచి, కొలచి తల్లి చేసే పనులన్నీ నేలతల్లీ చేస్తుందని భావించిన మనకు ‘నేలపాట’ పదబంధం ఆశ్చర్యపరచదు. “పాదస్పర్శం క్షమస్వమే” అని ప్రార్థిస్తే చెవులొగ్గి వినగలిగినపుడు, గొంతు సవరించి ఎందుకు పాడలేదు. ఉపరితలంపైనా, అంతర్గత ఆవరణల్లోనూ జరుగుతున్న (అ)మానుష కృత్యాలను తలచుకుంటూ తల్లి చేసే ‘విలపిత గళ ఆలాపన’ ఈ నేలపాట. అన్నట్టు, నేలంటే దేశమనీ అర్థమే కదా. మరైతే, ఇది దేశం పాట, అందులోని ప్రజల పాట. అన్నిటికీ మించి, ఆ మట్టివాసన పట్ల మురిపాన్ని, దేశంపట్ల భక్తిని, ప్రజల పట్ల ప్రేముడిని పెంచుకున్న కవయిత్రిలో భయం, బాధ్యత కలిసిపాడిన యుగళమీ పాట. అందుకే, ముందుమాటలో వారు ప్రస్తావించిన బాధాతప్త మూర్చన, ఆర్తి, అవ్యక్త ప్రేమ, హెచ్చరిక, ప్రబోధం, సంయమనం, సంఘీభావం.. కలగలిపి, ఎలుగెత్తిపాడిన సత్యగీతం ఈ కవితా సంపుటి.
***
ప్రతి కవితా ఆశావహంగానే అనిపిస్తుంది. నిరీక్షణ ఫలిస్తుంది అనే భరోసా ఉంటే, పిలుపుని విని పలికేవారున్నారు అనే నమ్మకం ఉంటే ఎదురు చూడడం ఏమంత కష్టం కాదు. అలాంటి ఒక విశ్వాసాన్ని కలిగించే పంక్తి ఇది – “ఎవరం ఒంటరి కాదు. ఈ మహా సమూహంలో వీధి చివర అక్కున చేర్చుకునే రెండు బాహువులు ఉంటాయి. మరికాస్త సమయం ఎదురు చూడాలంతే”. అలాంటి చేతులలో తల ఉంచి, ఆ దోసిలిని కన్నీటి కొలనుగా మార్చినపుడు ఏ బాధగా మనల్ని బాధించదు. మనిషి నిరంతర అన్వేషణ తన జీవితకాలంలో అలాంటి ఓదార్పునీయగల విశాల బాహువులున్న స్నేహితులను ఒకరిద్దరినైనా సంపాదించుకోవడం. వారేం చేస్తారు? శైలజగారు వ్రాసినట్లు – “వడగాల్పు మధ్యాహ్నానికి చిరుజల్లు సాయంత్రమవుతారు”. పై కవిత భవిత పట్ల విశ్వాసాన్నిస్తే ‘పతంగులు’ కవితలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తారు – “కాస్తంత దారం, ఒక కాగితం ఉంటే నింగీ నేలా ఒకటిగా చేస్తాను. ఆశల తోరణాలు కడతాను”. “Give me a place to stand and a lever long enough and I will move the world” అనగలిగిన ఆర్కిమెడిస్ స్థాయి ఆత్మవిశ్వాస ప్రకటన ఇది.
***
కవులు తమ భావ జగత్తులో దర్శించినవాటి ఆనవాళ్ళను కవితలుగా మారుస్తారు. పోతన “అల వైకుంఠపురంబులో ఆపన్న ప్రసన్నుండు” ఎక్కడ ఉంటాడో చూసి వచ్చినంత పారవశ్యంతో చెబితే, కుంతీవిలాపంలో “రమణీయ పుష్పవనములోని మేడపై మారుమూల గది తల్పులు తీసి మెల్లగా దిగుచున్న రాచపిల్ల”ను మనకు దృశ్యమానం చేస్తారు, కరుణశ్రీ. వాళ్ళు చూసినవి అవి. మరి శైలజగారేమి దర్శిస్తున్నారు? అడుగడుగునా వారికి ‘దుఃఖపు దిగుడుబావి’ ఎదురవుతోంది. వాస్తవంలోనూ, మిథ్యాజగతిలోనూ తాను చూస్తున్న ఆ దిగుడుబావి చిరునామా చెబుతున్నారు మనకు –
“అందరు నడిచే బాటకు కాసింత ఎడం పక్క
ఎవరూ చూడని మూల
ఈగలు ముసిరిన సిమెంట్ వరల్లో
పాతిక అడుగుల లోతున
పాత కాలపు చెక్కమీద తుప్పు పూలు
గుబాళించే ఇనుప తలుపు కింద
చికిలించి చూస్తే గానీ
కనబడని చిన్ని కన్నాల చట్రం కప్పిన
దుఃఖపు దిగుడు బావి”
అదే దారుల్లో పోతున్నా, ఇలా మనం ఎందుకు చూడలేదు అంటే “చికిలించి చూడగలగడం” ఇంకా చేతకాలేదు మరి. ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అన్నాడు సముద్రాల. అలా అనుకోగలిగినపుడే తుప్పు పూలు గుబాళించే ఇనుపతలుపు సౌందర్యం అర్థమవుతుంది.
***
“సగం కొట్టిన చెట్టు తెగిన తూనీగ రెక్కల్ని పసరు వాసనతో నేమరేసుకుంటూ ఉండగా” ఎంత బావుందీ వాక్యం! పూలన్నీ కోసిన తర్వాత మొక్కను చూసి “ప్రసవబంధాలు సడల బాష్పములు రాల్చె” అనగలిగిన కరుణశ్రీని మరోమారు గుర్తుచేశారు.
మనసు వ్యాకులంగా ఉన్నపుడు, ఏదైనా జరగబోయే మంచిని తలచుకుంటూ పడుకోమంటారు. ఆ ఆలోచన మనల్ని కాస్త శాంతపరచి నిద్రకు చేరువ చేస్తుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆ ఆలోచనలే కలలై వస్తాయి. సరే ఇవన్నీ మనకు సంబంధించిన సంగతులు. మరి, ‘ప్రాకృతిక అంశాలకు కలలొస్తే వాటిలో ఏ దృశ్యాలుంటాయ్?’ అనే కవిగారి ఆలోచనకు ముందు అభినందనలు తెలపాలి. “వరిచేలు కప్పుకున్న నేల మాత్రం, నోరారా తినే చేతుల్ని కల కంటుంది”. పుస్తకంలోని గొప్ప కవితావాక్యాలలో ఇది ఒకటి. నేలపాట వినిపించడమే కాదు, నేల కలల్నీ తాను చూస్తూ మనకు చూపుతున్నారు శైలజ.
ప్రవాహంలో కొత్తనీరు రావడం పాత నీరు తరలి పోవడం సహజమే. తన ప్రాభవం తగ్గుతున్నపుడు మరో పాత్రలోకి మారి అందులో ఒదిగిపోవడం విజ్ఞుల లక్షణం. ఈ సంగతిని చమత్కారంగా –
“తారామణి తల్లి పాత్రకి సిద్ధమౌతుంటే
సౌందర్యం అతిశయించే గులాబీ ఫేస్ ప్యాక్ ప్రకటనకు
మరో బాల తార సిద్ధపడుతోంది” అంటారు.
***
‘యుద్ధం’ గురించిన అమానుషత్వాన్ని ‘మనిషి ఆనవాలు’ కవితలో వినిపిస్తారు. ఒక నిర్మాణమో, ఒక వ్యవసాయ క్షేత్రమో, ఒక వెలుతురో, ఒక వేడుకో, సంభాషణో.. ఇలాంటివి వినిపిస్తేనో, కనిపిస్తేనో అక్కడ మానవ సమూహం ఉంది అని లెక్క. కానీ యుద్ధవాతావరణంలో మనిషి జాడ ఎక్కడ అంటే – “ఎక్కడ మృత్యు రోదనలు ప్రతిధ్వనిస్తే అదే మనిషి ఉన్న చోటు”. ఎంత తీవ్రమైన మాట ఇది. ఆడుకునే పిల్లలు విమానం శబ్దం వినపడగానే, సంబరంగా ఆటలాపి కనుచూపుమేరలోంచి కదలిపోయే దాకా చప్పట్లు కొడుతూ ఆనందిస్తారు. కానీ ఇపుడు “ఇన్నాళ్ళూ మురిపించే గాలి ఓడ ఇప్పుడు నిప్పులు కక్కుతోంది”. ఇదీ విపరిణామం అంటే. ఒకనాటి మేడలు ఇపుడు ‘పొడుచుకొచ్చిన ఇనప చువ్వల కట్ట’లయ్యాయి.
నీ ఊరే నీకు పరాయి అయిపోతుంది. బావుండడం మాట దేముడెరుగు, అసలు ఉండడమే ప్రశ్నార్థకం అయినపుడు ఋతువుల మార్పే కాదు, వెలుగూ చీకటీ కూడా తెలీవు. ఎందుకంటే నువ్వున్నది ‘పరాయి’ ఆక్రమణలోని నేలపై. “పరాయూళ్ళో పగలు, రాత్రి ఒకేలా ఉంటాయి”. అపుడేమవుతుంది? పగలు, రాత్రీ తేడా తెలియకపోతే రోజు గడపడం గగనమవుతుంది. యుద్ధం గురించే కాదు, మాదకత గురించీ అంతే తీవ్రంగా వ్రాశారు.
“నరాల నిస్సత్తువలో పట్టు తప్పిన రే పవళ్ళు
బోలు బొమికల సాక్షిగా స్పృహ తప్పిన దేహాలు
ఉర్రూతల మైమరపులో
కళ్ళు మూతబడి కరిగిపోతున్న ఆయువు”.
వ్యాఖ్యానం అవసరం లేని వాక్యాలివి. క్రమానుగత క్షీణత, దశలవారీ పతనం గురించిన హెచ్చరిక ఈ కవిత. నింగీ, నేలా, చెట్టూ, చేమా అన్నీ తమ పరివర్తనలో ఘనత సంతరించుకుంటూ ఉంటే మనిషి ప్రగతి పేరిట అధోగతి పొండదం నచ్చని కవి ఇలా అన్నారు –
“నేల కొండగా ఎదిగింది ఎడారి నదిగా మారింది
మరి మానవుడు మనిషయే మార్గం ఉందా!”.
ప్రశ్నించి, సమాధానం అడుగుతున్నట్టున్నా “లేదు” అనే నైరాశ్యం స్పష్టంగానే కనిపిస్తోంది. మరి వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయ్. వాటికి బాధ, బాధ్యత లేవా? ఐనా, మంచి చెబితే వినేవాడు ఎవడు? ఎవరు ఎవరిని మార్చాలి.. ఇలా ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయ్ పాఠకుడిలో. వాటి మధ్యలో ఓసారి “అన్నట్టు ఆ యుద్దాలను మొదలు పెట్టేవారు, జీవితాలను ముగించేవారు, మాదకత మప్పేవారు, మత్తులో తూగేవారు, పాలకులు, పాలితులు..” ఇలా ఇందరు మనుషులున్నారా? లేక అవకాశాలు, అవసరాలు బట్టి వాళ్ళే వీళ్ళవుతున్నారా? అనే సందేహం కలుగుతుంది. అప్పుడు ఈ కవయిత్రి ఓ మాటతో ముగిస్తారు – “మనుషులంతా ఒక్కటే. ఓట్లే బోలెడు”.
***
“ఇల్లొక చెర” ఎపుడు? అది కేవలం ‘నాలుగు గోడలు, ఐదు బాల్కనీలు’ అనే బ్లూప్రింట్ గానే భావించినపుడు. నలుగురి రాకపోకలకు నెలవు కానప్పుడు, కష్టనష్టాలు కలబోసుకునేందుకు ఆసరా కానప్పుడు, ఎవరి బ్రతుకులు వారే గిరి గీసుకుని బ్రతుకుతున్నపుడు గుండెగదులన్నిటా “నిశ్శబ్దం చిరకాలం నిలిచే ఎనామిల్ కోటింగ్” మాత్రమే. అలాంటి ఇంటిలో నువ్వెక్కడున్నా ఒక్కటే. “ప్రహరీ బయటా లోపలా భయం” అంటారు కవి. మరి ఆమె కోరుకునే ఆదర్శవంతమైన ఇల్లు ఎప్పుడు తయారవుతుంది? పిల్లల అల్లరిని ఆనందించగలగాలి. సహచరుల కోపతాపాలను క్షమించగలగాలి. పెద్దల రుజాజరలను సహజాతాలని ఎరిగి మనసారా స్వీకరించగలగాలి. అలా అందరికోసం ఒకరు, ఒకరి కోసం అందరూ జీవించినపుడు సమాజమనే ఇంటిలో జీవనం విహారయాత్రగా మారుతుంది. అందుకు సాధన చేయాల్సినవి రెండు. ఓరిమితో ఉండడం, చిరునవ్వుతో పలకరించడం. కానీ ఇవి రెండు కాదు ఒక్కటే శైలజగారి దృష్టిలో “ఓర్పు చెట్టుకి కాసి, ఆ కొమ్మనే పండే ఫలం చిరునవ్వు”.
ద్రవస్థితిలో హాయిగా లోలోపల పారాల్సినవేవో ఘనీభవించిన దశలో, ఆ అవాంఛిత పదార్థాలను కాస్త మరిగించి, కరిగించి “ఆప్యాయత ప్రవహించాల్సిన నాళాల్లో పూడికలు” తీసే బాధ్యతను తలకెత్తుకున్న కవితలివి. మాత్రలతో ఎప్పటినుంచో ఆ పని చేస్తున్న వైద్యురాలు మాటలతోనూ చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని మనసారా ఆహ్వానిద్దాం.
***
రచన: డా. కాళ్ళకూరి శైలజ
ప్రచురణ: స్మృతి పబ్లికేషన్స్
పేజీలు: 112
వెల: ₹ 130/-
ప్రతులకు:
డా. కాళ్ళకూరి శైలజ,
సాయికృష్ణ క్లినిక్,
1-9-23, శ్రీరామ్‍నగర్
కాకినాడ 533003
ఫోన్: 9885401882
ఫోన్ పే: 9966953191
~
డా. కాళ్ళకూరి శైలజ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-kallakuri-sailaja/
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023) వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘మధుశ్రీలు చదివాకా’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024) అందుకున్నారు.

