Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేనెవరు..!?

[తిరుమలశ్రీ గారు రచించిన ‘నేనెవరు..!?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రముఖ రచయిత్రి ‘మాధవి’కి స్వర్ణకంకణం బహూకరింపబడుతూన్న సందర్భంగా టౌన్ హాల్లో సన్మానసభ జరుగుతోంది. మాధవి రచనలలో స్త్రీజన సమస్యలే అధికంగా చోటుచేసుకోవడంతో ‘ఫెమినిస్ట్ రైటర్’గా పేరు పొందింది. ఆమె రచనలు వేలాది పాఠకుల అభిమానానికి  పాత్రమయ్యాయి. పలు ప్రముఖ రచయిత్రులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఆ సభకు విచ్చేయడం విశేషం.

వక్తలు మాధవి రచనలు, ఆమె శైలి వగైరాలను గూర్చి చేస్తూన్న ప్రసంగాలు వీనులలో పడుతూంటే,  నా మనసు నాకు తెలియకుండానే గతంలోకి జారిపోయింది..

***

“లతా! లతా! ఎన్నిసార్లు పిలిచినా పలికిచావవేమే?” కోపంగా అరచింది అమ్మ వంటింట్లోంచి.

నిజమే, అది నాలుగోసారి అమ్మ పిలవడం. నేను కావాలనే పలకలేదు. “హోమ్ వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకో చెప్పు,” అన్నాను కించిత్తు విసుగ్గా.

“పొద్దు కూకుతోంది. కోడిపిల్లల్ని కేకేసి గూట్లోకి చేర్చు. వాటికి మేత వేసి నీళ్ళు పెట్టు,” చెప్పింది అమ్మ.

“రాసుకోవలసింది బోలెడు ఉంది. నేను ఇప్పుడు రాలేను,” జవాబిచ్చాను నేను.

“తరువాత రాసుకుందువుగానిలే, వెళ్ళి కోళ్ళ సంగతి చూడు. నా చేయి ఖాళీలేదు,” అంది అమ్మ.

“నేను రాను,” ఖచ్చితంగా చెప్పేసాను. అసలే చేస్తున్నది లెక్కల హోమ్ వర్క్. ఏమాత్రం తప్పులు దొర్లినా లెక్కల మాస్టారు తాట తీస్తారు. అదే మాట చెప్పాను.

“కదలకపోతే నేను తాట తీస్తాను,” కోపంగా అంది అమ్మ. “నేను వచ్చానంటే ఆ పుస్తకాలన్నీ తీసి బైటకు గిరవాటేసేస్తాను”.

కోపం వస్తే అంతపనీ చేస్తుంది తాను! అసలే చేస్తూన్న లెక్కకు ఆన్సర్ రాక తంటాలుపడుతున్నాను నేను. తమ్ముడు నాకంటె మూడేళ్ళు చిన్నవాడు. అమ్మ వాడికసలు ఏపనీ చెప్పదు. చిన్నపిల్లాడు అంటుంది. లేదా, మగపిల్లాడు అంటుంది. “ఏం, మగపిల్లాడు తిండి తినడం లేదా? పని చేయకూడదా? ఆడపిల్లలే చాకిరీ అంతా చేయాలా?”

“తమ్ముడికి చెప్పు” అనరచాను. “వాడు చదువుకుంటున్నాడు” అంది.

నేను ఏడవ తరగతి చదువుతూంటే, వాడు నాలుగవ తరగతిలో ఉన్నాడు.

నాపక్కనే కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటూన్న తమ్ముడితో, “ఒరేయ్, ఇవాళ్టికి నువ్వెళ్ళరా. ప్లీజ్!” అన్నాను.

“ఉహుఁ, అమ్మ నీకే చెప్పింది” అన్నాడు మొండిగా.

“నేనూ చదువుకుంటున్నానుగా?” అన్నాను అమ్మతో.

“నువ్వు చదివి ఊళ్ళేలవలసిన అవసరంలేదు గానీ, నోర్మూసుకుని లేచి రా!” గట్టిగా కసరింది.

తమ్ముడు కిసుక్కున నవ్వాడు. ఉరిమిచూసాను వాడి వంక.

“కదులుతున్నావా, లేదా?” మళ్ళీ అరచింది అమ్మ.

ఉక్రోషం తన్నుకువచ్చింది నాకు. చేతిలోని పెన్‌ని నోట్ బుక్ పైన పడేసి విసురుగా  లేచాను. వెళుతూ వెళుతూ, నన్ను వెక్కిరిస్తూన్న తమ్ముడి తలపైన ఓ మొట్టికాయ వేసాను.

“అమ్మా, చూడవే!” అని వాడు అరవడంతో, “ఏమయిందిరా?” అనడిగింది అమ్మ.

“ఏం లేదు,” అని వాడికంటే ముందు నేనే జవాబిచ్చి పెరట్లోకి పరుగెత్తాను.

మేము కోళ్ళను పెంచుతాము. నెలక్రితం అవి చాలా పిల్లల్నే పెట్టాయి. అయితే గ్రద్దలు ఎత్తుకుపోయినవి ఎత్తుకుపోగా పదహారు పిల్లలే మిగిలాయి. తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగులతో ముద్దుగా ఉన్నాయవి. ఖాళీగా ఉన్నప్పుడు తమ్ముడు, నేనూ వాటిని చేతులపైన ఎక్కించుకుని ఆడుకుంటుంటాము. అవి బుల్లి ముక్కులతో అరచేతిలో పొడుస్తూంటే తమాషాగా ఉంటుంది.

దొడ్డంతా తిరుగుతూ మట్టిలో పురుగుల్ని ఏరుకుతింటున్నాయి కోడిపిల్లలు. వాటినన్నిటినీ ఒకచోటకు చేర్చి, తల్లికోళ్ళతోపాటు గూట్లోకి పంపేసరికి చాలాసేపు పట్టింది.. ఆ తరువాత ఇంకేదో పని చెప్పింది అమ్మ. ఓ పక్క హోమ్ వర్క్ పూర్తికాలేదు. మరోపక్క, చెప్పిన మాట వినకపోతే అమ్మ ఊరుకోదు. మొట్టికాయలు మొట్టుతుంది.

ఆడపిల్లనని అన్ని పనులూ నాకే చెబుతుంది. తమ్ముడికి అసలు ఏ పనీ చెప్పదు. మగపిల్లాడని వాణ్ణి అపురూపంగా చూస్తారంతా. దాంతో వాడికి నెత్తిపైన కొమ్ములు వచ్చేసాయి. నా మాట అసలు వినిపించుకోడు. వాడికంటె పెద్దదాన్నని కూడా చూడడు.. తలచినపుడల్లా ఇంట్లో పని ఉందంటూ నన్ను బడి మానిపించేస్తుంటారు, నేను ఏడుస్తున్నాసరే. తమ్ముడు ఒక్కరోజు వెళ్ళనన్నా ఊరుకోరు. బ్రతిమాలి, డబ్బులు లంచమిచ్చి మరీ పంపుతారు.

‘అమ్మ కూడా ఆడపిల్లే కదా! ఎందుకంత వివక్ష చూపిస్తుంది!?’ అన్న ప్రశ్న అప్పుడప్పుడు నాలో తలెత్తుతూవుంటుంది. అదే అడిగితే, “ఏడ్చావులే!” అని త్రోసిపుచ్చేస్తుంది అమ్మ. ఆడపిల్లలు ఒదిగివుండాలంటుంది. మగపిల్లలతో పోటీపడకూడదంటుంది. అలాగని, తనకు నామీద ప్రేమ లేదని కాదు. తమ్ముడిపట్ల కొంచెం ఎక్కువ. అంతే!

నాకు చదువంటే మిక్కిలి ఇష్టం. శ్రద్ధగా చదివేదాన్ని. తమ్ముడికి చదువుకంటె ఆటలపైనే మక్కువగా వుండేది. తాతయ్య అమ్మను చదివించలేదట. “ఆడపిల్లకు చదువెందుకు, చాకలిపద్దు రాసుకోగలిగితే చాలు” అని ఐదవ తరగతితోనే ఆపేసాడట. నేను బాగా చదువుకుని, ‘ఆడపిల్లలు ఎందులోనూ తీసిపోర’ని తాతయ్యకు చెప్పాలనుకునేదాన్ని.

నేను పదవ తరగతి ఫస్ట్ మార్కులతో పాసయ్యాను. ఇంటర్‌లో చేరాలని వువ్విళ్ళూరాను. కానీ, అమ్మ ఒప్పుకోలేదు. ఆడపిల్లను పొరుగూళ్ళో ఉన్న జూనియర్ కాలేజ్‌కి పంపనంది.  నాన్న కూడా అంతటితో చదువు చాల్లే అన్నాడు. ఇంట్లో అమ్మకు సాయం చేయమన్నాడు. నా స్నేహితురాళ్ళంతా ఇంటర్‌లో చేరితే, నేను ఇంటికే పరిమితం కావడం కృంగదీసింది నన్ను. ఎంతో ఏడ్చాను. సత్యాగ్రహం చేసాను. వారం రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పైపెచ్చు నాన్న బాగా తిట్టిపోసాడు.

తల్లిదండ్రుల చాటు పిల్లను నేను. ఫలానా ఆవిడ కూతుర్ని. ఫలానా ఆయన కూతుర్ని. నాకంటూ ఒక ఉనికి లేదు. స్వతంత్ర ప్రతిపత్తి పూజ్యం.. క్రమంగా పరిస్థితులతో రాజీపడక తప్పలేదు. అమ్మ వంటపనులలో, ఇంటిపనులలో తర్ఫీదు ఇచ్చింది నాకు. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళబోయే పిల్లకు అవసరమైనవి అవేనంది.. వీలయినపుడల్లా నా స్నేహితురాండ్ర నుండి పత్రికలు, పుస్తకాలూ తెచ్చుకుని తీరికవేళల్లో చదువుతూం డేదాన్ని..

పద్ధెనిమిదేళ్ళు రాగానే బావతో నా పెళ్ళి జరిపించేసేసాడు నాన్న. నాకు అప్పుడే పెళ్ళి వద్దని ఏడ్చి మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఆడపిల్ల ఎప్పటికైనా గుండెల పైన కుంపటేనంది అమ్మ.

మా మేనత్త పల్లెటూళ్ళో ఉంటుంది. లంకలో పొలాలు ఉన్నాయి వాళ్ళకు. వాటిలో పొగాకు పండిస్తారు. బావ చదువుకోలేదు. చిన్నప్పట్నుంచీ మావయ్యతోపాటు పొలం వెళుతూ పనులన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద పొగాకు చట్టల్ని పొరుగూళ్ళకు తీసుకువెళ్ళి అమ్ముతుంటాడు. వతనుగా తీసుకునేవారికి వారానికోసారి సరుకు వేస్తుంటాడు. మిగతా రోజుల్లో ఇతర ఊళ్ళ సంతలకు వెళతాడు.

బావ మంచోడే కానీ, అమ్మకూచి. అత్తయ్య ఎంత చెబితే అంత! ఆ తరువాతే ఆలి అయినా, అన్యులైనా. నన్ను ప్రేమగానే చూసుకుంటాడు. బావంటే నాకూ ఇష్టమే. కాకపోతే, ఉద్యోగం చేసుకునేవాణ్ణి పెళ్ళాడాలన్న నా మనోవాంఛ ఫలించలేదన్న చిన్న అసంతృప్తి. అత్తయ్య, మావయ్య కూడా నన్ను బాగానే చూసుకుంటారు.

అయితే, లంకంత కొంప. చాకిరీ ఎక్కువ. పనివాళ్ళందరూ పొలం పనులతో తీరిక లేకుండా ఉంటారు. ఇంటిపనంతా కోడలిగా నాదే బాధ్యత. ఇంటి లోపల, బైటా శుభ్రత.. ఆవుల సంరక్షణ.. పాలు పితకడం నుండి వాడకందారులకు పంపించడం వరకు.. పొలం వెళ్ళేవారికి, బైటకు వెళ్ళే బావకు ఉదయమే కాఫీ-టిఫిన్లు.. వారు తిరిగివచ్చేసరికి వంట సిద్ధంచేయడం.. తదితర పనులతో బొత్తిగా ఊపిరి సలిపేదికాదు. ఇంట్లో పనులకు సాయంగా ఓ ఆడమనిషి, పాడి చూసుకోవడానికి ఓ మగమనిషీ ఉన్నా నా అజమాయిషీ తప్పనిసరి. పని ఎంతకూ తెమిలేది కాదు. “ఫలానావారి కోడలు పనిమంతురాలు” అన్న పేరు మాత్రం దక్కింది. నా గురించి నేను ఆలోచించుకోవడానికి కూడా తీరిక చిక్కేదికాదు. అప్పుడప్పుడు బావచేత పత్రికలేవో తెప్పించుకుని తిరగేసేదాన్ని.

పెళ్ళయి ఏడాది తిరక్కుండానే నీళ్ళు పోసుకున్నాను నేను. మరో తొమ్మిది నెలలకు పండంటి బాబు పుట్టాడు. బావ, అత్తయ్య, మావయ్య– ఎవరికి వారే వాడు తమ పోలికేనంటూ మురిసిపోయేవారు. పిల్లాడు వచ్చాక నా పని పెరిగింది. ఓపక్క చంటాణ్ణి సాకుతూనే, మరోపక్క ఇంటిపనుల పైన దృష్టి పెట్టవలసివచ్చేది.

రోజులు నెలలు.. నెలలు సంవత్సరాలూ.. అయిపోతున్నాయి. అత్తయ్య, మావయ్య పెద్దవాళ్ళయిపోతున్నారు. మావయ్య మునుపటిలా పొలానికి రోజూ వెళ్ళడంలేదు. దాంతో అటు పొలం పనులు, ఇటు వ్యాపారమూ బావే చూసుకోవలసి వచ్చేది. అత్తయ్య కీళ్ళనొప్పులంటూ ఎక్కడికీ కదలడంలేదు.. బాబు కూడా పెద్దవాడయ్యాడు. బళ్ళో చేరాడు. రాత్రివేళ ఎలాగో తీరిక చేసుకుని వాడికి చదువులో సాయంచేసేదాన్ని. శ్రద్ధగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకునేవాడు.

ఏవేవో ఆలోచనలు తరచు నా మదిలో దూరి కందిరీగల్లా ఝుమ్మని రొదచేసేవి. “నేనెవర్ని? బతుకంతా ఇలా చాకిరికి అంకితమయిపోయి, ఎటువంటి మార్పూ లేకుండా మనవలసిందేనా? పుట్టినప్పుడు ఫలానావారి కూతుర్ని నేను.. పెళ్ళయ్యాక ఫలానా వ్యక్తి భార్యను, ఫలానావారి కోడల్ని.. పిల్లాడు పుట్టాక ఫలానా కుర్రాడి తల్లిని! ఇదేనా జీవితమంటే? ‘నేను’ ఎక్కడ? నా ఉనికి ఏది? నాకంటూ ఓ గుర్తింపు లేదా?.. జీవితమంతా ఇలా ఎవరో ఒకరి నీడలో భాగం కావలసిందేనా?.. ఈ సమస్య నా ఒక్కదానిదేనా? లేక, ఆడపిల్లలందరి పరిస్థితీ ఇంతేనా!?”- ఇవీ సదా నన్ను వేధించే ప్రశ్నలు.

రాను రాను నాలో ఏదో అసంతృప్తి, అశాంతీను. నాకంటూ ఓ వ్యక్తిత్వం, ఉనికి, గుర్తింపూ పొందాలి! ఎలా? ఎలా?? ఎలా???.. ఏ పని చేస్తున్నా నా మదిలో రేగే ఆలోచనలు ఇవే!

ఓ రోజున అసంకల్పితంగానే నా మదిలోని భావాలకు అక్షరరూపం కల్పించాను. దాన్ని పదుగురితో పంచుకునేందుకు ఏదైనా పత్రికకు పంపాలనిపించింది. కానీ, దాన్ని చదివి నవ్వుతారేమోనన్న సంశయం! చివరికి తెగించి ఓ మహిళాపత్రికకు పోస్ట్ చేసేసాను దాన్ని.

రెండు నెలల తరువాత వచ్చిన ఆ పత్రిక కాపీని చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి నాకు. నా వ్యాసం అందులో ప్రచురింపబడింది. అదీ – బోర్డర్ కట్టి! దాన్ని ఎన్నిసార్లు చదువుకున్నానో నాకే తెలియదు. మొదటిసారిగా అచ్చులో నా పేరు చూసుకుంటూంటే నామది ఉయ్యాలలూగింది. బావకు చూపిస్తే నవ్వేసి ఊరుకున్నాడు. బాబు చదివి, “బాగుంది, మమ్మీ!” అన్నాడు.

అది నాలో నూతనోత్తేజానికి నాంది పలికింది. తోచినపుడల్లా నా భావాలను, ఊహలను, ఆలోచనలనూ కాగితం మీద పెట్టనారంభించాను. ఆశ్చర్యకరంగా పత్రికలు వాటిని ఆదరించి ప్రోత్సహించాయి. ఒకటీ, అరా తిరిగివచ్చినా వాటిని రివైజ్ చేసి ఇతర పత్రికలకు పంపడము, అవి ప్రచురితం కావడమూ జరిగేది. నేనూ రాయగలనన్న ఆత్మవిశ్వాసం నాలో ఏర్పడింది.

ఏడాది గడచేసరికి అరడజను వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కథలు రాయడానికి పూనుకున్నాను. అవికూడా ప్రచురితం కావడంతో నా ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. ఒకప్పుడు తీరిక చిక్కినప్పుడు మాత్రమే కలం కాగితం పైన పెట్టేదాన్ని. కానీ, ఇప్పుడు దాన్ని దినచర్యగా మార్చుకున్నాను. రాత్రివేళ అంతా పడుకున్నాక కనీసం రెండు గంటలసేపైనా రాయకపోతే మదిలో అశాంతిగా ఉంటోంది. నాలో ఏదో తెలియని ఉత్సాహము, శక్తీ ఉరకలు వేసేవి.

చూస్తూండగానే మరో రెండేళ్ళు గడచిపోయాయి. కథల నుండి నవలలకు ఎదిగాను. ఇప్పుడు నా వ్యాసాలు, కథలు, నవలలు ప్రముఖ పత్రికలలో కనిపించనారంభించాయి. సంపాదకుల అభినందనలను, పాఠకుల ప్రశంసలను చూరగొనేవి. ఎందరో అభిమానులను సంపాదించిపెట్టాయి. మీదు మిక్కిలి – నాలోని ఐడెంటిటీ క్రైసిస్ అడుగున పడిపోవడం ముదావహం. నేను ఇప్పుడు ఓ రైటర్‌ని! ఆంధ్రుల అభిమాన రచయిత్రిని! ఎవరి నీడలోనో జాడ వెదుక్కోనవసరం లేదు. నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

నా రచనలలో స్త్రీజన సమస్యలు ప్రాముఖ్యత వహించేవి. నా అనుభవాలకు తోడు, నా చుట్టూ ఉన్నవారి సమస్యలను అధ్యయనం చేసి వాటిని అక్షరమాలలుగా కూర్చేదాన్ని. సమాజాన్ని ఉత్తేజపరచేదాన్ని. నా రచనలు కొన్నిటికి పరిష్కారమార్గాలను సూచించితే, మరికొన్నిటికి సమాజంలో వెదుక్కునేందుకు దోహదపడేవి. నా రచనలు ఎన్నిటికో బహుమతులు, అవార్డులు లభించాయి. ఎక్కడెక్కడినుండో ఎందరో అభిమానులు నన్ను కలవడానికి వచ్చేవారు. పత్రికలు, సాహితీసమాఖ్యలు నాకు సన్మానాలు జరిపేవి..

నా రచనా వ్యాసంగం ఆరంభమై దశాబ్దకాలం గడచిపోయింది. ఇప్పుడు నా రచనలను ప్రచురించని పత్రికలు లేవు. నా నవలలు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోతున్నాయి. కొన్ని టీవీ సీరియల్స్ గానూ, చలనచిత్రాలుగానూ రూపొంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం.

నా మనసుకు ఇప్పుడు ఎంతో తృప్తిగా, ప్రశాంతంగా ఉంది. ‘నేను’ అన్న అస్థిత్వాన్ని కోల్పోయి గానుగెద్దులా బతుకు ఈడ్చుతూన్నదాన్ని- ‘రాయడం’ ద్వారా నా ఉనికిని నేను వెదుక్కోగలిగాను, నిలుపుకోగలిగాను. నేనిప్పుడు ‘ఫలానా వారి భార్యను, కోడల్ని, తల్లినీ’ కాదు – అశేష ఆంధ్రపాఠకుల ఆరాధ్యదేవతను! ‘నేను’ – నేనే!!

***

చప్పెట్ల మ్రోతతో నా ఆలోచనల గొలుసు పుటుక్కుమనడంతో వాస్తవంలోకి వచ్చాను నేను.

సభాధ్యక్షుడి ప్రసంగం ముగిసింది. అనంతరం కార్యదర్శి, “ఇప్పుడు వేదికనలంకరించిన పెద్దలు ప్రముఖ రచయిత్రి ‘మాధవి’ గారిని శాలువాతో సత్కరించి, స్వర్ణకంకణాన్ని చేతికి తొడుగుతారు,” అని ప్రకటించడంతో.. స్టాండింగ్ ఒవేషన్ నడుమ లేచి నిలుచున్నాను – ‘మాధవి’ కలంపేరుతో రచనలు చేసే నేను.. మాధవీలతను!!

Exit mobile version