Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నెలసరి మేఘ విస్ఫోటనం

[‘నెలసరి మేఘ విస్ఫోటనం’ అనే అనువాద కవితని అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. మూలం మౌమితా ఆలం.]


~
నా గర్భసంచి లోపల నెలనెలా ఒక మేఘ విస్ఫోటనం!
మనసు కృంగిపోతూ ఉంటే, దేహం
పిండిలాగా ముడుచుకుపోతూ ఉంటుంది!
కడుపులో వికారం కలిగించే, మెలితిరిగే
ఆ భయంకరమైన నొప్పి గురించి
నా మంచం మీది దుప్పటిని
గోళ్ళతో రక్కుతూ రాయాలని చూస్తాను!
కానీ ఈ నెలసరి నొప్పికి ఒక పేరంటూ ఉందా అసలు?
~
నడుం మీద కూర్చుని నా రెండు అరచేతులతో
మబ్బులను అదిమి పట్టుకొని వాటిని బుజ్జగిస్తూ
త్వరగా కరిగిపోమ్మని అడుగుతాను!
మేఘాలు కోపంగా ఉడికిపోతాయి!
నేను వణికిపోతూ తలగడను పిండేస్తూ,
వాటిని కౌగిలించుకుంటూ
నా గుండెలకు బలంగా హత్తుకుంటాను!
~
కొన్ని గంటల తర్వాత నా గర్భ సంచీలోని
మేఘాలు విస్ఫోటనం చెందుతాయి!
అలిసిపోయిన నా కళ్ళు ఆ మేఘాలన్ని
తెల్లటి పాలరాతి మీద పారుతూ
చెరువుగా మారక ముందే రక రకాల రూపాలు మారడం చూస్తాయి!
ఆ కరిగిన మేఘాలు
ఉదయపు ఆకాశం మీద పారడాన్ని కూడా
నా కళ్ళు నీరసంగా చూస్తాయి!
~
(ఈ కవిత డిస్మనోరియా అనే స్త్రీల నెలసరి ఋతుస్రవానికి సంబంధించినది. ఆ సమయంలో స్త్రీలు అనుభవించే నొప్పి తీవ్రతను తెలిపే కవిత! హిందూ పత్రిక సర్వే లో ప్రతీ పది మంది స్త్రీలలో తొమ్మిది మంది ఈ నెలసరి నొప్పిని అనుభవిస్తున్నారని తెలిపింది.)

ఇంగ్లీషు- మౌమిత ఆలం
అనువాదం -గీతాంజలి

Exit mobile version