Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నెలరాజా.. వెన్నెల రాజా.. కృష్ణశాస్త్రి అక్షరహేల

[‘మల్లీశ్వరి’ సినిమాలోని ‘నెలరాజా.. వెన్నెలరాజా..’ అనే పాటని విశ్లేషిస్తున్నారు మొదలి పద్మ.]

ఇది జీవితం. మనదైన జీవితం. మన విషాదం మన ఉద్వేగం. జీవితం చాలా చిత్రమైనది. ఎప్పుడు ఏమలుపు తిరుగుతుందో, ఏ క్షణాలు ఆనందంలో ముంచేవో, ఏ ఘడియలు దుఃఖపు సాగరాన పడవేసేవో తెలియదు. అటువంటి దుఃఖపు ఘడియలే నాగరాజు-మల్లీశ్వరిల జీవితంలో యీ ఎడబాటు వెతలు. నాగరాజు కోసం మల్లీశ్వరి విలాపం నిండిన ఆలాపన. కోటను దాటి గీతలు దాటిన లోలోపల పిలుపు. అతని మదికి చేరాలనే ఆరాటంతో బాధాతప్తహృదయంతో చేసే గానం.

ఏది పంచుకునేందుకైనా మనకు తోడు ముందుగా ప్రకృతి బంధం కాక మరేముంటుంది. అందుకే ఆ ప్రేయసి నెలరాజుతో మొరపెట్టుకుంటుంది తన నిట్టూర్పు తడిని ఆ వెనుక గాథను మరెవరికీ తెలియనీయని రెప్పల మాటున మౌనాన్ని.. ప్రకృతి అంటే కృష్ణశాస్త్రిగారే కదా.. కృష్ణశాస్త్రిగారి కలం గళం జార్చిన వేదనాక్షరాలు యివి..

సాకీ:
ఎవరు ఏమని విందురు
ఎవ్వరేమని కందురు
ఈ జాలి గాథ ఈ విషాద గాథ
నెలరాజా వెన్నెలరాజా వినవా ఈ గాథా..

అనేందుకేముంది చెప్పేందుకేముంది ఎవరికైనా అనే ఒక నిరాసక్తత ఒక నిర్వేదం. క్షణాలు జీవితాన్ని బందీని చేసిన ఉద్వేగం. తెలియనితనం, అమాయకత్వం చేసిన చిన్న మాట తప్పిదం పెనుముప్పులా మారి ముందు కలగన్న జీవితపు గోడల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం తట్టుకోలేని ఆ చిన్నతనపు భావాలే ఇలా అమాయకంగా తనలో తనే ప్రశ్నించుకుంటూ తనను తానే సమాధానపరచుకుంటూ..

చరణం 1:
ఏనాడో ఏకమై కలిసిపోయిన జంట
ఏ క్రూర దైవమో ఎడబాటు చేసేనే..
ఊరు గుడిలో రావికావల
నాటి వలపుల మాటలన్నీ
నేలపాలైపోయెనే గాలిమేడలు కూలెనే..
నెలరాజా వెన్నెలరాజా..

ఒక్కక్షణంలో ముంచుకొచ్చిన విపత్తు అది. కనుమూసి తెరిచినంతలో కల కన్నీరుగా వొలికింది. విధి శాపమై కాటువేసి మేఘాలమాటుకు చేరుకుంది. ఎంతో అనుకున్న జీవితం విరిలా విరబూయాల్సిన అంతులేని ఆనందం అంతలోనే ఆవిరయింది. జీవితం అంతే. అన్నీ క్షణకాలపు మురిపాలే. తృటిలో మారే విషాదపు నడకలే.

చరణం 2:
ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా
ఆనాటి బాసలు అన్ని కలలాయెనే
విడిచి వచ్చేవేళ సెలవని
అడుగనైనా అడగలేదని
ఎంతగా చింతించెనో
ఏమనుచు దుఃఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే
తుదకు బాధలు మిగిలెనే
నెలరాజా వెన్నెలరాజా
వినవా యీ గాథ..

ఎంత చిత్రం. కలలోనైనా ఊహించని ఎడబాటు అది. విడిపోతామని తెలియదు. విడిచిపోయింది మది జీర్ణించుకోలేని వాస్తవం. కన్నీరెంతగా జారినా కలత గట్టు దాటదు. జరిగిన ఘటనలో మార్పుండదు. ఏమనుకోవాలి ఎలా అంగీకరించుకోవాలి యీ స్థితిని. విడిపోయేది తెలియని జంట వీడ్కోలు తీసుకోలేదనే మరో చింత చిత్రమైన స్థితి అది.

మహారాణి ఇష్టసఖిగా చిరువేదిక మీద ఈ పాట పాడుతుంది మల్లీశ్వరి. తనలోని వేదనను దిగమింగుతూ మహారాణిని ఉల్లాసపరిచే ప్రయత్నం.

బి ఎన్ రెడ్డిగారి దృశ్యకావ్యం మల్లీశ్వరి చిత్రంలోని కృష్ణశాస్త్రిగారి ఈ గీతం స్వరరాజేశ్వరుని స్వరాలలోంచి ఆర్ద్రంగా జాలువారి, భానుమతి గళంలో కదలాడి మదిని భారం చేస్తుంది. భానుమతి అభినయమూ – గానమూ రెండూ చివరిదాకా బిందువులేని వాక్యంలా నైరాశ్యపు జడిలోకి తోస్తాయి.

గళంలోని భావం అది దిగులో నిర్వికారమో యిదీ అని నిర్ధారించలేని అవ్యక్తమైన అనుభూతి మనది. ఏమైనా మల్లీశ్వరి చిత్ర సంగీతసాహిత్యాలు సినీ వినీలాకాశంలో అరుదైన విషాదానంద మేఘాలు. నెలరాజు మోముని ఆర్ద్రంగా తాకే ఉద్వేగపు మేఘాలవి. ఉరమక మెరిసే మొయిలు రాగం. దేవులపల్లివారి కలం దిగులు తెమ్మెరలోంచి కురిసిన గుబులుపరాగం మన మదిని వీడిపోదు. అలా అని స్థిమితంగానూ ఉండనీయదు ఆ నెలరాజు సాక్షిగా ఆ వెన్నెలరాజు మీద ఆనగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ..

[‘నెలరాజా.. వెన్నెలరాజా..’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=l4G_KCTyEJc]

Exit mobile version