అమెజాన్ ప్రైం లో లభ్యం. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’ తెలుగులో ‘నేనే వస్తున్నా’.
=========
ఈ సినిమా ఎవ్వరూ చూడాల్సిన అవసరం లేదు. ఇంతోటి సినిమాని గీతా బానర్ వారు ఎందుకు డబ్బింగ్ చేశారో.
ప్రజా ప్రయోజనాల దృష్టా ఈ విశ్లేషణ వ్రాస్తున్నాను.
సాధారణంగా సినీ ప్రేక్షకులలో ఉండే కొన్ని అపోహలు ఏమిటంటే
“తమిళ సినిమాలు బాగుంటాయి”
“ధనుష్ సినిమాలలో కథా బలం ఉంటుంది”
“సెల్వ రాఘవన్ మంచి దర్శకుడు”
ఈ అపోహలు మనసులో పెట్టుకుని ‘నేనే వస్తున్నా’ సినిమా చూడటానికి ఉపక్రమించాను. గొప్ప భంగపాటు కలిగింది.
స్థూలంగా కథ చెపుతాను:
ప్రభు, కదిర్ ఇద్దరూ కవల సోదరులు. ఈ రెండు పాత్రలు ధనుష్ పోషించాడు. వీరిలో కదిర్ చిత్రమైన ప్రవృత్తితో సైకోగా ముద్ర పడతాడు. ఆరేడేళ్ళ వయసులోనే పక్కింటి చిన్నారిని తగలబెట్టి చంపబోతాడు. కోపగించుకున్న తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. అడవిలో ఒక పెద్ద సైకోని బండరాయితో మోది చంపేస్తాడు. అంతటి ప్రమాదకరమైన చిన్నారిని ఏ బాలనేరస్తుల స్కూల్లోనో చేర్పించకుండా వాళ్ళ అమ్మ కోనేటి ఒడ్డున వదిలేసి వస్తుంది. మనం ఇలా ఏ పిల్లినో, కుక్కపిల్లనో వదిలేస్తాం. ఈ సంఘటన చూశాక దర్శకుడు సైకో ఏమో అని అనుమానం వస్తుంది మనకు. ఆ బాల సైకో కూడా అంతే చిత్రంగా ఇంటికి రాకుండా అక్కడా ఇక్కడా సైకో నేరాలు చేస్తూ, ఉత్తరప్రదేశ్‌లో ఒక హిల్ స్టేషన్ చేరుకుని పెద్ద వాడై, పెళ్లి చేసుకుని ఇద్దరు అబ్బాయిలకి తండ్రి అవుతాడు. వారు ఇద్దరూ కవలలే.
ఒక చిన్న కారణానికి హిల్ స్టేషన్‌కి వచ్చిన టూరిస్ట్ బృందాన్ని అమానుషంగా చంపేస్తాడు. ఈ సంఘటన ద్వారా తన ప్రవృత్తి బయటపడిపోయిందని, ఆ సత్యం తెలుసుకున్నభార్యని కవల సంతానంలో ఒక పిల్లవాడిని (సోనూ) చంపేస్తాడు. ఆ పిల్లవాడు దయ్యంగా మారి, మంచి ధనుష్ వాళ్ళ ఊరికి వస్తాడు. మంచి ధనుష్‌కి సత్య అని ఒక కూతురు ఉంటుంది. ఆ పిల్లని ఆవహిస్తాడు సోను. ఆవహించి, చెడ్డ ధనుష్‌ని చంపేయ్యమని వేదిస్తాడు. వీళ్ళు ఉత్తరప్రదేశ్ కి వెళ్లి చెడ్డ ధనుష్‌ని చంపేస్తారు. ఆ గందరగోళంలో చనిపోయింది చెడ్డ ధనుషా, మంచి ధనుషా అన్నది ప్రేక్షకులకి సస్పెన్స్ పెడతాడు మన దర్శకుడు, అంటే పార్ట్ 2 కి రంగం సిద్ధం చేస్తూ దరిద్రంగా ముగించాడు సినిమాని.
ఈ సినిమా కథ నేను వ్రాసినట్టు స్ట్రైట్ నేరేటివ్‌లో కూడా లేదు. కాస్త ఫ్లాష్‌బాక్, కాస్త వర్తమానం, కాసేపు బాల్యం ఇలా గందరగోళంగా సాగుతుంది.
బాలమేధావులు ఎలా పుడతారో చెప్పలేం అన్నట్టు, బాలసైకోగా వాడు ఎందుకు పుట్టాడో ఎవ్వరికీ తెలియదు. దర్శకుడు కూడా ఏ లాజిక్ ఇవ్వడూ. ప్రతి ఇంట్లో అది కామన్ కథ అన్నట్టు తీశాడు సినిమాని.
వీక్ పాయింట్స్:
మన నేటివిటీ కాదు. ఎక్కడో విదేశాలలో చౌకబారు హారర్ సినిమాలు చూసి ఆ తరహాలో తీయాలని చేసిన ప్రయత్నం.
కథా బలం లేదు. కుటుంబ సంబంధాల పట్ల నమ్మకం సన్నగిల్లేలా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ఇటీవల కొందరు దర్శకులు అర్థం కావటం లేదు.
నేరప్రవృత్తిగల పిల్లవాడిని కోనేటి వద్ద అలా ఏ తల్లీ వదిలేసి రాదు. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ కథలో మౌలికమైన ఈ అవాస్తవిక సంఘటన వల్ల ఆత్మ దెబ్బ తింది.
ప్రేక్షకుల ఐక్యూని చాలా తక్కువ అంచనా వేశాడు ఈ దర్శకుడు అని ఉక్రోషం వస్తుంది.
సైకియాట్రిస్ట్ గా ప్రభు చిన్న పాత్ర పోషించాడు. ఆయనకి మంత్ర తంత్రాలు కూడా తెలుసు అని చెప్తారు. ఆయన దెయ్యాల స్పెషలిస్ట్ కూడా. దర్శకుడు తీసుకున్న థీం ప్రకారమే వెళ్దామన్నా, హారర్ సంఘటనలకి బోలెడు అవకాశాలు ఉన్నా, పేలవంగా తీశాడు దెయ్యం ఉన్న సన్నివేశాలని. కొంత మంది కాలేజీ కుర్రాళ్ళు వచ్చి దెయ్యాల ఆచూకిని కనిపెడతాం, వాటిని తుదముట్టిస్తాం, అని బీరాలు పలికి ఏమీ చెయ్యకుండా తుస్సుమనిపించారు,ఈ చిత్రంలో. ఈ సినిమా దర్శకుడు కూడా సరిగ్గా అలాగే చేశాడు అని చెప్పవచ్చు.
సెకెండ్ హాఫ్ ఆసక్తికరంగా లేకపోవడం, కదీర్ ట్రాక్లో లాజిక్ మిస్ అవ్వడంతో ఈ సినిమా చూడటం ఒక శిక్షగా పరిణమించింది.. దీనికితోడు సెకెండ్ హాఫ్‌లో చాలా సీన్స్ మరీ సినిమాటిక్‌గా సాగుతాయి. ఇలాంటి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్‌లో ఇలాంటి సిల్లీ ట్రీట్మెంట్‌ను రాసుకోకుండా ఉండాల్సింది. పైగా కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్‌ఫ్యూజ్డ్‌గా సాగడం, రిలీఫ్‌కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది.
ఓవరాల్‌గా ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే.. సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది.
బలమైన పాయింట్స్: ధనుష్ ద్విపాత్రాభినయం చేయటం విశేషం. ధనుష్ నటన తప్ప ఈ సినిమాలో బలమైన అంశం ఏదీ లేదు.
తుది తీర్పు:
ఈ సినిమాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
నటీనటులు: ధనుష్, ఎలి అవ్రమ్, ఇంధుజ, యోగి బాబు తదితరులు
దర్శకత్వం : సెల్వ రాఘవన్
నిర్మాత: కలైపులి ఎస్ థాను
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ దేశం గర్వించదగ్గ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా నిపుణుడు. వీరు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ అధినేత. వివేకానంద్ గారు రూపుదిద్దిన ‘పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ’ అనే మోడ్యూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా పై స్థాయిల్లో ఉన్న అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు వీరి పేపర్ లెస్ ఫ్లూయెన్సీ కోర్స్ ద్వారా విజయ శిఖరాలకి చేరుకున్నారు. ఇప్పటిదాకా యాభై వేలమందిపైగా ప్రొఫెషనల్స్ మరియు సెలెబ్రిటీలు ఈ శిక్షణా తీసుకుని ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ’ని అమలు చేయబోయే ముందు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకి వీరిని ప్రత్యేకంగా అహ్వానించి వీరి సలహాలు సూచనలు స్వీకరించటం జరిగింది.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పేపర్ లెస్ ఫ్లూయెసీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్మెంట్, ఇంటర్యూ స్కిల్స్, హెచ్చార్డీ స్కిల్స్ తదితర అనేక శిక్షణా తరగతులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బోధనలు విని మంత్రముగ్ధులు అవని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. తన శిక్షణా కార్యక్రమంలో ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్’ మరియు ‘పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్’ అనే ప్రభావవంతమైన సూత్రాలతో వీరు తమ బోధనని రక్తి కట్టిస్తారు.
టీనేజీ పిల్లలకి ‘గోల్ సెట్టింగ్’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టి వీరు అనేక మంది పిల్లలని విజయపథంలో నడిపిస్తున్నారు.
వీరి కార్యక్రమాలని యూట్యూబ్‌లో చూడవచ్చు. వీరు స్వతహాగా రచయిత. సినీ విశ్లేషకులు కూడా. వీరు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకం ‘సాఫ్ట్ స్కిల్స్ టు ఏస్ ఇంటర్వ్యూస్’ అమెజాన్‌లో లభ్యం అవుతుంది.
ప్రతి శనివారం సాయంత్రం జూమ్ ప్లాట్‌ఫాం ద్వారా వీరు లైవ్‌లో పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ గూర్చి ఉచిత అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు.