Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తినే వంటకాలూ, వినే కబుర్లూ

సాధారణంగా వంటల పుస్తకాలు, కథల పుస్తకాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ రెసిపీలని, జీవితంలో సంఘటనలకు ముడిపెడుతూ, వంటకాలు తయారు చేసే విధానాన్ని కథలో ఇమిడిపోయేలా వివరిస్తూ రుచికరంగా వడ్దించిన పుస్తకం సంధ్య యల్లాప్రగడ గారి ‘నేను వడ్డించిన రుచులు చెప్పిన కథలు’. ఈ పుస్తకంలో కథన శైలి ఎలా ఉందంటే, రచయిత్రే స్వయంగా మన పక్కన ఉండి, ఈ కబుర్లు చెబుతున్నట్టుగా ఉంది. అందుకనే వినే కబుర్లు అన్నాను.

ఇవి కమ్మని వంటకాలతో చక్కని కబుర్లు. ఇందులోని వంటలు కొందరికి తెలిసే ఉంటాయి… తెలియనిదల్లా ఆ వంట చేస్తున్నప్పుడో, లేదా కుటుంబ సభ్యులకు వడ్డిస్తున్నప్పుడో జరిగిన సంగతులని కబుర్లుగా చెప్పడం! అదే ఈ పుస్తకం విశేషం.

~~

కాకినాడలోని సుబ్బయ్య హోటల్ ఎంతో ప్రసిద్ధం. వారు ఈ మధ్యలో హైదరాబాదు లోని కుక‍ట్‍పల్లిలో తమ శాఖని తెరిచి తమ పాక ప్రావీణ్యాన్ని హైదరాబాదు వాసులకూ రుచిచూపిస్తున్నారు. వీరి హోటల్‍లో ఎంతో ఆదరణ పొందిన ‘బుట్ట భోజనం’ వర్ణనతో ప్రారంభమవుతుంది ‘బుట్టోపాఖ్యానము’. బుట్ట భోజనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునే ప్రక్రియ, రచయిత్రి భర్త ఎయిర్ పోర్ట్ నుంచి ఇల్లు చేరే విధానం – చదువరులని నవ్విస్తాయి… ఆలస్యంగా ఇల్లు చేరిన ఆయన బుట్ట భోజనాన్ని తినలేక తినలేక తింటారు… ఓ భ్రమ తీరిపోతుంది!

ఎంత ఇష్టమైనా, వంకాయ కూరని అస్తమానం తినలేమని చెప్తారు మరో కథలో. దీనిలోనే వంకాయ-మెంతికారం కూర ఎలా చేసుకోవాలో నోరు ఊరించేలా చెప్పారు.

‘ఆవడలు – ఊడిన పళ్ళు’ శీర్షిక చదవగానే లోపల ఏముంటుందో ఊహించేస్తాం…. ఆవడలో కాదందోయ్… ఆ కథలో…! ఆవడలో ఏముటుందో అందరికీ తెలిసిందే! మెత్తని పెరుగావడలు ఎలా చేసుకోవాలో చెప్తూ, తనకెదురయిన ఓ అనుభవాన్ని హాస్యంగా వివరిస్తారు రచయిత్రి.

తమ పెళ్ళి అనుభవాన్ని, అనుభూతులని చెప్తూ, గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తారు. ఓ మంచి పెసరట్టు ఎలా వేసుకోవాలో కవితారూపంలో వివరిస్తారు. ట్రంప్ మీద కోపాన్ని కారంగా మార్చి అమెరికాలో ఆవకాయ పెట్టిన వైనం నవ్విస్తుంది. ‘రోటీమ్యాటిక్ మ్యాజిక్’ కథలో రోటీమేకర్ తమని ఎలా ఆదుకుందో వివరించారు.

ఒకప్పుడు పిన్నిపిల్లలకి చేసి పెట్టాలని ప్రయత్నించిన శనగపిండి దోశ విఫలమైన తీరు నవ్విస్తుంది. కానీ ప్రయత్నం మీద సరైన పాళ్ళు తెలిసాకా, శనగపిండి దోశలని సులువుగా ఎలా వేసుకోవచ్చో వివరిస్తారు.

అమ్మాయికు అత్తారింట్లో ఎన్ని స్క్రీన్‌ప్లేస్ ఉన్నా, చేతిలో తెల్లజండా, పెదాల మీద చిరునవ్వే శ్రీరామ రక్ష అంటూ పూర్ణం బూర్లు ఎలా వండుకోవాలో చెప్తారు.

దిబ్బరొట్టె దోసెగా మారిన వైనం చదువరుల పెదాలపై దరహాసాలు తెప్పిస్తుంది.

రచయిత్రి బామ్మగారు ఏం చేశారో తెలుసా? స్పాంజ్ అనుకుని పసుపచ్చని డోక్లాతో… నేను చెప్పకూడదు… ఎవరికి వారు చదువుకుని నవ్వుకోవల్సిందే! ఈ కథలో రుచికరమైన డోక్లా ఎలా చేసుకోవాలో చెప్తారు.

అమ్మ పోపులడబ్బాలోని అమృతం గురించి అందరికీ గుర్తు చేస్తారు. అనుకోకుండా అతిథులు వస్తే సులువుగా, రుచికరంగా జీరా రైస్ ఎలా వండిపెట్టాలో చెప్తారు.

ఏడవ తరగతిలో తాను చేసిన ఓ ప్రయోగం గురించి… తస్మాత్ జాగ్రత్త అంటారు. తను చెప్పిన పద్ధతిలో – టెస్ట్ చేయబడిన, ప్రూవ్ చేయబడిన – వంగీబాద్‍‍ని ఎవరైనా సులువుగా వండుకోవచ్చని హామీ ఇస్తారు. కాప్సికమ్ రైస్‌తో జీవిత పాఠాలు చెప్తారు. పెళ్ళయిన కొత్తల్లో ఇటిక ముక్కల్లాంటి ఇడ్లీలతో చెడుగుడు ఆడిన వైనం హాయిగా నవ్విస్తుంది.

అమ్మల కష్టం తీరేలా కాకరకాయ పులుసుకూర ఎలా చేయవచ్చో చెప్తారు. నూనెలో వేయించకుండా సమోసా ఎలా చేసుకోవచ్చో చెప్తారు.

గుళ్ళో ప్రసాదంగా ఇచ్చే పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అందరికీ అనుభవమే. ఆ రుచికి ఏ మాత్రం తీసిపోకుండా, ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో వివరించారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే పొంగల్‌ని అంతే రుచిగా ఇంట్లోనే చేసుకునే విధానం వివరిస్తారు.

బంగాళాదుంప భౌ భౌ లాగా కాకరకాయ క్యావ్ క్యావ్ చేసుకునే విధానాన్ని తెలిపారు. ఇంకా టమాటా స్ప్రింగ్ రోల్స్, కారప్పూస, కొబ్బరి అన్నం తదితర వంటకాలు ఎలా చేసుకోవాలో చెప్తారు.

నౌకా విహారంలో ఆలూతో పడ్డ అగచాట్లు అయ్యో అనిపిస్తాయి.

~ ~

ఇవన్నీ చదువుకుంటే వంటల్లో బాగా చెయ్యి తిరిగిన వారికి జ్ఞాపకాలు మెదులుతాయి, ప్రస్తుతం చెయ్యి కాల్చుకుంటున్నవారికి ఆపన్నహస్తం దొరికినట్టవుతుంది.

సరసి గారు వేసిన బొమ్మలు ఆయా కథలకు దివ్యంగా నప్పాయి. కొన్ని చోట్ల కథ చదవడం కన్నా ముందే దాని బొమ్మ నవ్వులూ పూయించేలా చేస్తుంది.

తనువుని, మనస్సుని సారవంతం చేసేవి ఆహారం, సాహిత్యం… తినకుండా ఉండలేము… చదవకుండా ఉండలేము. ఆహారం లోనూ, సాహిత్యం లోనూ రుచికరమైనవి, హితవైనవి గ్రహించడానికి వెనుకాడం. ఆ కోవలోదే ఈ పుస్తకం.

***

నేను వడ్డించిన రుచులు – చెప్పిన కథలు
రచన: సంధ్య యల్లాప్రగడ
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
పేజీలు: 132
వెల: ₹ 100
ప్రతులకు:
నవోదయ్ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్
ఈబుక్: కినిగె.కాం
https://kinige.com/book/Nenu+Vaddinchina+Ruchulu+Cheppina+Kathalu

Exit mobile version