[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘నేనొక బాటసారిని..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఈ విశాల ప్రపంచంలోకి
ఒక సంచారిలా ప్రవేశించాను
అతిథిలా అందర్నీ కలుసుకుంటున్నాను
ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాలు
అపూర్వమైన స్వాగతం పలుకుతున్నాయి..!
కనులు తెరిచినప్పటి నుండి
అద్భుతంగా శోభిల్లుతున్న దృశ్యావరణం
నన్ను ముగ్ధుణ్ణి చేస్తూనే ఉంది
నాలో రగులుతున్న ప్రశ్నల కొలిమి
ఇంకా ఇంకా జ్వలిస్తూనే ఉంది..!
నడక నేర్చుకునే ప్రయత్నం
పట్టు వదలకుండా సాగుతుంది
పడి లేవడం కొత్తగా అనిపించడం లేదు
రాలిన ప్రతి పువ్వు నేర్పుతున్న పాఠం
నవ్వెనుకున్న విషాదం అర్థమవుతున్నది..!
అనంతమైన దారిలో పయనిస్తున్నాను
అందరూ తెలిసిన వాళ్ళే కావచ్చు
అన్నీ చూసిన ప్రదేశాలే కావచ్చు
కొండలు లోయలను దాటుతుంటే
దుఃఖాలు సుఖాలు వెంబడిస్తున్నాయి
హెచ్చరికలను పట్టించుకునే ఓపిక లేదు
మంచి మాటలను చర్చించే అవకాశం లేదు
ముళ్ళ దారుల్లో మొలకెత్తుతున్న ధీరత్వంతో
వెనుకకు మాత్రం తిరిగి చూడడం లేదు
శిఖరాలే ఆదర్శమైన తత్వం నాది..!
నాది పొగరని మీరనుకోవచ్చు
పట్టించుకునే సమయం కూడా లేదు
యుద్ధ క్షేత్రాలను సందర్శించాను
సమాధుల్లోని వీరులను స్మరించుకంటూనే
సడలని సంకల్పాన్ని ఆయుధంగా ధరించాను..!
అడవి దారుల్లోని రక్తం మరకలు
అప్పుడప్పుడు కలవరపరుస్తూనే ఉంటాయి
నదులను దాటుతున్నప్పుడల్లా అనుకుంటాను
నేనే ఒక జీవనదినైతే బాగుండునని
నాలో ప్రవహిస్తున్న రుధిరం కూడా నదినే కదా..!
ఊరేగింపుల్లో నా కోరస్ వినబడుతుంది
జనాగ్రహంలో నా పిడికిలి భావుటావుతుంది
చైతన్యంలో నా శ్వాస రెపరెపలాడుతుంది
పచ్చని పైరులో నా ఉనికి కనబడుతుంది
భూమిపైన అలసట లేని బాటసారిని నేను..!
